Hamass October 7 Gamble: హమాస్ క్షణం ఆలోచించాల్సింది
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:42 AM
2023 అక్టోబరు 7వ తేదీ... ఇజ్రాయెల్‌పైకి వేల క్షిపణులు ప్రయోగించే ముందు హమాస్ ఒక్క క్షణం ఆలోచించాల్సింది... ‘నాది’ అని ఇజ్రాయెల్ చెప్పుకొంటున్న భూభాగంలోకి ప్రవేశించేముందు ఒక్క క్షణం ఆలోచించాల్సింది...
2023 అక్టోబరు 7వ తేదీ... ఇజ్రాయెల్‌పైకి వేల క్షిపణులు ప్రయోగించే ముందు హమాస్ ఒక్క క్షణం ఆలోచించాల్సింది... ‘నాది’ అని ఇజ్రాయెల్ చెప్పుకొంటున్న భూభాగంలోకి ప్రవేశించేముందు ఒక్క క్షణం ఆలోచించాల్సింది... వేల మందిని చంపి, వందల మందిని బందీలుగా పట్టుకున్నామనే ఆనందం పొందేముందైనా ఒక్క క్షణం ఆలోచించాల్సింది... ‘ఈ రోజు మాదే! మరి... రేపు ఏమవుతుంది?’ అని హమాస్ తమలో తాము ప్రశ్నించుకోవాల్సింది! అదే జరిగి ఉంటే... నేడు గాజా ఒక శిథిలాల దిబ్బలా మారేది కాదేమో! రెండేళ్లుగా రక్తమోడుతూ విలపించేది కాదేమో! ఏడ్పులు, ఆర్తనాదాలు వినిపించేవి కావేమో! ‘పాలస్తీనా ఎవరిది? ఇజ్రాయెల్ దురాక్రమణదారా? కాదా? న్యాయం ఎటువైపు ఉంది?’ అనే ప్రశ్నలకు ఎవరి సమాధానాలు వారివి. కానీ... ఇజ్రాయెల్ ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఆ దేశ పాలకుడు ఎంత మొండివాడో కూడా తెలుసు. ‘మా పౌరుల్లో ఒక్కరిని చంపితే... మిమ్మల్ని వందమందిని చంపుతాం. మాపై ఒక్క రాకెట్ వదిలితే... వెయ్యి బాంబులతో విరుచుకుపడతాం!’ అనేదే ఇజ్రాయెల్ సిద్ధాంతం! లక్ష్యంగా ఎంచుకున్న ‘శత్రువు’ పాతాళంలో ఉన్నా వెంటాడి, వేటాడి వధించే తత్వం వాళ్లది. కాలం మారుతోంది కానీ... ఈ సిద్ధాంతంలో ఇసుమంత మార్పూ లేదు. ఇది ప్రపంచానికి తెలుసు! మరి... హమాస్‌కు తెలియదా? ఒక్కరోజు అవకాశం దక్కిందని కంచెలు తెంచుకుని ఇజ్రాయెల్‌లోకి దూకుడుగా వెళ్లడం ఎంత ‘ముప్పో’ తెలియదా? తాము వదిలే వందల రాకెట్లకు బదులుగా ఎన్ని వేల బాంబులు మీద పడతాయనేది ఊహించలేకపోయిందా? హమాస్ ఒక్కరోజు పొందిన ‘వెర్రి ఆనందానికి’ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నది ఎవరు? ‘శత్రువు’కు తనదైన విస్తృత అర్థాన్ని కల్పించుకుని...
జాలి, దయ, మానవత్వాన్ని మూటగట్టి మంచెపై పెట్టిన ఇజ్రాయెల్ రక్కసి పంజాకు బలి అవుతున్నదెవరు? ముందు హమాస్ స్థావరాలు, ఆ తర్వాత ప్రభుత్వ భవనాలు, ఆపై పాఠశాలలు, ఆస్పత్రులు, నిరాశ్రయుల శిబిరాలు... ఇజ్రాయెల్ గురికి అన్నీ శిథిలాలే! ‘గాజా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి. సహాయ సామగ్రీ అందడం లేదు. గాజా ఇప్పుడు ఆకలి దప్పులతో అల్లాడుతోంది. సంక్షోభం ఇంతలా ముదిరి... డొక్కలు ఎండి, కన్నీళ్లూ ఇంకి, ఎముకలు తేలిన చిన్నారుల చిత్రాలు ప్రపంచాన్ని కలిచి వేస్తున్నాయి కానీ... ఇజ్రాయెల్‌ను కాదు! ఇజ్రాయెల్ ‘మొస్సాద్’కు ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన నిఘా వ్యవస్థగా పేరుంది. పాలస్తీనా వైపు నుంచి ఒక్క రాకెట్ గాల్లోకి లేచినా... దుర్భేద్యమైన ఇజ్రాయెల్ గగన రక్షణ వ్యవస్థ (ఐరన్ డోమ్) అడ్డుకుంటుంది. మరి... 2023 అక్టోబరు 7వ తేదీన ‘అలా ఎందుకు జరిగింది?’ అది యూదులకు సెలవుల కాలం! ఇజ్రాయెలీలు విహారాల్లో మునిగి తేలుతున్నారు. గాజాకు బాగా సమీపంలోని రీఇమ్‌లో భారీ సంగీతోత్సవం ఏర్పాటు చేశారు. అలాంటి సమయంలో... హమాస్ నుంచి ఎలాంటి ముప్పూ ఊహించకుండా ‘మొస్సాద్’ మొద్దు నిద్రపోతోందా? హమాస్ దాడిని ఊహించలేదా? లేక... ‘గాజా’ను మట్టిపాలు చేసేందుకే వాళ్లకు ఒక అవకాశమిచ్చిందా? ఏం జరిగిందో చెప్పలేం! కానీ... పాలస్తీనాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్‌కు ఒక ‘కారణం’ దొరికింది. ‘అందివచ్చిన అవకాశం’ అంటూ గాజాలో ఒక్కో అంగుళాన్నీ ధ్వంసం చేస్తోంది. హమాస్ దాడిలో 1500 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించినట్లు అంచనా. అయితే... దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఈ ఏడాది జనవరికే గాజాలో 70వేల మంది మరణించినట్లు ఒక స్వతంత్ర అధ్యయనం పేర్కొంది. వీళ్లంతా తుపాకులు పట్టిన ఉగ్రవాదులు కాదు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, సామాన్యులే. ‘యునిసెఫ్’ అంచనా ప్రకారం... గాజా స్ట్రిప్‌లో 2023 అక్టోబరు నుంచి ఇప్పటిదాకా 50వేల మందికి పైగా పిల్లలు మరణించడమో, క్షతగాత్రులు కావడమో జరిగింది! వాళ్లు చేసిన పాపం ఏమిటి? ఇజ్రాయెల్ ఇప్పుడు దేన్నీ వదిలిపెట్టడంలేదు.
ఆస్పత్రులు, పాఠశాలలు, సహాయ శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాలు.... దేన్నీ, దేన్నీ వదిలిపెట్టడం లేదు. సంక్షుభిత గాజాకు బాహ్యప్రపంచం నుంచి సహాయం నిలిచిపోయింది. పాలస్తీనీయులను చంపేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేకంగా బాంబులు, బుల్లెట్లు వాడక్కర్లేదు. ఆకలిదప్పులతో వాళ్లంతట వాళ్లే చనిపోతారు! ఇది ఆధునిక మానవ చరిత్రలో అత్యంత విషాదంగా నిలిచిపోతుంది! 2023 అక్టోబరు 7న హమాస్ చర్య ఇజ్రాయెల్‌పై యుద్ధ ప్రకటనే! కానీ... ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు హమాస్ సిద్ధపడే, సర్వసన్నద్ధమయ్యే ఈ యుద్ధానికి దిగిందా? ఇజ్రాయెల్‌తో పోల్చితే హమాస్ బలమెంత? సాయుధ సంపత్తిలో తన స్థానమేది? అంతర్జాతీయ స్థాయిలో అండగా ఉండేదెవరు? ఇవన్నీ ఆలోచించకుండానే హమాస్ యుద్ధ ప్రకటన చేసేసింది. పాలస్తీనాకు దౌత్యపరమైన మద్దతు ఇచ్చే దేశాలే తప్ప... యుద్ధంలో అండగా నిలిచే వారెవరూ లేరు. ‘సేవ్ పాలస్తీనా’ నినాదాలు... అంతర్జాతీయంగా పాలస్తీనీయులకు సంఘీభావంగా జరిగే నిరసన ప్రదర్శనలు, సోషల్ మీడియా పోస్టులతో గాజాలోని సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. శత్రువు బలాన్ని అంచనా వేయకుండా మీసంమెలేసి తొడగొట్టడం, రాళ్లేసి రెచ్చగొట్టడం... స్వీయహాని చేసుకోవడమే! తప్పొప్పుల సంగతి పక్కనపెడితే... ఇలాంటి విషయాల్లో లౌక్యమూ, సంసిద్ధతా అవసరమే. హమాస్ దూకుడు వల్ల ఆ సంస్థకు జరిగిన నష్టమెంతో కానీ... ‘గాజా’ మాత్రం ధ్వంసమైపోయింది. పాలస్తీనా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే హక్కు హమాస్‌కు లేదు. హమాస్‌ను నిర్మూలించే పేరుతో సామాన్యులను బలి తీసుకునే అధికారం ఇజ్రాయెల్‌కూ లేదు. కనికరమన్నది లేని ఇజ్రాయెల్ పాలకుడు సంపూర్ణ నాశనం చేసేదాకా వదిలిపెట్టేలా లేడు! ప్రపంచ దేశాలు పట్టించుకోవడం లేదు. ఐక్యరాజ్యసమితి మాటకు విలువ లేదు. మరి... ఈ వినాశనం ఆగేదెన్నడు? ఆపేదెవ్వరు? తప్పు ఎవరిది?
తొమ్మండ్రు సురేష్‌కుమార్
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News