ఆప్ ఓటమి ప్రజాస్వామ్య విజయమేనా?
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:21 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. మధ్యతరగతి ఓటర్లు మందహాసం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యర్థులు ఆనంద తాండవం చేస్తున్నారు. క్షమించాలి, నేనీ విజయోత్సవాలలో...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. మధ్యతరగతి ఓటర్లు మందహాసం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యర్థులు ఆనంద తాండవం చేస్తున్నారు. క్షమించాలి, నేనీ విజయోత్సవాలలో పాల్గొనలేను. ఇది నిజంగా ‘ఆమ్ ఆద్మీ’ విజయమేనా అని ప్రశ్నిస్తున్నాను. పది సంవత్సరాల క్రితం ఆప్‌లో పనిచేస్తున్న మాలో కొంతమందిపై పుకార్లు పుట్టించి, అవమానించి గెంటివేసిన వైనాన్ని నేను మరచిపోయానని మీరు పొరపడవద్దు. ఒక విశాల రాజకీయ సన్నివేశం గురించి యోచిస్తున్నప్పుడు నా వ్యక్తిగత అనుభవాలు, ఎంత చేదువైనా, ఆ వివేచనను ప్రభావితం చేయడాన్ని అనుమతించను. ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు, ఆప్ ఓటమి ఆ విస్తృత రాజకీయ సన్నివేశంలో ఒక భాగం మాత్రమే. ఆ ఆలోచన నా గురించి కాదు, ఆప్, దాని నాయకుల గురించీ కాదు. నేను ముందే ప్రస్తావించినట్టు అది ‘ఆమ్ ఆద్మీ’ గురించి. చింత, కలత, ఆందోళన మిళితమైన మనసుతో నిట్టూరుస్తున్నాను.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ పదేళ్ల పాలన ఒక ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజలు ఆప్ పాలనను నిర్ద్వం ద్వంగా తిరస్కరించారు. ఢిల్లీ ప్రజల ఆప్ తిరస్కారం బీజేపీకి అధికార లబ్ధిని సమకూర్చింది. గమనించారా? పరాజిత ఆప్, విజేత బీజేపీ మధ్య ఓట్ల శాతం కేవలం 3.5శాతం మాత్రమే. బీజేపీ సాధించుకున్న సీట్ల సంఖ్యను సూచిస్తే విజేత ఓట్ల వాటా పరాజిత ఓట్ల వాటా కంటే చాలా అధికంగా ఉండవచ్చనే భావన కలుగుతుంది. అయితే వాస్తవంగా ఆ రెండు వాటాల మధ్య తేడా ఊహాత్మక అంచనా కంటే చాలా తక్కువగా లేదూ?!
ఢిల్లీ ఎన్నికల ఫలితం ఎటువంటి పరిస్థితులలో విరుద్ధంగా ఉండేదో ఊహించడం కష్టమేమీ కాదు. అవినీతి ఆరోపణలు ప్రజల దృష్టికి వెళ్లకుండా ప్రసార మాధ్యమాలు బీజేపీ నాయకులను కాపాడిన విధంగానే ఆప్ నేతలనూ ఆదుకున్నట్టయితే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఢిల్లీ ఎన్నికలు కేంద్ర బడ్జెట్‌కు ముందే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం శ్రద్ధ చూపి ఉన్నట్టయితే, అలాగే ఢిల్లీ ఓటర్లను లక్ష్యం చేసుకునేందుకు కేంద్ర బడ్జెట్‌ను అనుమతించబోమన్న తన హామీకి ఈసీ కట్టుబడి ఉన్నట్టయితే పరిస్థితి భిన్నంగా ఉండేది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో వలే మహిళలకు నగదు బదిలీ పథకాన్ని అమలుపరచడంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నిరోధించకుండా ఉన్నట్టయితే ఓటర్లు అంతగా ఆప్‌కు వ్యతిరేకమయ్యేవారు కాదు అని నిశ్చితంగా చెప్పవచ్చు. ఆప్, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకోకపోయినా ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని సీట్లకు పోటీ చేయాలి అనే విషయమై అవగాహన కుదుర్చుకున్నట్లయితే ఈ రెండు పార్టీల పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. ప్రస్తావించిన వాటిలో ఏ ఒక్కటైనా సంభవించి ఉన్నట్టయితే మరో 2 శాతానికి పైగా ఓట్లు ఆప్‌కు చేకూరేవి. ఎన్నికల ఫలితాలపై పతాక శీర్షికలు భిన్నంగా ఉండేవి.
