Share News

న్యూ ఇండియాలో న్యాయం నిష్పాక్షికమేనా

ABN , Publish Date - May 23 , 2025 | 06:15 AM

హిందుత్వ రాజకీయ ప్రాబల్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక భారతీయ ముస్లింగా ఉండడం అంటే ఏమిటి? ఈ విషయమై ఆలోచనాపరుల భిన్నాభిప్రాయాలతో కూడిన ‘మై నేమ్‌ ఈజ్‌ రహీమ్ ఖాన్‌’ అనే వీడియో బ్లాగ్‌ను కొద్ది వారాల క్రితం ప్రసారం చేశాను. వెన్వెంటనే కరడుగట్టిన మితవాద హిందువులు ...

న్యూ ఇండియాలో న్యాయం నిష్పాక్షికమేనా

హిందుత్వ రాజకీయ ప్రాబల్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక భారతీయ ముస్లింగా ఉండడం అంటే ఏమిటి? ఈ విషయమై ఆలోచనాపరుల భిన్నాభిప్రాయాలతో కూడిన ‘మై నేమ్‌ ఈజ్‌ రహీమ్ ఖాన్‌’ అనే వీడియో బ్లాగ్‌ను కొద్ది వారాల క్రితం ప్రసారం చేశాను. వెన్వెంటనే కరడుగట్టిన మితవాద హిందువులు నన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శనాస్త్రాలను సంధించారు. ఇస్లామిక్‌ తీవ్రవాదం పెచ్చరిల్లిపోతున్న తరుణంలో ఆ నిజమైన సమస్యతో తలపడడాన్ని తప్పించుకునేందుకే ముస్లింలను ‘బాధితులు’గా చిత్రీకరిస్తున్నానని ఆక్షేపించారు. ఇప్పుడు వెనుతిరిగి పర్యాలోచించుకుంటే ఆ బ్లాగ్‌ శీర్షిక తప్పుగా పెట్టానని అనిపిస్తుంది. నేను ఆ వీడియో బ్లాగ్‌కు ‘మై నేమ్‌ ఈజ్‌ అలీఖాన్‌ మహమూదాబాద్‌’ అని పేరు పెట్టి ఉండవల్సింది.

భారత్‌, పాకిస్థాన్‌ ఘర్షణలకు సంబంధించి ఇరువురు మహిళా సైనికాధికారుల– కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌– మీడియా సమావేశం గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన అశోకా యూనివర్శిటీ పొలిటికల్‌ సైన్స్ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహమూదాబాద్‌ను ఇటీవల అరెస్ట్‌ చేశారు. అధికార రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందీ ఆ అరెస్ట్‌ ఉదంతం వెల్లడించింది. కల్నల్‌ సోఫియా ఖురేషీని టీవీ యాంకర్లు, వ్యాఖ్యాతలు ఘనంగా ప్రశంసించడాన్ని ప్రశ్నిస్తూ ఆపరేషన్‌ సిందూర్‌పై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించడమే ప్రొఫెసర్‌ అలీఖాన్‌ చేసిన ‘నేరం’! తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఆయన ఇలా అన్నారు: ‘కల్నల్‌ సోఫియా ఖురేషిని టీవీ వ్యాఖ్యాతలు ప్రశంసిస్తుండడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వీరంతా మూకల హింసాకాండ, అకారణ బుల్డోజింగ్‌ బాధితులు, ఇంకా బీజేపీ ద్వేషపూరిత ప్రచార బాధితుల పక్షాన కూడా గళమెత్తితే వారికీ భారతీయ పౌరుల్లా రక్షణ లభిస్తుంది. ఇద్దరు మహిళా సైనికాధికారుల ద్వారా సమాచారం ఇవ్వడం ప్రశంసనీయమే. అయితే ఆ సమాచార వెల్లడి విధానం వాస్తవికంగా ఉండాలి. లేదంటే అది నయవంచనే అవుతుంది. తన లౌకికవాద నిబద్ధతను ఆ మహిళా సైనికాధికారుల ద్వారా చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే క్షేత్ర స్థాయిలో సాధారణ ముస్లింలు దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు’.


మోదీ ప్రభుత్వాన్ని అలీఖాన్‌ తీవ్రంగా విమర్శించారు, సందేహం లేదు. అయితే మోదీ సర్కార్‌ భావిస్తున్నట్టుగా ఆ వ్యాఖ్యల్లో భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతలకు అపాయం కలిగించేది ఏముంది? ఆ మాటకొస్తే మత విద్వేషాన్ని రెచ్చగొట్టేదీ ఏముంది? మహిళా సైనికాధికారుల గౌరవానికి భంగం కలిగించేది ఏముంది? ఎంతగా రెచ్చగొట్టేది అయినా ప్రభుత్వంపై చేసిన విమర్శను ‘నేరపూరిత చర్య’గా ఎప్పటి నుంచి పరిగణిస్తున్నారు? అందునా బీజేపీ యువ మోర్చా కార్యకర్త అయిన ఒక గ్రామ సర్పంచ్‌ ఫిర్యాదు లేదా హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ పంపిన నోటీస్‌ ఆధారంగా అరెస్ట్‌ చేయడం న్యాయబద్ధమేనా?

