జాతిని నడిపిస్తున్న ఆలోచనే మోదీ
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:26 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆయన పాలనను పర్యాలోచన చేస్తే భారత రాజకీయాల్లో మోదీ రంగప్రవేశం తర్వాత కొత్త శకం మొదలైందని అనిపిస్తుంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆయన పాలనను పర్యాలోచన చేస్తే భారత రాజకీయాల్లో మోదీ రంగప్రవేశం తర్వాత కొత్త శకం మొదలైందని అనిపిస్తుంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఒక ఆర్థిక వ్యవస్థగా దేశం రూపురేఖలు మారినట్లే, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక రాజకీయ, సామాజిక వ్యవస్థగా దేశం తీరుతెన్నులు మారాయన్న అభిప్రాయం కలుగుతుంది. పీవీ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల ప్రభావం ప్రతి రంగంలోనూ ఇప్పుడు కనపడుతోంది. మనుషుల జీవన ప్రమాణాలు మాత్రమే కాదు, మానవ సంబంధాలు కూడా మారిపోయాయి. మార్కెట్ శక్తులు మనిషి ఆలోచనలను పసిగట్టి తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు పెరిగిపోయాయి. నరేంద్ర మోదీ ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మార్పుకు చోదకశక్తిగా తనను తాను ప్రకటించుకున్నారు. మోదీ మార్కెట్‌ను సృష్టించలేదు. మార్కెట్‌కు అనువుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. దేశంలో పెరుగుతున్న యువ జనాభా, టెక్నాలజీ, ముఖ్యంగా సోషల్ మీడియా విప్లవం, పట్టణీకరణ దేశ రాజకీయ క్రీడ స్వరూప స్వభావాలను మార్చి వేశాయి. ఈ క్రీడలో మోదీ నిష్ణాతుడుగా నిరూపించుకున్నారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తూనే రాజకీయ, సామాజిక వ్యవస్థలపై పట్టు బిగించడం ప్రారంభించారు. క్రమంగా దేశ రాజకీయాలన్నీ తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. మోదీ ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న మీమాంసలో ప్రతి రాజకీయ పార్టీ పడే పరిస్థితి ఏర్పడింది.
సామాజిక వ్యవస్థలపై, సామూహిక చేతనపై ఒక బలమైన భావజాలం ప్రభావం చూపేందుకు మోదీ కారణమయ్యారు. ఇద్దరు వ్యక్తులు ఈ దేశం గురించి మాట్లాడుకుంటే నరేంద్రమోదీ అన్న వ్యక్తి పేరు దొర్లక తప్పని పరిస్థితిని ఆయన కల్పించారు. మోదీ దుర్మార్గుడని తీర్మానిస్తూ బలంగా ద్వేషించే వారు ఒక వర్గం అయితే, మోదీ అంతటి దేశభక్తుడు, జాతీయవాది మరొకరు లేరని బలంగా ఆరాధించేవారు మరో వర్గంగా చీలిపోయారు. తనను విమర్శించినా విస్మరించలేని పరిస్థితిని మోదీ కల్పించుకున్నారు. ‘బలమైన నాయకులు సాధారణంగా జాతీయవాదాన్ని తమ రాజకీయంగా ప్రకటిస్తూ తమ చుట్టూ ఒక వ్యక్తిగతమైన ఆకర్షణను సృష్టించుకుంటారు. ఈ దేశ సమస్యల్ని పరిష్కరించగల సామర్థ్యం తమకే ఉన్నదని, తామేది చేసినా దేశం కోసమే చేశామనే అభిప్రాయాల్ని కల్పించే ప్రయత్నిస్తారు. ప్రజాస్వామ్యం పట్ల అవిశ్వాసం ఉన్నా, తాము ప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నామని జనం భావించేలా చేస్తారు..’ అని ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు గిడియన్ రాక్ మన్ అన్నారు. నిజానికి ఈ విశ్లేషణ మోదీకి మాత్రమే కాదు, దేశంలో అనేకమంది నేతలకు కూడా వర్తిస్తుంది. అయితే మోదీ ప్రభావం ఇప్పటి వరకూ మన దేశం చూసిన నేతలకంటే విస్తృతమైనదే కాదు, భిన్నమైనది కూడా. తాను అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైనా తన ఆమోదయోగ్యత, ప్రభావం తగ్గలేదని మోదీ నిరూపించుకున్నారు. అలా తగ్గలేదని నిరూపించుకునేందుకు ఆయన మొత్తం పార్టీ వ్యవస్థనూ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ మాత్రమే కాదు, అనేక సంస్థల్నీ, వ్యక్తుల్నీ, మీడియాను