Share News

కరోనా మరణాల గుట్టు

ABN , Publish Date - May 21 , 2025 | 05:37 AM

ప్రపంచాన్ని కకావికలు చేసిన కరోనామహమ్మారి హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటి కొన్ని ఆసియా దేశాల్లో మళ్ళీ ప్రభావం చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈదేశాల్లో వందలాది కేసులు నమోదవుతున్నాయని, చైనాలో వ్యాప్తి ఉధృతంగా ఉంటూ, కేసులు...

కరోనా మరణాల గుట్టు

ప్రపంచాన్ని కకావికలు చేసిన కరోనామహమ్మారి హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటి కొన్ని ఆసియా దేశాల్లో మళ్ళీ ప్రభావం చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈదేశాల్లో వందలాది కేసులు నమోదవుతున్నాయని, చైనాలో వ్యాప్తి ఉధృతంగా ఉంటూ, కేసులు వేలసంఖ్యలో ఉంటున్నాయని, ఆస్పత్రుల్లో చేరికలు కూడా హెచ్చుతున్నాయని వింటున్నాం. ఈ వేరియంట్‌ ప్రమాదకారి కాదని, ఆందోళన అక్కరలేదని ఆయా దేశాలు ప్రకటిస్తున్నాయి. భారతదేశంలోనూ మూడునాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతూండటంతో కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగి, దేశవ్యాప్తంగా 257యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని, పరిస్థితి పూర్తినియంత్రణలో ఉన్నదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

కరోనా బాగా బలహీనపడిందని, దగ్గు, జలుబుకు పరిమితమైపోయిందని, వేరియంట్లు, మ్యుటేషన్లు ఇత్యాది పదజాలానికి గతంలో మాదిరిగా వొణికిపోనక్కరలేదని నిపుణులు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ, ఏటా వచ్చిపోతున్నప్పుడల్లా అది కాస్తంత ఆందోళనని కలిగిస్తూనే ఉంది. ఐదేళ్ళక్రితం యావత్‌ ప్రపంచం స్తంభించిపోయిన దృశ్యం సులువుగా చెరిగిపోయేది కాదు. 2020మార్చి పదకొండున ప్రపంచ ఆరోగ్యసంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటిస్తే, అదేనెల 24న భారత ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించి, బహుశా ప్రపంచంలోనే అత్యంత కఠినంగా దానిని అమలుచేసింది. వ్యాపారాలు స్తంభించిపోయాయి, చిన్నాచితకా చితికిపోయారు, ఎక్కడివారక్కడ ఇరుక్కుపోయారు. అంతిమంగా ఎన్ని అడ్డుగోడలు కట్టినా మహమ్మారి వ్యాప్తినీ, ప్రభావాన్ని నిలువరించలేకపోయాం. ఆ ఏడాది దాదాపు లక్షన్నర మరణాలు నమోదైనాయి. ఇక, డెల్టావేవ్‌ రూపంలో అత్యంత ప్రమాదకరమైన దాని రెండవ రాకడ మన ఆరోగ్యవ్యవస్థలను కుప్పకూల్చింది. ఆక్సిజన్‌ కోసం, ప్రాణాధారమైన మందులకోసం జనం గగ్గోలెత్తిపోయారు. ఆత్మీయుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్నారు, ప్రైవేటు ఆస్పత్రుల నిలువుదోపిడీకి గురైనారు. ఆ డెల్టావేవ్‌లో మృతుల సంఖ్య ౩.32లక్షలని ప్రభుత్వం ప్రకటించింది.


కొవిడ్‌ మరణాలపై, అప్పటి క్షేత్రస్థాయి వాస్తవాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాపరికం పాటించాయన్నది కాదనలేని నిజం. భారతదేశంలో 47లక్షలమంది కరోనాతో మరణించారని మూడేళ్ళక్రితం ప్రపంచబ్యాంకు నివేదిక పేర్కొన్నప్పుడు ఆ లెక్కలను ఖండించి, ఆ సంస్థ అనుసరించిన విధానాన్ని మన ప్రభుత్వం తప్పుబట్టింది. మునుపటి సంవత్సరాలతో పోలుస్తూ, ప్రస్తుత ఏడాదిలో అదనంగా సంభవించిన మరణాల ఆధారంగా కరోనా మరణాలెన్నో చెప్పడం సరికాదనుకున్నప్పటికీ, మహమ్మారి స్థాయిని, అధికశాతం మరణాలను ఇది పట్టిస్తుందన్న మాట నిజం. కానీ, 2020 జనవరి 1నుంచి 2021 డిసెంబరు 31వరకూ ౪.81లక్షలమంది మరణించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా చెబుతూంటే, ఈ నివేదికలో మరణాల సంఖ్య అంతకు పదింతలు ఉండటం, ప్రపంచవ్యాప్త కరోనా మరణాల్లో ౮0శాతం ఒక్క భారతదేశంలోనే చోటుచేసుకున్నాయని అనడం మనకు నచ్చలేదు. లాన్సెట్‌ సహా దాదాపు నాలుగు స్వతంత్ర, గ్లోబల్‌ స్థాయి అధ్యయనాలు ప్రభుత్వ అధికారిక లెక్కలకంటే ఏడునుంచి పదిరెట్ల కరోనా మరణాలను ప్రకటించిప్పుడల్లా ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో, సివిల్‌ రిజిస్ట్రేషన్‌ డేటా ఆధారంగా ఇటీవల వెలుగుచూసిన మరణాల లెక్కల్లో డెల్టావైరస్‌ కాలంలో 21. 5లక్షలు అదనంగా ఉన్నట్లుగా తేలడం ఆశ్చర్యం కలిగించడం లేదు. మరణాలను తక్కువగా చూపడంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు తొలిస్థానాల్లో ఉన్నాయి. మహమ్మారిపై మహాయుద్ధం చేశామని చెప్పుకోవడానికి కేంద్రరాష్ట్రాలు దాచిపెట్టిన రహస్యం ఇది.


రోగవిస్తృతి, ప్రభావం ఇత్యాది అంశాల్లో దాపరికం పాటిస్తే, ఆ రోగంమీదే కాదు, భవిష్యత్తులో వచ్చిపడే ఆ తరహా మహమ్మారులమీద సైతం యుద్ధం చేయలేం. ఏ దేశమూ ఒంటరిగా ఉండలేని ఈ ఆధునిక కాలంలో సరికొత్త వాక్సిన్ల తయారీ సహా ప్రపంచస్థాయి ఉమ్మడిపోరాటం విజయవంతం కావాలంటే ప్రతి దేశమూ నిజాయితీగా వ్యవహరించాల్సిందే. ప్రమాదం లేదు, ప్రశాంతంగా ఉండండి అని సామాన్యుడికి భరోసా ఇవ్వడం అవసరమే. కానీ, పాలకులు వాస్తవాలు దాస్తున్నారని వారికి తెలిసినప్పుడు మరింత భయం కలుగుతుంది, అనుమానాలు పెరుగుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 05:37 AM