Indian Communism: తరిమెల నాగిరెడ్డిని గవర్నర్ ఆహ్వానించి ఉంటే
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:53 AM
జననేత తరిమెల నాగిరెడ్డి చనిపోయి అర్ధ శతాబ్ది కావస్తున్నా ఇంకా ఆయన జీవితం నుండి పొందాల్సిన స్ఫూర్తి అనంతమే! ‘తాకట్టులో భారతదేశం’ అనే విశ్లేషణతో ఆయన కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంటు పుస్తక రూపంలో వచ్చి...
జననేత తరిమెల నాగిరెడ్డి చనిపోయి అర్ధ శతాబ్ది కావస్తున్నా ఇంకా ఆయన జీవితం నుండి పొందాల్సిన స్ఫూర్తి అనంతమే! ‘తాకట్టులో భారతదేశం’ అనే విశ్లేషణతో ఆయన కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంటు పుస్తక రూపంలో వచ్చి అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైన ఇన్నేళ్ళ తర్వాత దాని ప్రాసంగికత ఇంకా పెరిగి ఇప్పుడు ‘తాకట్టు కాదు, అమ్మకానికి భారతదేశం’ అనే స్థాయికి చేరిందని చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాభై ఏళ్ల కాలంలో అనేకమంది మిత్రులు అనేక సందర్భాలలో ఆయన్ని గుర్తు చేశారు. నేనూ అనేకసార్లు వివిధ వేదికలపై ఆ పని చేయటంతో పాటు ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పేరుతో 570 పేజీల పుస్తకాన్ని ఆయన శతజయంతి సందర్భంగా 2017లో ప్రచురించాను. యాభై రూపాయల రేటుతో ఇప్పటికి పది వేల కాపీలు జనంలోకి వెళ్లాయి. ఇప్పుడు ఎక్కువమందికి తెలియని కొత్త విషయాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలన్న ఆందోళన జరుగుతున్న రోజులవి. మద్రాసులో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో నాగిరెడ్డి (మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు) కమ్యూనిస్టు పార్టీ పక్షాన పాల్గొని 3 గంటల సేపు ప్రసంగించారు. ఆ సభలో ప్రేక్షకునిగా ఉన్న సుప్రసిద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆయన ప్రసంగానికి ముగ్ధుడై సభానంతరం ఆయన నివాసానికి వెళ్లి ‘‘నాగిరెడ్డి గారూ నాకు కమ్యూనిస్టులంటే చాలా చులకన భావం ఉండేది. కాని మీలాంటి గొప్ప వక్త, విశ్లేషకుడూ ఆ పార్టీలో ఉన్నారని తెల్సుకుని నా అభిప్రాయం మార్చుకున్నాను’’ అని అభినందించారు. తర్వాత కొద్దికాలానికే పొట్టి శ్రీరాములు బలిదానంతో ఉద్యమం ఉధృతం కావటంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కూడా నాగిరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు.
1953 నవంబర్‌లో ఏర్పడిన ప్రకాశం మంత్రివర్గం సంవత్సర కాలంలోనే పడిపోయింది. మెజారిటీపక్ష (41 సీట్లు) నాయకుడుగా ఉన్న నాగిరెడ్డిని మంత్రివర్గం ఏర్పాటు చేయాలని ఆహ్వానించటం రాజ్యాంగ సంప్రదాయం. కమ్యూనిస్టు పార్టీ అదే కోరింది. చందూలాల్ మాధవలాల్ త్రివేది అప్పటి గవర్నర్. ‘‘I can invite you for dinner Nagi Reddy, but not to form government’’ (నిన్ను భోజనానికి పిలవగలను నాగిరెడ్డీ, కాని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేను) అనే పరిస్థితి, ఆ ఒత్తిడి ఆయనపై లేకపోయి ఉంటే దేశ రాజకీయాలు, కమ్యూనిస్టుల పరిస్థితి మరోరకంగా ఉండేవి. మెజారిటీ పక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా నెహ్రూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలి అప్రజాస్వామిక చర్యకి పూనుకుంది. గవర్నర్‌ని కల్సిన సందర్భంలో, ‘‘How to control comunists?’’ అనే పుస్తకం చదివారా? అని త్రివేది అడిగితే దానిపై సమాధానంగా వచ్చిన పుస్తకం కూడా చదివానని నాగిరెడ్డి చెప్పారు.
1975 జూలై 6న ఎడ్లపాడులో జరిగిన నా పెళ్లికి నాగిరెడ్డి అధ్యక్షత వహించాలి. వస్తున్నట్లు నాకు టెలిగ్రాం ఇచ్చి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. టెలిగ్రాం సెన్సార్ అయి నా పెళ్లి వేదికను సుమారు పాతికమంది పోలీసులు చుట్టుముట్టారు. మీసాలు వచ్చినప్పటి నుండి ఎప్పుడూ మీసాలు పెంచని ఆయన బుర్ర మీసాలు పెంచారు. సుప్రసిద్ధ నవలా రచయిత్రి మాదిరెడ్డి సులోచన ఇంట్లో పార్టీ అద్దెకు తీసుకున్న పోర్షన్‌ని పార్టీ డెన్‌గా ఉపయోగిస్తూ ఆ ఇంట్లో నుండే వస్తూపోతూ కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఉండగానే నాగిరెడ్డిలో అనారోగ్య లక్షణాలు కన్పడటంతో పార్టీ కార్యకర్తలుగా ఉన్న డా. బిక్కసాని పూర్ణ, ఆయన భార్య డా. మేదరమెట్ల అరుణ (తెలంగాణ పోరాట యోధుడు మేదరమెట్ల సీతారామయ్య కూతురు. ప్రస్తుతం ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు) దగ్గరకు తీసుకెళ్లారు. వారి ట్రీట్‌మెంట్‌కి లొంగకపోవటంతో మాదిరెడ్డి వెంకట్రామయ్య అనే పేరుతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. అదే వార్డులో చికిత్స పొందుతున్న ప్రముఖ సాహితీవేత్త శ్రీనివాస చక్రవర్తి, జయంతి పబ్లికేషన్స్ పెరుమాళ్లు ఆయన్ని గుర్తించలేదు. 1976 నాటికి ఉస్మానియాలో వెంటిలేటర్ సదుపాయం కూడా లేదు. తుదకి జూలై 28 ఉదయాన నాగిరెడ్డి చనిపోయారు.
అప్పుడు అందుబాటులో పార్టీ నాయకులు ఎవరూ లేరు. సాయినాథ్, లాయర్ వెంకటరెడ్డి ఇద్దరూ ఏం చేయాలో తోచక ప్రముఖ లాయర్ సి. పద్మనాభరెడ్డి దగ్గరకు వెళ్ళి, పక్క ఇంటిలో ఉన్న మరో ప్రముఖ న్యాయవాది బాల్‌రెడ్డిని తీసుకొని యస్.ఆర్. నగర్‌లో ఉన్న నాగిరెడ్డి చెల్లెలు రమాదేవికి నాగిరెడ్డి పార్థివదేహాన్ని అప్పగించారు. ఈలోగా ప్రతిపక్ష నాయకులు వేములపల్లి శ్రీకృష్ణ ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి వెంగళరావుకి తెలియటంతో పోలీసులు అనంతపురం జిల్లా కల్లూరు గ్రామం వద్ద నాగిరెడ్డి పార్థివదేహం ఉన్న కారును అటకాయించి శవాన్ని స్వాధీనం చేసుకొని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న వేలాది ప్రజలు అక్కడకు చేరారు. నాగిరెడ్డిని చూడటానికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. దానితో అక్కడేవున్న నాగిరెడ్డి బావ, మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ‘‘ఇంకా వాడంటే మీకు భయమెందుకు? జనాన్ని చూడనివ్వండి’’ అని కేకలేయటంతో ప్రజల్ని అనుమతించారు. పోస్టుమార్టం అనంతరం కల్లూరు నుంచి వేలాది జనం వెంటరాగా తరిమెల వరకు అంతిమయాత్ర సాగింది. నాగిరెడ్డి అర్ధ శతాబ్ది వర్ధంతి సభలు ఈ సంవత్సరంపాటు జరిపి ఆ గొప్ప కమ్యూనిస్టు స‍్ఫూర్తిని నిలపాలని ఆయన సహచరులు, అనుచరులకు మనవి చేస్తున్నాను.
చెరుకూరి సత్యనారాయణ
తరిమెల నాగిరెడ్డి స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శి
(జూలై 28: తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News