మహిళా సైనికాధికారుల గౌరవానికి భంగం కలిగించే విషయాలు అలీఖాన్‌ సోషల్‌ మీడియా పోస్టులో ఏమున్నాయని ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేణు భాటియా సరైన సమాధానమివ్వలేకపోయారు.. చాలా ‘సర్కారీ’ సంస్థల మాదిరిగానే హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ సైతం శీఘ్రగతిన అలీఖాన్‌కు వ్యతిరేకంగా అనాలోచిత నిర్ణయం తీసుకున్నది. ‘అధికారిక’ ఆదేశాల మేరకు అలీఖాన్‌కు సమన్లు జారీ చేసింది. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేసింది. ఈ న్యాయసమ్మతం కాని వ్యవహారంలో పోలీసులూ భాగస్వాములు అయ్యారు. ఒక పౌరుని ప్రాథమిక హక్కులను కాలరాచివేస్తున్నామనే ఆలోచన లేకుండా, యుక్తమైన ప్రక్రియను అనుసరించకుండా అలీఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

ప్రొఫెసర్‌ అలీఖాన్‌ కేసు అనేక ఇబ్బందికరమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొదటిది వాక్‌ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టేందుకు నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగం జరిగింది. ఈ విషయంలో అలీఖాన్‌దే ఏకైక కేసుకాదు. కేంద్రంలో గానీ, రాష్ట్రాలలోగానీ పార్టీలకు అతీతంగా ప్రతి ప్రభుత్వమూ తన అధికారాలు, పోలీస్‌ వ్యవస్థపై నియంత్రణను తన విధానాలతో విబేధించేవారి గొంతులను నొక్కివేసేందుకు నిస్సంకోచంగా ఉపయోగించుకుంటోంది. రాష్ట్రాలలో చోటుచేసుకున్న అలాంటి అనుచిత చర్యలు కొన్నిటిని గుర్తు చేస్తాను. 2022లో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను అవహేళన చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ నొకదాన్ని షేర్‌ చేసినందుకు మరాఠీ నటుడు కేటకి చితాలెను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు అధికార పక్షాన్ని విమర్శించే యూ ట్యూబర్‌ సవుక్కు శంకర్ గృహంలోకి ఒక గుంపు చొరబడి చెత్త, అశుద్ధ పదార్థాలను కుప్పపోయడంపై డీఎంకే ప్రభుత్వం మౌనం వహించింది. మమతా బెనర్జీని పరిహసించిన ఒక కార్టూన్ విషయమై కోల్‌కతా ప్రొఫెసర్‌ ఒకరిని అరెస్ట్‌ చేశారు. ‘మీకు వాక్‌ స్వాతంత్ర్యం ఉన్నది. అయితే మాట్లాడిన తరువాత మీ స్వేచ్ఛకు నేను హామీ ఇవ్వలేను’ అన్న ఒకనాటి ఉగాండా నిరంకుశ పాలకుడు ఇడి అమీన్‌ ప్రవచనాన్నే భారత రాజకీయ వ్యవస్థ ఒక విధంగా అనుసరిస్తోంది!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలనైనా ‘జాతి–వ్యతిరేక’మైనవిగా పరిగణించి, సదరు విమర్శకులపై దేశద్రోహ చట్టాలను ప్రయోగించడం పరిపాటి అయింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ చట్టాలను ప్రత్యర్థులపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నాయి. వాక్‌ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు చట్టాన్ని ఆయుధంగా వాడడమే కాదు, ఆ అధికార దుర్వినియోగానికి ఎంపిక చేసుకున్న కొద్ది మంది విషయంలో మాత్రమే పాల్పడుతున్నారు. వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. ఈ అవాంఛనీయ పరిణామం రెండవ తక్షణ సమస్యను లేవనెత్తుతోంది. నిర్దిష్ట చట్టం పరిధిలోకి ఎవరు వస్తారు అనేది పూర్తిగా అధికారంలో ఉన్నవారి చపలచిత్త వైఖరులు, భ్రమలపై ఆధారపడి ఉన్నది. ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహమూదాబాద్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి విజయ్‌ షా కేసుల మధ్య వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోండి. కల్నల్‌ సోఫియా ఖురేషికి వ్యతిరేకంగా అవమానకరమైన, జెండర్‌ వివక్షాపూరిత, మత విద్వేషకరమైన వ్యాఖ్యలు చేసిన మహాశయుడు విజయ్‌ షా. మరి ఆయన్ని మంత్రి మండలి నుంచి తొలగించారా? లేదు. కనీసం మధ్యప్రదేశ్‌లోని బీజేపీ నాయకత్వం విజయ్‌ షాను బహిరంగంగా మందలించిందా? ఇదీ జరగలేదు. పైగా రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ ఆయనకు బాసటగా నిలబడ్డారు. కేంద్రం మౌనం పాటించింది. అయితే విజయ్‌ షా లాంఛనప్రాయంగా క్షమాపణలు చెప్పారు. కల్నల్‌ సోఫియా ఖురేషీపై ఆయన వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. సుప్రీంకోర్టు సైతం ఆయన వ్యాఖ్యలు ‘జాతికి సిగ్గు చేటు’ అని అభివర్ణించింది. ఉన్నత న్యాయస్థానాలు ఇలా ప్రతిస్పందించిన తరువాతనే విజయ్‌ షా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ‘ఇటీవల నేను చేసిన ప్రకటన అన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. అందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. మనఃస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని’ విజయ్‌ షా అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై దర్యాప్తునకు కోర్టు ఆదేశం మేరకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. అయితే ఢిల్లీ పోలీసులు ఫ్రొఫెసర్‌ అలీఖాన్‌ను అరెస్ట్‌ చేసిన విధంగా మధ్యప్రదేశ్‌ పోలీసులు విజయ్‌ షాను అరెస్ట్‌ చేయలేదు!