ఉపయోగించుకుంటుండవచ్చు. గత ఏడాది సార్వత్రక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోయినా ఇవాళ పార్టీ మొత్తం తన చుట్టూ కేంద్రీకృతం కావడమే కాదు. తన మిత్రపక్షాలుగా భావిస్తున్న వారిని కూడా తన చుట్టూ దృష్టి సారించేలా చేసుకోగలిగారు. అంతేకాదు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆత్మరక్షణలో పడిపోయి తనను నిత్యం విమర్శించకుండా ఉండలేని పరిస్థితిని కల్పించుకున్నారు. అయిష్టంగానైనా కొన్ని పార్టీలు భజన చేసే పరిస్థితి కల్పించుకున్నారు. అలా చేసుకోగలగడమే ఆయన బలమైన నాయకత్వ లక్షణానికి నిదర్శనం.
బలమైన చర్యలు తీసుకోని వారు బలమైన నాయకులు కాలేరు. ఒక్కోసారి ఆ బలమైన చర్యలు బెడిసికొట్టవచ్చు, కాని ఆ పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా తిప్పుకుని వ్యతిరేకతా పవనాలకు ఎదురొడ్డి పైకి లేవగల శక్తి తనకున్నదని మోదీ రుజువు చేసుకున్నారు. గత 11 సంవత్సరాలలో మోదీ ఎంతో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెట్టింపు కంటే ఎక్కువ ధరలకు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశారన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు. వేలాది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భూసేకరణ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమాచార హక్కు చట్టాన్నీ నీరుకార్చారన్న విమర్శలూ ఎదుర్కొన్నారు. జీఎస్టీ విధించిన తీరు కూడా వివాదాస్పదమయింది. పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రతిపక్షాల కదలికల్ని పసికట్టారన్న ఆరోపణలూ ఎదురయ్యాయి. భయంకరమైన కరోనా అగ్నిపరీక్షగా మారింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడిపోయినా సరే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గకపోవడం, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకోవడం, పార్లమెంట్‌లో కీలక బిల్లులను చర్చలు లేకుండా ఆమోదించడం, పార్లమెంట్ నూతన భవన ప్రారంభాన్ని, అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠను తానే నిర్వహించడం కూడా చరిత్ర పుటల్లో నమోదయ్యాయి. ఇక వ్యవస్థలపై పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలూ, ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా ఈడీ, సీబీఐ వంటి సంస్థల్ని ప్రయోగించడం కూడా జనం చర్చల్లో రాకమానలేదు. ఎన్నికల బాండ్ల పేరుతో అధికార పార్టీ పారదర్శకత లేకుండా భారీ ఎత్తున నిధులు సేకరించడాన్ని సుప్రీంకోర్టే తప్పు పట్టింది. చివరకు పాకిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించి నాలుగు రోజుల్లో కాల్పుల విరమణ ప్రకటించడం మోదీ హయాంలో ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలకంటే ఎక్కువగా అంతటా చర్చనీయాంశమైంది. వాజపేయి కంటే భిన్నమైన నేత నరేంద్ర మోదీ. ఆయన తనకు అనుకూలంగా జరిగిన ప్రచారాన్ని మాత్రమే కాదు, ఈ దేశ సమస్యలకన్నిటికీ నెహ్రూ–-గాంధీ కుటుంబమే కారణమని ప్రతిభావంతంగా జనం విశ్వసించేలా చేయగలిగారు. కార్పొరేట్లకు అనుకూలమైన ప్రధానిగా ప్రతిపక్షాలు విమర్శించినా, తనను తాను ఓబీసీ నేతగా, చాయ్‌వాలాగా, తన తల్లి అంట్లు తోమిన పేదరాలిగా గద్గద స్వరంతో మాట్లాడి ఆకట్టుకోగలిగిన శక్తి మోదీకి ఉన్నది. తన విజయాలను తనకు అనుకూలంగా మార్చుకుని తన వైఫల్యాలకు ప్రతిపక్షాల గత నిర్ణయాలే కారణమని చెప్పడంలో మోదీని మించిన దిట్ట ఎవరూ లేరు. అన్నిటికంటే మించి మెజారిటీ హిందువులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను అవలంబించిన భారతీయ జనతా పార్టీ నేత మరొకరు లేరు. ఈ విషయంలో ఆడ్వాణీ, వాజపేయిలను కూడా మోదీ ఎంతో అధిగమించారు.
