Share News

From Guns to Constitution: చేతులు మారుతున్న రాజ్యాంగ ఆయుధం

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:45 AM

నక్సల్స్ ఉద్యమంలో ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు మల్లోజుల వేణుగోపాల్‌రావు, తక్కళ్లపల్లి వాసుదేవరావులు చాలామంది సహచరులతో కలిసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో...

From Guns to Constitution: చేతులు మారుతున్న రాజ్యాంగ ఆయుధం

నక్సల్స్ ఉద్యమంలో ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు మల్లోజుల వేణుగోపాల్‌రావు, తక్కళ్లపల్లి వాసుదేవరావులు చాలామంది సహచరులతో కలిసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఇటీవల లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ ఆయుధాలను రాజ్యం చేతుల్లో పెట్టారు. దానికి బదులుగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా– ఆ నాయకులు ఆయుధాలతో పాటు తమ అభిప్రాయాలనూ ఆశయాలనూ మార్చుకున్నారా? లేక తాత్కాలిక యుద్ధ విరమణ చేశారా? ఆయుధం స్థానాన్ని రాజ్యాంగం పూరించగలుగుతుందా? లేక రహస్య పోరాటాలు తిరిగి కొనసాగుతాయా?– తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ చర్చ కన్నా ముందు ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్ది పూర్వార్ధంలో సమాజంలో పునాది స్థాయిలో జరిగిన మార్పు చేర్పులను రాజకీయ, సామాజిక, ఆర్థిక, పౌర, సాంకేతిక, శాస్త్ర రంగాల వెలుగులో పరిశీలిస్తే కొంతమేరకైనా మేలు జరుగుతుంది.

ప్రపంచీకరణ వేగంగా పరుగెడుతున్న చోట దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రజా పోరాటాలు కొనసాగించడం అంత సులభమైన విషయం కాదు. సమాజం పునాదిలో జరుగుతున్న మార్పుల వలన ఉపరితలంలో అగుపించే ఉద్యోగాలలో, వ్యక్తులలో, వ్యవస్థలో స్థిరత్వం ఉండడానికి వీలు లేని ఒక సంక్షోభ వాతావరణం ఏర్పడింది. సమాజం క్రమంగా భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానంగా పరివర్తన చెందింది. జాతీయ పెట్టుబడిదారుడు అంతర్జాతీయ క్యాపిటలిస్టుగా ఎదిగాడు. బహుళ జాతి సంస్థలు మార్కెట్లను ఆక్రమించాయి. పంటలు పండించే సాధారణ స్వభావం మార్చుకొని రియల్ ఎస్టేట్‌గా భూమి రూపాంతరం చెందింది. కనబడే ప్రభుత్వాలను తెర వెనుక ఉండి నడిపే డ్రైవింగ్ ఫోర్స్ ఒత్తిడి శాసనకర్తల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నది. ఆయా ప్రభుత్వాలను చెప్పుకోదగ్గ స్థాయిలో కట్టడి చేస్తోంది. లాభాల దాహం తీరని జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు అందరూ ఒక్కటిగా తమ తమ ఉత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతి దిగుమతులపై ఆయా దేశాల మీద ఒత్తిడి తెచ్చి సుంకాల రాయితీని పొందుతారు. దీనితో ఎగుమతి దిగుమతుల సుంకాల మధ్య అంతరం ఏర్పడుతుంది. తద్వారా ఎక్కువ దేశాలు నష్టపోతే, కొన్ని సంపన్న దేశాలు లాభపడతాయి. ఇదే నేటి ప్రపంచీకరణ తెచ్చిన వాణిజ్యయుద్ధ నీతి తంత్రం. జాతీయంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ఇటువంటి పరిస్థితులలో రహస్య సాయుధవాదులు తమ ఆయుధాలతో పోరాట బాట వీడిన సదరు వ్యక్తులకు రాజ్యాంగ ప్రతులను ప్రభుత్వ నాయకులు అందజేస్తున్నారు. ఇక్కడే తిరకాసు అంతా ఉంది. ఆయుధాలతో సహా లొంగిపోవడం అంటే తమ ఆశయం పట్ల విశ్వాసం సడలిపోయినట్టు భావించాల్సి వస్తుంది. రాజ్యాంగ ప్రతిని స్వీకరించడం అంటే రాజ్యం పట్ల విధేయత కలిగి ఉండడంగా అన్వయించుకోవాలి.


రాజ్యాంగాన్ని రాజ్యం త్రికరణ శుద్ధిగా ఆచరించి, ప్రజా సమస్యలను పరిష్కరిస్తే సమాజంలో పోరాటాల అవసరమే ఉండదు. కానీ రాజ్యం తీసుకున్న నిర్ణయాలపైన జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రభావం ఉంటుందని ముందే మాట్లాడుకొని ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడం శాసనకర్తలకు అసాధ్యంగా పరిణమిస్తుంది. వీటన్నిటి పర్యవసానంగా సంపద అంతా పిడికెడుమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది. ధనవంతులకు పేదలకు మధ్య పూడ్చలేని అగాథం పెరిగిపోతున్నది. శాసనసభలు బలహీనపడుతున్నాయి. నాయకులు ఏం చేయాలో దిక్కుతోచక ‘అభివృద్ధి, సంక్షేమం’ అనే మాటలను చర్విత చర్వణంగా వల్లె వేస్తుంటారు. ప్రజల నిత్యావసర జీవితం తీవ్రమైన ఆటుపోట్లకు గురి అవుతుంది. సహజ ప్రకృతి వనరులు తీవ్రంగా నష్టపోతాయి. విలువలు సంస్కృతి దిన దినం లుప్తమైపోతాయి. రైతులు, కుటీర పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతాయి. చివరికి ఆయా వృత్తులను ఆశ్రయించి జీవిస్తున్నవారు అటు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాక, ఇటు ఉత్పత్తి ఉపకరణాల వ్యయం పెరిగిపోవడం వలన తలకు మించిన అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయిస్తారు.

ఈ నేపథ్యంలో నేడు ఆయుధాన్ని వీడి రాజ్యాంగాన్ని చేతబూనుతున్నవారు భవిష్యత్తులో చట్టబద్ధంగా ప్రజాసమస్యల పరిష్కార ఉద్యమాలను చేపట్టినా– వాటికి ఫలితం ఉంటుందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!

జూకంటి జగన్నాథం

ఇవి కూడా చదవండి:

కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 01:45 AM