International Womens Day: ‘పిలుపునివ్వటం’తోనే ఆగిపోరాదు!
ABN , Publish Date - Mar 08 , 2025 | 06:29 AM
ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పిలుపులు ఇస్తుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా మహిళల, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం పిలుపునిచ్చింది.
ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పిలుపులు ఇస్తుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా మహిళల, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం పిలుపునిచ్చింది. ఐతే పిలుపునివ్వడం వరకే సరిపోదు, దానికి తగ్గ దిశానిర్దేశం ఉండాలి. ఇవి లేవు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో మహిళల నిరసనలు ఆందోళనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌లో మహిళలపై హింస, అదృశ్యం, హత్యలు, పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం లేకపోవడం వంటి సమస్యలను హైలైట్ చేస్తూ వేలాది మంది మహిళలు ‘ఔరత్ మార్చ్’ జరిపారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్‌ల అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు, కళాకారులు, విద్యావేత్తలు నిరసనలు తెలుపుతున్నారు. ఇరాన్‌లో నివురుగప్పిన నిప్పులా ప్రతిఘటన ఏకమవుతున్నది. పాలస్తీనా మారణహోమానికి వ్యతిరేకంగా అక్కడి మహిళా జర్నలిస్టులు, కళాకారులు తమ నిరసనను ప్రపంచ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
భారతదేశంలో పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా మణిపూర్, ఛత్తీస్‌గడ్, లడక్‌లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పోరాటాలు చేస్తున్నారు. మధ్యభారతంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు వేలాదిగా పోలీస్ క్యాంపులు పెడుతూ మహిళలపై చేస్తున్న లైంగిక దాడులు, హింస, హత్యలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమిస్తున్నారు. ఈ అంతర్జాతీయ, జాతీయ పోరాటాలు మహిళలపై నేటికీ జరుగుతున్న హింసను సూచిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మహిళల అభివృద్ధిని ఎలా ఆశించగలం? ఉన్నత న్యాయస్థానాలు సైతం నేడు మహిళా వ్యతిరేక తీర్పులు ఇస్తూ తమ పితృస్వామిక భావజాలాన్ని చాటుకుంటున్నాయి. లైంగిక నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణలో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలు హైదరాబాదులో ప్రారంభం అవుతున్నాయి. 1996లో ప్రపంచ సుందరి పోటీలు బెంగళూరులో జరిగినప్పుడు అన్ని మహిళా సంఘాలు ఐక్యంగా నిరసించాయి. అదే స్ఫూర్తిని ఇక్కడా ప్రదర్శించాలి. మొత్తంగా భూస్వామ్య, కార్పొరేట్, సామ్రాజ్యవాదులను వ్యతిరేకిస్తూ, విముక్తి సాధన దిశగా మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం కోసం పోరాడాలి.
– బి. జ్యోతి, చైతన్య మహిళా సంఘం
(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)