Share News

చరిత్రలోకి జారిపోతున్న‘ఇండియా’!

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:32 AM

‘ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక మహాకూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన యుక్తమైనదే, అయితే అదెంతవరకు సుసాధ్యమవుతుందో నేను కచ్చితంగా చెప్పలేను’....

చరిత్రలోకి జారిపోతున్న‘ఇండియా’!

‘ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక మహాకూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన యుక్తమైనదే, అయితే అదెంతవరకు సుసాధ్యమవుతుందో నేను కచ్చితంగా చెప్పలేను’– జూన్‌ 2023లో ఇండియా కూటమి సీనియర్‌ నాయకుడు ఒకరు అన్న మాట అది. ఆ రాజకీయ దురంధరుడు చాలా జాగ్రత్తగా చెప్పిన ఆ మాటలు ఇప్పుడు దాదాపుగా రుజువయ్యాయి. పద్దెనిమిది నెలల క్రితం రోహిణీ కార్తె రోజుల్లో పాట్నాలో విభిన్న రాజకీయ స్వభావాలతో వ్యవహరించే వివిధ రాజకీయ పక్షాలు అసంభవమనుకున్న బీజేపీ వ్యతిరేక రాజకీయ కూటమి నేర్పాటు చేశాయి. సార్వత్రక ఎన్నికల అనంతరం ఆ కూటమి చీలిపోవడం ప్రాంభమయింది. ఆ చీలిక ప్రక్రియ ఇప్పుడు దాదాపుగా పూర్తయిందని చెప్పవచ్చు. ఇండియా కూటమి దాదాపుగా అస్తమించింది. దానికి అంత్యక్రియలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పిమ్మట తప్పక జరుగుతాయి.


గత సార్వత్రక ఎన్నికలలో మోదీ నేతృత్వంలో బీజేపీ 400 లోక్‌సభ సీట్లను సాధించాలని మోదీ నేతృత్వంలోని బీజేపీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ప్రభవించిన ఇండియా కూటమి లక్ష్య పరిపూర్తి అనంతరం ఎంతో కాలం సమైక్యంగా ఉండలేక పోయింది. తగ్గిన మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తరువాత జాతీయ ప్రాథమ్యాల కంటే రాష్ట్ర స్థాయి రాజకీయ అవసరాలు, ఒత్తిళ్లే ఇండియా కూటమి రాజకీయాలను ప్రభావితం చేయడం ప్రారంభమయింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ, వామపక్షాలు సమైక్యంగా పనిచేసేందుకు ఆమోదయోగ్యమైన ప్రాతిపదిక ఏమైనా ఉన్నదా? పోనీ, అటువంటి ప్రాతిపదికను కనుగొనేందుకు మమత, వామక్షాలు ప్రయత్నించగలవని ఎవరూ భావించలేరు. బిహార్‌లో శత్రువులుగా మారిన స్నేహితులు, తిరిగి స్నేహపూరిత శత్రువులుగా మారిన నితీశ్‌ కుమార్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌ల మధ్య ఎప్పుడైనా పరస్పర విశ్వాసమున్నదా? కశ్మీర్‌ లోయలో ఆధిపత్యానికి తీవ్రంగా పోటీపడే ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి ఇంకా ఎంతకాలం ఒకే కూటమి(ఇండియా)లో ఉండగలుగుతారు? మహా రాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌) తన మిలిటెంట్‌ హిందుత్వ గతాన్ని తన ఇప్పటి అస్పష్ట వర్తమానంతో ఇంకెంత కాలం సామరస్యంగా ఉంచగలుగుతుంది? జాతీయ ఎన్నికలలో నరేంద్ర మోదీ, బీజేపీ ఉమ్మడి శత్రువులే అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో సమీకరణాలు తప్పక మారతాయి. మారాయి కూడా.


ఢిల్లీలోనే ఈ వాస్తవం తేటతెల్లంగా కనిపిస్తోంది. ఎనిమిది నెలల క్రితం దేశ రాజధానిలో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలిసికట్టుగా పోరాడాయి. అదే సమయంలో పంజాబ్‌లో ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచాయి. ఒకే కూటమిలో ఉన్నా ఇరు పార్టీల మధ్య సఖ్యత లోపించింది. రాజకీయ అంకగణితం నుంచి లబ్ధి పొందడానికి ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య దృఢ అనుబంధం లేనేలేదు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ శిథిలాల నుంచే రాజకీయ అంకుర పక్షమైన ఆప్‌ ప్రభవించిందనే సత్యం విస్మరించరానిది 2011లో అవినీతికి వ్యతిరేకంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్వహించిన ఉద్యమమే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని బలహీనపరిచింది. ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించింది. ఈ పరిస్థితిని 2014 సార్వత్రక ఎన్నికలలో తన ప్రయోజనాలకు బీజేపీ పూర్తిగా వినియోగించుకున్నది. ఢిల్లీకి వరుసగా ౧5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ను మట్టి కరిపించారు. అయితే అంతిమంగా కాంగ్రెస్‌ బయట నుంచి ఇచ్చిన మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని కేజ్రీవాల్‌ ఏర్పాటు చేశారు. దేశ పురాతన రాజకీయ పక్షానికి కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌కు మద్దతునివ్వడం తప్పనిసరి అయింది. దరిమిలా దేశ రాజధానిలో కాంగ్రెస్‌ వైభవం క్షీణించి పోయింది. ఒక దశాబ్ద కాలంగా ఢిల్లీ నుంచి లోక్‌సభకు గెలిచిన కాంగ్రెస్‌ నేత ఎవరూ లేరు.


కనుకనే ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా తన మనుగడను కాపాడుకునేందుకు, తన సత్తాను నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గత సార్వత్రక ఎన్నికలలో వలే కలిసికట్టుగా పోటీ చేసేందుకు అటు ఆప్‌ గానీ, ఇటు కాంగ్రెస్‌ గానీ ప్రయత్నించనే లేదు. పైగా ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. వాటి మధ్య మాటల యుద్ధం అదుపు తప్పుతోంది. ఈ పరిస్థితి బీజేపీకి తన గెలుపుపై భరోసానిస్తోంది. గత ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌తో పొత్తు పెట్టుకునేందుకు రాహుల్‌ గాంధీ అంగీకరించారు. అయితే తమ విజయంపై మితిమీరిన విశ్వాసంతో హర్యానా పీసీసీ నాయకులు ఆప్‌తో పొత్తుకు అంగీకరించలేదు. పొత్తు ప్రయత్నాలను విఫలం చేసేందుకు చేయవలసినదంతా చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్‌, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయవలసిన అగత్యంలోకి పడిపోయింది. ఇప్పుడు కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌తో పొత్తుకు ససేమిరా అన్నారు. అంతేకాకుండా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను గెంటివేయాలని కూడా ఘోషించారు!


ఇండియా కూటమి ఆవిర్భావం నుంచి దాని ప్రస్థానాన్ని సింహావలోకనం చేస్తే నాయకుల అహమికలు, ఆకాంక్షలు ఎంత పరస్పర విరుద్ధంగా ఉన్నాయో ఆశ్చర్యం గొలుపుతుంది. ఆ మాటకొస్తే ఆ నాయకులు అసలు ఆ మహా కూటమి నిర్మాణానికి ఎలా పూనుకున్నారా అని అంతులేని విస్మయమూ కలుగుతుంది. మోదీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమిని తొట్ట తొలుత ప్రతిపాదించిన నితీశ్‌ కుమార్‌ ‘ఇండియా’ నుంచి వైదొలిగిన మొట్టమొదటి నేత కావడం గమనార్హం. ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఉండాలన్నది ఆయన ప్రగాఢ ఆకాంక్ష. అయితే ఇతర భాగస్వామ్య పక్షాలు అందుకు ససేమిరా అనడంతో నితీశ్‌ ముందుగానే ఇండియా కూటమి నుంచి నిష్క్రమించి తన కొక భద్ర బాటను ఎంచుకున్నారు. బెంగాల్‌లో వామపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడాన్ని మమతా బెనర్జీ క్షమించరుగాక క్షమించరు. పైగా అన్ని విధాల తనకు జూనియర్‌ అయిన రాహుల్‌ గాంధీ కంటే తాను తక్కువ స్థానంలో ఉండవలసిరావడాన్ని ఆమె అంగీకరించలేక పోయారు. కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ఆమె ప్రశ్నించారు, వ్యతిరేకించారు. ఇక కాంగ్రెస్‌ నాయకత్వంలో ఒక బలమైన వర్గం లోక్‌సభలో తమకు 99 స్థానాలు దక్కడాన్ని ఒక మహా విజయంగా పరిగణించింది. తమ పార్టీ పునరుజ్జీవితమవుతున్నదని విశ్వసించింది. క్షేత్ర స్థాయి వాస్తవాలను విస్మరించింది. ప్రజల మద్దతు ఇక పూర్తిగా ఉంటుందని భ్రమ పడింది. అధికార కైవసానికి తాము చేరువవుతున్నామని నమ్మింది. కూటమిని పటిష్ఠం చేయగల బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగల నేత శరద్‌ పవార్‌. ఇప్పుడు అష్టపదులు పైబడిన వయసులో ఉన్న వృద్ధ నేత. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ అనూహ్య పరాజయం పాలయింది. ఖిన్నుడైన పవార్‌ నిస్సహాయుడుగా మిగిలిపోయారు. ఈ పరాజయ అవమానంతో ఇండియా కూటమి అంతర్గత కలహాలను తీర్చ గల సంకల్పం, సామర్థ్యం ఆయనలో లేకుండా పోయాయి.


