Gandhi Versus Lenin: గాంధీ పథమా? లెనిన్ మార్గమా?
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:25 AM
అహింసా ప్రవక్త మహాత్ముడు, అక్టోబర్ విప్లవ నిర్మాత లెనిన్ చింతనా ధోరణులలోని తారతమ్యాలను నిశితంగా విశ్లేషించిన, సాదృశ్యాలను ఎత్తిచూపిన వంద సంవత్సరాల నాటి ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని...
అహింసా ప్రవక్త మహాత్ముడు, అక్టోబర్ విప్లవ నిర్మాత లెనిన్ చింతనా ధోరణులలోని తారతమ్యాలను నిశితంగా విశ్లేషించిన, సాదృశ్యాలను ఎత్తిచూపిన వంద సంవత్సరాల నాటి ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని నేను ఇటీవల చదివాను. ‘లెనిన్ అండ్ గాంధీ’ అనేది ఆ పుస్తకం శీర్షిక. గ్రంథకర్త ఆస్ట్రియన్ రచయిత, చరిత్రకారుడు రెనే ఫ్యులోప్ మిల్లర్ (1891 –1963). తొలుత ఫ్రెంచ్ భాషలో ప్రచురితమైన ఈ పుస్తకం 1927లో ఆంగ్లంలోకి అనువదితమయింది.
గాంధీ, లెనిన్‌లు సమకాలికులు. ఆరునెలల తేడాతో వారు ఈ ప్రపంచంలోకి ప్రవేశించారు. ఇరువురూ మధ్యతరగతి కుటుంబాలలో జన్మించారు. పేదరికం, అన్యాయాల నుంచి మానవకోటిని విముక్తం చేయాలనే ప్రగాఢ ఆకాంక్ష వారి జీవితాలను విలక్షణంగా నడిపించింది. లెనిన్ తన రచనలలో కనికరం లేని కఠిన వాదనలు చేసేవారు. గాంధీ ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ చాలా నాగరీకంగా వ్యవహరించేవారు. మరో ముఖ్యమైన తేడా– లెనిన్ హింసను ఆరాధించి హింసాత్మక పద్ధతులను అనుసరించారు. అహింసకు అంకితమయిన ఉదాత్తుడు గాంధీజీ. మనసా వాచా కర్మణా అహింసావాది.
నాకు తెలిసినంతవరకు గాంధీ, లెనిన్‌ల భావజాలాలను తులనాత్మకంగా పరిశీలించిన తొలి రచయిత బొంబాయి కమ్యూనిస్టు శ్రీపాద్ అమృత్‌డాంగే (1899–1991). 1921లో ఆయన ‘గాంధీ వర్సెస్ లెనిన్’ అనే ఒక చిన్న పుస్తకాన్ని రాశారు. ఈ కమ్యూనిస్టు సహజంగానే గాంధీ కంటే లెనిన్ వైపే మొగ్గారు. అయితే తన స్వదేశీయుడి భావాలు, ఆలోచనల పట్ల ఆసక్తి, సానుభూతిని నిలుపుకున్నారు. ‘గాంధీ, లెనిన్ సిద్ధాంతాలు ఆచరణాత్మక జీవితంలో సాకారమవ్వడం అసాధ్యం’ అని డాంగే వ్యాఖ్యానించారు.
డాంగే పుస్తకం వెలువడిన నాలుగు సంవత్సరాలకు హ్యారీ వార్డ్ (1873–1960) అనే అమెరికన్ మెథడిస్ట్ క్రైస్తవ పండితుడు 1925 ఏప్రిల్‌లో ‘ది వరల్డ్ టుమారో’ అనే జర్నల్‌లో ‘లెనిన్ అండ్ గాంధీ’ అనే వ్యాసాన్ని రాశారు. గాంధీ, లెనిన్ ఇరువురూ తమ మధ్యతరగతి నేపథ్యాన్ని అధిగమించి, తమ నిరాడంబర జీవనశైలుల ద్వారా సామాన్య మానవులతో తాదాత్మ్యమయ్యారని వార్డ్ పేర్కొన్నారు. వారి మధ్య వ్యత్యాసాలను వివరిస్తూ పీడకుల ఆధిపత్యాన్ని వారి హింసాత్మక పద్ధతులను మరింతగా అనుసరించడం ద్వారానే అధిగమించగలమని లెనిన్ విశ్వసించగా, ప్రత్యామ్నాయ పద్ధతులలో పీడకులపై విజయం సాధించగలమని గాంధీ భావించారు, ఆచరించారు’ అని వ్యారీ వార్డ్ రాశారు. లెనిన్, గాంధీల భావాలు, ఆదర్శాలు వారి వారి దేశాల చరిత్రలను మార్చడమే కాకుండా ప్రపంచ చరిత్రను మలుపు తిప్పాయని వార్డ్ అభిప్రాయడ్డారు.
1927లో ‘గాంధీ అండ్ లెనిన్’ను ప్రచురించిన రెనే మిల్లర్‌కు డాంగే, వార్డ్ రచనల గురించి తెలిసి ఉండే అవకాశం లేదు. అయితే ఆయన కూడా మొదటి ఇరువురు అభిప్రాయపడినట్టుగానే లెనిన్, గాంధీలు చరిత్ర గతిని మార్చివేశారని సునిశ్చితంగా విశ్వసించారు. రష్యాలో కార్మికులు, కర్షకుల మధ్య దృఢమైన, నిర్మాణాత్మక సంబంధాలను పెంపొందించేందుకు లెనిన్, భారత్‌లో హిందువులు–ముస్లింల మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పేందుకు గాంధీ అనితర సాధ్యమైన కృషి చేశారని మిల్లర్ పేర్కొన్నారు. దోపిడీకి తావులేని వర్గరహిత సమాజాన్ని స్థాపించడమనే లక్ష్యసాధనకు హింసాత్మక పద్ధతులను అనుసరించడం మినహా మరో మార్గం లేదని లెనిన్ విశ్వసించగా, ప్రతికూల పరిస్థితులలోనూ అహింసాత్మక, ప్రేమ పద్ధతులలో గాంధీ తన వ్యక్తిగత, రాజకీయ ప్రత్యర్థులపై పోరాడి చరిత్రాత్మక ఫలితాలు సాధించారని మిల్లర్ పేర్కొన్నారు.
హ్యారీ వార్డ్ వ్యాసం వెలువడిన ఒక సంవత్సరం అనంతరం, రెనే మిల్లర్ పుస్తకం ప్రచురణకు ఒక ఏడాది ముందు, అంటే 1926లో ఫిలిప్ స్ప్రాట్ (జననం 1902) అనే బ్రిటిష్ యువ కమ్యూనిస్టు భారత్‌కు వచ్చారు. ఈ దేశంలో కమ్యూనిస్టు విప్లవాన్ని పురిగొల్పడమే అతడి రాక లక్ష్యం. ఆస్ట్రియన్ మిల్లర్, అమెరికన్ వార్డ్ వలే స్ప్రాట్ రచయిత కాదు. అయితే లెనిన్ బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్న క్రియాశీల వ్యక్తి. రెండు సంవత్సరాల పాటు భారత ఉపఖండమంతటా ఈ యువ కార్యకర్త పర్యటించారు. భారతీయ విప్లవకారులతో సంబంధాలను నెలకొల్పుకున్నారు. విప్లవ సాధ్యతకు గల అవకాశాలను చాలా నిశితంగా పరిశీలించారు. 1929 వేసవిలో స్ప్రాట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర భారతీయ కామ్రేడ్లతో పాటు అతడినీ మీరట్ కుట్రకేసులో ముద్దాయిగా కోర్టు బోనులో నిలబెట్టారు. దాదాపు ఒక దశాబ్దం పాటు స్ప్రాట్ జైలు జీవితం గడిపారు. కారాగారవాసంలో భారతదేశ చరిత్ర, తాత్విక సంప్రదాయాలు, సాహిత్యం విస్తృతంగా అధ్యయనం చేశారు. అంతకు ముందు ఇవన్నీ అతడికి పెద్దగా అవగాహన లేని అంశాలు. ఈ ప్రగాఢ అధ్యయనం మూలంగా లెనినిస్టు భావజాలం ఒకప్పుడు తనను అనుమతించినదానికంటే ఎక్కువ సహానుభూతితో గాంధీని అర్థం చేసుకునేందుకు స్ప్రాట్ ప్రయత్నించారు. జైలు నుంచి విడుదల అయిన వెంటనే సేవాగ్రామ్ వెళ్లి గాంధీజీని దర్శించారు. అనేక అంశాలపై మహాత్ముడితో మాటా మంతీ జరిపారు. ఆ సంభాషణల స్ఫూర్తితో పాటు గాంధీజీ రచనల నిశిత అధ్యయనం ఆధారంగా ఆ మహోన్నత భారతీయుని చింతనా ధోరణి, భావ విశిష్టత గురించి ‘Gandhism : An Analysis’ అనే పుస్తకాన్ని స్ప్రాట్ రాశారు. లెనిన్ విప్లవ తాత్త్వికత, గాంధీ మానవతా దార్శనికత మధ్య సమన్వయం సాధించేందుకు స్ప్రాట్ ప్రయత్నించారు. ‘గ్రామీణ భారతదేశంలో ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితులలో కోట్లాది ప్రజలను అనివార్యమైన దానికంటే ఒక్కరోజు పాటు అదనంగా వదిలివేసినా నేరం అవుతుంది. విదేశీ దురాక్రమణల ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రష్యన్లు మరింతగా దారిద్ర్యంలో కునారిల్లవలసి ఉన్నది. పాలనలో, సమాజ నిర్మాణంలో క్రూర పద్ధతులను అనుసరించవలసి ఉన్నది. సంప్రదాయ సోషలిజం అటువంటి ఆస్వాభావిక పాలనా పద్ధతులకు పాల్పడకుండా సంయమనం వహించగలిగితే అది తప్పకుండా ఒక అర్ధ శతాబ్ది కాలంలో భారత్‌ను– అశేష జనులు మరింత సుఖసంతోషాలతో జీవించగల నెలవుగా మార్చివేయగలదు’ అని ఫిలిప్ స్ప్రాట్ రాశారు.
ఒక మార్క్సిస్టుగా జైలుకు వెళ్లిన ఫిలిప్ స్ప్రాట్ అస్పష్టమైన కొత్త ఆలోచనలతో స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు. లెనిన్, గాంధీ భావజాలాల్లో దేనివైపూ పూర్తిగా మొగ్గకుండా ఒక మధ్యేమార్గాన్ని అన్వేషిస్తూ మానవేంద్రనాథ్‌రాయ్ స్ఫూర్తి కేంద్రంగా ఉన్న మేధావుల బృందంలో చేరారు. లెనిన్‌కు మాజీ సహచరుడు, గాంధీ విమర్శకుడు అయిన రాయ్ రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ప్రచురించే ‘ఇండిపెండెంట్ ఇండియా’ పత్రికకు ఆయన ప్రధాన సంపాదకుడు. 1941లో భారతీయ మహిళను వివాహం చేసుకున్న ఫిలిప్ స్ప్రాట్ బెంగళూరులో స్థిరపడ్డారు. గాంధీజీపై రాసిన ఒక వ్యాసాన్ని ఇండిపెండెంట్ ఇండియా పత్రికకు పంపించారు. అయితే గాంధీ ఆలోచనల పట్ల మితిమీరిన సానుభూతి చూపిందనే కారణంతో రాయ్ ఆ వ్యాసాన్ని ప్రచురించడానికి తిరస్కరించారు. ఆ వ్యాసం లిఖిత ప్రతి ఆనాడే కనుమరుగయింది. అయితే అందులోని అంశాలను అవగాహన చేసుకునేందుకు రాయ్‌కు స్ప్రాట్ రాసిన ఒక లేఖ దోహదం చేస్తుంది. ‘స్వావలంబనకు, ప్రజా వ్యవహారాలలో నిజాయితీకి గాంధీ ప్రాధాన్యమిస్తున్నారు. తనతో ఏకీభవించని వారికి సహకరించే ఉదారస్వభావం ఆయనకు ఉన్నది. కుల మత సంకుచితత్వాలకు పోకుండా విశాల భావాలతో నిర్ణయాలు తీసుకునే ఉదాత్తుడు గాంధీ’ అని స్ప్రాట్ రాశారు. ‘స్వాతంత్ర్యానికి అర్హమైన దేశం (సోషలిజానికి అర్హమైన దేశమని నేను అనడం లేదు)గా భారత్‌ను గాంధీ తీర్చిదిద్దుతున్నారు’ అని రాస్తూ ‘బూర్జువా ప్రజాస్వామ్యం గురించి లెనిన్ ‘పొరపాటు’ అభిప్రాయాన్ని’ ఆయన ప్రస్తావించారు.
‘బూర్జువా ప్రజాస్వామ్యం ఒక సంపూర్ణ వంచన అని, విప్లవ లక్ష్యాల సాధనకు దానిని ఉపయోగించుకోవచ్చు గానీ దానికదే ఎటువంటి ఉన్నత లక్ష్యాలను సాధించలేదని’ లెనిన్ అభిప్రాయపడినట్టు స్ప్రాట్ పేర్కొన్నారు. దీనిపై ఆయన ఇలా వ్యాఖ్యానించారు: ‘నిజానికి బూర్జువా ప్రజాస్వామ్యం ఒక సార్థక విజయం. దాని ప్రధాన లక్షణాలు అయిన రాజకీయ ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛలు, ఆలోచనా స్వాతంత్ర్యం మొదలైనవాటిని పరిరక్షించుకోకపోతే సోషలిస్టు సమాజ నిర్మాణానికి ఎటువంటి దోహదం జరగదు’. లోపభూయిష్ఠమైనదే అయినప్పటికీ అది మానవ అనుభవాల వైవిధ్యాన్ని గౌరవిస్తూ వాటిని పెంపొందిస్తుందని, విమర్శలను అనుమతిస్తుందని బూర్జువా ప్రజాస్వామ్యానికి ఫిలిప్ స్ప్రాట్ జేజేలు పలికారు. ఆయన ఈ హర్షధ్వానాలు వ్యక్తం చేసిన ఎనభై సంవత్సరాల అనం తరం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రతీపశక్తుల ముట్టడిలో ఉన్నాయి. ట్రంప్ ఏలుబడిలోని అమెరికా, విక్టర్ ఓర్బాన్ పాలనలోని హంగరీ, నెతన్యాహూ నేతృత్వంలోని ఇజ్రాయెల్, ఎర్డోగాన్ సారథ్యంలోని తుర్కియే, మరీ ముఖ్యంగా మోదీ భారత్‌తో రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తికి ఎనలేని అపకారం జరుగుతోంది. ఈ దేశాల నిరంకుశ పాలకులు పరిస్థితులను పూర్తిగా తమ పార్టీలకు సానుకూలం చేసేందుకు ప్రజాస్వామిక విలువలు, సంప్రదాయాలను కాలరాస్తున్నారు. అయితే ఈ శోచనీయ ప్రజాస్వామిక తిరోగమనానికి సరైన సమాధానం లెనినిస్ట్ తరహా విప్లవం కానేకాదు. ఎందుకంటే అది నిరంకుశ ఏకపార్టీ పాలనకే తప్పకుండా దారితీస్తుంది. సుపరిపాలనను సమకూర్చుకోవడంలో మానవాళి సాధించిన అత్యంత విలువైన విజయమే ‘బూర్జువా ప్రజాస్వామ్యం’ వెలుగొందేందుకు తోడ్పడిన స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ స్వతంత్ర సివిల్ సర్వీస్ తదితర రాజ్యాంగ వ్యవస్థల, సంస్థల పురుజ్జీవానికి, నవీకరణకు పూనుకోవాల్సిన అవసరమున్నది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..