Share News

Telangana Agriculture: ఎరువులపై కేంద్రం విధానం మారాలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:03 AM

దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎరువులను కలిపి సుమారు 6 కోట్ల 20 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తున్నారు. ఇందులో తెలంగాణ వినియోగం సుమారు 44 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే జాతీయ స్థాయిలో...

Telangana Agriculture: ఎరువులపై కేంద్రం విధానం మారాలి

దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎరువులను కలిపి సుమారు 6 కోట్ల 20 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తున్నారు. ఇందులో తెలంగాణ వినియోగం సుమారు 44 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే జాతీయ స్థాయిలో 7 శాతానికి సమానం. అలాగే మొత్తం దేశంలో రెండు సీజన్లు కలిపి ఒక సంవత్సరంలో సాగవుతున్న విస్తీర్ణం 54 కోట్ల 84 లక్షల ఎకరాలు, అందులో తెలంగాణ వాటా 4 శాతం మాత్రమే. అంటే, 4 శాతం సాగు విస్తీర్ణంతో ఉన్న తెలంగాణ, దేశ ఎరువుల వినియోగంలో 7 శాతం వాటా కలిగి ఉండటం వల్ల, రాష్ట్రంలోని సగటు ఎరువుల వినియోగం దేశ సగటుతో పోలిస్తే దాదాపు 80 శాతం అధికంగా ఉందని అర్థమవుతున్నది. అంతేకాక, వినియోగంలో వివిధ రకాల ఎరువుల మధ్య సమతుల్యత లోపించడమే కాకుండా, వాటి మధ్య వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న ఎరువుల్లో 60 శాతం వరకు యూరియానే ఉంది. తెలంగాణ యూరియా వాటా సుమారు 43 శాతం. అయితే తెలంగాణలో గత 7, 8 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది యూరియా వినియోగం సుమారు ఒక లక్ష మెట్రిక్ టన్నులు పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణాలు భూగర్భజలాల పరిమాణం పెరగడం, సాధారణ వర్షపాతం నమోదవడం వల్ల రెండవ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడమే. ఇటీవల యూరియా కొరతపై రైతుల్లో ఆందోళనకు అసలు కారణం యూరియా వినియోగం అనూహ్యంగా పెరగడం కాదు. సాధారణంగా, ప్రతి పంట సీజన్ ప్రారంభ దశలో యూరియా చాలా తక్కువ మోతాదులో వేయాలి. అయినా, చాలా సందర్భాల్లో రైతులు ముందస్తుగా ఎక్కువ మొత్తంలో యూరియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా, యూరియాకు ఉన్న నికర ధర ఇతర ఎరువులతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటంతో, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువగా వాడుతున్నారు.


వాస్తవానికి, పంట సీజన్‌ తొలి మాసంలో ఎక్కువగా వాడాల్సిన ఎరువులు డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ వంటి పోషక ఎరువులే. కానీ, ఈ ఎరువుల ధరలు యూరియాతో పోలిస్తే దాదాపు 6 నుంచి 7 రెట్లు ఎక్కువగా ఉండటంతో, రైతులు యూరియాపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ధరల వ్యత్యాసం వల్ల అవసరానికి మించి యూరియా వినియోగం పెరుగుతున్నది. ప్రస్తుతం 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266 కాగా, ఇదే పరిమాణంలో డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువులకు రూ.1500 నుంచి రూ.1800 వరకు ధర ఉంది. ఈ ధరల వ్యత్యాసానికి మూల కారణం కేంద్ర ప్రభుత్వపు లోపభూయిష్ఠ ఎరువుల ధరల విధానమే. దీనివల్ల యూరియా వినియోగం రోజురోజుకీ పెరుగుతున్నది. అదే సమయంలో, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఆ స్థాయిలో పెరగకపోవడంతో, ఎరువుల వినియోగంలో అసమతుల్యత పెరుగుతోంది. ప్రస్తుత ఎరువుల సబ్సిడీ విధానం ప్రకారం, యూరియాపై దాదాపు 90శాతం సబ్సిడీ ఇస్తున్నారు. అదే సమయంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై 60శాతం నుంచి 65శాతం సబ్సిడీ మాత్రమే ఉంది. ఉదాహరణకు, 45 కిలోల యూరియా బస్తాకు వాస్తవ వ్యయం రూ.2800 ఉన్నా, రైతు ప్రస్తుతం చెల్లిస్తున్న ధర కేవలం రూ.266 మాత్రమే; మిగతా మొత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీయే. ఇదే యూరియాపై 1970లో కేవలం 10శాతం సబ్సిడీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉదాహరణకు, ప్రస్తుతం ఒక కిలో నత్రజనిపై కేంద్ర ప్రభుత్వం రూ.43 సబ్సిడీ ఇస్తోంది. అదే సమయంలో, ఒక కిలో పొటాష్‌పై కేవలం రూ.2.40, ఒక కిలో సల్ఫర్‌పై రూ.2.60 మేరకే సబ్సిడీ ఉంది. ఈ విధమైన ధరల అసమతుల్యత, సబ్సిడీలో వ్యత్యాసం వల్ల, యూరియాపై రైతులు ఆధారపడుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయం, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రయత్నంలో జీవన ఎరువుల వినియోగంపై సబ్సిడీ లేనందున, రైతులు ఆశించిన స్థాయిలో ఈ ఎరువుల వాడకం వైపు మళ్లడం లేదు. ఉదాహరణకు, ఒక 45 కిలోల యూరియా బస్తాలో ఉన్న నత్రజనిని జీవన ఎరువుల ద్వారా అందించాలంటే సుమారు 20 క్వింటాళ్లు వేయాలి. దీనివల్ల ఎక్కువ మంది రైతులు జీవన ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపడంలేదు. ఇదే సమయంలో, సహజ వ్యవసాయంలో జీవన ఎరువుల వినియోగం తప్పనిసరి కావడం వల్ల, కేంద్ర ప్రభుత్వం సమర్థమైన ధరల విధానాన్ని రూపొందించకపోతే సహజ వ్యవసాయ లక్ష్యాలు సాధ్యం కావు. ఇటీవలి కాలంలో కొన్ని ఎరువు సంస్థలు నానో ఫర్టిలైజర్లను వినియోగంలోకి తెచ్చాయి. ఉదాహరణకు, అర లీటర్ నానో యూరియా ధర సుమారు రూ.225.


ఇది 45 కిలోల యూరియా బస్తా ద్వారా వచ్చే నత్రజనిని పంటలకు సమానంగా అందించగలదని సంస్థలు చెబుతున్నాయి. అదే విధంగా, నానో డీఏపీ ధర అర లీటర్‌కు రూ.600గా ఉంది. ఇది 50 కిలోల డీఏపీ బస్తా ద్వారా వచ్చే పోషకాలను పంటలకు అందిస్తుందని అభిప్రాయం ఉంది. అయితే ఈ నానో ఎరువుల నాణ్యత, పనితీరుపై ఇంకా క్షేత్ర స్థాయిలో శాస్త్రీయ అధ్యయనాలు పూర్తి కాలేదు. దీని వల్ల రైతులలో నానో ఎరువుల సామర్థ్యంపై పూర్తిస్థాయిలో నమ్మకం ఏర్పడలేదు. పైగా, వీటిపై సబ్సిడీ లేదు. దాంతో వీటి వినియోగం ఆశించిన స్థాయిలో విస్తరించడం లేదు. యూరియాపై చెలరేగుతున్న గందరగోళంపై వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఎరువుల విధానాన్ని సమీక్షించాలి. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సాహసోపేతమైన, శాస్త్రీయమైన విధానాల వైపు దృష్టి మళ్లించాలి. అధిక యూరియా వాడకం నేల ఆరోగ్యం, పంట నాణ్యత, చీడపీడల తీవ్రత వంటి అనేక సమస్యలకు దారి తీస్తోంది. దీన్ని నివారించాలంటే– యూరియా ధరలను క్రమంగా పెంచుతూ, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ వంటి ఇతర ఎరువుల ధరలను తగ్గిస్తూ, సమతుల్యాన్ని సాధించాలి. అదే సమయంలో జీవన ఎరువులపై ప్రత్యేక సబ్సిడీ విధానం ప్రవేశపెట్టి, వాటి ఉత్పత్తిని ప్రోత్సహించాలి. నాణ్యతా ప్రమాణాలు కలిగిన జీవన ఎరువులపై రైతుల్లో నమ్మకం ఏర్పడేలా సరైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయంపై దృష్టి పెట్టినా, అమలులో స్పష్టత లేకపోవడం వల్ల రైతుల్లో సరైన అవగాహన లేదు. అలాగే, నానో ఎరువుల ప్రయోజనాలు బహుళంగా ఉన్నా, సబ్సిడీ లేకపోవడం వల్ల వాటి వినియోగం చాలా పరిమితంగా ఉంది. దీనిపై కూడా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి.

ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

ఉపకులపతి, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఇవీ చదవండి:

ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Aug 08 , 2025 | 01:03 AM