Mamdanis New York Mayoral Victory: భ్రమలు భయాలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 03:27 AM
‘న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ గెలుపు– యావత్ ప్రపంచానికే ఒక మలుపు’ అంటూ వివిధ పత్రికల్లో వ్యాసాలు, టీవీలో ఒకటే చర్చలు. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనంత హైప్ జరుగుతోంది. మమ్దానీ గెలుపును వేడుక చేసుకుంటున్న...
‘న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ గెలుపు– యావత్ ప్రపంచానికే ఒక మలుపు’ అంటూ వివిధ పత్రికల్లో వ్యాసాలు, టీవీలో ఒకటే చర్చలు. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనంత హైప్ జరుగుతోంది. మమ్దానీ గెలుపును వేడుక చేసుకుంటున్న వారిలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఉన్నారు. వీరంతా పెట్టుబడిదారులను వ్యతిరేకించే వామపక్ష భావజాలం ఉన్నవారు, సెక్యులర్ల ముసుగులోని ముస్లింలు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నోటి దురుసు కారణంగానే రెండోసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, జోబైడెన్ ఉదారవాదం మొత్తం అమెరికా ఉనికికే ప్రమాదమని భావించినందునే అమెరికన్లు మళ్లీ ట్రంప్‌కే పట్టం కట్టారు. మమ్దానీ గెలుపు అమెరికా గడ్డపై నాన్ అమెరికన్ల ఏకీకరణతో సాధించిన విజయం. న్యూయార్క్ నగరంలో పెరిగిన ముస్లింల జనాభా, ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ కావడం, ఇస్లామిక్ సంప్రదాయ వివాహం, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యం, భారతీయురాలైన తల్లి, ఇస్లామిక్ తీవ్రవాదంపై తండ్రి రాసిన సాహిత్యం, క్రైస్తవ అభ్యుదయవాదుల మద్దతు వంటివి కలగలిసిన విజయం ఇది. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో అమెరికా అంతటా పునరావృతమవుతాయనే ఆశలు, భ్రమలు వద్దు. గెలుపు ఏకపక్షంగా కూడా ఏమీ లేదు. న్యూయార్క్ పట్టణం ప్రపంచ సంస్కృతికి ప్రతిబింబం. ఇటీవలికాలంలో అక్కడ క్రైస్తవుల జనాభా తగ్గి ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. 51 లక్షల మంది ఓటర్లలో 30 లక్షల మంది ఓటర్లు (60శాతం) ఓటింగులో పాల్గొనలేదు. నగరంలోని ధనవంతులెవరూ పోలింగ్ బూత్‌లకు రాలేదు. పోలైన ఓట్లలో మమ్దానీకి 10,36,051 (50.6 శాతం) ఓట్లు, రిపబ్లికన్ అభ్యర్థికి 8,54,995 (41.7శాతం) వచ్చాయి. మొత్తం ఓటర్లలో కేవలం 20.3శాతం, న్యూయార్క్ జనాభాలో 10శాతం మమ్దానీకి మద్దతు పలికినా అతనిని మేయర్ పీఠంపై కూర్చోపెట్టింది అక్కడి ప్రజాస్వామ్యం. ధనవంతులే తన ప్రత్యర్థులంటూ మమ్దానీ చేసిన ప్రచారంతో పేదల ఓట్ల ఏకీకరణ జరిగింది.
సామ్యవాద వ్యతిరేకతతో వాణిజ్య సామ్రాజ్యవాదం విస్తరించే పనిలో ఉండే అమెరికా గతంలో ముస్లిం దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులను సృష్టించి, పెంచి, పోషించింది. అవి తమకే ద్రోహం చేస్తున్నాయని 9/11 దాడులతో తెలిసొచ్చాక, ఆయా ఉగ్రగ్రూపులను అంతమొందించేందుకు పూనుకుంది. లాడెన్, అల్ జవహరీ వంటి ఇస్లామిక్ ఉగ్రవాద నేతలను మట్టుబెట్టింది. పెట్టుబడిదారీ విధానం అవలంబించే దేశాలకు పెద్దన్న అయిన అమెరికాలో పెట్టుబడిదారుల లాభాలకు నష్టం కలిగించే పరిపాలన ఎప్పటికీ ఉండదు. అయితే... మమ్దానీ సోషలిస్టు కాదు, కమ్యూనిస్టు అంతకన్నా కాదు. కానీ ఆయన గెలుపు పట్ల అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికే అనేక భయాలు ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలో ‘గ్లోబలైజ్డ్ ఇంతిఫాదా’ అంటూ ఇస్లాం వ్యాప్తిని మమ్దానీ ప్రస్తావించారు. విజయోత్సవ ర్యాలీలో ఆయన తనను తాను ముస్లింగా ప్రకటించుకుంటూ చేసిన ప్రసంగం లోతుగా గమనించాల్సిందే. ‘సౌండ్ పెంచుకొని విను, ఇక్కడ ఎవ్వరిని తాకాలన్నా మా అందరినీ దాటుకుంటూ రావాలి’ అని ట్రంప్‌కు ఆయన ఘాటైన హెచ్చరిక చేశారు. తన భార్యకు అరబ్బు దేశాలతో ఉన్న అనుబంధం నేపథ్యంలో, ప్రపంచ ముస్లిం రాజ్యాలు తనకు అండగా నిలవాలని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఆయన ఎప్పుడూ, ఎక్కడా ఇస్లామిక్ తీవ్రవాదంపై మాట్లాడలేదు. ఇస్లామిక్ ఉగ్రవాదులకు శాంతి సందేశం ఇవ్వలేదు.
