ఇస్మాయిల్ మాటతో సాహసించాను
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:52 AM
కవిత్వం నన్ను నేను, నా లోపలి నానో (nano) విశాల, plural బ్రతుకు గమనం కోసం రాశాను. అద్దాల్లేని reflection కోసం కూడా. నీళ్ళు అడుగంటిపోయిన ఎండుదిబ్బల్లో కుంటల్లో ఈత వంటిది కవిత్వం...

నా మొదటి పుస్తకం
సిద్ధార్థ
కవిత్వం నన్ను నేను, నా లోపలి నానో (nano) విశాల, plural బ్రతుకు గమనం కోసం రాశాను. అద్దాల్లేని reflection కోసం కూడా. నీళ్ళు అడుగంటిపోయిన ఎండుదిబ్బల్లో కుంటల్లో ఈత వంటిది కవిత్వం అని తెలిసొచ్చింది, మొదటి కవిత్వం పుస్తకం వేసిన తర్వాతే (1994). ఒక సాయంత్రం గోదావరి ట్రెయిన్ ఎక్కుతూ మా పెద్దన్న కవి ఇస్మాయిల్ తల నిము రుతూ చెప్పిన వాక్యం నన్ను కవిత్వం అచ్చు వెయ్యడానికి ముందుకు తోసింది. ‘‘కవిత్వం నీ స్వంతం కాదు. నీదీ కాదు. అచ్చు వేసి కాలం లోకి విసిరి పారేసి... ట్రెయినెక్కి వెళ్ళిపో’’ అన్న ఇస్మాయిల్ గొంతు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ వాక్యాలే నన్ను ‘దీపశిల’ను అచ్చు వేయడానికి సాహసంతో ముందుకు తోశాయి. దాని కంటే ముందు మునుపటేడులో వరుసగా నాపై కురిసిన విధ్వంస విదారక అనుభవ దినాలు...
రంజని అత్యుత్తమ కవిత్వ పురస్కారాలు. శ్రీ కల్లూరి భాస్కరంగారు, కె. శ్రీనివాస్‌గారు... కవిత్వ ఎంపికల్లోని గ్రూపు రాజకీయాల కుట్రలపై సాహిత్య మాఫియా కదలికల గురించి లక్డీకాపూల్ ఇరానీ హోటల్స్ ఛాయ్ ముచ్చట్లలో చాంద్ బిస్కట్లను ముంచుకుంటూ తిన్న దినాలు, మొదటి పుస్తకం వేస్తందుకు పటం గట్టి ముందుకు తోసినాయి. ‘నెల నెలా వెన్నెల’ కర్త కర్మ క్రియ పూజ్యులు శ్రీ సి.వి. కృష్ణారావు గారి సత్సంగం, సుమనశ్రీ గారి సోపతి అప్పటి అస్తిత్వ రోదనల ఆపతి నన్ను ‘దీపశిల’ వేయటానికి పురికొల్పాయి. నా కవిత్వానుభవ జీవితమ్మీద హిమోహ రాగ సమ్మోహనం చేసిన వడ్డెర చండీదాస్ అంటే ఇష్టం నాకు. బుచ్చిబాబును తన లోనాభిలో చుట్టుకొని తనదైన కవిత్వ వచనాన్ని దిద్దుకొని పాఠకానుభవానికి తాత్త్విక కల్పనను శృతిపరిచిన చండీదాస్‌తో.. నాలుగు మాటలు ‘దీపశిల’ కవిత్వం మీద రాయించాలన్న కోరికను ఎమ్మెస్ నాయుడుతో ఎక్స్‌ప్రెస్ చేసాను. అది వాస్తవమయ్యింది. తిరుపతిలో భవానీపురా లోని అపార్ట్‌మెంట్‌లో వొకే వొక్క గదిలో మంచం మీద స్పైనల్ ఇంజురీకి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ పడుకొని ఉన్న తనని కలిసి నా హైదరాబాదీయతను పంచుకున్నాను.
అనాహతనాద ప్రస్తావన, గీతాదేవి స్వప్నరాగలీనల పాత్రల నా పాఠకానుభవాన్ని పంచుకున్నాను. నా కవిత్వమ్మీద కొన్ని మాటలు రాయమన్నాను. కవిత్వం తనకు అర్థం కాదన్నాడాయన. రెండు మూడు కవితలు చదివాను. అవి వినగానే.. పడుకునే విన్న ఆయన కండ్లల్లోంచి కన్నీళ్ళు వొలికిపోతుండడం ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఇంటికి చేరుకున్న రెండు రోజుల్లోనే ‘మహాహం’గా తన ముందుమాట చేరుకుంది. దానిని తన లిపి లోనే పలకరించాను. మా పాఠకుల అన్న నాళేశ్వరం శంకరం, బోనగిరి ఆంజనే యులు, అసుర తత్త్వకత్వల విచారం, మెరుపుల మలుపులూ, ఏలె లక్ష్మణ్ స్వచిత్రరేఖల గాత్రాలూ, హైద్రాబాదీ ఆబాదీ ఫొటోల జీవ వాద్యకారుడు గోవిందన్నా, నున్నా నరేశ్, పసునూరి శ్రీధర్ బాబూ, ముక్కామల చక్రధర్, చల్లా రామఫణుల కవిత్వ పఠనాల గజల్ ముషాయిరాలూ, హెచ్చార్కేల, ‘గుల్షన్’ స్నేహాల నుంచి, అలా నా కవిత్వ ప్రస్థానం మొదలయింది పయిలంగా అభద్రంగా.. నాపరాళ్ళను పరుసుకుంటూ వేసుకుంటూ, చింతలగతిని గీసుకుంటూ, మోసుకుంటూ, నడిచి నిలిచిందే నా మొదటి పుస్తకం ‘దీపశిల’. దీని కతల కమామీషంతా తెలుగు పాఠకానుభవానికింకా మూసిన కిటికీ రెప్ప అనే తోస్తుంటుంది నాకు.
Cell : 73306 21563
For Telangana News And Telugu News