Share News

Justice Over Politics: న్యాయం అన్యాయం చూడాలి

ABN , Publish Date - Oct 29 , 2025 | 02:01 AM

ఆంధ్రజ్యోతి అక్టోబర్ 23 సంచికలో పి. విక్టర్ విజయ్‌కుమార్ ‘హమాస్ దుర్మార్గం – ఇజ్రాయెల్ అమానుషం’ పేరుతో వ్యాసం రాశారు. శీర్షిక ఆకర్షణీయంగా కనబడినా, అంతర్లీనంగా వ్యాసం పాశ్చాత్య మీడియా...

Justice Over Politics: న్యాయం అన్యాయం చూడాలి

ఆంధ్రజ్యోతి అక్టోబర్ 23 సంచికలో పి. విక్టర్ విజయ్‌కుమార్ ‘హమాస్ దుర్మార్గం – ఇజ్రాయెల్ అమానుషం’ పేరుతో వ్యాసం రాశారు. శీర్షిక ఆకర్షణీయంగా కనబడినా, అంతర్లీనంగా వ్యాసం పాశ్చాత్య మీడియా నెరేటివ్‌కు ప్రతిధ్వనిగా, వాస్తవాల వక్రీకరణతో, అర్ధసత్యాల మేళవింపుతో నిండిపోయింది. ‘ఇజ్రాయెల్ – ఫలస్తీనా ఘర్షణ’ లాంటి సంక్లిష్ట, చారిత్రక అంశంపై రాస్తున్నప్పుడు సమతుల్యత కోసం చూడకూడదు. న్యాయం, అన్యాయం చూడాలి. న్యాయం వైపు నిలబడాలి. కానీ ఈ వ్యాసం ఆ ప్రమాణాన్ని అందుకోలేకపోయింది.

హమాస్‌ను ‘ఉగ్రవాద సంస్థ’గా, ఇజ్రాయెల్ చర్యలను ‘స్వీయరక్షణ’గా చూడటం పాశ్చాత్య శక్తుల రాజకీయ నిర్వచనానికి అతికినట్లున్న అభిప్రాయం. 1949 జెనీవా ఒప్పందం, 1977 అదనపు ప్రోటోకాల్స్ ప్రకారం... ఆక్రమిత భూభాగంలోని ప్రజలు తమ ఆత్మరక్షణ కోసం సాయుధ ప్రతిఘటన చేయవచ్చు. ఇది అంతర్జాతీయ చట్టబద్ధ హక్కు. అలాంటి న్యాయ పోరాటాన్ని, అన్యాయాన్ని ప్రతిఘటించడాన్ని ‘ఉగ్రవాదం’గా చూడటం చట్టానికీ, చరిత్రకూ అవమానం.

1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు దాదాపు 7.5 లక్షలమంది ఫలస్తీనీయులు తమ ఇళ్ల నుంచి బహిష్కృతులయ్యారు. నేటికీ యూఎన్‌ఓ రికార్డుల ప్రకారం 59 లక్షల మంది శరణార్థులుగా ఉన్నారు. ఇంతటి చారిత్రక పీడనను తట్టుకొని నిలబడిన జాతి ప్రతిఘటనపై ‘ఉగ్రవాదం’ అనే ముద్ర వేయడం చాలా అన్యాయం. గాజాపై ఇజ్రాయెల్ విధించిన ఆంక్షలను ‘భద్రతాపరమైన చర్య’గా రచయిత పేర్కొన్నారు. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. నిజానికి అది భద్రత కాదు, సామూహిక శిక్ష. 2007లో హమాస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గాజా ప్రాంతం సంపూర్ణ నిర్బంధంలోకి నెట్టివేయబడింది. ఆహారం, ఇంధనం, నీరు, విద్యుత్తు, ఔషధాలు అన్నింటిపైనా ఆంక్షలు విధించి, లక్షలాదిమంది నిరపరాధులను అమానవీయంగా నిస్సహాయ పరిస్థితుల్లోకి నెట్టివేశారు. ఈ నిర్బంధం కేవలం ఆర్థికం కాదు, ఇది ఒక జాతిని భూమ్మీద నుంచి చెరిపేయాలనే పగతో నిండిన అమానవీయ, పైశాచిక యుద్ధోన్మాదం.


ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నిరపరాధులైన పసి పిల్లలు, గర్భిణులు, వైద్యులు, జర్నలిస్టులు కూడా బలయ్యారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మసీదులు, శరణాలయాలు, ఏవీ సురక్షితంగా లేవు. చిన్నపిల్లల శరీరాలు మాంసపు ముద్దల్లా చెల్లాచెదురై మట్టిలో కలిసిపోయాయి; తల్లుల కేకలు, ఆర్తనాదాలు మానవ చరిత్ర సిగ్గుతో తలదించుకునే స్థాయిలో ఉన్నాయి. ఇది యుద్ధం కాదు, నరమేధం. ఇలాంటి దారుణాలకు సమర్థనగా ‘భద్రత’ అనే పదం వాడటం మానవత్వానికే మాయని మచ్చ. ‘పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2024 నాటికి గాజా నివాసయోగ్యంగా ఉండదు’ అని యూఎన్ఓ 2012లోనే హెచ్చరించింది. దురదృష్టవశాత్తూ 2025 నాటికి ఇది నిజమై కనబడుతోంది. గాజాలోని 70 శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి, 90 శాతం ప్రజలు ఆహారం కోసం ఇతరుల సహాయంపై ఆధారపడుతున్నారు. 65,000 మందికి పైగా మరణించారు. వారిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు.

అలా అని హమాస్ హింసను అస్సలు సమర్థించడం లేదు. కానీ ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న అత్యంత క్రూరమైన, నిరంతర హింసను, చిన్నపిల్లల హత్యలను, ప్రజల సామూహిక వధను పెద్ద నేరంగా గుర్తించకపోవడం, అంతర్జాతీయ సమాజం అస్సలు పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద విషాదం. నిజానికి అదే మానవతకు జరుగుతున్న పెద్ద అవమానం.

హమాస్ దాడులే ఫలస్తీనా ప్రజల బాధలకు మూల కారణమని విజయ్‌కుమార్ సూత్రీకరిస్తున్నారు. అయితే ఫలస్తీనా ప్రజలు గత 75 సంవత్సరాలుగా ఆక్రమణ, పీడన, అవమానం, నిర్బంధంలో జీవిస్తున్నారు. నిజానికి హమాస్ పుట్టుకకు మూలకారణం ఈ అన్యాయం, ఆక్రమణ, అణచివేతలే తప్ప మరొకటి కాదు. హమాస్ లేకున్నా ఇజ్రాయెల్ దాడులు ఆగేవి కావు. నక్బా నుంచి నేటి వరకు, ఇదొక చరిత్రాత్మక సత్యం. 1948లో ప్రారంభమైన ‘నక్బా’ అంటే ఫలస్తీనా జాతి విపత్తు. తరతరాలుగా వారు తమ సొంత నేలపైనే బహిష్కృతులుగా, శరణార్థులుగా జీవిస్తూ వస్తున్నారు.


ఫలస్తీనీయుల భూములు ఆక్రమించుకుని ఇజ్రాయెల్ నిర్మించిన అక్రమ కాలనీలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, వారి జీవన హక్కును కాలరాస్తున్నాయి. యూఎన్‌ఓ తీర్మానాలు ఇజ్రాయెల్‌ వైఖరిని ఎంత తీవ్రంగా, ఎన్నిసార్లు ఖండించినప్పటికీ, ప్రపంచ సామ్రాజ్యవాద శక్తుల ద్వంద్వ ప్రమాణాలు ఇజ్రాయెల్ దౌర్జన్యాలకే వంత పాడి ప్రోత్సహించాయి. విజయ్‌కుమార్‌ వ్యాసం ఈ చారిత్రక నేపథ్యాన్ని పూర్తిగా పక్కనబెట్టి, ఒకే కోణం నుంచి తీర్పు చెప్పింది. అది పాఠకులను తప్పుదోవ పట్టించే బలమైన ఎత్తుగడ.

హమాస్ హింస ముమ్మాటికీ తప్పే. కానీ ఇజ్రాయెల్ దుర్మార్గాలు న్యాయ సమ్మతమనడం అత్యంత ఘోరమైన తప్పు. బాంబులు ఎవరి చేతుల్లో ఉన్నా పతనమే సృష్టిస్తాయి. అవి ఎవరినీ రక్షించవు. ప్రపంచం ఈ యుద్ధాన్ని భద్రతా సమస్యగా కాకుండా, మానవతా సంక్షోభంగా చూడాలి. ఇజ్రాయెల్‌–ఫలస్తీనా ఘర్షణను రాజకీయ కోణంలో కాకుండా, మానవ విలువల దృష్టిలో చూడడం అవసరం. లేకపోతే, చరిత్ర మనందరినీ నిశ్శబ్ద దోషులుగా గుర్తిస్తుంది.

యండి. ఉస్మాన్‌ఖాన్

ఇవి కూడా చదవండి:

Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు

Updated Date - Oct 29 , 2025 | 02:01 AM