అపురూప కవులకు లోక్‌నాయక్ పురస్కారం
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:30 AM
గత 20 సంవత్సరాలుగా ఎన్.టి. రామారావు గారి పుణ్యతిథి రోజున లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం) రెండు లక్షల రూపాయల నగదు ప్రదానం చేసే సాహిత్య పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందెశ్రీ, ఖాదర్ మొహియుద్దీన్ స్వీకరిస్తారు...

గత 20 సంవత్సరాలుగా ఎన్.టి. రామారావు గారి పుణ్యతిథి రోజున లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం) రెండు లక్షల రూపాయల నగదు ప్రదానం చేసే సాహిత్య పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందెశ్రీ, ఖాదర్ మొహియుద్దీన్ స్వీకరిస్తారు. మనిషితనానికై పరితపించిన పాట అందెశ్రీది. ముస్లిం అస్తిత్వ వేదనను పలికించిన కవనం ఖాదర్ మొహియుద్దీన్‌ది.
అక్షర జ్ఞానం లేని రత్నాకరుడనే బోయవాడు సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించి వాల్మీకి అయ్యాడని చదువుకున్నాం. మన కాలపు వాల్మీకి అందెశ్రీ. పాండిత్యం పండితుల కుటుంబాల్లో, ప్రతిభ పెట్టుబడిదారుల కుటుంబాల్లో మాత్రమే పుట్టదు అని నిరూపించారు.
అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18వ తేదీన వరంగల్ జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. పదేళ్ళు కూలీగా, ఇరవై రెండేళ్ళు తాపీమేస్త్రిగా పనిచేశారు. అక్షర జ్ఞానం లేదు. చదవడం, రాయడం రాదు. ‘‘నేను పుట్టిన దేశంలో కులమే ప్రామాణికమైనప్పటికీ నా ఊరిలో నాకు కులమనే మరకే అంటలేదు. నా ఊరిలోని ప్రజలందరూ మానవ కులంగా బ్రతుకుతారు. నా ఊరు నాకు చెక్కుచెదరని నేపథ్యంగా మారింది’’ అని చెప్పిన అందెశ్రీ, హైదరాబాద్ వచ్చి ఐదేళ్లపాటు కాలినడకనే నగరంలో తిరిగాడు. భార్య మెడ లోని తాళిబొట్టు కూడా అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు. తినడానికి ఒక్క రూపాయి లేక ఆకలితో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అప్పుడే ఆయన లోంచి కవి పుట్టుకొచ్చాడు. జీవించాలి అనే తలంపు ఉంటే అన్నీ నేర్పుతుంది జీవితం. ఇందుకు అందెశ్రీ నిలువెత్తు నిదర్శనం. నిజామాబాద్ లోని శృంగేరి మఠంలో శంకర్ మహారాజ్ అందెశ్రీ అని పేరు పెట్టి, వెన్నుతట్టి ప్రోత్సహించారు. చదువుకుంటేనే భాష వస్తుంది అనేది అపోహేనని నిరూపించారు అందెశ్రీ. వినడం ద్వారానే పురాణ, ఇతిహాసాలు, వేద వాఙ్మయ, ఉపనిషత్తుల ధర్మాలు అన్నీ అవగాహన చేసుకున్నారు. భక్తి పాటలు రాశారు. ప్రజా ఉద్యమాలకు బాటలు వేసే గొప్ప గీతాలు రచించారు. ‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు/ నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు/ ఏడ ఉన్నడో కానీ కంటికీ కానరాడు’’ – అంటూ మనిషితనం కోసం తపించాడు.
‘జయజయహే తెలంగాణ’ ఇప్పుడు రాష్ట్ర గీతంగా ధ్వనిస్తోంది. ఆయన రచనలు పాఠ్యపుస్తకాల్లో భాగాలయ్యాయి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ను అందుకున్న అందెశ్రీ ‘లోకకవి’ బిరుదును సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ అందెశ్రీని తమ వార్షిక సాహిత్య పురస్కారం రెండు లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నది.