సమాజాన్ని చీల్చారన్న విమర్శ ఎదుర్కొన్నా అదే ఆయన బలంగా మారింది. మోదీ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం అంటూ లేదు. కాని ఆ ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. ‘చౌకీదార్ చోర్ హై’ అన్న నినాదం జనంలోకి వెళ్లలేదు. అదానీ, అంబానీలను మితిమీరి ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలూ ప్రభావం చూపలేదు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతల గురించి ఎంత తీవ్రంగా మాట్లాడినా అరణ్య రోదనలే అయ్యాయి. సామాజిక న్యాయాన్ని ఎజెండాగా చేపట్టినా జనంలో కదలికలు కనపడ్డ దాఖలాలు లేవు. గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని తాజాగా రాహుల్ గాంధీ ఆరోపించారు. లక్షలాది నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారని, రెండు గంటల్లో 65 లక్షల ఓట్లు పోలయ్యాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మహారాష్ట్ర మాదిరే బిహార్‌లో కూడా బీజేపీ అక్రమంగా గెలిచే ప్రయత్నం తప్పక చేస్తుందని రాహుల్ ఘంటాపథంగా సూచిస్తున్నారు. అయినా రాహుల్, కాంగ్రెస్ నేతల ఆరోపణలు జనం నమ్ముతున్నారని చెప్పేందుకు దాఖలాలు ఏమీ లేవు. అసలు కాంగ్రెస్ మాదిరి మిగతా రాజకీయ పార్టీలు కూడా బీజేపీ అక్రమాల ద్వారా గెలుస్తోందని నమ్ముతున్నాయా, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా విషయంలో జరిగినట్లు అన్ని పార్టీలు ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయా, అంతకు మించి బంగ్లాలో లాగా ప్రజా వెల్లువ కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారగలదా అన్న ప్రశ్నలకు జవాబు రానంతవరకూ రాహుల్ ఎన్ని ఆరోపణలు చేసినా వాటికి ప్రామాణికత ఏర్పడదు. అంతే కాదు, ప్రజాభిప్రాయాన్ని తమకు పూర్తిగా అనుకూలంగా మళ్లించుకునేందుకు, ప్రజలు తమ వెంట నడిచేందుకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోవడంలో, తమ విశ్వసనీయతను పెంచుకోవడంలో ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు విజయం సాధించాయన్నదే ప్రశ్నార్థకం. అసలు మోదీపై తాము ఎక్కుపెట్టిన విమర్శలన్నీ ఎందుకు వీగిపోతున్నాయో ప్రతిపక్షాలకూ క్లూ అందడం లేదు! నరేంద్రమోదీ త్వరలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన 11 సంవత్సరాల పాలనపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ఎంతో ప్రాధాన్యమున్నది. భగవంతుడు ఒక లక్ష్యంతోనే భూమ్మీద తనను ప్రవేశపెట్టాడని భావిస్తున్న నరేంద్ర మోదీ ఇవాళ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి, ఒక సమిష్టి ఆలోచనా విధానంగా మారిపోయిన మహాశక్తి. ప్రధానమంత్రిగా విఫలమైనా, విజయవంతమైనా ఆయన ఆలోచనా విధానం ప్రజల మనసుల్లోంచి తొలగిపోవడం అంత సులభం కాదు. ఆయన ప్రధానిగా ఎన్నాళ్లుంటారన్నది ప్రశ్న కాదు. ఆయన ఆలోచనా విధానం కంటే బలమైన ఆలోచనా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడే ప్రతిపక్షం విజయం సాధించగలదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Read latest AP News And Telugu News