అయితే ఇండియా కూటమి పతనంలో దాని నాయకులకు మాత్రమే పరిమితం కాని ఒక పాఠం ఉన్నది. గత దశాబ్దంలో మోదీ ఉత్థానం ఒక రాజకీయ భూతాన్ని సృష్టించింది: ఏక పార్టీ, ఏక నాయకుడు ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నిరంకుశ పాలన’ వైపు దేశం నెట్టబడుతుందనే భీతి సర్వత్రా వ్యాపించింది. ఈ కారణంగానే తాము పూర్తిగా ప్రాధాన్యం కోల్పోతామనే భయమే ప్రతిపక్షాలను ఏకం చేసింది. అయితే మోదీ, మోదిత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత మినహా ఆ ఏకీకరణకు మరెలాంటి ఉమ్మడి ప్రాతిపదిక లేదు. 1970ల్లో ఇందిరాగాంధీని ఎట్టి పరిస్థితులలోను అధికారం నుంచి దించివేయాలనే ప్రతిపక్షాల కోరిక నుంచి జనతా పార్టీ ఆవిర్భవించినట్టుగా ఇప్పుడు మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకతే ఇండియా కూటమి ప్రభవించడానికి దారితీసింది. అయితే సైద్ధాంతిక ప్రాతిపదికలు లోపించిన ప్రతిపక్ష రాజకీయాలు స్వల్పకాలిక లక్ష్యాలపై ఆధారపడి మనుగడ సాగించలేవు. కనుకనే జనతా పార్టీ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండగా, ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకోలేక పోగా అంతకంటే తక్కువ వ్యవధిలోనే చీలి పోవడం ప్రారంభమయింది. జనతా పార్టీకి కనీసం మహోన్నతుడైన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ కొంతకాలం మార్గదర్శిగా ఉన్నారు; ఇండియా కూటమికి అటువంటి వివేకశీలి అయిన నాయకుడు లేక పోవడమే కాకుండా దాని ప్రస్థానాన్ని తీర్చి దిద్దగల ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం కూడా లేకపోయింది.


ఇండియా కూటమి పతనం, 2024 ఆరంభంలో బీజేపీ ఎంత బలీయశక్తిగా ఉన్నదో మళ్లీ అంత బలమైనశక్తిగా పునరావిర్భవించడాన్ని సూచిస్తుంది. గత సార్వత్రక ఎన్నికలకు ముందు తనకు అడ్డుగా ఉన్న ఏ ప్రతిపక్షాన్ని అయినా కూల్చివేయగల శక్తి సామర్థ్యాలు మోదీ పార్టీకి పుష్కలంగా ఉన్నాయన్న వాస్తవం విస్మరించరానిది. మోదీ ప్రభుత్వం తనను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలను ఆత్మరక్షణలో పడవేసేందుకు రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలను నిస్సంకోచంగా ఉపయోగించుకుంటున్న తరుణంలో ప్రతిపక్షాలు వేటికవి వేరుపడిపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిగల పౌరులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం దాని రాజకీయ ప్రత్యర్థులు పార్లమెంటు లోపల, బయట సమస్థాయిలో పోటీ పడే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయనే ఆశాభావాన్ని 2024 సార్వత్రక ఎన్నికల ఫలితాలు కలిగించాయి. అంతర్గత విభేదాలతో ఇండియా కూటమి శీఘ్రగతిన కూలిపోవడం మరింత గందరగోళ, నిరాశా జనక రాజకీయాలు మళ్లీ నెలకొనవచ్చని సూచిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారినందరినీ నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు వెనుకాడదు. భారత్‌కు ఇప్పుడు అవసరమయింది ప్రతిపక్షాలు లేని రాజకీయాలు ఎంత మాత్రం కాదు కదా.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Jan 17 , 2025 | 03:33 AM