Share News

Local Government Empowerment: గేమ్‌ చేంజర్స్‌ గా స్థానిక ప్రభుత్వాలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:10 AM

స్థానిక సంస్థలు స్వశక్తితో పైకి ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మూడు అంశాలు కీలకం. ఒకటి ఫైనాన్సెస్‌ (నిధులు), రెండు ఫంక్షన్స్‌ (విధులు), మూడు ఫంక్షనరీస్‌ (ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు). ఈ మూడు సమకూరడానికి, సవ్యంగా ముందుకు

Local Government Empowerment: గేమ్‌ చేంజర్స్‌ గా స్థానిక ప్రభుత్వాలు

స్థానిక సంస్థలు స్వశక్తితో పైకి ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మూడు అంశాలు కీలకం. ఒకటి ఫైనాన్సెస్‌ (నిధులు), రెండు ఫంక్షన్స్‌ (విధులు), మూడు ఫంక్షనరీస్‌ (ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు). ఈ మూడు సమకూరడానికి, సవ్యంగా ముందుకు సాగడం కోసమే చరిత్రాత్మకంగా పేర్కొనే 73, 74 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఇవి జరిగాక, స్థానిక సంస్థల పనితీరు కొంతమేర మెరుగైన మాట నిజం. కానీ ఆశించిన ప్రయోజనాలు ఒనగూడినట్లేనా అన్నది చర్చనీయాంశం.

ముందుగా స్థానిక సంస్థలకు అందుతున్న నిధులు, సొంతంగా అవి ఆర్జిస్తున్న ఆదాయం గురించి మాట్లాడుకోవాలి. మన రాజ్యాంగంలోని 243(జి) అధికరణ ప్రకారం స్థానిక సంస్థలకు మూడు మార్గాలలో నిధులు సమకూరుతాయి. కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వాటికి నిధులు అందుతాయి. ఇవికాక సొంతంగా అవి ఆదాయం ఆర్జించాలి. 15వ కేంద్ర ఆర్థిక సంఘం 2021–2026 మధ్య కాలానికి స్థానిక సంస్థలకు రూ.4.36 లక్షల కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్న స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు అందుతున్నాయి. ఇక వాటి సొంత ఆదాయాన్ని పరిశీలిస్తే, ఇటీవల రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం దేశంలోని స్థానిక సంస్థలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 60శాతం మేర సమకూరుస్తుండగా, అవి సొంతంగా ఆర్జిస్తున్న ఆదాయం జీడీపీలో కేవలం 0.6శాతం మాత్రమే ఉంది. అది కూడా దేశంలోని పెద్ద నగరాలు ఆర్జిస్తున్న ఆదాయం కారణంగానే. దేశంలోని అత్యధిక మున్సిపాలిటీలలో సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదు. ఇక వేలాది గ్రామాల్లో బ్లీచింగ్‌ పౌడరు కొనడానికి కూడా నిధులు లేవు.


స్థానిక సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయా? అని పరిశీలిస్తే– స్థానిక స్వపరిపాలనలో కీలకమైన ప్రణాళిక, అభివృద్ధి, కార్యనిర్వహణలకు సంబంధించి పనులు చేపట్టడంలో ఈ సంస్థలు చాలా వరకు విఫలం చెందాయి. కారణం రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే. ఎందుకంటే, రాజ్యాంగం 11వ షెడ్యూల్‌లో పొందుపర్చిన 29 అంశాలను పలు రాష్ట్రాలు ఇప్పటి వరకు పూర్తిగా స్థానిక సంస్థలకు బదలాయించలేదు. రాజ్యాంగబద్ధంగా అందవలసిన నిధులు, విధులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ సంస్థలు అనేక ఉద్యమాలు చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి కూడా. ఆందోళనలు ఉధృతమైనప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటున్నారే తప్ప, పూర్తి స్థాయిలో 29 అంశాలను బదలాయించి స్థానిక సంస్థలను ‘ఎంపవర్‌’ చేయడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతున్న తంతు మాత్రం ఇదే. కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి ప్రణాళికలలో భాగంగా ‘స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌’ అనే పథకం చేపట్టి రూ.2.05 లక్షల కోట్లతో 100 నగరాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 2011 జనాభా లెక్కల ఆధారంగా లక్ష జనాభా దాటిన ప్రాంతాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌గా గుర్తించాలి. ఆ లెక్కన దేశంలో 269 మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రస్తుత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే అవి 600 పైగానే ఉన్నాయి. అంటే మొత్తం నగరాలలో ఆరోవంతు నగరాలలోనే ‘స్మార్ట్‌ సిటీస్‌’ మిషన్‌ పథకం అమలవుతోంది. మరి మిగతా నగరాల పరిస్థితి ఏమిటి?

