ఆచరణ సాధ్యంకాని ఆలోచనలు
ABN , Publish Date - May 23 , 2025 | 06:07 AM
ఒక సాహితీ సంస్థలో తనకు సభ్యత్వాన్ని నిరాకరించటాన్ని ప్రస్తావిస్తూ శ్రీశ్రీ ‘‘అరవైయేళ్లు దాటిన నన్ను సభ్యుడిగా చేర్చుకోలేమని చెప్పారు, వయసు ఎక్కువైకాదు– చాలక’’ అని అంటాడు. దశాబ్దకాలంగా వృద్ధుల వలన, వృద్ధుల చేత, వృద్ధుల కొరకు రాయబడుతున్న...
ఒక సాహితీ సంస్థలో తనకు సభ్యత్వాన్ని నిరాకరించటాన్ని ప్రస్తావిస్తూ శ్రీశ్రీ ‘‘అరవైయేళ్లు దాటిన నన్ను సభ్యుడిగా చేర్చుకోలేమని చెప్పారు, వయసు ఎక్కువైకాదు– చాలక’’ అని అంటాడు. దశాబ్దకాలంగా వృద్ధుల వలన, వృద్ధుల చేత, వృద్ధుల కొరకు రాయబడుతున్న అనేకానేక ఆచరణ సాధ్యం కాని వ్యాసపరంపరలలో మంచికంటి వ్యాసం (ఆంధ్రజ్యోతి 7.5.25) కూడ చేరి శ్రీశ్రీ చమత్కారానికి సాక్ష్యంగా నిలిచింది.
ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్లల్లో ఉత్తీర్ణత శాతం పెరగటానికి, అక్కడ గైడ్ల బదులు మెటీరియల్ ఉండటమే కారణం అని మంచికంటి వివరించారు. అది ఒక కారణం కావచ్చు కాని, అదొక్కటే కారణం కాదు. కార్పొరేటు విద్యాసంస్థ ఉద్దేశ్యం వ్యాపారమైనా అక్కడ ఉపాధ్యాయుడి సామర్థ్యానికి, పిల్లల చదువుకు ఖచ్చితమైన జవాబుదారీతనం ఉంటుంది. ప్రేమవల్ల కాకపోయినా వ్యాపారం దెబ్బతింటుందన్న భయంవల్లనైనా ఉత్తీర్ణతా శాతం కోసం వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత పడిపోతుందన్న దిగులెందుకు? ప్రైవేటు స్కూళ్ల విధానాలను ఆదర్శంగా తీసుకోవచ్చు కదా!
విద్యావ్యవస్థ లోపాలను సరిదిద్దేందుకు చదువు నేర్వడంలో ఇబ్బందులు విద్యార్థులు ఉన్నతాధికారులకు తెలియచేయాలని, అధికారులు తరచు పాఠశాలలను సందర్శించి సమీక్షించాలని రచయిత సూచించారు. ఇవి ఆచరణసాధ్యం కాదని తెలియదా? పై అధికారుల ఆజ్ఞలకు హుజూర్ అనటం తప్ప ఏమీ చేయలేని అధికారులు ఉన్నప్పుడు విద్యావ్యవస్థలో క్వాలిటీ ఎక్కడ నుంచి వస్తుంది? వ్యవస్థలోని లోపాలన్నిటికీ మాతృభాషలో విద్యాబోధన లేకపోవటమేనని మంచికంటి వారు విశ్లేషించారు. నూటికి ఎనభై శాతం మంది కార్పొరేటు స్కూళ్లలో చదివి సాఫ్ట్‌వేర్, వైద్యవృత్తులలో దూసుకుపోతున్నారు. అక్కడ మాతృభాషలో విద్యాబోధన లేదే! దారిద్య్రరేఖకు దిగువనున్న వారు, దిగువ మధ్యతరగతి వారి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో కనబడటానికి కారణం వారి ఆర్థిక పరిస్థితే తప్ప మాతృభాషపై అభిమానం కాదు. మాతృభాష గురించి ఉపన్యాసాలు దంచే సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారస్తులు తమ పిల్లలను, మనుమలు మనుమరాళ్లను ఇంగ్లీషు మీడియంలో చదివించటానికి కారణం వారి ఆర్థికస్థితి మెరుగుగా ఉండటమే.
అసలు మాతృభాష అన్న పదం గూర్చి మేధావులు, రచయితలు ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ ఉపన్యాసకులు ఉటంకించే మాతృభాష అంటే తమ చిన్నప్పటి మాతృభాష. అంటే యాభై యేళ్లనాటిది. ఇప్పటి పిల్లలది సగం తెలుగు, సగం ఇంగ్లీషు కలగలిసిన భాష. నేటి తరం పిల్లలకు యాభై యేళ్లనాటి తెలుగు మాధ్యమంలో చెప్పటానికి యత్నిస్తే వారు కంగారుపడిపోతారు. దీనర్థం తెలుగు ఉండకూడదు, చచ్చిపోవాలని కాదు. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి కూలంకషంగా పిల్లలకు బోధించటం ఖచ్చితంగా అవసరమే. కాని ఈ తెలుగు జ్వరాన్ని మాధ్యమాలలో, సాంకేతిక పదాలలో సైతం చొప్పించాలనటమే అసలు సమస్య. కింది స్థాయిలో సాంకేతిక పదాలు తెలుగులో నేర్చుకున్న ఈ తరం పిల్లలు పై చదువుల కెళ్లినపుడు దానిని ఇంగ్లీషులో అర్థం చేసుకునేందుకు, తర్జుమా చేసుకునేందుకు ఊహించని యాతన పడాల్సి వస్తుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తును మనం చేజేతులా పాడుచేయటమే.
ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు కనీస సామర్థ్యం లేక విద్రోహులుగా మారకుండా ఉండాలంటే మాతృభాషలో విద్యాబోధనతో బాటు గ్రంథాలయాలు, పుస్తకపఠనం మాత్రమే పరిష్కారాలని చెపుతూ ‘‘ఉపాధ్యాయులు చేయలేని పని గ్రంథాలయం చేస్తుంద’’ని వ్యాసకర్త అన్నారు. గ్రంథాలయాలు మాత్రమే ఏకైక మార్గంగా ఉన్నప్పటి యాభై యేళ్లనాటి గతవైభవాన్ని తలచుకుంటూ నోస్ట్రోలజీలో మునిగితేలే ఒక రిలవెన్స్ లేని అంశం ఇది. నిజానికి ఉపాధ్యాయులు చేయలేని పని చేసేది గ్రంథాలయాలు కాదు యుట్యూబ్‌లు. అందులో ప్రతి పాఠం సూక్ష్మ అంశాలతో సహా విడమరచి చెప్పబడే లెక్కకు మించిన వీడియోలున్నాయి.
పుస్తకపఠనం ఈ తరానికి రుచి చూపించాలనుకోవడం చాలా మంచిది, అవసరం కూడా. అందుకు గ్రంథాలయాలతో పాటు క్లిక్ దూరంలో దొరికే పీడీఎఫ్‌లు, కావల్సిన పుస్తకాలు ఇంటి ముంగిట చేర్చే అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి ఎన్నో ఇతర ప్రత్యామ్నాయాలున్నాయి. ఇలాంటి నవీనయుగంలో యువత శ్రమకోర్చి, సమయం వెచ్చించి సుదూర ప్రాంతంలోని గ్రంథాలయాలకు వచ్చి సమిష్టిగా చర్చించుకుంటూ పుస్తకాల ద్వారా మాత్రమే కెరీర్ అభివృద్ధి చేసుకొనటం సాధ్యమా? సబబా? దీనర్థం గ్రంథాలయాలు మూసివేయాలని కాదు. అనేకానేక ప్రత్యామ్నాయాలలో గ్రంథాలయం కూడ ఒకటి తప్ప, గ్రంథాలయం ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు.
