కొంచెం జాగ్రత్తపడదాం!
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:39 AM
చైనాలో తాజాగా వైరస్ వ్యాప్తితో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి రోగులు తామరతంపరగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఆ దేశం వాటిపై నిఖార్సయిన సమాచారం...

చైనాలో తాజాగా వైరస్ వ్యాప్తితో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి రోగులు తామరతంపరగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఆ దేశం వాటిపై నిఖార్సయిన సమాచారం ఇతర దేశాలతో పంచుకోకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి హెచ్‌ఎంపి వైరస్ కారకంగా తెలియవస్తోంది. అదే వైరస్ కేసులు ఇతర ప్రపంచ దేశాల్లో కూడా రిపోర్ట్ అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. మన దేశంలో బెంగుళూరులో రెండు కేసులు బయటపడ్డాయి. అయితే వాటికీ, చైనాలో కేసులకు సంబంధం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. అది కొంత ఊరటే.
ఈ నేపథ్యంలో మన దేశం అప్రమత్తంగా ఉండడం అవసరం. కొవిడ్ వ్యాప్తిలో జరిగిన అనుభవాల ఆధారంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ వ్యాప్తి పట్ల సమాచారం వెంటవెంటనే అందజేసేటట్లు చూడాలి. చైనా, ఇతర దేశాల్లో పరిస్థితుల్ని నిశితంగా గమనించాలి. ప్రజా ఆరోగ్య విభాగాల్ని, సంబంధిత యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలి. ఆక్సిజన్ నిల్వలు, సిబ్బంది, సపోర్ట్ సిస్టమ్‌లను రెడీ చెయ్యాలి. వీటన్నింటి కన్నా ముఖ్యంగా వ్యాప్తి నివారణ అంశాలపై దృష్టి పెట్టాలి. మాస్కుల వినియోగం, చేతుల శుభ్రత, గుంపుల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కలిగించాలి. కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలను ప్రజా సమూహాలు మళ్లీ అలవర్చుకోవాలి.
ముఖ్యమైన విషయమేమిటంటే ఈ హెచ్‌ఎంపీ వైరస్ కొత్తది కాదు.. ప్రమాదకరమైనది కాదు. 2001 నుండి తెలిసిందే. పిల్లల్లో శ్వాస సంబంధిత వ్యాధుల్లో 12 శాతం దీని వల్లే వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్ళలో ప్రమాదకరంగా మారవచ్చు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తపడాలి. శీతాకాలంలో సహజంగానే వైరస్ వ్యాప్తి ఎక్కువ. కాబట్టి కేసులు ఎక్కువ కనబడతాయి. నివారణ, జాగ్రత్తలతో వ్యాప్తిని వీలైనంత తగ్గిస్తే మంచిది. ఆ కోణంలోనే ఆలోచించి, తదనుగుణంగా ఆచరిస్తే సరిపోతుంది. భయం అక్కరలేదు. బాధ్యత ఉంటే చాలు.
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