Share News

సివిల్‌ సర్వెంట్లకు నీతిపాఠాలు కీలకమే!

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:29 AM

సుపరిపాలనా వ్యవస్థ సజావుగా సాగడానికి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికలలో వాగ్దానం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు...

సివిల్‌ సర్వెంట్లకు నీతిపాఠాలు కీలకమే!

సుపరిపాలనా వ్యవస్థ సజావుగా సాగడానికి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికలలో వాగ్దానం చేసిన అభివృద్ధి– సంక్షేమ పథకాలకు ఒక రూపం ఇచ్చి సరిగ్గా అమలుచేయడానికి సివిల్ సర్వెంట్ల నిబద్ధత, వైఖరి అత్యంత కీలకం. వారిని ఆ దిశగా నడిపించే స్ఫూర్తి, తప్పు చేయమని ప్రోత్సహించకుండా ఉండే బాధ్యత రాజకీయ నాయకులది. నిరంతరం మార్పుకు గురవుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో, ఊగిసలాటలో వున్న సివిల్ సర్వెంట్లలో, ముఖ్యంగా యువ అధికారులలో, ప్రవర్తనా వైఖరిని ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి నైతికతలో శిక్షణ మినహా గత్యంతరం లేదు.

ఇటీవల కొద్దిమంది యువ అధికారులలో విజ్ఞానం, నైపుణ్యం, ప్రవర్తనా వైఖరుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, ఊగిసలాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక పుస్తకావిష్కరణ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ– యువ ఐఏఎస్ అధికారుల ఆలోచనా విధానం మారాలి అని స్పష్టంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సమాజం మేలుకోరే పలువురి హృదయాంతరాలలో ఇలాంటి అభిప్రాయమే ఉన్నది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా కనిపించినా, అవి సివిల్ సర్వెంట్ల ప్రవర్తనా ధోరణులపై పెరుగుతున్న ఆందోళనలను వందశాతం ప్రతిబింబిస్తున్నాయి.


మూడున్నర దశాబ్దాల క్రితం నేను ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి శిక్షణాసంస్థలో ఫ్యాకల్టీ మెంబర్‌గా, అదనపు సంచాలకుడిగా పనిచేస్తున్నాను. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన శిక్షణలో వున్న ఏడు బ్యాచ్‌ల అసిస్టెంట్ కలెక్టర్లకు శిక్షణా కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను నిర్వహించాను. ఆ సందర్భంగా సివిల్ సర్వీసుకు సంబంధించిన కొన్ని విషయాలు నా అవగాహనకు వచ్చాయి. శిక్షణ పూర్తయిన తరువాత ఆయా అధికారుల వృత్తి పురోగతినీ, రాష్ట్ర అభివృద్ధికి వారు అందించిన విశిష్ట సేవలనూ దగ్గరగా పరిశీలించాను. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించడం కష్టం. కాకపోతే, కొంతమంది యువ ఐఏఎస్ అధికారులలో, వారు అందించాల్సిన సేవలకు సంబంధించి తప్పక అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం, ప్రవర్తనా వైఖరుల్లో లోపాలున్న విషయం గమనించాను.

1990 దశకంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘సివిల్ సర్వెంట్ల నిబద్ధత’ అత్యంత ప్రాధాన్యం గల విషయం అని గుర్తించి, మూడు రోజుల శిక్షణ మోడ్యూల్‌ను రూపొందించి, దాదాపు 150 మంది సీనియర్, జూనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే, సివిల్ సర్వెంట్లలో మార్పును తీసుకురావడానికి ‘గవర్నింగ్ ఫర్ రిజల్ట్స్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అప్పట్లో అనుకున్న లక్ష్యాలను సాధించాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం, సివిల్ సర్వెంట్ల శిక్షణలో విజ్ఞానం, నైపుణ్యం మాత్రమే కాకుండా ప్రవర్తనా వైఖరి కూడా అవసరమే కాబట్టి.


ఇప్పటివరకు, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఎఎ) సివిల్ సర్వెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలలో– విధానాల రూప కల్పన, భూపరిపాలన, సాఫ్ట్ స్కిల్స్‌, ప్రాజెక్ట్ నిర్వహణ, జాతీయ భద్రత, ఇ–గవర్నెన్స్ వంటి అంశాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు. అయితే వీటికన్నా ప్రధానమైన ప్రవర్తనా వైఖరి, నియమావళి మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనిపిస్తున్నది. జాతీయ శిక్షణా విధానం ఈ లోటును గుర్తించింది. దాన్ని భర్తీ చేయడానికి, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ‘ప్రవర్తనా వైఖరి ఆధారిత శిక్షణ–పునశ్చరణ’ (Attitudinal Training and Reorientation) అవసరం అనే విషయాన్ని ఉద్ఘాటించింది. సివిల్ సర్వెంట్లు ప్రజాస్వామ్య సమాజంలో తమ బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకునేలా చేయడం, అత్యున్నత నైతిక ప్రమాణాలు, ప్రవర్తనా విలువలు, నిజాయితీ, నిబద్ధతలను పాటించేందుకు వారిని సిద్ధం చేయడం ఈ శిక్షణ లక్ష్యం.

యువ సివిల్ సర్వెంట్లు కొందరిలో వ్యక్తిగత ప్రయోజనాలపట్ల అమితమైన ఆసక్తి, ధనపిపాస, అధికార తాపత్రయం, గుర్తింపు పొందాలన్న కాంక్ష, పనిలో అనైతికత వంటి ఆందోళనకర అంశాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో నిబద్ధత, బాధ్యత, స్పందన, జవాబుదారీతనం, పారదర్శకత మెల్లమెల్లగా క్షీణిస్తున్నాయి. వీరికి పరిపాలనలో నైతికత అంశంపై సమర్థమైన శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకం. ఎందుకంటే ఒక వ్యక్తి పనితీరును నిర్ణయించేది కేవలం అతని విషయ పరిజ్ఞానం, నైపుణ్యం మాత్రమే కాదు; ప్రవర్తనా వైఖరి కూడా.


పదవ పంచవర్ష ప్రణాళికా విధాన ప్రకటన ప్రకారం– ప్రభుత్వ పరిపాలన మరింత సమర్థంగా, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా ఉండాలంటే, సివిల్ సర్వీసును దీర్ఘకాలికంగా, స్థిరంగా నిర్వహించగలిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే, ప్రమాణాలను పాటించే అధికారులకు ప్రోత్సాహకాలను అందించాలి. మెరుగైన పనితీరు కోసం క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేయాలి. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత అనుకూలంగా మార్చాలంటే, అధికార వ్యవస్థను అన్ని స్థాయిల్లో మెరుగుపరచాలి, నైతిక విలువలను ఖచ్చితంగా పాటించాలి. రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలపై నిబద్ధత ఉండాలి. అలాగే రాజకీయ నాయకులు, సివిల్‌ సర్వెంట్ల పరస్పర సంబంధాలను స్పష్టంగా నిర్వచించుకోవాలి.

ఐఏఎస్ అధికారులుగా ఎంపికకాగానే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏడాదిపాటు ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత, వారికి కేటాయించిన రాష్ట్రాల్లో జిల్లా శిక్షణ పొందుతారు. ఆ తరువాత సబ్-కలెక్టర్లుగా వారి నియామకం జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు– జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌లుగా పదోన్నతి పొందుతారు. సుమారు నాలుగైదు సంవత్సరాల తర్వాత వారు కీలకమైన జిల్లా కలెక్టర్ పదవిని చేపడతారు. దాదాపు ఒక దశాబ్దం పాటు జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన తరువాత, రాజధానికి బదిలీ అయ్యి, సచివాలయ, విభాగ, ప్రభుత్వ రంగసంస్థలలో పదవులు చేయడమో, లేదా కేంద్రంలో నియామకం కావడమో జరుగుతుంది. ఎక్కడ పనిచేసినా సమయానికి పదోన్నతి సీనియారిటీ ఆధారంగా జరుగుతుంది. కానీ పోస్టింగ్‌లు మాత్రం అధికారుల వ్యక్తిగత ప్రతిభ, సామర్థ్యాలు, అలాగే రాజకీయ నాయకత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఐఏఎస్ అధికారుల అత్యున్నత పదవి– రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, కేంద్రంలో కాబినెట్ సెక్రటరీ. అయితే దీనికి కేవలం సీనియారిటీ ఒక్కటే అర్హత కాదు. ఒకసారి జిల్లా పరిపాలనను వదిలిపెడితే, తదుపరి ఉద్యోగ జీవితంలో క్షేత్రానుభావం వదిలినట్లే.


కొత్త జిల్లాల ఏర్పాటుతో యువ ఐఏఎస్ అధికారులకు ఒకేసారి ఎక్కువ బాధ్యతలు రావడం సవాలుగా మారింది. అనుభవం తక్కువగా ఉండటం, మంచి పరిపాలనా పద్ధతులపై తగిన శిక్షణ లేకపోవడం, మారుతున్న సామాజిక, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా మారడం కష్టతరం కావడం ప్రధాన సమస్యలుగా మారాయి. యువ అధికారులు ప్రజా సేవకులుగా అభివృద్ధి చెందడానికి తగిన శిక్షణ, తగిన అభివృద్ధి అవకాశాలు అందించాలి. అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షిస్తూ వారు సమర్థమైన ప్రజా సేవను అందించగలుగుతారు.

వనం జ్వాలానరసింహారావు

ఈ వార్తలు కూడా చదవండి:

IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..

AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..

Updated Date - Mar 11 , 2025 | 12:29 AM