మంచికంటి... మేధావులకు, సాహితీవేత్తలకు జరిగే అనర్థాలను పట్టించుకోవాలని చివర్లో విజ్ఞప్తి చేశారు. అందులో తప్పులేదు. అయితే సమాజంలో జరిగే అనర్థాలకు సగం కారణం ఈ సాహితీవేత్తలే. కాటికి కాళ్లు చాచుకున్న ఓ మాజీ రచయిత, లేదా కవి ప్రధానవక్తగా జరిపే ఈ సభలలో నూటికి తొంభై శాతం ప్రేక్షకులు వృద్ధులు. ఉపన్యాసకులు వయోవృద్ధులు. యువతీయువకులు, పిల్లల మాట అటుంచి ఈ సభలలో కనీసం నలభైయేళ్లు లోపువారు పట్టుమని పదిమంది కూడ ఉండడం లేదు. నేటి తరాన్ని వక్తలుగానో, ప్రేక్షకులుగానో సభలకు ఆహ్వానించి, యువతరంతో తెగిపోయిన లింకును పునరుద్ధరించుకోవటానికి రచయితలు, కవులు ఏ మాత్రం సముఖంగా లేరన్నది బహిరంగ సత్యం.
సెల్‌ఫోన్ చీకటి కమ్మేసింది వాట్సప్ మబ్బులు కమ్ముకున్నాయి అని బాధపడే ముందు సాంకేతికతపై ద్వేషం నుంచి మేధావులు బయటపడాలి. అప్పుడు సెల్‌ఫోన్ కొన్ని వందలమందికి ఆత్మీయుడిగా, ఆప్తుడిగా, విజ్ఞానప్రదాతగా ఉందన్న విషయం తెలుస్తుంది. పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు హోమ్‌వర్క్‌లు, పిల్లల ఎదుగుదల గురించి తల్లిదండ్రులకు సూచనలు వాట్సప్‌ల ద్వారానే ఇస్తున్నారు. ‘సమాజానికి బహిరంగ లేఖ’ అంటూ మంచికంటి రచించిన 56 పేజీల ఒక విలువైన పుస్తకం సెల్‌ఫోన్ల ద్వారా అందులోని వాట్సప్‌ల ద్వారానే దేశవిదేశాలలోని వేలాది మందికి చేరి తెలుగువారందరిలో మంచి పేరు తెచ్చిపెట్టిందన్న విషయం ఆయన మరువరాదు. ఖండించాల్సింది సెల్‌ఫోన్ వినియోగాన్ని కాదు దుర్వినియోగాన్ని.
గత వైభవంగా మిగిలిపోతున్న వ్యవస్థలను చూచి ఎవరికైనా హృదయం కలుక్కుమనటం సహజం. అయితే మార్పు అవసరం, అనివార్యం. అభ్యుదయాలు, అవలక్షణాల సమ్మిళితమైన మార్పును ఆహ్వానించుకుంటూ, దానిలోని అవలక్షణాలు తొలగించుకొని అద్భుతాలు సృష్టించుకోవడమే మన కర్తవ్యం. బాలల అభ్యున్నతికి శ్రమను, ధనాన్ని వెచ్చించిన వ్యక్తిగా మిత్రుడు మంచికంటి వెంకటేశ్వరరెడ్డి అభ్యుదయవాదులలో ముందుంటారు. దానికి అభినందించకుండా ఉండలేం. అలాగని ఆచరణ సాధ్యాసాధ్యాలను సమీక్షించుకోకుండా వెలువరించే ఆయన ఆలోచనలను, అమాయకత్వాన్ని అభిశంసించకుండా కూడా ఉండలేం.
ఆర్.వి. రాఘవరావు
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి