వందేళ్ళ తెలంగాణ జీవన చిత్రం ‘మలగని బత్తి’
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:31 AM
‘మా భూమి’ చిత్రానికి 1979లో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డును పొందిన ఎస్.ఎమ్. ప్రాణ్‌రావ్ ఆ తరువాత నవలా రచననే ప్రధాన ప్రక్రియగా స్థిర పరుచుకుని ఇప్పటికి 20 నవలలు రాసారు...

‘మా భూమి’ చిత్రానికి 1979లో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డును పొందిన ఎస్.ఎమ్. ప్రాణ్‌రావ్ ఆ తరువాత నవలా రచననే ప్రధాన ప్రక్రియగా స్థిర పరుచుకుని ఇప్పటికి 20 నవలలు రాసారు. వీటిలో ‘రుద్రమదేవి’, ‘ప్రతాపరుద్రుడు’, ‘మహామంత్రి మాదన్న’, ‘ప్రజాజ్యోతి ‘పాపన్న’, ‘రాణి శంకరమ్మ’, ‘కొమరంభీం’ లాంటి చారిత్రక నవలలు ఉన్నాయి. ‘నీలిపాప’ పర్యావరణం మీద తొలి తెలుగు నవల. అలాగే, ట్రాన్స్‌జెండర్ కథానాయకుడుగా వచ్చిన మొదటి నవల ‘పురి విప్పిన నెమలి’.
ఇటీవల ప్రాణ్‌రావు వెలువరించిన ట్రిలజీ (Trilogy) ‘మలగని బత్తి’ కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యా నికి సంబంధించిన చారిత్రక నవలే. ‘మలగని బత్తి’, ‘నేల జారని ఊడలు’, ‘పంచువాటు’ అనే మూడు నవలల సమాహారం ఈ నవలాత్రయం. మూడు నాలుగు తరాలకు విస్తరించి వస్తు ఐక్యత సాధించిన ఈ నవల లోని కథాంశం వందేళ్ళ తెలంగాణ జీవన చిత్రం. తెలంగాణ భాషకు ప్రాణప్రదమైన యాసను, నుడికా రాన్ని, పలుకుబడిని అద్భుతంగా ప్రతిధ్వనిస్తుంది.
తెలుగులో మహీధర రాంమోహనరావు ‘కొల్లాయి గట్టితేనేమి’, ‘దేశం కోసం’, ‘జ్వాలాతోరణం’ అనే నవలలు ట్రిలజీ కోవలోకి వస్తాయి. దాశరథి రంగాచార్య, అంప శయ్య నవీన్‌లు రాసిన నవలల్లోనూ ట్రిలజీలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకే పుస్తకంగా రాలేదు.
ప్రాణ్‌రావు నవలా త్రయంలో మొదటి నవల ‘మలగని బత్తి’. కథ మొత్తం దొర నరహరి రావు ఏలుబడిలో ఉన్న ప్రధాన గ్రామం తిమ్మాపురంలో జరుగుతుంది. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థలో దొరల క్రూరత్వం, రజాకార్ల దౌర్జన్యం, సంగం ఏర్పాటు, దళాల నిర్మాణం, దొరలపై తిరుగు బాటు ఈ నవలలోని ప్రధానాంశాలు. ‘మలగని బత్తి’ కథానాయకుడు రాజన్న. ఇతని తండ్రి సీనయ్య, తాత పోశయ్య దొరల అణచివేతకు గురై బానిస బ్రతుకులు బ్రతికారు. దొర దాష్ట్టీకం వల్ల రాజన్న చదువుకి స్వస్తి చెప్పి దొర దగ్గర వెట్టి చాకిరి చెయ్యవలసి వస్తుంది. పశులు కాసే రాజన్నకి అడవిలో కామ్రేడ్ జానకి రామయ్య కలుస్తాడు. సంగం గురించి దళ నిర్మాణం గురించి అవగాహన కల్గిస్తాడు. ఆ స్ఫూర్తితో కామ్రేడ్ లింగం దగ్గర శిక్షణ పొందిన రాజన్న, దళం ఏర్పాటు చేసి దొర గడీని ముట్టడి స్తాడు. ముట్టడి పతాక సన్నివేశంలో ఎదురుబొదురు కాల్పులు జరుపుకుంటారు. ఆ కాల్పుల్లో దొర నర హరిరావు రాజన్న చేతిలో మరణిస్తాడు; రాజన్న కూడా అమరుడౌతాడు. ఆనాటి బడుగుల నిస్సహాయ బ్రతుకులలోని ఎడతెగని కడగండ్లను హృదయం కదిలించేలా చిత్రీకరించాడు రచయిత.