దేశంలో పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోయాక– నగరాలలో, పట్టణాలలో మురికివాడలు పెరిగిపోయాయి. అడ్డదిడ్డంగా ఆక్రమణలు విస్తరించాయి. తాజా లెక్కల ప్రకారం పట్టణ జనాభాలో 17శాతం మంది మురికివాడలలో నివసిస్తున్నారు. అక్కడ ఉండేవారికి మౌలిక సదుపాయాలు సమకూర్చడం కార్పొరేషన్లకు తలకు మించిన భారమైంది. ఇక ఆక్రమణల విషయానికి వస్తే దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై మొదలుకొని దాదాపుగా అన్ని నగరాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. గత ఏడాది బెంగళూరులో కురిసిన వానలకు నీరు నిలిచిపోయి నగరం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆక్రమణల తొలగింపులో ప్రభుత్వాల ఉదాసీనత, ప్రజల పాలిట శాపంగా మారింది. హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘హైడ్రా’ లాంటి వ్యవస్థను ఇప్పుడు దేశంలోని అన్ని నగరాలలో చేపట్టాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ప్రధాన నగరాలలో ఆక్రమణలు తొలగించి మురుగునీరు, వాననీరు పోయేందుకు, డ్రెయిన్లు పూడిక తీయించేందుకు కూడా స్థానిక రాజకీయాల కారణంగా ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయి.


ఇక స్థానిక సంస్థల అభివృద్ధిలో 3వ కీలక అంశం... ఫంక్షనరీస్‌ (ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు) విషయానికి వస్తే– పరిపాలనా సంబంధిత విధాన నిర్ణయాలు తీసుకొనే ప్రజాప్రతినిధుల మధ్య ఇటీవల కాలంలో రాజకీయంగా ఏకాభిప్రాయం లోపిస్తోందని, ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కేరళ రాష్ట్రం త్రికరణశుద్ధిగా 73, 74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తిని ఆచరణలో చూపిస్తున్నది. అక్కడి గ్రామ సచివాలయ వ్యవస్థ రాష్ట్ర సచివాలయ వ్యవస్థకు నమూనాగా నిలుస్తోంది. అదే విధంగా రాజ్యాంగబద్ధంగా బదిలీ కావలసిన 29 అంశాలను సంపూర్ణంగా స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా 300 కోట్లకు పైగా పనిదినాలు చేపట్టగా, కేరళలో కేటాయించిన పని దినాల్లో 90 శాతం మేర ఉపయోగించుకోగలిగారు. అయితే, ఈ పథకం కింద ఉపాధి కూలీలకు పని కల్పించడంలో దేశ సగటు 55 శాతం మాత్రమే కావడం గమనార్హం. స్థానిక ప్రభుత్వాల్లో ప్రధాన సమస్యగా మారిన అవినీతిని నిరోధించడానికి, విచారించడానికి కేరళ ప్రభుత్వం ‘అంబుడ్స్‌మన్‌’ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కేరళ తర్వాత పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో కూడా స్థానిక స్వయంపాలిత ప్రభుత్వాలు సమర్థంగా, ఆదర్శంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు... ప్రజల భాగస్వామ్యంతో సేవలందించేవారుగా, సంక్షేమ ప్రతినిధులుగా, క్రమబద్ధీకరించేవారుగా, సహాయకారులుగా తమ బాధ్యతలను నిర్వహించడం వల్ల ఫలితాలు అందుతున్నట్లు అక్కడి ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.

స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలలో సామాజిక న్యాయం పాటించడం వల్ల పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉన్నదా? అనేది పరిశీలనాంశం. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాయి. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ప్రస్తుతం మహిళల సగటు ప్రాతినిధ్యం 48శాతానికి పెరగడం గొప్ప ముందడుగు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధన ఉన్నా, కొన్ని రాష్ట్రాలు బీసీలకు 50 శాతం మించి రిజర్వేషన్లు అందిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ జారీచేసింది. తెలంగాణ రిజర్వేషన్ల మోడల్‌ విజయవంతమైతే, చాలా రాష్ట్రాలు అదే దారిలో పయనించే అవకాశం ఉంది.


స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపుదలకు, వాటి అభివృద్ధికి సంబంధం ఉంటుందా? అన్న అంశాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలి. అయితే, రిజర్వేషన్ల పెంపుదల వల్ల కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక నాయకత్వం బలపడుతుంది. స్థానిక సంస్థలు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాల్లో ఇంతకుముందు కంటే ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది. మహిళల భాగస్వామ్యం పెరిగాక స్థానిక సంస్థల పనితీరు మెరుగైంది. స్థానిక స్వయంపాలన బలోపేతం అయితేనే, పట్టణ–గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి. అయితే స్వయంపాలనలో సొంత నిర్ణయాలు ఉండాలి. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే వివిధ కమిటీలకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. స్థానిక సంస్థల పరిధిలోని మట్టి, ఇసుక, గనులు వంటి సహజ వనరులపై వచ్చే ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళకుండా చూడాలి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఉండే మురికివాడలను అభివృద్ధి చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణలను తొలగించాలి.

రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గని తెలంగాణ ‘హైడ్రా’ తరహా వ్యవస్థను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలి. 2047 నాటికి ప్రధాని మోదీ చెబుతున్న ‘వికసిత భారత్‌’ రావాలన్నా, ఆ సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు వికసిత ఆంధ్రా సిద్ధించాలన్నా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పూర్తి సాధికారతతో పనిచేయగలగాలి. అప్పుడే దేశాభివృద్ధిలో అవి ‘గేమ్‌ ఛేంజర్స్‌’ అవుతాయి.

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 06:18 AM