Share News

A Powerful Ode to Village Life: మత్తకొలుపు

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:56 AM

అవ్వా గౌండ్లోల్ల భాగవ్వా కాయిపాయి కమ్మగ తింటనని

A Powerful Ode to Village Life: మత్తకొలుపు

వ్వా! గౌండ్లోల్ల భాగవ్వా!

కాయిపాయి కమ్మగ తింటనని

ఇల్లిడిసి ఊరిడిసి ఎగేసుకొచ్చిన్నని

అలిగి అరుగంచుకు కూసున్నవా!

బతుకు మెతుకు తల్లీ! అతుకు బతుకు

మామా! మాసుల్దారి మైసయ్యా!

కడుపు సలసల మసల్తుందిరా అయ్యా

ఇల్లిడిసి పల్లిడిసి శేనిడిసి శెల్కిడిసి

పిడికెడంటే పిడికెడే మెతుకులురా మామా

వందలు వందలు మందలు మందలు

లొందల బొందల బొందల లొందల

బతుకు బందీల వడ్డది మామా

బావా! నీరటి బాల్‌నర్సూ!

వరి కర్రలకు నీళ్ళు తాపుతున్నవా

వట వట కన్నీళ్ళు వడుపుతున్నవా

కట్ట కొమ్ముకు కూసోని

రాయిని చెర్వు మీద భగభగ మండుతున్నవా

మండకు తండ్రీ! పిండకు నాయినా!

కట్ట మైసమ్మ కన్ను తెరిచే ఉంది

పెద్దవ్వా! లేకి రాజవ్వా!

కల్లం అడుగులు మాయమాయెనని

మనాదిల పడకు పునాదిల పడకు

దిగులు పడకు మొగులు అయితది

లేకి బతుకు లేని మెతుకు

ఫికరు తప్ప ఫకరు కాదు

గోధుమకుంట ముత్యాలమ్మ పెద్ద పెద్ద జంగలతోని

సర్రాసుగ నీ ఇంట్లకే నడిచొస్తున్నది

బాపూ! పాండవ కతోల్ల పరంధాములూ!

నీ జీర గొంతు బీరి పోనియ్యకు నాయినా!

పంచ పాండవులు ఏమడుగుతున్నరు?

అయిదూళ్ళడుగుతున్నరా! అయిదు వేళ్ళడుగుతున్నరా!

చిచ్ఛా! మొల్ల సయ్యదూ!

మర్రి చెట్టెక్కిన దూది పీరి

మల్ల మసీదు ముందట దుంకిందట నిజమేనా!

ఎన్నడు కలువని పాత పీరి

కొత్త పీరి కలిసి సవారీ చేస్తున్నయట నువద్దిగనేనా!

కొంచెమంత ఊదు పొగేసి

నెమలీకల కట్టతోని నెత్తిమీద కొట్టురా అయ్యా!

అల్లుడా! మాదిగ కనుకయ్యా!

‘లంద’ల దాగున్న ఎల్లవ్వతల్లి ఏమంటున్నది

బైండ్ల మల్లన్న జమిడిక ఏం పాడుతున్నది

మత్త కొలిపిన మేకపిల్ల ఏమనుకుంటున్నది

సిద్ధులు యోగమడుగుతున్నరా! భోగమడుగుతున్నరా!

బామ్మర్దీ! పసులకాడి బాలయ్యా!

కాళ్ళకు బలపాలు కట్టినవా

కాటగలిసిన కైలిది మూటిల కలిసిందా!

పక్క పక్కలు నడిసే పయ్యది తొవ్వల వడ్డదా!

పసురాలకు పసరిక కంట్లెవడ్డదా

కంచెల తోలి పరాకత్‌గ కన్నుమలుపకురా అయ్యా!

బాహుబలులు బలి కోరుతై.

-మద్దికుంట లక్ష్మణ్

Updated Date - Jul 14 , 2025 | 12:56 AM