నవశకానికి నవ్యాంధ్ర పరుగు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:43 AM
రాష్ట్రంలో ఐటీ–ఎలక్ట్రానిక్స్ రంగాలకు మహర్దశ పట్టనున్నది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో దృఢమైన కార్యాచరణతో ఐటీ రంగం అభివృద్ధికి ఆ శాఖ...

రాష్ట్రంలో ఐటీ–ఎలక్ట్రానిక్స్ రంగాలకు మహర్దశ పట్టనున్నది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో దృఢమైన కార్యాచరణతో ఐటీ రంగం అభివృద్ధికి ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ విశేష కృషి చేస్తున్నారు. శాస్త్ర సాంకేతికాంధ్రని దేశానికి దిక్సూచి చెయ్యాలన్న చంద్రబాబు స్వప్నాన్ని సాకారం చెయ్యడానికి శ్రమిస్తున్నారు. ఐటీ రంగాన్ని విస్తృతపరిచి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధికి పునాదులు వేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా లోకేశ్ కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్‌సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి ఆధారిత నైపుణ్య కార్యక్రమాలను అమలు చేసి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటీవల సెంచూరియన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిద్వారా దుస్తుల తయారీ, ఆటో విడిభాగాలు, డ్రాగన్ ఫ్రూట్ సాగు, స్మార్ట్ వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఎంటర్‌ప్రైజ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. అగ్రిటెక్, ఏఐ అనుసంధానంతో రాష్ట్ర సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ఉత్పాదకతను పెంచే సాగు విధానాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ప్రగతిశీల ఆలోచనలతో ఆరు నెలలుగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ప్రోత్సహిస్తూ నవశకానికి నవ్యాంధ్రను పరుగు తీయిస్తున్నారు లోకేశ్. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు, అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్‌టెక్‌ను అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలాతో ఎంఓయు కుదుర్చుకున్నారు. ఆయన కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్‌సీఎల్ మరో 15 వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకు వచ్చింది. లోకేశ్‌తో చర్చల అనంతరం ఫాక్స్‌కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదేళ్లలో ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రకటించారు. అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024–29లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసం విధానాల రూపకల్పన చేశారు. ఢిల్లీలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రోత్సాహకాలతో కూడిన సులభతర విధానాలను వివరించారు.
కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపైనే కాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్ సిద్ధమైంది. రాష్ట్రంలో 65 వేల కోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దశలుగా రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకు వచ్చింది. జనవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. ముంబైలో లోకేశ్ జరిపిన చర్చలతో వేదాంత అనుబంధ సంస్థ అయిన సెరెంటికీ గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
అయిదేళ్ల తర్వాత విశాఖలో తొలిసారిగా ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్, ఐటీ రంగ సమస్యలను తెలుసుకుని, సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు సులభంగా అనుమతులు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డును పునరుద్ధరించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు నారా లోకేశ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా మనకు ఓడరేవులు, విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని పశ్చిమ తీరం కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయాన మార్గాలతో మెరుగైన రీతిలో అనుసంధానమై ఉంది. ఇవన్నీ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
నీరుకొండ ప్రసాద్