Share News

యువత భవితకు ఇంటర్న్‌షిప్‌ ఊతం

ABN , Publish Date - May 23 , 2025 | 06:12 AM

నూట నలభై ఐదు కోట్ల పైచిలుకు జనాభాలో అలరారుతున్న దేశం మనది. వీరిలో తొంభై కోట్లకు పైగా యువత ఉన్నారు. వీరంతా ముప్ఫై ఐదు సంవత్సరాల లోపువారే. ప్రపంచంలోని ఏ ఇతర దేశానికి లేని యువ సంపద మన సొంతం. కాని, చదివిన చదువులకు తగిన పని అనుభవం...

యువత భవితకు ఇంటర్న్‌షిప్‌ ఊతం

నూట నలభై ఐదు కోట్ల పైచిలుకు జనాభాలో అలరారుతున్న దేశం మనది. వీరిలో తొంభై కోట్లకు పైగా యువత ఉన్నారు. వీరంతా ముప్ఫై ఐదు సంవత్సరాల లోపువారే. ప్రపంచంలోని ఏ ఇతర దేశానికి లేని యువ సంపద మన సొంతం. కాని, చదివిన చదువులకు తగిన పని అనుభవం కలిగినవారు ఎందరు? గణాంకాలు కలవరపాటుకు గురిచేస్తాయి. ఏళ్ళ తరబడి చదువులు చదువుతూ, స్వల్పకాలంలో పని అనుభవాన్ని సాధించగలిగే నైపుణ్యాలను వృద్ధి చేసుకోడంలో యువత ఎందుకు వెనకబడుతున్నారన్నది అందరూ ఆలోచించాలి.

‘జాతీయ విద్యావిధానం–2020’ యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఇంటర్న్‌షిప్‌లను వారి చదువులలో భాగం చేసింది. ఇది యువతలో ఆరోగ్యకర పోటీని పెంచటంతోపాటు, వివిధ రకాలైన ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి సహకరిస్తుంది. వివిధ వృత్తులు, ఉద్యోగాలు, పరిశోధనల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఇంటర్న్‌షిప్‌లు ఎంతగానో దోహదం చేస్తాయి. జాతీయ విద్యావిధానం మూడు రకాలైన ఇంటర్న్‌షిప్‌లపై దృష్టి పెట్టాలని విద్యాలయాలకు సూచించింది. వారానికి రెండు నుంచి నాలుగు క్రెడిట్ల బోధన, అభ్యసన గంటలను ఇంటర్న్‌షిప్‌లకు కేటాయించాలని విధానపత్రం సూచిస్తోంది.


ఇంటర్న్‌షిప్‌లలో మొదటిరకం వృత్తి నైపుణ్యాలను వృద్ధి చేసుకోడానికి సంబంధించినది. పరిశ్రమలు, కార్యాలయాలతో అనుసంధానమై విద్యార్థులు దీనిని పూర్తి చేయాలి. రెండవది, తాము చదువుతున్న సబ్జెక్టులో పరిశోధన నైపుణ్యాలను వృద్ధి చేసుకోడానికి సంబంధించింది. చదువుకొంటున్న విద్యాలయంలోని ఆచార్యుల పర్యవేక్షణలో ఉంటూ విద్యార్థి పరిశోధన ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలి. ఇందుకోసం, ఇతర విద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కూడా కలసి పనిచేయవచ్చు. మూడవది, సమాజంతో మమేకమై పనిచేయడం. సమాజం పట్ల సానుకూలమైన దృక్పథాన్ని యువతలో పెంపొందింప చేయడానికి ఇది మేలైన మార్గం. ప్రజాప్రయోజనం కోసం పనిచేసే వ్యక్తులు, సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు... మొదలైన వాటితో కలిసి పనిచేస్తూ సమాజ చలనసూత్రాలను నేరుగా అధ్యయనం చేసే వీలు దీని ద్వారా యువతకు లభిస్తుంది. ఈ మూడు రకాలైన ఇంటర్న్‌షిప్‌లలో దేనిని ఎంచుకోవాలన్నది విద్యార్థుల అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.