స్వాతంత్ర్యానంతర కాలంలో భారత ముస్లింల అస్తిత్వ వేదనను శక్తివంతంగా అభివ్యక్తం చేసిన కవిత ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’. రామచంద్ర గుహ వంటి చరిత్రకారుడు తన ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ పుస్తకంలో ‘పుట్టుమచ్చ’ కవిత నుంచి కొన్ని పంక్తులను ఉటంకించారు. ప్రఖ్యాత హిందీ కవి అశోక్ వాజపేయి సంపాదకత్వంలో వెలువడిన ‘ఇండియా డిసెంట్స్: 3000 ఇయర్స్ ఆఫ్ డిఫరెన్స్, డౌట్ అండ్ ఆర్గ్యుమెంట్’ బృహత్ సంకలనం కోసం తెలుగు నుంచి మూడు కవితలను ఎంపిక చేశారు. అందులో ఒకటి ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’ కాగా, మిగతా రెండిటిలో ఒకటి అన్నమయ్యది, రెండవది గద్దర్‌ది!
‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైవుంది నా పేరు’’ అన్న ఖాదర్– 1955 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలోని ఒక మారుమూల కుగ్రామంలో జన్మించారు. పుట్టి పెరిగిన దేశంలోనే వలస జీవనాన్ని ఈడ్వాల్సిన కాందిశీకుని యాతన ఖాదర్ మొహియుద్దీన్ కవిత్వంలో వినిపించే వేదన. అమాయకంగా దెబ్బతింటున్న భారత ముస్లింల స్వరానికి ఇచ్చిన కొన్ని లక్షల కోట్ల డెసిబిల్స్ శబ్దం ఖాదర్ మొహియుద్దీన్ కవిత్వం.
నిజానికి పుట్టుమచ్చ దీర్ఘకవిత ఖాదర్ మొహియుద్దీన్ ఇతర కవితలను కనుమరుగయ్యేలా చేసిందని పలువురు విమర్శకులు, కవులు గుర్తించారు. ఉదాహరణకు మొదటి కవిత ‘సంధ్య’ నుంచి రెండు చరణాలు– ‘‘ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు/ దాని తోక నేల మీద ఎలిజీ రాస్తోంది.../ వెలుగు చీకట్ల పల్టీలు వేస్తూ/ ఎర్ర లంగోటా చుట్టుకుని/ కాలం వేసిన శీర్షాసనం ఈ సంధ్యా సమయం’’ – ఇటువంటి అద్భుతమైన వాక్యాలతో పాటు, ‘‘చినిగిపోతున్న క్యాలెండర్ చివరి పేజీ వెనుక నా నీడంటే భయం...’’, ‘‘గోడల్ని నిలువునా కూల్చితే తప్ప నీడలు నిజాల్ని విప్పవు/ బహుశా దిక్కులు లేవనెత్తితే ఉషస్సు శవపేటికలా పైకి లేస్తుంది’’ వంటి మహా వాక్యాలు ఖాదర్ మొహియుద్దీన్ కవిత్వంలో అనేకం. ‘అజైవిక’ శీర్షికతో కరోనా వైరస్‌పై రాసిన కవిత ఇటీవలి సంచలనం. అనువాద రంగంలో ఖాదర్ మొహియుద్దీన్‌ది అందె వేసిన చెయ్యి. టి.ఎస్. ఎలియట్ ‘ద వేస్ట్ లేండ్’కు ‘చవిటిపర్ర’ శీర్షికతో చేసిన అనువాదం ఒక ఉదాహరణ మాత్రమే. ‘పుట్టుమచ్చ’ ఇంటి పేరుగా మారిపోయిన ఖాదర్ మొహియుద్దీన్‌కు ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ విశాఖపట్నం రెండు లక్షల రూపాయల నగదుతో తమ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది.
లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం రేపు సాయంత్రం 5 గంటలకు డా.బి.ఆర్. అంబేడ్కర్ అసెంబ్లీ హాల్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నంలో జరుగుతుంది. పై పురస్కారాలతో పాటు లక్షరూపాయల జీవన సాఫల్య పురస్కారాన్ని ఇమ్మణ్ణి దీపావెంకట్, డి.ఆర్.కె. ప్రసాద్, పద్మావతి దంపతులు స్వీకరిస్తారు. సభలో ముఖ్య అతిథిగా నల్లు ఇంద్రసేనారెడ్డి, సభాధ్యక్షులుగా గంటా శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా నటుడు కన్నెగంటి బ్రహ్మానందం, ఆత్మీయ అతిథులుగా– చలసాని అశ్వనీదత్, వై.వి.యస్. చౌదరి, వల్లేపల్లి శశికాంత్, లావు రాణి రుద్రమదేవి పాల్గొంటారు.
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్