Share News

Eshwari Bai: సమానత్వ కాంతులు పంచిన అగ్నిశిఖ

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:22 AM

అంబేడ్కర్ ఆశయాలను ఆలంబనగా చేసుకొని, ఆఖరి శ్వాస వరకు ఆయన అడుగుజాడల్లో నడిచిన నిఖార్సైన అంబేడ్కరిస్ట్ ఈశ్వరీ బాయి. నింగిని తాకాలని నిరంతరం పోరాటం చేస్తూ అలసిపోని కెరటంలా...

Eshwari Bai: సమానత్వ కాంతులు పంచిన అగ్నిశిఖ

అంబేడ్కర్ ఆశయాలను ఆలంబనగా చేసుకొని, ఆఖరి శ్వాస వరకు ఆయన అడుగుజాడల్లో నడిచిన నిఖార్సైన అంబేడ్కరిస్ట్ ఈశ్వరీ బాయి. నింగిని తాకాలని నిరంతరం పోరాటం చేస్తూ అలసిపోని కెరటంలా, తెలుగు నేలపై సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం, అంటరాని తనాన్ని తరిమికొట్టి సమసమాజాన్ని స్థాపించాలని తపించి అలుపెరుగని పోరాటం చేసిన నీలి పోరాట కెరటం ఈశ్వరీ బాయి. ఇంతులు తలుచుకుంటే ఇలలో సమానత్వ కాంతులు పంచవచ్చని నిరూపించిన అగ్నిశిఖ, కాంతి పుంజం ఈశ్వరీ బాయి. ఒంటరి మహిళగా తనకు ఏ అండ లేకున్నా అభాగ్యులకు అండగా నిలబడ్డ ధీర వనిత. తాడితులు, పీడితుల పక్షాన పోరాడే క్రమంలో అంబేడ్కరిజాన్ని దేహంలో అణువణువునా ఆవాహన చేసుకుని నిస్వార్థంగా, నిజాయితీగా, నిబద్ధతతో ఉంటే ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదగవచ్చని నిరూపించిన శీల శిఖరం. అసమానతలకు వ్యతిరేకంగా నేడు నడుస్తున్న పోరాటాలకు స్ఫూర్తి. సమసమాజ స్థాపన కోసం తపించే మనందరి ఆలోచనల్లో ఉదయించే రేపటి ఉషోదయం.

ఈశ్వరీ బాయి సికింద్రాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతంలో మాల సామాజిక వర్గానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు 1918 డిసెంబర్ 1న జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అప్పటి సవర్ణ ధర్మం ప్రకారం ఆమెకు పదమూడవ ఏట పుణెకు చెందిన దంత వైద్యుడితో బాల్య వివాహం జరిపించారు. కూతురు (మాజీ మంత్రి గీతారెడ్డి) జన్మించాక భర్త అకాల మరణంతో ఆమె మళ్లీ సికింద్రాబాదుకి తిరిగి వచ్చారు.

ఆత్మాభిమానం, పట్టుదల, ధైర్య సాహసాలు కలిగిన ధీర వనిత ఈశ్వరీబాయి. సికింద్రాబాదులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరి ఎవరి మీద ఆధారపడకుండా తన స్వంత కాళ్లపై నిలబడింది. ఆమె అందరిలా సాధారణ ఉద్యోగిగానే మిగిలిపోకుండా ఈ సవర్ణ హిందూ సమాజంలో వేల ఏళ్లుగా వేళ్లూనుకున్న అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలను కూకటి వేళ్ళతో పెకిలించాలనే దృఢ సంకల్పంతో సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే వారు. నాటి సమాజంలోని పురుషాధిపత్యాన్ని, స్త్రీని బానిసగా భావించే కఠోర నియమాలను, సంప్రదాయాలను ఆమె ధైర్యంగా ప్రతిఘటించేవారు. మహిళలు ఆత్మగౌరవంతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవిస్తూ సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని మహిళల్లో స్ఫూర్తిని నింపేవారు. ఆమె మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షులుగా ఉన్నపుడు మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని పటిష్ఠంగా అమలు జరిపారు. స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్య్రం రానిదే, మనదేశం పురోగతి చెందదు అని ఆమె దృఢంగా విశ్వసించేవారు.