ఈ కారణంగానే అలీఖాన్‌ కేసులో మూడవ, మరింత అత్యవసరమైన ప్రశ్న ఉన్నది. ప్రొఫెసర్‌ అలీఖాన్‌ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టొరేట్‌ పొందిన విద్యాధికుడు. అయితే ఆయన తన భావాలు, అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసే భారతీయ ముస్లిం పౌరుడు. మరీ ముఖ్యంగా ఒకప్పటి మహమూదాబాద్‌ రాజకుటుంబానికి చెందినవాడు. ఆయన తాత మొహమ్మద్‌ ఆమిర్‌ అహ్మద్‌ ఖాన్‌ స్వాతంత్ర్యానికి పూర్వం ముస్లింలీగ్‌లో ఒక కీలక నాయకుడు. మరి హిందుత్వవాదులకు ఇంతకు మించి నిర్దుష్ట శత్రువు అయిన వ్యక్తి మరొకరు ఎవరుంటారు? భారతీయ ముస్లింలను దేశభక్తి లేనివారు, పాకిస్థాన్‌ అనుకూలురు, సంశయాస్పద స్వభావులుగా వేధించడమే హిందూత్వ సంస్థల, వ్యక్తుల ప్రాథమిక లక్ష్యంగా ఉన్నది. ముస్లింకాని ప్రతిపక్ష నాయకుడు లేదా మీడియా ప్రముఖుడు ఎవరైనా ఆపరేషన్‌ సిందూర్‌పై ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎన్ని లేవనెత్తినా ప్రభుత్వ ఆగ్రహానికి గురికాకుండా సురక్షితంగా ఉండగలుగుతారు. అయితే తమ భావాలు, అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయగలిగే భారతీయ ముస్లింలు ఎవరికీ అటువంటి అనుమతి, స్వేచ్ఛ లేదు! ఈ కారణంగానే అలీఖాన్‌ చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్న వ్యక్తిగా పరిగణితుడయ్యాడు.


ఆయన పాల్పడిన ‘నేరం’ ఏమిటి? దేశ చట్టాల ఉల్లంఘనకు కిందకు వచ్చే ఎలాంటి వ్యాఖ్యలనైనా చేయడం కానేకాదు; ప్రస్తుత ప్రభుత్వాన్ని నిర్భయంగా విమర్శించే భారతీయ ముస్లిం కావడమే ఆయన ‘అపరాధం’. మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన విజయ్‌ షాపై చట్టపరమైన చర్యలు ఏవీ చేపట్టకపోవడానికి కారణం ఆయన పాలకపక్షంలో ప్రముఖ నాయకుడు కావడం వల్లే కాదూ? మీ ఇంటి పేరు షా కావడం, ఖాన్‌ కాకపోవడంలో ఉన్న వ్యత్యాసమది. ఒకరి విషయంలో క్షమాపణతో సరి, మరొకరి విషయంలో అరెస్ట్‌ అనివార్యమయింది! ఇదే ‘న్యూ’ ఇండియా సుమా!

తాజా కలం: ప్రొఫెసర్‌ అలీఖాన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆయన సామాజిక మాధ్యమాల పోస్ట్‌లపై దర్యాప్తునకు ఒక సిట్‌ను నియమించింది. ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు చేసేది ఏమిటో స్పష్టంగా తెలియదు. పనిలేని పోలీసధికారులు చాలా మంది ఉన్నారని, విచారణ ప్రక్రియే శిక్షగా ఉన్న న్యాయవ్యవస్థ ఉన్నదని మనకు స్పష్టంగా తెలుసు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 06:15 AM