Transformative Poetry: ఇలా రికామీగా...
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:20 AM
కళ్ళకు గంతలు కట్టుకొని శూన్యంలో నడుస్తున్నాను ఒక చేతిలో కత్తి మరో చేతిలో డాలుతో యుద్ధానికి సన్నద్ధమైన సైనికుడిలా....
కళ్ళకు గంతలు కట్టుకొని
శూన్యంలో నడుస్తున్నాను
ఒక చేతిలో కత్తి
మరో చేతిలో డాలుతో
యుద్ధానికి సన్నద్ధమైన సైనికుడిలా
ఎన్నో బంధాల్ని వదిలేసి
ఎంతో కాలంగా
తిరుగుతున్నాను ఇలా రికామీగా-
నీలి పూల లాంటి
నా కనురెప్పలపై
నాట్యం చేస్తున్నాయి
అల్లకల్లోల దృశ్యాలు
ఒక ఊహాపూరిత కోరిక
ఒక రసమయమైన భావన
నా స్మృతి పథం నుండి జారిపోతున్నప్పుడు
మనసుతో మనసును
అనుసంధానించి
ఆత్మను ఆత్మతో అనువాదం చేస్తున్నాను
ఇప్పుడు నన్ను నేను విస్తరించుకున్నాను
నా ఆలోచనలు పురివిప్పి
నాట్యమాడుతున్నాయి
ఇప్పుడు నా రికామీ తిరుగుళ్ళన్నీ
యుద్ధవ్యూహాలు అయ్యాయి
కళ్ళకు గంతలున్నా
స్వప్న గమ్యం స్పష్టంగా కనిపిస్తోంది
నన్ను రక్షిస్తూ డాలు
యుద్ధం చేస్తూ నా చేతిలో కత్తి రేపటి రోజు
ఆశ్చర్యకరమూ, కాంతివంతమూ అయినది కావచ్చునేమో!
-విల్సన్ రావు కొమ్మవరపు & 89854 35515