నవలా త్రయంలో రెండవ నవల ‘నేల జారని ఊడలు’. ఇందులో రంగు మారిన దొరతనం కనిపి స్తుంది. దొరలు గాంధీ టోపీల్లోకి మారి పట్నాలకు పోయి వ్యాపారం, పల్లెల్లో రాజకీయం చేస్తుంటారు. ఈ మార్పు తప్ప పేదవారి జీవితంలో ఏ మార్పూ రాదు. ఈ నవలలో ప్రధాన పాత్ర రాజన్న కొడుకు దుర్గయ్య. తల్లి తండ్రి లేని దుర్గయ్యను కూలి నాలి చేస్తూ పెంచుతుంది అతని నాయనమ్మ చంద్రమ్మ. దుర్గయ్య ఏడవ తరగతిలో ఉండగా చంద్రమ్మ ఆరోగ్యం పాడవటం వలన దుర్గయ్య చదువు మాని పిచ్చయ్య బట్టల కొట్టులో పనికి కుదురుతాడు. తను చెయ్యని దొంగతనం ఎదుర్కొనే సందర్భంలో, గ్రామ పెద్దలను ధిక్కరించి పట్నం పారిపోతాడు. అక్కడ ఒక హోటల్‌లో పని దొరుకు తుంది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటాడు. ఒక ఊరేగింపులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలుకు వెడతాడు. జైలులో దుర్గా ప్రసాద్ అనే మార్క్సిస్టు మేధావితో పరిచయం కలు గుతుంది. ఆ సహచర్యం వల్ల వర్గ రహిత సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం అలవడుతుంది. నక్సలైట్లలో కలిసిపోతాడు. భార్య ప్రమీ లని, కూతురు గాయత్రిని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపో తాడు. ఎమర్జెన్సీ కాలంలో అడవిలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనిపించకుండా పోతాడు. ఈ నవలా త్రయంలో– రాజన్న అతని కొడుకు దుర్గయ్యలు ప్రజల మనుషులు. అన్యాయాన్ని ఎదిరించి ప్రాణ త్యాగం చేస్తాడు రాజన్న. నమ్మిన సిద్ధాంత కోసం ప్రాణాల్ని పణంగా పెడ్తాడు దుర్గయ్య.
నవలా త్రయంలోని మూడవ నవల ‘పంచు వాటు’. దుర్గయ్య అజ్ఞాతంలోకి పోవడంతో ఏ దిక్కూ లేని ప్రమీల కూతురు గాయత్రిని పోషించడానికి భవన నిర్మాణ కూలిగా మారుతుంది. అక్కడే తోటి కూలీగావున్న అనాథ బాలుడు రవి ఆమెకి చేరువ వుతాడు. మేస్త్రీ ఆగడాలు తట్టుకోలేక ప్రమీల తన భర్త గ్రామం తిమ్మాపురం వెడుతుంది. అక్కడే గాయత్రిని రవికి ఇచ్చి వివాహం చేస్తుంది. వార సత్వంగా దక్కిన రెండెకరాలలో వ్యవసాయం చేసు కుంటూ జీవితం వెళ్ళదీస్తుంది. ఎమర్జెన్సీ ఆగడాలు తట్టుకోలేక కూతురు అల్లుడుతో పట్నం వస్తుంది. మళ్ళీ కూలి బ్రతుకే ఆధారమవుతుంది. ఊరిలో ఆమె కున్న రెండెకరాల పొలం గ్రామ పెద్ద బాలపీరు కబ్జా చేసుకుంటాడు. హైదరాబాద్‌లో జరిగిన మత కల్లో లాల్లో కత్తిపోట్లకు గురైన ప్రమీల ఉస్మానియా మార్చురీలో శవంగా మిగులుతుంది. పెద్ద దిక్కులేని రవి, గాయత్రి నానా అగచాట్లు పడుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఉబుకుతుంది. రవి పెద్ద కొడుకు రాజు ఒంటి మీద పెట్రోలు పోసుకొని తెలంగాణ సాధన కోసం ఆత్మాహుతి చేసుకుంటాడు. తెలంగాణ కల సాకారమవుతుంది. రవి రెండవ కొడుకు కిరణ్ ఎం.ఎ. పాసయి ఐదేళ్ళయినా ఉద్యోగం రాదు. పొట్ట చేతబ ట్టుకుని బొంబాయి వలసపోతాడు. తెలంగాణ రావడం వల్ల ఊళ్ళో కబ్జాకి గురైన తమ భూమి తమకు వస్తుందనే ఆశతో ఊరికి వెడతారు రవి, గాయత్రిలు. 40 లక్షలు విలువ చేసే ఆ భూమిని తను ఆరు లక్షల కమీషన్ తీసుకుని, కంటి తుడుపుగా రెండు లక్షలు రవి చేతిలో పెట్టి ఆ భూమి సెటిల్‌మెంట్ చేస్తాడు దళారి శంకరయ్య. ఆ డబ్బుతో పిల్లల పెళ్ళిళ్లు చేస్తారు. కన్న పిలల్లు దూరమై వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోయిన రవి, గాయత్రిలు హైదరాబాద్‌లో కురిసిన కుంభవృష్టిలో చెరువు శిఖంలో వేసుకున్న తమ గుడిసె కొట్టుకుపోగా రెక్కలు విరిగిన పక్షుల్లా మిగిలిపోతారు.
ఈ నవలా త్రయం నాలుగు తరాల గాథ. సీనయ్య, రాజన్న, దుర్గయ్య, రాజు ఆ తరాల ప్రతి నిధులు. సీనయ్య పాత తరానికి ప్రతినిధి అయితే తక్కిన వారు కొత్త తరానికి ప్రతినిధులు. వీరిలో రాజన్న, దుర్గయ్యలు పోరాట బాట పట్టారు. రాజు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకుంటాడు. ఈ ట్రిలజీ ఒక శతాబ్దం పైన విస్తరించి 1908 నుండి 2018 వరకు సాగుతుంది. మొదటి నవల -దొరల, రజాకార్ల దుర్మార్గం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం; రెండవ నవల - తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సటైటు ఉద్యమం, ఎమర్జెన్సీ;- మూడవ నవల మలిదశ తెలంగాణ ఉద్యమం, బలి దానాలు, తెలంగాణ ఆవిర్భావం అనంతర పరిస్థితులు హృదయా లను ఆకట్టుకునేలా ఎంతో ఆర్ద్రత నిండిన దృశ్యాలతో ఎక్కడా ఆగ కుండా చదివిస్తాయి. ఒక విధంగా మలగని బత్తి తెలంగాణ సాంఘిక చరిత్ర (1908–-2018)గా భావించవచ్చు.
తెలంగాణ జీవితానికి అక్షర సాక్ష్యంగా కలకాలం నిలిచే ప్రయోజ నాత్మక నవల ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు నవలా త్రయం ‘మలగని బత్తి’. నవల ముగింపులో ‘‘అంకుల్, మీ లాంటి లక్షలాది కుటుంబాలు స్వేచ్ఛగా, హుందాగా, భవిష్యత్తు మీద భరోసాతో, నిర్భయంగా బతకగలిగినప్పుడే మేం చేసిన ఉద్యమం ఫలిస్తుంది. రాజు లాంటి అమరవీరుల త్యాగాలకి ప్రయోజననం సిద్ధిస్తుంది. అంతదాకా మా పోరాటం ఆగదు. మా పోరాటం నిరంతరం సాగుతుంది అది మలగని బత్తి’’ అన్న రాజు స్నేహితుడు శ్రీధర్ మాటలు యువతకు స్ఫూర్తిని, రాజకీయ నాయకులకు హెచ్చరికను సందేశంగా ఇస్తాయి.
n చింతపట్ల సుదర్శన్
& 92998 09212