Indian Constitution: న్యాయ సహాయం రాజ్యాంగ బాధ్యత
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:56 AM
సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని అతణ్ణి అరెస్ట్ చేశారు. దాంతో కుటుంబంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. పోలీసులు ఏర్పాటు చేసిన న్యాయవాది కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు....
సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని అతణ్ణి అరెస్ట్ చేశారు. దాంతో కుటుంబంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. పోలీసులు ఏర్పాటు చేసిన న్యాయవాది కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అయినా నిందితుడు ఆరు నెలలుగా జైల్లోనే ఉన్నాడు. ఇక్కడ అతడి పేరు అవసరం లేదు, అతనొక సర్వనామం.
2023లో, బెయిల్ ఉన్నా 24,000 మంది ఖైదీలుగా ఉన్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. సగం రాష్ట్రాలు సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఇది కనీస అంచనా. కారణాలు అనేకం. మేజిస్ట్రేట్ కోర్టులు బెయిల్ సమాచారాన్ని జైళ్లకు నేరుగా పంపడం లేదు. బెయిల్ షరతుల కంటే అడ్వకేట్ షరతులు భారమైతే నిందితునికి కష్టమే. సగటు నిందితుడికి పోలీసుల పట్ల ఉండే భయమే ఆయన పట్లా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఇంకొక న్యాయవాది కానీ, న్యాయమూర్తి కానీ జోక్యం చేసుకోరు. మీకు, న్యాయవాదికి మధ్య బంధం ‘పవిత్రమైనది’. అది జవాబుదారీతనానికి అతీతం.
గత కొన్నేళ్లుగా, ఏడాదికి 17 నుంచి 18 లక్షల మంది జైళ్లలో నిర్బంధితులవుతున్నారు. అధికారిక గణాంకాలు ‘విచారణలో ఉన్న ఖైదీలు 73 శాతం’ అంటాయి. కానీ వాస్తవ సంఖ్య 91 శాతం. వీరంతా న్యాయబద్ధంగా, చట్టరీత్యా నిర్బంధంలో ఉన్నారని ప్రాసిక్యూటర్స్ కూడా చెప్పలేరు. జరుగుతున్నదేమిటో పోలీసులకు, కోర్టులకు బాగా తెలుసు. ‘నేరం రుజువు కానంత వరకు ప్రతి నిందితుడూ అమాయకుడే’ అనే సూత్రం శతాబ్దాల పోరాట ఫలితం. రాజ్యాంగంలోని 22వ అధికరణ ‘కస్టడీలో ఉన్న ఏ వ్యక్తికీ న్యాయవాదిని సంప్రదించే హక్కు, రక్షించుకునే హక్కును నిరాకరించరాదు’ అంటుంది. పోలీసులకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు వర్తించే ఆదేశం ఇది. రాజ్యాంగ నిర్మాతలు వలస రాజ్యంలో చవిచూసిన అనుభవం ఈ అధికరణకు పునాది. వ్యక్తి స్వేచ్ఛ సహజమైన విషయంగా, దాన్ని ఉల్లంఘించడం అధికార స్వభావంగా ఈ అధికరణ తెలుపుతున్నది. చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన కారణం లేకుండా, వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ముఖ్యంగా, న్యాయ సహాయం ద్వారా రక్షణ పొందే హక్కును ఎవరూ అడ్డుకోడానికి వీలులేదు. న్యాయ సమ్మతమైన కారణం లేకుండా వ్యక్తి స్వేచ్ఛను నిరాకరించే ప్రయత్నాన్ని ఎవరు చేసినా అడ్డుకునే బాధ్యత న్యాయవ్యవస్థ మీద ఉంది. కానీ ఈ నిబద్ధత– కార్యనిర్వాహక వర్గం పట్ల, న్యాయ వ్యవస్థ వైఖరి మీదా ఆధారపడుతుంది. ఫలితం స్పష్టం: విచారణ లేని నిర్బంధాలు లక్షల్లో!
నిందితుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న అసమ సంబంధంలో ఎవరు ఓడిపోతారో తెలుసు. మరి రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయానికి పట్టే గతేమిటి? ఈ ప్రశ్న ఫలితంగా చాలా దేశాల్లో న్యాయ సహాయం హక్కు నిందితుడికి వచ్చింది. అధికరణ 39A భారత రాజ్యాంగంలో చేరింది. 9 నవంబర్ 1995 నుంచి అమలుకు వచ్చిన న్యాయ సహాయ చట్టానికి నేటికి సరిగ్గా ముప్పై ఏళ్లు. అయినా 2023లో 11 శాతం మంది ఖైదీలకు మాత్రమే న్యాయ సహాయం అందింది.
బలహీనులు న్యాయం పొందడానికి న్యాయ సహాయం, లీగల్ డిఫెన్స్ ఒక ముఖ్య ఆయుధం కావాలి. రాజ్యాంగ న్యాయమంటే దయా భిక్ష కాదు, కాబట్టి న్యాయ సహాయం కూడా ధర్మం కావడానికి వీల్లేదు. న్యాయం అర్థించే వారిలో 90 శాతం మంది దళితులు, ఆదివాసీలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు ఉంటే, ప్రతి న్యాయవ్యవస్థా ఈ హక్కును ఆచరణలోనూ ఆమోదించాలి. కానీ అది ధర్మంగా కూడా కాలేదు. 2023లో వ్యవస్థ చేసిన మొత్తం ఖర్చులో సింహ భాగం పోలీసుల మీద పెట్టి, న్యాయ సహాయం అందించడానికి ఒక శాతం కంటే తక్కువ తెలంగాణ ఖర్చు చేసింది. ‘నిందితులకు ఆచరణలో హక్కులు ఉండవు’ అనే పాలనా నీతి ఇది. రాజ్యాంగ రక్షణకు వ్యవస్థ లోపల నుంచి పట్టించిన తుప్పు ఇది. ఈ స్థితికి కారణాలు అనేకం.
దీర్ఘకాలం జైళ్లలో ఉన్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంది. మెజారిటీ మేజిస్ట్రేట్ కోర్టులు కారణాలు నమోదు చేయకుండా బెయిళ్లు నిరాకరిస్తున్నాయి. కొత్త నేరస్మృతిలో శిక్షలు పెంచారు, బెయిల్ హక్కు ఉన్న నేరాలను బెయిల్ హక్కు లేని నేరాలుగా మార్చారు. ఇది రాజ్యాంగ రక్షణల వ్యతిరేక వైఖరి.
నిందితులందరికీ న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో జాతీయ న్యాయ సేవా సంస్థ 2023లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాదులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. వ్యక్తి స్వేచ్ఛను రక్షించాలంటే, ప్రాసిక్యూషన్ అనుసరించే రివాజు పద్ధతులను వీరు ఎదుర్కోవాలి. నేరాల వల్ల బాధితులైన వ్యక్తుల పేరు మీద, వ్యవస్థ బాధితులను సృష్టించే వైఖరిని వ్యతిరే కించాలి. సహేతుకమైన కారణాలు లేని ఖైదును నిరసించాలి. జైలు నిర్బంధాన్ని చివరి చర్యగా కాకుండా, యథాలాపంగా ప్రయోగించడం రాజ్యాంగ విరుద్ధం అని వాదించాలి. ప్రతీకార ప్రజాభిప్రాయానికి వెరసి జైళ్లను నింపుతున్న న్యాయస్థానాలను జవాబుదారీ చేయాలి.
విచిత్రంగా మేజిస్ట్రేట్ కోర్టులకు బెయిల్ వ్యవహారం ప్రధాన కర్తవ్యం కాదు. నెలకు 18 కేసులలో విచారణ పూర్తి చేయాలని వాటికి హైకోర్టుల నుంచి నిర్దేశం ఉన్నది. ఫలితంగా బెయిల్ కేసులను పరిష్కరించడం వాటికి అప్రధానమైపోయింది. ప్రతి బెయిల్ ఆర్డర్‌ను 24 నాలుగు గంటలలో జైళ్లకు ఈ–మెయిల్ ద్వారా పంపాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి నాలుగేళ్లయినా దిక్కులేదు. ఈ కోర్టులకు, ఖైదీలకు మధ్య కమ్యూనికేషన్ ఉద్దేశపూర్వకంగానే వెనుకబడిపోయింది. ఇది లక్షల మంది జీవన్మరణ సమస్య.
దీర్ఘకాలం జైల్లో ఉన్నవారి కేసులను ‘పరిష్కరించ డానికి’ జైలు అదాలత్‌లు ప్రారంభించారు. ఆ ఖైదీలు అక్కడ నుంచి బయటపడేందుకు ‘నేరం చేశామని’ ఒప్పుకోలు ఇచ్చేలా ఇది పరోక్షంగా ఒత్తిడి చేస్తుంది. ఈ అంగీకారాన్ని స్వచ్ఛందమని అనలేం. ఈ ఒప్పుకోలు అన్యాయంగా శిక్షకు దారి తీస్తుంది. శిక్ష పడినవారిగా పోలీసులకు అనుమానం వచ్చిన ప్రతిసారీ వీరు అరెస్టుకు గురౌతారు. ఇలాంటి ఒప్పుకోలు నుంచి రక్షించుకునే హక్కును రాజ్యాంగంలోని 20(3) అధికరణ ఇచ్చింది. ఈ విషయంలో ఖైదీలను రక్షించే బాధ్యత, న్యాయ సహాయ సంస్థకు ఉంది. కిక్కిరిసిన జైళ్ల సమస్యకు దీనిని ఒక పరిష్కారంగా చూడడమే ఒక విషాదం.
విచారణ లేకుండా శిక్షించడం భౌతిక నిర్బంధం మాత్రమే కాదు, ఒక ప్రత్యామ్నాయ శిక్షా విధానం. దీని నష్టం విస్తృతమైనది. నిందితుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుంది; వారి సామాజిక విశ్వసనీయతను నాశనం చేస్తుంది; నిరాశ్రయులను చేస్తుంది; తిరిగి నేరం చేసి, జైలుకెళ్లే పరిస్థితులను సృష్టిస్తుంది. విచారణా క్రమాన్నే శిక్షగా మలిస్తే వ్యవస్థ పేదలను శిక్షించే పనిముట్టుగా తయారవుతుంది. అది వారి స్వేచ్ఛను మినహాయింపుగా, శిక్షను సాధారణ విషయంగా మార్చేస్తుంది. నేర న్యాయ వ్యవస్థే అప్పుడు బోనులో నిలబడుతుంది. అది కాకూడదు అంటే న్యాయ సహాయ హక్కును భిక్షగా కాకుండా, ఒక రాజ్యాంగ బాధ్యతగా వ్యవస్థ పరిగణించాలి.
ప్రొఫెసర్ మురళి కర్ణం
నల్సార్ విశ్వవిద్యాలయం
(న్యాయ సహాయ చట్టానికి నేటికి ముప్పయ్యేళ్లు)
ఇవి కూడా చదవండి...
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు
Read Latest AP News And Telugu News