అమెరికా అండతో పాలస్తీనాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును యుద్ధ నేరస్థుడంటూ, ‘న్యూయార్క్ వస్తే అరెస్టు చేయిస్తా’నన్నారు. కానీ, యూదు స్త్రీలపై, పిల్లలపై హమాస్ చేసిన అమానుష నరమేధంపై మమ్దానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. గతంలో ఇస్లామిక్ టెర్రరిస్టులకు అమెరికా అంటే కాస్తో కూస్తో భయం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ వేదికమీద ఉన్నవారి ప్రసంగాలతో ఆ భయం కూడా మిగలకపోవచ్చు.
మమ్దానీ గెలుపుతో ఆయన అభిమానులు భ్రమ పడుతున్నట్లుగా... అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా గానీ, యూరప్‌లో గానీ అనూహ్య మార్పులేమీ రావు. న్యూయార్క్ నగర ఎన్నికలు క్యాపిటలిస్టులకు, సోషలిస్టులకు మధ్య పోటీ కాదు. క్రైస్తవ ఛాందసవాదులకు, సెక్యులర్ ముసుగులో ఉన్న ఇస్లామిక్ ఛాందసవాదులకు మధ్య జరిగిన ఎన్నికల పోరు ఇది. క్రైస్తవ ఛాందసవాదులతో ప్రపంచానికి ప్రమాదమేమీ ఉండకపోవచ్చు కానీ, ఇస్లామిక్ ఛాందసవాదులతో నిత్యం సమస్యే. మమ్దానీ గెలుపుతో ఇస్లామిక్ ఛాందసులు తమకు ఒక ఆసరా దొరికినట్లుగా భావిస్తారు. అమెరికాను మరో ఇస్లామిక్ రాజ్యంగా చేస్తామని ప్రకటించిన సంస్థలకు ఉత్సాహం లభిస్తుంది. ఇప్పటికే యూరప్ దేశాలు వలసవచ్చిన ముస్లింలతో ఎంత ఇబ్బంది పడుతున్నాయో అమెరికా గమనిస్తోంది. ఒకవైపు అమెరికా ఔన్నత్యాన్ని పొగుడుతూనే నూయార్క్‌లో ముస్లిం జనాభా పెరుగుదలను ఇతడు అనుమతిస్తాడన్న అనుమానం అమెరికాలో లేకపోలేదు.
‘ఇస్లామోఫోబియా’ అంటూ యూరప్‌లో అబద్ధపు ప్రచారం జరుగుతోందని బాధపడిపోతున్న మమ్దానీ అభిమాన ముస్లిం మేధావులు ఇక్కడ కొందరున్నారు. కానీ, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాల్లో జరిగే అధిక ఉగ్రదాడుల్లో ఉన్నది ఈ మతంవారే. ‘లజ్జ’ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై హైదరాబాద్‌లో జరిగిన అమానుష దాడిని ఈ కుహనా ముస్లిం మేధావులు ఖండించరు, తమ మతంలో స్త్రీ వివక్షను ఎదుటివారు ప్రశ్నించకూడదనీ అంటారు. కానీ, మమ్దానీ తల్లి మీరానాయర్ దర్శకత్వం వహించిన ‘India Cabaret’ డాక్యు మెంటరీలోని ఒక యువతి పాత్రపై మాత్రం పొగడ్తల వర్షం, సానుభూతి ఒలకబోస్తారు. ఆఫ్రికన్ దేశాల్లో క్రైస్తవులపై ఇస్లామీయులు సాగిస్తున్న మారణకాండ వీరికి కన్పించదు.
మమ్దానీ గెలుపుతో అమెరికా వాణిజ్య, సామ్రాజ్యవాదానికి బ్రేకులేమీ పడవు. పెట్టుబడిదారీ విధానంలో మార్పులేమీ రావు. ఈ మాత్రం దానికే అదేదో ప్రపంచ వింతనీ, అద్భుతమనీ, మొత్తం ప్రపంచాన్నే మలుపుతిప్పే తీర్పు అనీ... ఇలా ఏవేవో భ్రమల్లో తెలియాడేవారు అసలు విషయాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు.
మామిడి నారాయణ
ఇవి కూడా చదవండి..
బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా
ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.