కేశవరెడ్డీ నేనూ మంచి స్నేహితులం అవుతాం అనిపిస్తుంది
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:55 AM
వివేక్ లంకమల రాసిన ‘వలపటెద్దు’ కథా సంపుటి బాగా నచ్చింది. మనిషి చుట్టూ ప్రకృతి అని కాకుండా ప్రకృతిలో, ప్రకృతితో కలిసి మనిషి అనే సందేశం ఈ కథల ద్వారా...
చదువు ముచ్చట
రీసెంట్‌గా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?
వివేక్ లంకమల రాసిన ‘వలపటెద్దు’ కథా సంపుటి బాగా నచ్చింది. మనిషి చుట్టూ ప్రకృతి అని కాకుండా ప్రకృతిలో, ప్రకృతితో కలిసి మనిషి అనే సందేశం ఈ కథల ద్వారా దొరుకుతోంది. మానవ జీవితంలో పశు పక్ష్యాదుల భాగాన్ని చాలా లోతుగా తెలుసుకొని రాసిన కథలు. రాయలసీమ గ్రామీణ జీవితం కూడా డాక్యుమెంట్ అయింది.
మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదివారు?
ఇంటర్మీడియేట్లో ఉన్నప్పుడు స్నేహితుల ద్వారా కొన్ని పుస్తకాల పీడీఎఫ్‌లు దొరికాయి. అప్పటిదాకా పుస్తకాలు అలా పీడీఎఫ్‌లుగా ఉంటాయని కూడా తెలీదు. అలా దొరికిన వాటిలో ‘ఒక గుండె సవ్వడి’ (ముచ్చర్ల రజనీ శకుంతల), ‘ఎంతో మధురమీ స్నేహం’ లాంటి నవలలు చదివినట్టు గుర్తు. ఇప్పుడు ఆ కథలేవీ గుర్తులేవు.
ఒకప్పటికీ ఇప్పటికీ చదివే పద్ధతి ఎలా మారింది?
ఒకప్పుడు ఒక రచయితని ఎంచుకుని ఆ రచయిత పుస్తకాలన్నీ వరుసగా చదివేవాడిని. ఇప్పుడు ఎక్కువగా సమకాలీన రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడానికి వస్తున్న పుస్తకాలన్నీ చదువుతు న్నాను. ఇప్పుడు ఎక్కువగా యాసలో (అన్ని యాసలు) రాసిన పుస్తకాలు చదువుతున్నాను.
కలిసి మాట్లాడాలనిపించే గత కాలం రచయిత?
ఒక్క క్షణం కూడా ఆలో చించకుండా డా. కేశవరెడ్డి అని చెప్తాను. ఆయన ‘స్మశానం దున్నేరు’, ‘సిటీ బ్యూటిఫుల్’ నవలల గురించి, నిజానికి ఆయన అన్ని పుస్తకాల గురించి ఆయనతో మాట్లాడాలి. నేను బీ.టెక్‌లో ఉన్నప్పుడు ‘చివరి గుడిసె’ నవల చదివి ఆయన గురించి వెతికితే లేరని తెలిసింది. కేశవరెడ్డి పుస్తకాల గురించి, ఆయన సృష్టించిన పాత్రల గురించి ఆయనతో మాట్లాడితే మేం మంచి స్నేహితులం అవుతాం అనిపిస్తుంది.
రచన విషయంలో మీకు దొరికిన మంచి సలహా, మీరు ఎప్పుడూ పాటించే నియమం?
ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో గుర్తులేదు: నేను మాత్రమే రాయగలిగిన కథలు మాత్రమే నేను రాయాలి. నేను పాటించే నియమం – కథ వెంట పరిగెత్తకుండా కథ పక్కన కూర్చొని మాట్లాడుతూ రాయాలి. ఎదురుచూడాలి. కథ ఒప్పుకున్నాకే రాయాలి. కొలతలు, లెక్కలు లేకుండా రాయాలి.
మీకు తరచుగా గుర్తొచ్చే వాక్యం/ కవితా పంక్తి?
కాఫ్కా ‘మెటమార్ఫసిస్’ నుండి ‘‘గ్రెగర్ జమ్జా ఒక ఉదయం కలత పెట్టే కలల నుంచి మేల్కొని చూసే సరికి తాను ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉన్నాడు’’ అన్న వాక్యం. ఆ మొదటి వాక్యంతోనే పాఠకుడిని ‘‘ఇప్పుడీ కథ చదవకుండా ఎలా ఉంటావో చూస్తా’’ అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆల్బర్ట్ కాము ‘ది స్ట్రేంజర్’ నవల నుండి ‘‘Mother died today. Or maybe yesterday, I don't know’’ కూడా అలాంటి వాక్యమే.
(మొహమ్మద్ గౌస్ కథ, నవలా రచయిత. ఇప్పటివరకు ‘గాజులసంచి’ కథా సంపుటి; ‘జీరో నెంబర్ 1’, ‘826 కి.మీ’ నవలలు పుస్తకాలుగా వచ్చాయి.)
మొహమ్మద్ గౌస్
సాహిత్యంలో మీకు
ఆల్టర్ ఈగోలా అనిపించిన పాత్ర?
కేశవరెడ్డి ‘సిటీ బ్యూటిఫుల్’ పుస్తకంలోని దేవీదాస్ పాత్ర. వంద శాతం అని చెప్పలేను కానీ, లాక్‌డౌన్‌లో
ఆ పుస్తకం చదివేటప్పుడు చాలా విషయాల్లో ఆ పాత్రతో ఏకీభవించాను. ఆ పాత్ర తన భావాలను వ్యక్తపరిచే విధానం చాలా నవ్వు తెప్పిస్తూ, కోపాన్ని అర్థం చేయిస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వ్యక్తపరిచే విధానం కూడా కారణం అయ్యుండొచ్చు.
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా