MGNREGA Dilution: హే రామ్ పని హక్కు పాలకుల దయా
ABN , Publish Date - Dec 19 , 2025 | 02:24 AM
ఇది భారతీయ ప్రజాస్వామ్యానికి పాడు కాలం. మరీ ముఖ్యంగా గ్రామీణ పేదలకు చెడురోజులు దాపురించాయి. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (క్లుప్తంగా ఉపాధి హామీ) స్థానంలో మోదీ...
ఇది భారతీయ ప్రజాస్వామ్యానికి పాడు కాలం. మరీ ముఖ్యంగా గ్రామీణ పేదలకు చెడురోజులు దాపురించాయి. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (క్లుప్తంగా ఉపాధి హామీ) స్థానంలో మోదీ ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ (క్లుప్తంగా జీ రామ్ జీ) బిల్లును ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లు, చట్టబద్ధమైన పనిహక్కును కేంద్ర ప్రభుత్వ సంకల్పంపై ఆధారపడ్డ ఒక విచక్షణాయుతమైన సహాయంగా తగ్గించివేసింది. హక్కు ఆధారిత పథకంను కూల్చివేసి దాని స్థానంలో నియంత్రిత ఉపాధి పథకాన్ని ప్రతిపాదించింది. రాజ్యాంగ విలువలు అయిన హుందా, జీవనోపాధి భద్రత, వికేంద్రీకరణను నిర్ణయాత్మకంగా కుదించివేసింది.
మహాత్మాగాంధీ మరొకసారి ఒక గాడ్సే చేతుల్లో ప్రతీకాత్మకంగా హతమయ్యారు. చట్టబద్ధమైన ప్రజల హక్కును రూపుమాపి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే, నిర్వహించే పథకాన్ని ప్రవేశపెట్టడం యాదృచ్ఛిక పరిణామం కానేకాదు. ‘ఉపాధి హామీ’ పట్ల చాలా కాలంగా చూపుతున్న వ్యతిరేకతకు పరాకాష్ఠే జీ రామ్ జీ బిల్లు. ఈ వ్యతిరేకత 2014లోనే వ్యక్తమయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పార్లమెంటులో ‘ఒక మహావైఫల్యం’గా ‘ఉపాధి హామీ’ని కొట్టివేశారు. తదాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ, లబ్ధిదారులకు వేతనాల చెల్లింపును జాప్యం చేస్తూ, టెక్నోక్రాటిక్ నియంత్రణలు విధిస్తూ ఇత్యాది చర్యలతో ఆ సంక్షేమ పథకాన్ని క్రమంగా నిరర్థకం చేస్తూ వస్తోంది. డిమాండ్ ఆధారిత ‘ఉపాధి హామీ’ పథకాన్ని బలహీనపరిచేందుకు ఒక దశాబ్దం క్రితం ప్రారంభమైన ప్రయత్నాలు ‘జీ–రామ్–జీ’ బిల్లుతో పరిపూర్తి అయ్యాయి, సందేహం లేదు.
‘ఉపాధి హామీ’ పరివర్తనాత్మక శక్తికి, గ్రామీణ జీవనంలో అది సాధించిన మౌలిక మార్పులకు నేను ప్రత్యక్ష సాక్షిని. 2 ఫిబ్రవరి 2006న అనంతపూర్ జిల్లాలో ‘ఉపాధి హామీ’ని నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తొట్టతొలుత ప్రారంభించినప్పుడు నేను అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నాను. ఉపాధిని డిమాండ్ చేసే హక్కు, సకాలంలో వేతనాల చెల్లింపును డిమాండ్ చేసే హక్కు, వేతన చెల్లింపుల్లో జాప్యం జరిగిన పక్షంలో నష్టపరిహారం కోరే హక్కు, పనుల కేటాయింపు వాటి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే హక్కు మొదలైనవి ‘ఉపాధి హామీ’ చట్టంలో ప్రధానాంశాలు. ఈ హక్కులను సంపూర్ణంగా గౌరవించే వ్యవస్థాగత నిర్మాణాలకు రూపకల్పన చేయడం నా ఉద్యోగ విధులకు ఒక సవాల్ అవడమే కాకుండా ఒక పరిపూర్ణ సంతృప్తిని కల్పించిన విధ్యుక్తధర్మ నిర్వహణ అది.
ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఉపాధి హామీ పథకం ప్రభావశీలత స్పష్టంగా గోచరమయింది. నాటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలోను సామాజిక తనిఖీల వ్యవస్థీకరణ గ్రామీణ శ్రామికుల సాధికారతకు విశేషంగా దోహదం చేసింది. ఆ శ్రామికులలో అత్యధికులు పేదలు, మహిళలు. అయినా ‘ఉపాధి హామీ’ తమకు కల్పించిన సాధికారతతో వారు అధికారులను ప్రశ్నించారు, అవినీతిని బహిర్గతం చేశారు, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం అపూర్వంగా అమలయింది. తత్ఫలితంగా సామాన్య పౌరులు స్థానిక పాలనా నిర్ణయాలను ప్రభావితం చేశారు. నిజమైన స్వపరిపాలనను సాధించుకున్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ‘ఉపాధి హామీ’కి ఎటువంటి మినహాయింపులు లేని మద్దతునిచ్చారు. అన్నివిధాలా ప్రోత్సహించారు. ఎటువంటి రాజీలకు తావులేకుండా ప్రజల హక్కులను పరిరక్షించారు. ఆ సంక్షేమపథకం పేదల జీవితాలలో శ్రేయో వెలుగులను నిండుగా ప్రసరించేలా చేశారు.
గత రెండు దశాబ్దాలలో ‘ఉపాధి హామీ’ తెలుగు రాష్ట్రాల గ్రామీణ జీవన పరిస్థితులను మౌలికంగా మార్చివేసింది. సామాన్యులకు జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో కాయకష్టంతో బతికే కుటుంబాలకు ఏటా 100 రోజుల ఉపాధికల్పనకు హామీ పడింది. స్వల్పకాలిక వేతనాలు సమకూర్చడంతో పాటు మరెన్నో సత్ఫలితాలను సాధించింది. గ్రామీణ ఆదాయాలను పెంపొందించింది. జీవనోపాధికై పట్టణాలకు వలసపోవలసిన అగత్యాన్ని గణనీయంగా తగ్గించింది. మహిళలకు సాధికారత కల్పించింది. ఊరుమ్మడి ఆస్తులను సృష్టించింది. తద్వారా వ్యవసాయ సుస్థిరతకు విశేషంగా తోడ్పడింది.
తాత్కాలిక నిరుద్యోగిత కాలంలో నగదు ఆదాయానికి భరోసా కల్పించిన ‘ఉపాధి హామీ’ లక్షలాది కుటుంబాలకు ఆదాయవనరుగా సార్థకమయింది. ఆదాయ భద్రత సమకూరడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా లేని కాలంలో సైతం గ్రామీణ శ్రామిక జనుల వినియోగ వ్యయాలకు సుగమమార్గాన్ని కల్పించింది. పంట వైఫల్యాల వెతలను తట్టుకునే సామర్థ్యాన్ని గ్రామీణ కుటుంబాలకు కల్పించింది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు తమ వేతనాల పెంపుదలకై భూస్వాములతో బేరమాడుకునే శక్తిని చట్టబద్ధంగా కల్పించింది. గతంలో అతి తక్కువ కూలితో శ్రమదోపిడీకి గురైన భూ వసతి లేని పేదలు– భూస్వాముల ఒత్తిళ్లను తట్టుకుని నిలబడేలా చేయడంలో ‘ఉపాధి హామీ’ ఇచ్చిన ఆసరా అంతా ఇంతా కాదు. ఇదే ప్రధానంగా గ్రామీణ కార్మిక మార్కెట్లను పేదలకు సానుకూలంగా చేసిందనడంలో సందేహం లేదు.
‘ఉపాధి హామీ’ స్థానంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ–రామ్–జీ వ్యవసాయ పనుల కాలంలో ఆ పథకం అమలును నిలిపివేసింది. దీనివల్ల వేతనాల పెంపుదలకై భూ వసతిలేని వ్యవసాయ కూలీలు, మహిళా శ్రామికులు, సన్నకారు రైతులు భూస్వాములతో బేరమాడే సామర్థ్యం సన్నగిల్లింది. గ్రామీణ శ్రామికులకు ఉపాధి అత్యవసరంగా ఉన్న కాలంలో వారికి ఆ ఉపాధికల్పన అవకాశాలను నిరాకరించడం ద్వారా వ్యవసాయ వేతనాలను భూస్వాములకు మాత్రమే అనుకూలంగా ఉండే పరిస్థితిని కొత్త బిల్లు కల్పించింది.
గ్రామీణ శ్రామికుల వేతనాలను పెంపొందించడంతో పాటు నీటి నిల్వ నిర్మాణాలు, సాగునీటి తటాకాలు, చెక్ డ్యామ్‌లు, నేల సంరక్షణ పనులు, తోటలు, గ్రామీణ రహదారులు మొదలైన సాముదాయిక ఆస్తులను కూడా ‘ఉపాధి హామీ’ విస్తృతంగా సృష్టించింది. నీటివసతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో భూగర్భ జలాలను పునశ్శక్తిమంతం చేయడం, వ్యవసాయ బావుల పునరుద్ధరణకు తోడ్పడం ద్వారా అనావృష్టి రోజుల్లో సేద్యపు పనులు కొనసాగేందుకు ‘ఉపాధి హామీ’ తోడ్పడింది. తద్వారా ఆ సంక్షేమ పథక తక్షణ లబ్ధిదారులు ప్రయోజనం పొందడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు సుస్థిరత సాధిందేందుకు, వాతావరణ మార్పులను తట్టుకునేందుకు దోహదం జరిగింది.
‘ఉపాధి హామీ’ పనుల్లో మహిళలు అత్యధికంగా పాల్గొనడం ఆ పథక సార్థకతను నిర్వచించే మరొక ఘన విజయం. సమాన వేతనాలు, స్థానికంగా ఉపాధి లభ్యత మూలంగా మహిళలు మున్నెన్నడూ లేని విధంగా గ్రామీణ ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దారితీసింది. ‘ఉపాధి హామీ’ ఆదాయం స్వల్పమే అయినప్పటికీ తమ కుటుంబ వనరులపై మరింత నియంత్రణ సాధించేందుకు చాలా మంది గ్రామీణ మహిళలకు వెసులుబాటు కల్పించింది.
వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్న డిమాండ్–ఆధారిత ‘ఉపాధి హమీ’ చట్టం స్థానిక స్వపరిపాలనను పటిష్ఠపరిచింది. స్థానిక అవసరాలకు ప్రాధాన్యమిచ్చి, వాటి ప్రాతిపదికన ‘ఉపాధి హామీ’ పనులకు ప్రణాళికలు రూపొందించి, వాటి అమలును పర్యవేక్షించడం వల్ల గ్రామ పంచాయత్‌ల పాలనా సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. పాలనా వ్యవహారాలలో పారదర్శకత కూడా పెరిగింది. సామాజిక తనిఖీలు దృఢంగా ఉన్నచోట పాలనా వికేంద్రీకరణ మరింత మెరుగైన ఫలితాలను సాధించింది. కరువు పీడిత మండలాల్లో నీటి సదుపాయాలు మెరుగుపడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తులను పొలం నుంచి మార్కెట్‌కు చేరవేసేందుకు రహదారుల నిర్మాణం జరిగింది. ఊరుమ్మడి అవసరాలను తీర్చే ఆస్తులు పెంపొందాయి.
మోదీ సర్కార్ ప్రతిపాదించిన కొత్త బిల్లు ఈ పునాదులను కూల్చివేసింది. ఉపాధి పనులను హక్కుల ఆధారితం నుంచి పథకం ఆధారితం చేసింది. పరిమిత కేటాయింపులతో రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపింది. దీనివల్ల ‘ఉపాధి హామీ’ డిమాండ్ ఆధారిత స్వభావాన్ని కోల్పోయింది.
‘ఉపాధి హామీ’ పనులకు వేతనాలు చెల్లించే బాధ్యత నూటికి నూరుశాతం కేంద్ర ప్రభుత్వానిది కాగా ఇప్పుడు ఆ భారాన్ని కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో పంచుకోవలసి ఉంది. ఈ అనివార్యత ఉపాధి పనుల డిమాండ్‌ను ఉపేక్షించేందుకు దారితీయదా? అరకొర నిధులను ఇతర అత్యవసర సేవల నుంచి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూలధన వ్యయాలకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడుతున్న రాష్ట్రాలు ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించలేవు. పర్యవసానమేమిటి? పనిదినాలు తగ్గిపోతాయి, వేతన చెల్లింపులు ఆలస్యమవుతాయి, నిరుపేదలు ఈ పనుల నుంచి మినహాయింపునకు గురవుతారు! మరింత స్పష్టంగా చెప్పాలంటే మోదీ ప్రభుత్వ జీ–రామ్–జీ బిల్లు వల్ల నష్టపోయేది తమ మనుగడకు ఉపాధి హామీ పనులపై ఆధారపడిన గ్రామీణ శ్రామిక కుటుంబాలే. ఈ వాస్తవం తెలిసి కూడా ఎన్డీఏ భాగస్వామ్య, మిత్రపక్షాలు కొత్త బిల్లుకు మద్దతునివ్వడం గర్హనీయం.
రెండు దశాబ్దాలుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ భారత జీవనోపాధుల భద్రతకు మూలస్తంభంగా ఉన్నది. గ్రామీణ పేదల పనిహక్కుకు చట్టబద్ధమైన హామీనిచ్చిన, స్థానిక ప్రజాస్వామ్యానికి సాధికారత కల్పించిన, ఉపాధి కల్పనను దయా ధర్మ భిక్షంగా కాకుండా ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించిన అరుదైన చట్టమది. ఈ విశిష్ట దార్శనికతను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ బిల్లు కూల్చివేసింది. ఇది మన దేశ చరిత్రలో నిజంగా ఒక ‘హే రామ్’ విషాద వేళ.
కొప్పుల రాజు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు
Also Read:
జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?