అంకెలు ఆమోదించని అచ్ఛేదిన్
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:10 AM
‘మోదీ పాలనపై సామాన్యుని సణుగుడు’ (జూన్ 14, ‘పళని పలుకు’) అంకెల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. నిర్దుష్టమైన, నిరూపించదగిన డేటాపై నాకు మక్కువ ఎక్కువ. యదార్థాలను నొక్కి చెప్పేందుకు అంకెలను ప్రస్తావిస్తే చాలా మంది పాఠకులు నొసలు చిట్లించుకోవడం కద్దు.
‘మోదీ పాలనపై సామాన్యుని సణుగుడు’ (జూన్ 14, ‘పళని పలుకు’) అంకెల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. నిర్దుష్టమైన, నిరూపించదగిన డేటాపై నాకు మక్కువ ఎక్కువ. యదార్థాలను నొక్కి చెప్పేందుకు అంకెలను ప్రస్తావిస్తే చాలా మంది పాఠకులు నొసలు చిట్లించుకోవడం కద్దు. విద్యావంతులు సైతం అంకెలతో కూడిన డేటాను అయిష్టపడతారు. ఒక ఆర్థిక వ్యవస్థ వాస్తవ దృశ్యాన్ని పదాల కంటే అంకెలే సత్యసమ్మతంగా స్పష్టం చేస్తాయని నేను సునిశ్చితంగా విశ్వసిస్తాను.
ప్రజల సంక్షేమమే సుపరిపాలనకు అంతిమ గీటురాయి అయినప్పుడు ఈ ప్రశ్న అనివార్యం: ‘ఒక వ్యక్తికి కూడు, గూడు, గుడ్డ, విద్య, ఆరోగ్య భద్రత, రవాణా, కుటుంబ వేడుకలు, వినోద విహారాలు ఇత్యాది నిత్యావసరాలకు సరిపడా ఆదాయమున్నదా?’ (ఈ రోజుల్లో నిత్యావసరాలుగా భావిస్తున్న ఇతర వ్యయాలను నేను పరిగణనలోకి తీసుకోలేదు). ఈ వ్యయాలపై ప్రామాణికమైన సమాచారం ‘గృహ వినియోగ వ్యయ సర్వే’ (హెచ్‌సీఈఎస్)లో లభిస్తుంది.
నా దృష్టిలో ఆదాయం కంటే వినియోగ కొలమానా (మెట్రిక్ ఆఫ్ కన్సంప్షన్)లే సగటు కుటుంబ జీవన ప్రమాణాలు, నాణ్యతను నిర్ధారిస్తాయి. చివరి హెచ్‌సీఈఎస్‌ను 2023–24లో నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 2,61,953 కుటుంబాల (1,54,357 గ్రామీణ, 1,07,596 పట్టణ) నుంచి ఆయా వినియోగ వ్యయాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. కాకతాళీయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023–24లోనే పది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నది. హెచ్‌సీఈఎస్ డేటా సమగ్రమైనది. సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎమ్‌పీసీఈ) ఆ సర్వేలో కీలకమైనది. ఒక నెలలో ఒక వ్యక్తి వినియోగ వ్యయం ఎంత అనేది అతడి/ఆమె జీవన ప్రమాణాలు, నాణ్యతను వెల్లడిస్తుంది. సదరు వ్యక్తి ధనికుడా, పేదవాడా లేక మధ్యతరగతికి చెందినవాడా అనేది నిర్ధారిస్తుంది. ఎమ్‌పీసీఈ వెల్లడించిన వాస్తవాలను సంగ్రహిస్తాను: ఒక వ్యక్తి చేసే వ్యయాన్ని అతడు/ఆమె ఆదాయానికి, తీసుకున్న రుణానికి ప్రాతినిధ్యంగా తీసుకోవాలి. ఈ ప్రకారం దిగువన ఉన్న పది శాతం మంది దినసరి వ్యయం రూ.50–100గా ఉన్నది. కొన్ని ప్రశ్నలు: రోజుకు 50 నుంచి 100 రూపాయల ఖర్చుతో సదరు వ్యక్తి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటాడు? ఎటువంటి నివాసంలో ఉంటాడు? ఎటువంటి వైద్య సేవలు పొందగలుగుతాడు? అవసరమైన ఔషధాలకు ఎంత సొమ్ము భరించగలుగుతాడు?
పది శాతం జనాభా అంటే అల్పసంఖ్య కాదు. 14 కోట్ల మందికి సమానం. వారే ఒక ప్రత్యేక దేశంగా ఉంటే జనాభా పరంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంటారు. మరి నీతి ఆయోగ్, ప్రభుత్వం మన దేశ జనాభాలో ‘పేదలు’ కేవలం 5 శాతం, అంతకంటే తక్కువ మంది మాత్రమే ఉన్నారని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ వాదన క్రూరమైనది, కపటమైనది.
సరే, రైతులు, ఆహారానికి సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఇవి చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. వ్యవసాయరంగ అభివృద్ధి చాలా ఆరోగ్యదాయకంగా ఉందని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. నిజమేనా? మరి రైతన్న జీవితం ఆనందకరంగా ఉన్నదా? నాబార్డ్ డేటా (2021–22) ఏమి చెబుతున్నదో చూడండి: దాదాపు 55 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణభారంతో కృంగిపోతున్నాయి. వ్యవసాయ కుటుంబాల సగటు రుణ భారం రూ.91,231. ఫిబ్రవరి 3, 2025న ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాధానం ప్రకారం 13.08 కోట్ల మంది రైతులు వాణిజ్య బ్యాంకులకు రూ.27,67,346 కోట్లు; 3.34 కోట్ల మంది రైతు సహకార బ్యాంకులకు రూ.2,65,419 కోట్లు, 2.31 కోట్ల మంది రైతులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ.3,19,881 కోట్ల మేరకు బకాయిలు చెల్లించవలసి ఉన్నది. ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య ఒకే విధంగా ఉండడం లేదు. ఏప్రిల్ –జూలై 2022లో 10.47 కోట్ల మంది లబ్ధి పొందారు. 2023 (15వ విడత చెల్లింపు)లో ఈ లబ్ధిదారుల సంఖ్య 8.1 కోట్లకు తగ్గింది. ఫిబ్రవరి 2025 (19వ విడత చెల్లింపు)లో ఈ లబ్ధిదారుల సంఖ్య 9.8 కోట్లు అని ప్రభుత్వం చెప్పింది. ఈ లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులకు కారణమేమిటో ప్రభుత్వం చెప్పలేదు. కౌలుదారులు అయిన రైతులు ఈ పథకం నుంచి ఎలాంటి లబ్ధి పొందడం లేదు. కౌలు రైతులను ఉపేక్షించడం సమర్థనీయమేనా?
యూపీఏ ప్రభుత్వ పంట బీమా పథకాన్ని మెరుగుపరిచి పునః ప్రవేశపెట్టింది. ప్రైవేట్ బీమా సంస్థలను అనుమతించింది. లాభాలు ఆశించకుండా, నష్టాలు వాటిల్లకుండా (నో ఫ్రాఫిట్, నో లాస్) ఉండేలా పంట బీమా పథకాలను రూపొందించి అమలుపరచాలని బీమా కంపెనీలను యూపీఏ ప్రభుత్వం ఆదేశించింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం అమలుపరిచిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక దోపిడీ పథకంగా పరిణమించింది. రైతుల క్లెయిమ్‌లకు చెల్లించిన మొత్తం రైతుల నుంచి సేకరించిన మొత్తం ప్రీమియంల సొమ్ములో 2019–20లో 87 శాతం నుంచి 2023–24లో 56 శాతానికి తగ్గిపోయింది!
గ్రామీణ శ్రామిక జనుల సామాజిక భద్రతకు ఆలంబనగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మూడు సంవత్సరాలుగా నిధుల కేటాయింపులు ఎదుగు బొదుగు లేకుండా నిలిచిపోయాయి. కోట్లాది మందిని ఈ పథకం పరిధి నుంచి తొలగించారు ఈ పథకం కింద ఏడాదికి సగటున 100 పని దినాలు కల్పించవలసి ఉండగా వాటి సంఖ్య 51కి తగ్గిపోయింది. ఈ సామాజిక భద్రతా పథకం నిధుల కొరతతో నీరుకారిపోతోంది.
ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున, 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తోంది. ఈ ఉదారతకు అర్హులైన పౌరులు ఇంకా పది కోట్ల మంది ఉన్నారు. ఉచిత రేషన్లు, మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉన్నప్పటికీ కోట్లాది మంది బాలలకు పోషకాహారం లభించడం లేదు. దేశంలోని మొత్తం బాలల్లో 35.5 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సూచీ పరిగణనలోకి తీసుకున్న 127 దేశాలలో భారత్ 105వ స్థానంలో ఉన్నది!
దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల, సేవల మొత్తం విలువలో తయారీరంగం వాటా 2011–12లో 17.4 శాతం నుంచి 2024–25లో 13.9 శాతానికి తగ్గిపోయింది. ఉత్పత్తితో ముడిపెట్టి ప్రోత్సాహకాలు అందిస్తున్న పథకం సత్ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమయింది. 14 రంగాలకు రూ.1,96,409 కోట్లు కేటాయించినా కేవలం రూ.14,020 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు.
భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రశంసలు పొందుతున్నా అది ఆరోగ్యదాయకంగా ఉందని భావించడం సరికాదు; పేదరికాన్ని నిర్మూలించి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను సుస్థిరంగా నిలపగలదనే విశ్వాసాన్నీ కల్పించలేదు. ప్రతి పది సంవత్సరాలకూ మరింత విస్తృత నిర్మాణాత్మక సంస్కరణలు (ఆర్థిక వ్యవస్థ పనిచేసే విధానంలో ప్రాథమిక మార్పులు సాధించడం), అధికారాల వికేంద్రీకరణ, పోటీ తత్వాన్ని పెంపొందించడం, లక్ష్యాల పరిపూర్తికి ప్రభుత్వం ‘అంతర్గత అడ్డంకులను అధిగమించడం’ సంపద్వంత, సంక్షేమ భారత్ ఆవిర్భావానికి అత్యంత అవసరం.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రశంసలు పొందుతున్నా అది ఆరోగ్యదాయకంగా ఉందని భావించడం సరికాదు; పేదరికాన్ని నిర్మూలించి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను సుస్థిరంగా నిలపగలదనే విశ్వాసాన్నీ కల్పించలేదు. సంపద్వంత, సంక్షేమ భారత్ ఆవిర్భవించాలంటే ప్రతి పది సంవత్సరాలకూ మరింత విస్తృత నిర్మాణాత్మక సంస్కరణలు, అధికారాల వికేంద్రీకరణ, పోటీ తత్వాన్ని పెంపొందించడం, లక్ష్యాల పరిపూర్తికి ప్రభుత్వం ‘అంతర్గత అడ్డంకులను అధిగమించడం’ చాలా అవసరం.