రైతు లాభంతో కార్పొరేట్లకు నష్టమా
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:52 AM
శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ‘బిజినెస్ స్టాండర్డ్’ అనే ఒక ఆంగ్ల వాణిజ్య పత్రిక ఆయనను ఇంటర్వ్యూ చేసింది. గతంలో...
శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ‘బిజినెస్ స్టాండర్డ్’ అనే ఒక ఆంగ్ల వాణిజ్య పత్రిక ఆయనను ఇంటర్వ్యూ చేసింది. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసి, వ్యవసాయ రంగం పట్ల విశేష శ్రద్ధ చూపిన వాడిగా, కేంద్రంలో ఆయన హయాంలో రైతాంగానికి మంచి జరుగుతుందని మనం ఆశించడం సహజం. కాగా, ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూను పరిశీలిస్తే ఆయన పని చేస్తూన్న చట్రంలో రైతాంగానికి ఆయనైనా ఎవరైనా పెద్దగా ఒరగ పెట్టగలగింది ఏమీ లేదని అర్థం అవుతుంది. మొదటగా అసలు దేశంలో రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కావల్సింది ఏమిటి? అనేది ప్రశ్న. దీనికి రెండు జవాబులు ఉన్నాయి: ఒకటి-– వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడం. రెండవది– వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను హామీ చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. అనేక దశాబ్దాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, హరిత విప్లవం అనంతరం దేశంలో వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరిగినప్పటికీ, వ్యవసాయదారుల స్థితిగతులు మాత్రం రాను రాను దిగజారిపోతున్నాయి. 1970–2015ల మధ్య 45ఏళ్ళ కాలంలో గోధుమలకు కనీస మద్దతు ధర కేవలం 19 రెట్లు మాత్రమే పెరిగింది.
కాగా, అదే కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయాలు 120 రెట్లు, కళాశాల ఉపాధ్యాయుల వేతనాలు 150 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల ఆదాయాలు 280 రెట్లు పెరిగాయి! అంటే ఇక్కడ, ఉత్పత్తిని పెంచుతూ పోయినా రైతాంగం ఆర్థిక స్థితి మెరుగుపడదని మనకు అర్థం అవుతుంది. ఇందుకే స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయరంగ ‘అనుకూల’ పాలనా కాలంలో కూడా మధ్యప్రదేశ్‌లో రైతాంగ సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వాస్తవానికి శివరాజ్ సింగ్ పాలనా కాలంలో మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ రంగం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అద్భుతమైన ముందడుగు సాధించింది. అక్కడ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు, ఆ రాష్ట్రంలో 2011–12లో 149 లక్షల టన్నులుగా ఉన్న వరి, గోధుమలు, ముతకధాన్యాలు, పప్పుధాన్యాల ఉత్పత్తి, 2021–22 నాటికి 349 లక్షల టన్నులకు, అంటే రెట్టింపుకు పెరిగింది. ఇది, ఆ రాష్ట్ర వ్యవసాయ రంగంలో సగటున 9.12 శాతం వార్షిక వృద్ధి రేటుకు సమానం. ఇంతగా ఉత్పత్తి సాధించినప్పటికీ రైతాంగానికి వ్యవసాయం మాత్రం లాభసాటి కాలేదు. పైగా, ఈ రికార్డు స్థాయి పంటల ఉత్పత్తితో మార్కెట్‌లో సరఫరా భారీగా పెరిగి ధరలు పతనమయ్యాయి. రైతులు రికార్డు స్థాయి పంటలను పండించినా, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నా– అంటే, పంట ఉత్పత్తి పెరిగినా, పడిపోయినా– అంతిమ ఫలితం మాత్రం రైతు నష్టపోవడమే అన్నది మధ్యప్రదేశ్ రైతాంగానికి అర్థమయింది. అందుకే 2017లో మధ్యప్రదేశ్‌లోని మాందసూర్‌లో రైతాంగం ఆందోళనలకు దిగింది. గిట్టుబాటు ధరల కోసం, వర్షాభావం వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం కోసం ఉద్యమిస్తోన్న రైతాంగంపై కాల్పులు జరిగాయి, ఆరుగురు రైతులు చనిపోయారు. ఫలితంగా, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రగతి సాధించినప్పటికీ, మధ్యప్రదేశ్‌లో 2018 ఎన్నికలలో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయ్యింది.
ఈ సమస్యల నేపథ్యంలోనే దేశ రైతాంగం కూడా మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని చుట్టుముట్టి ఆందోళనకు దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్నారు. అలాగే కనీస మద్దతు ధర అంశం పైన కమిటీని కూడా ఏర్పరిచారు. అయితే, అనంతంగా సాగుతోన్న చర్చోపచర్చలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనల తర్వాత కూడా, నేటికీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలనే రైతాంగ డిమాండ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వ మొండి వైఖరికి కారణం ఏమిటి? ఇంటర్వ్యూలో ఈ అంశంపై శివరాజ్ సింగ్ చౌహాన్ పలుమార్లు జవాబును దాటవేశారు. ‘‘మీ ప్రభుత్వం ఉత్పత్తి పెంపుదలపై అతిగా దృష్టిని పెడుతోంది, కాగా భారత రైతాంగం తాలూకు అసలు సమస్య పడిపోతూవున్న వారి ఆదాయాలు’’ అన్న ప్రస్తావనకు స్పందనగా చౌహాన్: ‘‘...ఒక ప్రక్కన మేము 145 కోట్ల జనాభాకు సేవ చేయవలసి ఉంది,’’ అనే అస్పష్టమైన జవాబును ఇచ్చారు. అయితే దీని పరమార్థం స్పష్టమే! ‘‘మేము రైతాంగానికి గిట్టుబాటు ధరలను ఇస్తే– అది దేశంలోని మిగతా జనాభాకు సమస్య అవుతుంది’’ అని ఆ మాటల అర్థం. అదెలా? అన్న ప్రశ్నకు జవాబు సులువే. రైతుకు గనుక స్వామినాథన్ కమిటీ సూచించిన తరహాలో గిట్టుబాటు ధరను ఇస్తే – అది వినియోగదారులకు ధరల పెరుగుదల రూపంలో ‘భారం’ అవుతుందనేది– ఈ జవాబు అంతరార్థం. అయితే, కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం వినియోగదారుల ప్రయోజనమేనా? ఖచ్చితంగా కాదు. ఇదే నిజమైతే మన పాలకులు ప్రజల కనీస అవసరాలపైన కూడా జి.ఎస్.టి వంటి పన్నులను విధించేవారు కాదు. ఈ పన్నుల భారం వలన కూడా, నేడు మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగాయన్నది తెలిసిందే.
అసలు సమస్య వినియోగదారులది కాదు. కార్పొరేట్ యజమానులది. ఎలాగంటే – రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వటం వల్ల నగర ప్రాంతాలలో వినియోగదారులకు ధరలు పెరిగాయనుకుందాం. ఈ వినియోగదారుల్లోని అత్యధికులు కార్మికులు, ఉద్యోగులే ఉంటారు. వీరు ధరల భారాన్ని భరించలేక తమ యజమానులను అధిక వేతనాల కోసం డిమాండ్ చేస్తారు. అదీ అసలు కథ! అంటే, రైతుకు మద్దతు ధర ఇవ్వటం వల్ల ఉద్యోగులూ, కార్మికులు అధిక వేతనాల కోసం కార్పొరేట్ల మీద ఒత్తిడి తెస్తారు కాబట్టే, కార్పొరేట్లకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టే, ప్రభుత్వం మద్దతు ధరలకు సుముఖంగా లేదు! కార్మికులనూ, ఉద్యోగులనూ సాధ్యమైనంత తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం కార్పొరేట్ల స్వభావం. లాభాలను పెంచుకోవడం కోసం వారికి ఇది అవసరం. దీని కోసం నగర ప్రాంతాల్లో నిత్యవసరాల ధరలు సాధ్యమైనంత తక్కువ ఉండటం కూడా వారికి అవసరం. ఇందుకోసమే కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు రైతు ప్రయోజనాలనూ, ఆర్థిక స్థితిగతులనూ పణంగా పెట్టి, వారి ఉత్పత్తులను తక్కువ ధరకు నగరాలకు తరలిస్తున్నాయి. నేడు అమలు జరుగుతున్న సంస్కరణల సారాంశం ఇదే. గ్రామాలను కొట్టి నగరాలకూ పెట్టడమే! నగరాలకు పెట్టడమంటే అంతిమంగా నగర ప్రాంత కార్పొరేట్లకు దోచిపెట్టడమే! ఈ క్రమంలో గత మూడు దశాబ్దాలుగా రైతాంగానికి వ్యవసాయం నష్టదాయకమై, వారి ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అలాగే, గిట్టుబాటు ధరలకు చట్టబద్ధతను ఇచ్చేందుకు ప్రభుత్వాల అయిష్టత వెనుక మరో కారణం కూడా ఉంది. అది నగర ప్రాంతాల్లోని కార్పొరేట్లకు అవసరమైన కార్మికులు, ఉద్యోగుల సరఫరా. అంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి, నగరాలకు తగినంత స్థాయిలో వలసలు ఉండాలీ అంటే, వ్యవసాయ రంగం లాభసాటిగా ఉండకూడదు. అలా ఉంటే రైతు గ్రామాన్ని వదిలి బయటకి రాడు. వ్యవసాయ రంగంలో బతకడం కష్టమైతేనే రైతు వలసకూలీగా మారి నగర బాట పడతాడు. కార్పొరేట్లకు కావల్సింది ఇదే. నగరాలలో మానవవనరుల సరఫరా అధికంగా ఉండాలి. ఉంటేనే ఉపాధి కోసం పోటీ పెరుగుతుంది. పెరిగితేనే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను తగ్గించే అవకాశం కార్పొరేట్లకు కలుగుతుంది.
దీని తాలూకు మరొక కొనసాగింపే – ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చివేసే ప్రయత్నం. ఈ పథకం వలన గ్రామాల్లో ఉపాధి పెరిగి నగర ప్రాంతాలకు వలసలు తగ్గుతాయి. దీనివల్ల నగర ప్రాంత కార్పొరేట్లకు కార్మికుల సరఫరాను తగ్గిపోతుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యక్తిగతంగా ఎంతటి మానవీయ కోణం కలిగిన వారయినా, రైతాంగానికి మేలు కోరుకునే వారయినా, వాస్తవంలో ఆయన వర్గపరిమితులు, రాజకీయ పరిమితులు దానిని అనుమతించవు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వాల హయాంలో – కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అటుంచి, కనీసం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలలో – దిగుమతి టారిఫ్‌ల తగ్గింపు పేరుతో – భారత వ్యవసాయ రంగం పూర్తిగా బలిపీఠం ఎక్కదని ఆశించడం మాత్రమే మనం చేయగలిగింది!
డి. పాపారావు
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News