కళలు, సాహిత్య రంగాలు, సామాజిక శాస్త్రాలు, వృత్తివిద్య, విఙ్ఞాన శాస్త్రాలు వంటి అన్ని రంగాలలోను, అన్నిరకాల చదువులలోను ఇంటర్న్‌షిప్‌లను భాగం చేయాలని యూజీసీ మార్గదర్శక సూత్రాలు తెలియజేస్తున్నాయి. స్థాయికి అనుగుణంగా యువతకు ఉన్న ఉపాధి అవకాశాలను పెంచడం దీనిలో గుర్తించదగిన ఒక ప్రధానమైన అంశం. ఒక తరగతి చదివే విద్యార్థులంతా మూస పద్ధతిలో ఒకే రకమైన ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకోవలసిన అవసరం లేదు. ఏఏ ఇంటర్న్‌షిప్‌లను ఎంతమంది చేయాలనుకొంటున్నారో విద్యార్థులు, ఆచార్యులు కలిసి నిర్ణయించుకోవచ్చు. డిగ్రీ పూర్తయ్యేలోపు ఇటువంటి ఇంటర్న్‌షిప్‌లలో ఏ ఒక్కటైనా పూర్తి చేయాలని విధానపత్రం నిర్దేశిస్తోంది.

ఒకప్పుడు సైన్సు, ఇంజనీరింగ్, సాంకేతిక విద్యలకు సంబంధించిన కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేసేవారు. ఇప్పుడు అన్ని రకాల చదువులు చదివే విద్యార్థులు చేయదగిన అంశాలు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి. తాము మంచి వ్యక్తులుగా ఎదగడమే కాకుండా, సమాజాన్ని వృద్ధిచేయడానికి కావలసిన నైపుణ్యాలను ఎన్నిటినో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా యువత సాధించుకోవచ్చు. వీటిని అందుకోడానికి యువత తమను తాము ఎంతగా సమాయత్తం చేసుకొంటే మన సమాజాలు అంతగా వృద్ధి చెందుతాయి.


ఇంతకు ముందుకాలాల్లో లేని ఎన్నో విద్యావకాశాలను జాతీయ విద్యావిధానం ఇప్పటి యువతకు అందిస్తోంది. డిగ్రీలు పూర్తయ్యేవరకు విద్యార్థులకు ఆయా విషయాల్లో పని అనుభవం లేకపోతే ఉద్యోగాల కల్పన కష్టం అవుతుంది. అందుకే ఏఐసీటీఈ వంటి సంస్థలు సాంకేతిక విద్యకు సంబంధించి నమూనా ప్రణాళికలను అందిస్తున్నాయి. వీటి ఆధారంగా ఆయా రాష్ట్రాలు తగిన కార్యాచరణను ప్రారంభిస్తున్నాయి. కృత్రిమమేధ, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్... వంటి అంశాలలో పాఠశాల స్థాయినుంచి తర్ఫీదును ఇచ్చేందుకు కొన్ని రాష్ట్రాలలో ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి‌. సంబంధిత సంస్థలు, పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలను చేసుకొని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుకొంటున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు అందించడానికి సిద్ధం అవుతున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ పరిశోధన సంస్థలు, పరిశ్రమలతో ఇంటర్న్‌షిప్‌ల కోసం అవగాహన ఒప్పందాలను చేసుకొంటున్నాయి.

విద్యార్థి దశలో చేసే ఇంటర్న్‌షిప్‌లు వారి మూర్తిమత్వ వికాసంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి. బృందంగా ఏర్పడి పనిచేయడానికి తగిన కౌశలాలను పెంచుతాయి. వ్యక్తిగతమైన బలహీనతలను అధిగమించి, సామూహికమైన బలాలను ప్రజోపయోగ్యమైన రీతిలో వాడే అవకాశం చిక్కుతుంది. తమ ప్రతిభను ఏయే రంగాలలో సానపెట్టుకోవచ్చో యువతకు అనుభవంలోకి వస్తుంది. విభిన్నమైన పని వాతావరణాలు, పని సంస్కృతులపై అవగాహన, గౌరవం పెంచుకోడానికి ఇంటర్న్‌షిప్‌లు ఎంతగానో సహకరిస్తాయి‌. సాధించిన నైపుణ్యంతో ఎక్కడైనా గెలవవచ్చనే ధీమా పెరుగుతుంది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నవీకరణ చెందడానికి, సమతుల్యాన్ని సాధించడానికి ఇంటర్న్‌షిప్‌లు సహకరిస్తాయి.

