Andhra Pradesh Debt: అప్పులపై జగన్ నీతిమాలిన రాజకీయం
ABN , Publish Date - Dec 19 , 2025 | 02:05 AM
‘నిజం కూడా నిరంతరం ప్రచారంలో ఉండాలి, లేదంటే నిజం అబద్ధంగా మారుతుంది. రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది’ అన్నారు...
‘నిజం కూడా నిరంతరం ప్రచారంలో ఉండాలి, లేదంటే నిజం అబద్ధంగా మారుతుంది. రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్.
కాబట్టి నిజం కూడా నిరంతరం ప్రచారంలో ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అప్పులపై తప్పుదారి పట్టించే జగన్‌రెడ్డి ప్రకటనలు చూస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తన రాజకీయ అవసరాల కోసం వక్రీకరిస్తున్నట్లు అర్థమవుతుంది. అప్పులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, అబద్ధాలు ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి, కూటమి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేసి ఒత్తిడి సృష్టించడానికి ప్రయత్నించినట్లుగా ఉన్నాయి. అప్పులు ఎలా, ఎందుకు, ఎవరి పాలనలో ఎంత పెరిగాయో ప్రజలకు నిజాలు తెలియవనుకోవడం ఆయన అవివేకం. జగన్‌రెడ్డి అయిదు సంవత్సరాల పాలనలో రాష్ట్ర అప్పులు ఏ స్థాయికి చేరాయో అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆయన ఛిన్నాభిన్నం చేసిన ఉదంతం ఇంకా ప్రజలు మరచిపోలేదు. అభివృద్ధిని పక్కన పెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత పథకాలు, ప్రచారం పేరుతో అప్పులు చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని వాటిని బడ్జెట్‌లో చూపకుండా దాచిపెట్టారు. ప్రజలకు తెలియకుండా చేశారు. నేడు రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నాయని సిగ్గు లేకుండా సుద్దపూస మాటలు చెబుతున్నారు. అప్పులు ఎప్పటి నుంచి మొదలయ్యాయో, ఎందుకు పెరిగాయో చెప్పాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. తన పాలనలో చేసిన ఆర్థిక దోపిడీ మరుగున పడేలా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేయడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ కాదు.
జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో, కార్పొరేట్ రుణాలు కాకుండా ఆయన బడ్జెట్ చూపిన రుణాలు రూ.6.5 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. చేసిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు? ఆయన ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ రుణాలను, విదేశీ సంస్థల వద్ద నుంచి చేసిన కఠిన షరతుల అప్పులను కాగ్‌కి జగన్ ఎందుకు సమర్పించలేకపోయారు? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద నిర్దేశించిన ఆర్థిక నిబంధనలను ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇష్టానుసారం అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని ఆర్థిక గందరగోళంలోకి నెట్టారు. అధిక లోటు, దోపిడీ చెయ్యడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. ఆయన అపరిపక్వ పాలనలో రెవెన్యూ లోటు 3.02 శాతానికి, ఆర్థిక లోటు 4.57శాతానికి, ప్రాథమిక లోటు 2.52 శాతానికి, అప్పు 35శాతానికి పెరిగింది. తన విధ్వంసకర భావజాలంతో రాష్ట్ర ప్రతిష్ఠను, రాజధాని అమరావతిని దెబ్బతీయడమే కాకుండా, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ఉపయోగపడే మూలధన వ్యయాన్ని మూలనపడేసి అభివృద్ధిని జగన్ విస్మరించారు. పేద ప్రజల పేరిట చేసిన సంక్షేమ వ్యయం పేదరికం, అసమానతలను తగ్గించలేదు.
జగన్‌రెడ్డి అబద్ధాలు, మోసాలు తెలుసుకున్న ప్రజలు, 2024 ఎన్నికల్లో వైసీపీని పాతాళంలో పాతరేశారు. అయినా జగన్ తన తీరు మార్చుకోకుండా అవే అబద్ధాలతో కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు విధాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బాగోతాలు బయటపడి, ఆయన ముఠా జైళ్లకు పోవడంతో– సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వంలో అప్పులు పెరిగిపోతున్నాయంటూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.
జగన్ చేసిన అపరిమితమైన అప్పుల పాపం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు శాపమైంది. అప్పుల వ్యవహారంలో నిజం ఒక్కటే– వాస్తవాలను దాచిపెట్టినవారే ఎక్కువగా గోల చేస్తారు. అదే పరిస్థితి ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి, స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అప్పులు చెయ్యడం తప్పు కాదు. కానీ వాటిని దేని కోసం చేస్తున్నారన్నది ముఖ్యం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే అప్పులు పెట్టుబడులు రావడానికి, మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు, ఆర్థిక వృద్ధికి అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం కోసమే. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే. కానీ జగన్ పాలనలో చేసిన అప్పులు... ఉచితాల పేరుతో ఓట్లు కొల్లగొట్టడానికి, ప్రచారానికి, అనవసర వ్యయాలకు ఉపయోగించారన్న ఆర్థిక నిపుణుల మాటలే నేడు రుజువవుతున్నాయి. జగన్ పాలన రాష్ట్రాన్ని అప్పుల భారంతో బలహీనపరిస్తే, కూటమి ప్రభుత్వం అప్పులను అభివృద్ధిగా మార్చే కృషి చేస్తోంది.
అప్పులపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆత్మరక్షణ కోసమే. అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పరాజయం పాలయిన జగన్‌రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ప్రజలు ఎలా నమ్ముతారు? ఆయన చెబుతున్న అబద్ధాలు తన స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతమైన మార్గంలో నడుస్తోంది. నిన్న నాశనం చేసిన వారికి, ఈ రోజు పునర్నిర్మాణం చేస్తున్న వారిని విమర్శించే హక్కు లేదు.
యనమల రామకృష్ణుడు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
Also Read:
జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?