ఎండమావుల్లో జమ్మిచెట్టు
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:00 AM
నడి ఎండాకాలపు వడగాల్పుల్లో ఒకానొక మిట్ట మధ్యాహ్నం ఎదురుగా ఈడు బోయిన మిరప చేను అక్కడక్కడా తెల్లని బొమికల్లా గాలికి ఊగుతున్న తాలుగాయలు ఎండి తలలు వాల్చేసిన దిష్టిబంతి చెట్లు...
నడి ఎండాకాలపు వడగాల్పుల్లో
ఒకానొక మిట్ట మధ్యాహ్నం
ఎదురుగా ఈడు బోయిన మిరప చేను
అక్కడక్కడా తెల్లని బొమికల్లా
గాలికి ఊగుతున్న తాలుగాయలు
ఎండి తలలు వాల్చేసిన దిష్టిబంతి చెట్లు
పగిలిన పత్తి గుల్లలోంచి కారుతున్న
మిగిలిపోయిన తెల్లని పత్తి
తలకొట్టేసినాక ఎదగలేక
ఎండిపోయిన పొగలొట్టలు
ఆకులు రాలిన చెట్టు కింద
బొబ్బలెక్కిన కాళ్ళకు
పూయాల్సిన లేపనం గురించి ఎదురుచూపు
పేగులకంటుకుపోయిన పొట్ట
ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఎగిరిపడుతుంది
గుల్లబారిన మట్టిపెళ్ళపై
రాలిన కన్నీటి చినుకు
సంచుల్లో మూటగట్టిన విత్తనాలు
ఎప్పటికీ మొక్కలవ్వవు
ఋతువుల పరదాలను ఎంత తొలగించినా
చిక్కని చీకటి తప్ప
చెమ్మ చేతికి తగలదు
కాటాలకెక్కిన పంట బరువు
ఎప్పుడూ రెండోవైపుకే వంగిపోతుంది
బేరన్లలో బంగారు వర్ణానికి తిరిగిన పొగాకు
బ్రోకర్ చేతుల్లో నలుపుకు తిరిగి చూర్ణమైపోతుంది.
విరిగిన వెన్నెముక ఎప్పటికీ అతకదు
స్వేద భూముల్లో మొలకెత్తే మొక్కలు
కాలిపోయి కవురుకంపు వెదజల్లుతాయి
ఎక్కడో దూరంగా ఓ జమ్మి చెట్టు
చుట్టూ ఎండమావులు
ఆశల వడగాల్పుల్లో గొంతు తడవదు
ఉండీ ఉండీ ఉత్తీత పిట్ట అరుపు
ఎలపట దాపట ఎద్దులు రెండు
జీవితాన్ని చెరోవైపూ లాక్కెళ్లిపోయాయి
వెనక
ముందు
చుట్టూ
ఎటు చూసినా
శూన్యమే శూన్యం
పూరించలేని శూన్యం
బండ్ల మాధవరావు
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా