కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ABN , Publish Date - May 14 , 2025 | 06:25 AM
‘పొంచి ఉన్న కృష్ణా జలకాటకం’ శీర్షికతో సీనియర్ జర్నలిస్ట్ వి. శంకరయ్య రాసిన వ్యాసంలో (మే 6, 2025) ఎప్పటి అలవాటు ప్రకారమే తెలంగాణపై అక్కసు వెళ్లగక్కినారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగాలు పెంచి పోషించే వ్యూహంతో కృష్ణా నదీ జలాల వాటాల గురించి అవశేష ఆంధ్రప్రదేశ్‌తో వాదులాటకు దిగారని ఆరోపించారు. కేసీఆర్‌కు...
‘పొంచి ఉన్న కృష్ణా జలకాటకం’ శీర్షికతో సీనియర్ జర్నలిస్ట్ వి. శంకరయ్య రాసిన వ్యాసంలో (మే 6, 2025) ఎప్పటి అలవాటు ప్రకారమే తెలంగాణపై అక్కసు వెళ్లగక్కినారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగాలు పెంచి పోషించే వ్యూహంతో కృష్ణా నదీ జలాల వాటాల గురించి అవశేష ఆంధ్రప్రదేశ్‌తో వాదులాటకు దిగారని ఆరోపించారు. కేసీఆర్‌కు కృష్ణా జలాలపై స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే తెలంగాణ ఏర్పడిన నెల రోజులకే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం, 1956, సెక్షన్–3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయమని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినారు. కృష్ణాలో పంచుకోవడానికి నీళ్ళు లేవని, కృష్ణా జలాల విషయంలో అసలు వివాదమే లేదని, పుష్కలంగా లభ్యమౌతున్న గోదావరి జలాలను పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజుల్లో చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి మాట్లాడకుండా గోదావరి జలాల గురించి మాట్లాడడం కుట్రపూరితమని స్పష్టం చేశారు. నిజానికి కృష్ణా లోటు బేసిన్ కానే కాదు. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సాగుకు అనువైన భూములకు సరిపోయేన్ని నీళ్ళు ఉన్నాయి. కానీ బేసిన్‌లోని ప్రాంతాల అవసరాల కంటే బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాల అవసరాలకు పెద్దపీట వేసి చూసినప్పుడు కృష్ణా లోటు బేసిన్‌గానే కనబడుతుంది. నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, మహారాష్ట్రలు ఆంధ్రప్రదేశ్ బేసిన్ ఆవలకు తరలించే నీటి వల్లనే కృష్ణా బేసిన్‌లో లోటు ఏర్పడిందని వాదించాయి. వరి పండించడానికి కూడా 130టీఎంసీలు కృష్ణా డెల్టా ఆయకట్టుకు సరిపోతాయి. అవి భూగర్భ జలాలు, వర్షపాతం పుష్కలంగా ఉన్న ప్రాంతాలు కూడా. కానీ ప్రతి సంవత్సరం 200–300 టీఎంసీలకు పైగా కృష్ణా నీటిని డెల్టా ఆయకట్టుకు మళ్లించారు. అట్లాగే కేసీ కెనాల్, నాగార్జునసాగర్ కుడి కాలువ వినియోగాలు కూడా అత్యధిక శాతం బేసిన్ ఆవలనే ఉన్నాయి. ఇట్లా తాము బేసిన్ అవల ఉన్న ప్రాంతాలకు మళ్లించే నీటి వల్లనే లోటు ఏర్పడిందన్న విషయాన్ని మరుగుపర్చి కృష్ణా బేసిన్‌లో నీళ్లు లేవు, అది లోటు బేసిన్ అని ప్రచారంలోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని బుట్టలో వేసుకొని కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్–3 కింద ట్రిబ్యునల్ వేయడానికి అపెక్స్ కౌన్సిల్లో అనుమతి సాధించారన్నది కేసీఆర్ మీద శంకరయ్య చేసిన మరొక ఆరోపణ. 2020 అక్టోబర్ 6న జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ సెక్షన్–3 కింద ట్రిబ్యునల్ వేయడాన్ని వ్యతిరేకించినా, అంతకంటే తీవ్రమైన కేసీఆర్ ప్రతిఘటనకు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 2014 నుంచి నిరంతరాయంగా సాగుతున్న పోరాటం ఆ రోజు ఒక కొలిక్కి వచ్చింది. అది నిజం కావడానికి తెలంగాణ 2023 ఎన్నికల దాకా ఆగాల్సి వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెక్షన్–3 కింద అదనపు టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) జారీ చేసిందన్న శంకరయ్య ఆరోపణలో నిజం ఎలా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వ పోరాట నేపథ్యం ఉందన్న సంగతిని శంకరయ్య విస్మరించడం తగదు. తెలంగాణ ప్రభుత్వం సెక్షన్–3 కింద కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయమని కోరిన ఒక ఏడాది తర్వాత అందుకు భిన్నంగా ఆగస్ట్ 2015లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, సెక్షన్–89 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా నిర్ణయించడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని పొడిగించారు.
ఈ సెక్షన్ కింద బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు నివేదించిన అంశాలు తెలంగాణకు న్యాయం చేకూర్చలేవని, వాటి పరిధి పరిమితమైనదని కేసీఆర్‌కు తెలుసు కాబట్టే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న ISRWD చట్టం సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలని కోరుతూ తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై నిరంతరాయంగా పోరాటం కొనసాగించాడు. అయితే, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని జారవిడుచుకోవద్దన్న ఆలోచనతో తెలంగాణకు న్యాయబద్ధ వాటా (equitable share) ఇవ్వాలని సెక్షన్–89 ప్రకారం జరిగే విచారణలోనూ తెలంగాణ పాల్గొన్నది. సెక్షన్–89 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ చేసేందుకు తనకు అధికారం లేదని బ్రిజేష్ కుమార్ పలుమార్లు వెల్లడించారు. ఈ పరిస్థితిలో అపెక్స్ కౌన్సిల్‌లో పట్టుబట్టి సెక్షన్–3ని సాధించారు కేసీఆర్. అయితే, తెలంగాణలో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ళ, మిషన్ భగీరథ తదితర పథకాలు అక్రమమైనవని ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది. బేసిన్‌లోని హైదరాబాద్ నగరానికి వినియోగించే తాగునీటిని బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారం 20శాతం మాత్రమే లెక్కించాల్సి ఉంటే, ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నందువల్ల గత పదేళ్ళుగా ఏటా సగటున 15టీఎంసీలు తెలంగాణ కోల్పోయింది. పోలవరం ద్వారా మళ్లించే గోదావరి నీటిలో 45టీఎంసీలు కృష్ణా బేసిన్‌లో నాగార్జునసాగర్ ఎగువన ఉన్న తెలంగాణకు దక్కాలి. తెలంగాణ రాష్ట్రం ఆ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించుకున్నది. మైనర్ ఇరిగేషన్‌కి కేటాయించిన 90 టీఎంసీలలో 45 టీఎంసీల మిగులును కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తున్నది. రాజోలిబండ ఆనకట్ట ఆధునికీకరణ పనులు పూర్తి కానీయకుండా అన్యాయంగా అడ్డుతగుల్తున్నది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తెలంగాణ తన వాటాను నాగార్జునసాగర్‌లో భద్రపరచుకొని మరుసటి సంవత్సరం వాడుకుంటామని (Carry Over) అంటే నిరాకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఘర్షణలు మాని సోదర తెలుగు రాష్టమైన తెలంగాణకు సహృదయంతో తోడ్పడాలి. తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన పోరాట ఫలితంగానే సెక్షన్–3 కింద అదనపు ToRను కృష్ణా ట్రిబ్యునల్‌కు కేంద్రం నివేదించింది. కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు. ఇక, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తుది నివేదికపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ నిశితంగా పరిశీలిస్తున్నది. కేంద్రం ప్రతిపాదించే అంశాలలో తెలంగాణ ప్రయోజనాలకు అనుకూల అంశాలు ఉంటే అధ్యయనం చేస్తుంది. లేకపోతే తిరస్కరిస్తుంది. పాత వినియోగాలను యథాతథంగా కొనసాగించాలన్న ఆంధ్రప్రదేశ్ వైఖరితో గుడ్డిగా అంటకాగడం తెలంగాణకు సాధ్యపడదు.
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..