దళిత ఉద్యమ ధృవతార భాగ్యరెడ్డి వర్మ, హైదరాబాదు అంబేడ్కర్‌గా పేరుగాంచిన బి.ఎస్. వెంకటరావు, జె.హెచ్. సుబ్బయ్య, బత్తుల శ్యామ్సుందర్, అరిగె రామస్వామి వంటి వారి పోరాటాల వల్ల ప్రభావితమై ఉద్యమాల్లో ఉవ్వెత్తున పాల్గొనే వారు. ఆ క్రమంలో ఆమె అంబేడ్కర్ ఉపన్యాసాలు, ఆయన రాసిన పుస్తకాలు, రచనలు, పత్రికల్లో రాసే వ్యాసాలు, ప్రత్యక్షంగా చేసే పోరాటాలతో స్ఫూర్తి పొంది ఆయన అడుగుజాడల్లో నడవాలని నిశ్చయించుకున్నారు.

ఒకవైపు సామాజిక ఉద్యమాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా, రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పిన ఆయన మాటల సారాన్ని తెలుసుకున్న ఈశ్వరీ బాయి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1952లో ఇండిపెండెంటుగా హైదరాబాద్ నగర పురపాలక సంఘం సభ్యురాలుగా గెలుపొందడంతో మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం తర్వాత కాలంలో గౌరవ మేజిస్ట్రేటుగా, రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలుగా, ప్రతిపక్ష నాయకురాలిగా వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో 1990వ సంవత్సరం వరకు అప్రతిహతంగా కొనసాగింది. దాదాపు నాలుగు దశాబ్దాల తన రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదురైనా మొక్కవోని ధైర్యంతో పేదల పక్షాన పోరాడింది.

1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆమె అలుపెరగకుండా ఉద్యమంలో పాల్గొన్నారు. చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి వైస్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజానీకానికి వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ పది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధాన నాయకత్వం మొత్తం జైలు పాలయినపుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన నిజమైన తెలంగాణ తల్లి ఈశ్వరీ బాయి. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీస్ లాఠీ దెబ్బలతో, తుపాకీ తూటాలతో అతి క్రూరంగా అణిచివేయడం అప్రజాస్వామికమని ఆంధ్ర పాలకులపై అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగేవారు.

కృష్ణా జిల్లా కంచికర్లలో దళిత పాలేరు కోటేసును కొంత మంది పెత్తందార్లు సజీవదహనం చేసిన సమయంలో ఆమె అసెంబ్లీలో స్పందించిన తీరు అనిర్వచనీయం. ఈ సంఘటనపై అసెంబ్లీలో ఆమె పట్టుబట్టి మరీ చర్చకు తీసుకొచ్చిన సందర్భంలో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మారెడ్డి చర్చ మధ్యలో కలుగజేసుకొని ‘‘దొంగతనం చేస్తే కాల్చి చంపకుండా ముద్దు పెట్టుకుంటారా?’’ అని అనగానే ‘‘ఎవడురా ఆ కూత కూసినవాడు, దళితులు మీకు దొంగల్లా కనిపిస్తున్నార్రా! సాటి మనిషిని సజీవ దహనం చేస్తారా? దళితులను దొంగలు అంటే చెప్పుతో కొడతా’’ అని ఆయన మీదకి చెప్పు విసిరి తగిన సమాధానం చెప్పిన తీరు చారిత్రాత్మకమైనది. ఒక నిజమైన అంబేడ్కర్ వారసుడు/వారసురాలు చట్టసభల్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఈ ఒక్క ఘటనతో అర్థం చేసుకోవచ్చు.


ఈశ్వరీ బాయి అంటే ఒక ఉద్యమం. ఆమె ఒక శక్తి పుంజం. నిత్య చైతన్య జ్యోతి. నిరుపేదల ప్రతినిధి. మర్రిచెన్నారెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారు ఆమె మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తరగతుల ప్రజల అభివృద్ధికి తీసుకోవలసిన సత్వర చర్యల విషయంలో, ఆమె సూచనలు అభిప్రాయాలకు వారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, ఆ విధంగా బడ్జెటు రూపొందించేవారు. ‘‘న్యాయమైన సామాజిక వ్యవస్థను రూపొందించటానికి మనం జరుపుతున్న కృషిలో శ్రీమతి ఈశ్వరీబాయి జీవితం, ఆమె చేసిన సేవ మనకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి’’ అని పీవీ నరసింహారావు ఒక సందర్భంలో అన్నారు.

m డా. మంచాల లింగస్వామి

చైర్మన్, మాల ప్రజాఫ్రంట్

(డిసెంబర్‌ 1 ఈశ్వరీ బాయి జయంతి)

ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 30 , 2025 | 05:22 AM