Honored by Viswanatha: విశ్వనాథ మెచ్చిన తెలుగు ఆత్మీయుడు
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:36 AM
మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ఆహ్వాన సంఘ కార్యాలయం ఏర్పడిన తొలి రోజులు (1974 అక్టోబర్) అవి. ఈ సంఘానికి అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు; కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యా ...
మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ఆహ్వాన సంఘ కార్యాలయం ఏర్పడిన తొలి రోజులు (1974 అక్టోబర్) అవి. ఈ సంఘానికి అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు; కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యా సాంస్కృతిక శాఖామాత్యులు మండలి వెంకటకృష్ణారావు. ప్రముఖ విద్యావేత్త, పాలనాదక్షులు డా॥. పి.యస్.ఆర్ అప్పారావు ప్రధాన కార్యదర్శి. రవీంద్రభారతి మొదటి అంతస్తులో నెలకొల్పిన ఈ సంఘ కార్యాలయం సిబ్బందిలో ఒకడిగా నేను ఉద్యోగంలో చేరాను.
మండలి వెంకటకృష్ణారావుని చూడడం అదే ప్రథమం. వారు విద్యామంత్రిగా ఎంత తలమునకలైనా, పని భారంలో ఉన్నా రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా రవీంద్రభారతిలోని ఈ కార్యాలయానికి వచ్చేవారు. యాభై సంవత్సరాల నిండు వయస్సులో ఉండి, మోచేతులు దాటని పాలనురుగులాంటి తెల్లని ఖద్దరు చొక్కాలో, పంచె చెరగును ఎడమ చేత్తో పైకిలాగి పట్టుకొని, కారు ఆగీ ఆగకముందే, తలుపు తెరుచుకొని చెంగున దూకి ఒక్క ఉదుటన రవీంద్రభారతి మెట్లు ఎక్కే వారి మహోన్నతమైన మూర్తి ఇప్పటికీ నాకు కళ్లకు కట్టినట్లు గోచరిస్తుంది. వారు వస్తే అదొక ప్రభంజనం. వారొచ్చిన ఒక నిమిషం తరువాత వారి వెంట వస్తున్నవారు రొప్పుతూ మెట్లెక్కి వచ్చేవారు. వారి ఎదలోను, వదనంలోనూ ఉత్సాహం పరవళ్లు తొక్కేది. వారి వెనకే వచ్చిన ఉప్పులూరి మల్లికార్జునశర్మ ‘‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’’ అంటూ గళమెత్తి ఒళ్లు పులకరించిపోయే రీతిలో పాట అందుకునేవారు. చేస్తున్న పనిని ఆపుచేయించి, అందరినీ ఆ పాటను శ్రద్ధగా వినమని కోరేవారు మండలివారు. అక్కడ పనిచేస్తున్న మా అందరికీ ‘మేం జీతం కోసం పనిచేయడం లేదు. ఒక మహోన్నత లక్ష్యసాధనకు గాను మా వంతు పాత్ర నిర్వహిస్తున్నాం’ అన్న స్ఫూర్తి కలిగించడమే వారి ఉద్దేశ్యం.
1977 నవంబర్ 19న కోస్తాంధ్రను పెను తుఫాను, ఉప్పెన ముంచి వేసింది. ఈ ఉప్పెన ప్రభావం కృష్ణాజిల్లా దివిసీమపై ఎక్కువగా పడింది. ఆ సమయంలో మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డలోనే ఉన్నారు. తుఫాను, ఉప్పెన ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశారు. గాంధీక్షేత్రం సేవాశ్రమంలో అనాథ బాలురు తుఫాను ధాటికి భయపడి బయటకు వచ్చి గంటకు రెండువందల కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలి ఉధృతికి తట్టుకోలేక కొట్టుకుపోతుంటే ఆయన తన ప్రాణాలకు తెగించి వారిని పొదివి పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుఫాను ఆ రోజంతా కొనసాగింది. మర్నాడు తెల్లవారుఝాముకు తుఫాను ఉధృతి తగ్గగా, టార్చ్‌లైట్ సాయంతో కృష్ణారావు బయటకు వచ్చి చూడగా, అంతా భీభత్సంగా కనిపించింది.
తెల్లవారిన తరువాత కొందరు వ్యక్తులు ఆయన స్వగ్రామమైన భావదేవరాపల్లి నుంచి వచ్చి ఉప్పెన గురించి ఆయనకు తెలియజేశారు. కృష్ణారావు హుటాహుటిన ఉప్పెన తాకిన ప్రదేశాలకు కాలినడకన బయలుదేరారు. దారిపొడవునా చెట్లు విరిగిపడి ఉన్నాయి. రోడ్లన్నీ చిన్నాభిన్నమైపోయాయి. నెమ్మదిగా దారి చేసుకుంటూ కొంత దూరం వెళ్ళగా రోడ్లన్నీ కొట్టుకుపోయి గుంతలు పడ్డాయి. ఆ గుంతలలో నడుము లోతు నీటిలో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్కచేయక ఆయన భావదేవరాపల్లి చేరారు. అక్కడి దృశ్యం చూసి ఆయన గుండె తరుక్కుపోయింది. మొత్తం ఊరు ఊరంతా శవాల దిబ్బగా మారింది. దివిసీమ మొత్తం మీద పదివేల మంది అశువులు బాశారు. లక్షలాది పశువులు ప్రాణాలు కోల్పోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. కృష్ణారావులో నిరాశా నిస్పృహలు ఆవహించాయి. తన మంత్రి పదవికి రాజీనామా ప్రకటించి, శవసేనను ఏర్పాటు చేశారు. ఉన్న మనుషులతో శవాలను తగలబెట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఆయన ఆ విధంగా దివిసీమ ఉప్పెన, తుఫాను బాధితులకు చేసిన సేవ చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయింది.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తమ రామాయణ కల్పవృక్ష కావ్య అవతారికలో తమకు అత్యంత ఆత్మీయులైన కొందరు స్నేహితులను కావ్యశ్రోతలుగా ఎంచుకొన్నారు. వారిలో మండలివారు ఒకరు. వీరి గురించి ప్రస్తావిస్తూ
‘‘ఆయన జూచిన నేనే
యాయన యనిపించె హృదయమందు నదేలో!
ఆయన ప్రకృతియు నా యది
మాయురే యొకజాతి ద్రవ్యమా యనిపించున్’’
అని చెప్పుకొన్నారు. వీరిని కావ్య శ్రోతలుగా ఎంచుకొన్న కారణం వివరిస్తూ, ‘‘సుస్థిరమగు కావ్యమందు కవిచే నిలుపంబడువానిపేరు, సుస్థిరముగ నేల సౌఖ్యము భజించడు వేల్పుల వీడు నందునన్’’ అని చెప్పారు.
డా. గంధం సుబ్బారావు
(రేపు అవనిగడ్డలో మండలి వెంకటకృష్ణారావు శతజయంత్యుత్సవాలు ఆరంభం. సాయంత్రం 6 గం.లకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా ప్రారంభోత్సవ సభ)
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News