ఇదే సమయంలో ఓటర్లలో ‘ప్రభుత్వ వ్యతిరేకత’ చాలా తీవ్రంగా ఉందన్నది ఒక కొట్టివేయలేని వాస్తవం. అయితే ఈ వ్యతిరేకతను ఓట్ల వాటాల వైనం పూర్తిగా ప్రతిబింబించలేదు. ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన వివిధ అంశాల–అభివృద్ధి, రోడ్లు, పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా– లో ఆప్ సర్కార్‌పై ప్రజల్లో భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని సిఎస్‌డిఎస్–లోక్‌నీతి సర్వే ధ్రువీకరించింది. ఆప్ ప్రభుత్వం పనితీరుపై ప్రజల సంతృప్తి, కేంద్ర ప్రభుత్వ పనితీరు పై కంటే తక్కువగా ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఆ పార్టీకి లభించిన ఓటర్ల వాటా కంటే తక్కువగా ఉన్నది. అవినీతి నిర్మూలన నినాదంతో ప్రభవించిన ఆప్ ప్రభుత్వం ‘పూర్తి’గా లేదా ‘కొంతమేరకు’ అవినీతి సర్కార్ అని ఢిల్లీ ఓటర్లలో మూడింట రెండు వంతుల మంది అభిప్రాయపడడం దిగ్భ్రాంతికరమైన విషయం. ఆప్‌కు ఓటు వేసిన ఢిల్లీ ఓటర్లలో చాలా మంది ఆ పార్టీని అంతగా ఇష్టపడడం లేదన్నది కూడా నిరాకరించలేని వాస్తవం. ఆప్‌కు ఒక గట్టి ప్రత్యామ్నాయం ఉన్నా, బీజేపీ తరపున విశ్వసనీయమైన ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నా లేదా కాంగ్రెస్ ఒక గెలుపు గుర్రంగా కనిపించినా ఈ ప్రజాభిప్రాయసేకరణలో ఆప్ పట్ల మరింత వ్యతిరేకత వ్యక్తమై ఉండేది.
అవును, ఈ ఎన్నికల పరాజయం ఆప్‌కు పూర్తిగా యుక్తమైనదే. అయితే అందుకు సంతోషించవలసింది ఏమీ లేదు. నిజానికి రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం మన దేశంలో సుస్థిరంగా వర్ధిల్లాలని కోరుకుంటున్న వారు ఆప్ ఓటమిలోని అపశకునాలకు ఆందోళన చెందాలి, మన గణతంత్ర రాజ్య భవిష్యత్తు గురించి శ్రద్ధతో ఆలోచించాలి. ఆప్ ఓటమికి నేను చింతిస్తున్నాను – ఆ పార్టీకి నేను అభిమానిని అయినందువల్ల కాదు. రాజకీయాలలో మౌలిక పరివర్తన సాధించేందుకు ప్రభవించిన పార్టీ అది. ఆవిర్భవించిన మొదటి రెండు సంవత్సరాలలోనే ప్రజామోదం సంపూర్ణంగా పొందిన పార్టీ అది. ఆ పార్టీ అధినేత వ్యక్తిపూజను పోత్సహించాడు, సకల అధికారాలనూ తన చేతుల్లో కేంద్రీకరించుకున్నాడని నిక్కచ్చిగా చెప్పక తప్పదు. ఇక ఆయన సన్నిహితులు, ఆంతరంగికులు నిగూఢ రాజకీయాలు చేశారు, రెండు నాల్కలతో మాట్లాడారు, సాధారణ పార్టీ కార్యకర్తను లక్ష్యపెట్టలేదు. ఏతా వాతా ఏ పార్టీల నయితే అధికారం నుంచి, జాతి రాజకీయ జీవితం నుంచి తొలగించేందుకు పుట్టిందో ఆ ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాల కంటే ఆప్ భిన్నమైనది కాదని రుజువయింది. మీడియాలో ముఖ్యమంత్రి నివాసం ‘శీష్ మహల్’ గురించి అతిశయోక్తులతో ఉధృత ప్రచారం జరిగింది. పార్టీ నాయకులు పదే పదే మాట్లాడిన గాంధేయ ఆదర్శాలకు విరుద్ధంగా వారి జీవన శైలి ఉన్నందునే మీడియా నిశిత విమర్శలు అనివార్యమయ్యాయి. మద్యం కుంభకోణంలో ఆప్ నాయకులకు న్యాయస్థానాలు ఎటువంటి శిక్ష విధించని మాట నిజమే. అసలు వారు ఆ అవినీతికి పాల్పడినట్లు న్యాయసమ్మతమైన రుజువులు లభించకపోవచ్చు. అయినా మద్యం కుంభకోణం మిథ్య కాదు. ఆప్‌కూ నైతిక విలువలు లేవనే కఠోర వాస్తవాన్ని ప్రజలకు అది స్పష్టం చేసింది.
ఆప్ ఓటమికి నేను కలత చెందుతున్నాను. ‘ఢిల్లీ నమూనా’ ఆదర్శప్రాయమైనదని విశ్వసించడం వల్ల కానే కాదు. ఆప్ సర్కార్ ప్రభుత్వ విద్యారంగానికి రాజకీయ ప్రఖ్యాతి తీసుకువచ్చింది. ప్రభుత్వ బడులలో సదుపాయాలను మెరుగుపరిచింది. మరి నాణ్యమైన విద్య ఢిల్లీ బాలలకు అందినదా అనే విషయం పూర్తిగా చర్చనీయాంశమే. మొహల్లా క్లినిక్‌లు ఒక మంచి ఆలోచన. అయితే వాటిని అమలుపరిచిన తీరు ఆరోగ్య సాధకంగా లేదు. ఉచిత విద్యుత్ , మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలైనవి పేదల సంక్షేమం పట్ల ఆప్ రాజకీయ సంకల్పానికి అద్దం పడుతున్నాయి. అయితే అందుకు ఖర్చు చేసిన నిధులను ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు దోహదం చేసే దీర్ఘకాలిక సంస్థాగత మెరుగుదలకు వినియోగించి ఉండవలసింది. పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఢిల్లీ నమూనా చేసిన దోహదం పెద్దగా ఏమీ లేదు. వ్యర్థ పదార్థాల నిర్వహణపై శ్రద్ధ చూపలేదు. నీటి, వాయు కాలుష్యాలను సమర్థంగా నిరోధించలేదు. కొన్ని రంగాలలో పరిస్థితులు పాక్షికంగా మెరుగుపడినా ఆ మెరుగుదల ఏ విధంగానూ ఆదర్శ నమూనా కానేకాదు.
ఢిల్లీ నగర–రాజ్య విధానాలు, రాజకీయాలలో నిరుపేదల రాజకీయ ప్రాధాన్యాన్ని తుడిచివేసేందుకు ఆప్ ఓటమి నాంది అవుతుందని నేను అమితంగా వ్యాకులత చెందుతున్నాను. ఆప్ ప్రభుత్వం ఎన్ని పరిమితులతో అయినప్పటికీ నగరంలో అనధికారికంగా నివసించక తప్పని పరిస్థితులలో కునారిల్లుతున్న ఢిల్లీ వాలాలలో చాలా మందికి రక్షణ కల్పించింది. పేదల, కొత్తగా నగరానికి వలసవచ్చిన అభాగ్యుల, దళితుల సమస్యల పరిష్కాం పట్ల శ్రద్ధ చూపింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ అజెండా ఢిల్లీని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరంగా అభివృద్ధిపరచడం. యమునానది తీర ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణ మొదలైనవి ఆ అజెండాలో ఉన్నాయి. ఇవన్నీ ఢిల్లీ జనాభాలో మెజారిటీగా ఉన్న పేదలు, నిరుపేదలు నగరంలో లేకుండా చేసేందుకు దారితీస్తాయి.
దేశ రాజకీయాలలో ఎటువంటి మినహాయింపులేని సంపూర్ణ ప్రాబల్యాన్ని నెలకొల్పుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చుకోవడంలో బీజేపీ మరో అడుగు ముందుకు వేసేందుకు ఢిల్లీ ఎన్నికలలో విజయం తోడ్పడుతుందని నేను ఆందోళన చెందుతున్నాను. ఎన్నికల సంఘం బీజేపీ పక్షపాతిగా వ్యవహరించడాన్ని, అన్ని పక్షాలకు సమ అవకాశాలు కల్పించకపోవడాన్ని ఎవరూ ప్రశ్నించడానికి ఆస్కారం లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా ఆప్ ఓటమితో ప్రత్యామ్నాయ రాజకీయాలకు అవకాశం లేకుండా పోతుందని, అటువంటి ప్రయత్నాలు చేసే శక్తులకు తీవ్ర విఘాతం కలుగుతుందని నేను భయపడుతున్నాను. ఈ విషయమై మీరూ ఆందోళన చెందాలి.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News