సమాజ వృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకోడానికి ఇంటర్న్‌షిప్‌లలో పొందే పని అనుభవం యువతకు ఎంతగానో సహకరిస్తుంది‌. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగే స్థైర్యాన్ని ఇంటర్న్‌షిప్‌లు కలిగిస్తాయి. బృందంలో కలిసి పని చేయగలగడంతోపాటు, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. నైతిక విలువల ఆధారంగా సమాజవృద్ధికి సహకరించే సృజనాత్మక ఆలోచనలకు ఇంటర్న్‌షిప్‌లు సహకరిస్తాయి‌. తాము ఎంచుకున్న రంగంలో, తమతో కలిసి పనిచేస్తున్న సహచరులతోపాటు, ఆ రంగంలో నిష్ణాతులైన పండితుల వరకు ఉన్నవారందరితో మంచి సంబంధాలు ఏర్పడతాయి.


పాఠశాల, కళాశాల విద్యను పూర్తిచేసిన యువతకు ఉద్దేశించిన ఇంటర్న్‌షిప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇటీవలే ప్రకటన వెలువరించింది. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకంగా పిలుచుకునే దీనిలో ఎంపికైన యువతకు నెలకు ఐదువేల రూపాయల భృతి లభిస్తుంది. నేర్చుకున్న అంశాలను పని అనుభవం ద్వారా పదునుపెట్టుకోవడానికి ఇది యువతకు అందివచ్చిన ఒక గొప్ప అవకాశం. ఒక సంవత్సరం వ్యవధిలో సాగే ఈ ఇంటర్న్‌షిప్‌లో అభ్యర్థికి ఆరునెలలపాటు ఉద్యోగ శిక్షణ‌ ఉంటుంది.

ఉన్నత పాఠశాల విద్య, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదివే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు చేయడానికి ఇంటర్న్‌శాల అనే ఆన్‌లైన్‌ వేదిక అవకాశాలను అందిస్తోంది. ఇంటర్న్‌షిప్‌లు చేయాలనుకొనే విద్యార్థులకు, అవి అందించే వ్యవస్థలకు- సంస్థలకు ఉమ్మడి ఆన్‌లైన్‌ వేదిక ‘ఇంటర్న్‌శాల’. దీనిలో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు అందించే కార్యాలయాలు, సంస్థలతో నేరుగా అనుసంధానాన్ని పొందవచ్చు. వివిధ ఉద్యోగాల కోసం కావలసిన నైపుణ్యాలను వృద్ధిచేసే అనేకమైన స్వల్పకాలిక కోర్సులను కూడా దీని ద్వారా చేయవచ్చు. ఇంటర్న్‌శాల అందించే ఇంటర్న్‌షిప్‌లలో వైవిధ్యం ఎక్కువ. వివిధ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు, స్వల్పమైన వృత్తి నైపుణ్యాలు కలిగినవారు నేరుగా ఉద్యోగాలలో చేరడానికి వీలుగా కొన్ని సంస్థలు దీనిలో అవకాశాన్ని కల్పిస్తున్నాయి. జీవితమనే బండి పట్టాలపై సాఫీగా సాగిపోవాలంటే పట్టాలిచ్చే చదువులు మాత్రమే చాలవిప్పుడు. పని అనుభవాన్ని కూడా తోడుపెట్టినప్పుడే సాధించిన పట్టాలకు సార్థకత. యువత తక్షణం దృష్టిసారించవలసిన విషయం ఇది.

ఆచార్య పమ్మి పవన్‌కుమార్

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు, హెచ్‌సీయూ

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 06:12 AM