Share News

Dr PDK Rao: సంక్షేమ సాధనలో నిశ్శబ్ద కృషీవలుడు

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:13 AM

అణుభౌతిక శాస్త్రంలో డాక్టరేట్ చేసిన ఒక శాస్త్రవేత్త... అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు... అన్నీ వదిలేసి అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి విజయనగరం జిల్లా చీపురుపల్లికి...

Dr PDK Rao: సంక్షేమ సాధనలో నిశ్శబ్ద కృషీవలుడు

అణుభౌతిక శాస్త్రంలో డాక్టరేట్ చేసిన ఒక శాస్త్రవేత్త... అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు... అన్నీ వదిలేసి అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి విజయనగరం జిల్లా చీపురుపల్లికి వచ్చి, ప్రజల కోసం జీవితమంతా పనిచేశారు. ఆయన ఎటువంటి అవార్డులు, గుర్తింపు ఆశించకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఆయనే డా. పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు. తెలిసిన వారందరూ పీడీకే రావు అంటారు.

1940 డిసెంబర్‌ 29న వెంకాయమ్మ, వెంకట సత్యనారాయణలకు జన్మించారు కామేశ్వరరావు. వీరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట దగ్గర ఉన్న వల్లూరు. కామేశ్వరరావుకు పాఠశాల స్థాయిలోనే భౌతికశాస్త్రం పట్ల అమితమైన ఆకర్షణ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేసిన తర్వాత, అణుభౌతికశాస్త్రంలో పరిశోధన చేయడానికి 1965లో అమెరికా వెళ్లారు. డాక్టరేట్ పొందిన తర్వాత బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు.

అదే సమయంలో అమెరికాలో నల్లజాతీయులు హక్కుల కోసం, వివక్ష నుంచి విముక్తి కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దీనిపట్ల ఆకర్షితుడైన కామేశ్వరరావు, ‘ఇండియన్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో భారతీయులు చేస్తున్న నల్లజాతీయుల సంఘీభావ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దాంతో ఆయనకు పౌరుల హక్కుల పట్ల, పాలకవర్గాల స్వభావాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగింది. విశ్వవిద్యాలయంలో అణుభౌతికశాస్త్ర పాఠాలు చెబుతున్నప్పటికీ, ఆయనలో ఒక అలజడి ప్రారంభమైంది. ‘నా దేశం కోసం నేనేమి చేయగలను?’ అనే ఆలోచన ఆయన మనసును తొలచసాగింది. దానితో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ నడుస్తోంది.


జయప్రకాశ్‌ నారాయణ్‌, వినోబాభావేలను కలిసి కామేశ్వరరావు తన కార్యాచరణను రూపొందించుకున్నారు. అప్పటి ఐఏఎస్ అధికారి మోహన్ కందా మార్గదర్శకత్వంలో, చీపురుపల్లి దగ్గర ఉన్న అప్పన్నవలస గ్రామాన్ని తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. దళితులు, పేదవారు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో దోపిడీకి గురవుతున్న వారికి తన ఆపన్న హస్తం అందించారు.

సమాజంలోని సకల రోగాలకు కారణం నిరక్షరాస్యత అని, దానిని రూపుమాపితే తప్ప అభివృద్ధి సాధించలేమనే ఉద్దేశంతో నిరక్షరాస్యత మీద తన తొలి బాణాన్ని ఎక్కుపెట్టారు కామేశ్వరరావు. 1979 జూలై 1న అప్పన్నవలసలో ప్రారంభమైన రాత్రిబడి తరువాతి కాలంలో కాపుశంభాం, గరివిడి, మెరకముడిదం, పొందూరు మండలాలలోని అనేక గ్రామాలకు విస్తరించింది. రాత్రి బడులలో అక్షరాస్యతతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న అనేక పథకాల పట్ల అవగాహన కల్పించారాయన. యువజన సంఘాలు ఏర్పాటు చేయించారు. వీటివల్ల ప్రజలలో చైతన్యం పెరిగి దుర్మార్గాలను, అక్రమాలను ఎదిరించే స్థాయికి ఎదిగారు. గ్రామీణులకు దాచుకోవడం తెలియదు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. అందువల్ల ఎప్పుడూ అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. దీని నుంచి బయటపడాలంటే పొదుపే మార్గమని భావించిన కామేశ్వరరావు, అప్పన్నవలసలో పొదుపు సంఘాలకు శ్రీకారం చుట్టారు. కూలి పనులకు వెళుతున్న మహిళలను సంఘాలుగా ఏర్పరిచి నిధిని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించారు. 1984 నాటికి 200 పొదుపు సంఘాలు ఆ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకొని, డ్వాక్రా లాంటి అనేక సంఘాల ఏర్పాటుకు పూనుకున్నాయి.

అక్షర చైతన్యంలోను, పొదుపు సంఘంలోను విజయం సాధించిన కామేశ్వరరావు క్రమంగా పేదలకు సొంత ఇంటి వైపు దృష్టి సారించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మించేవారు. అందువల్ల అవి నివాసయోగ్యంగా ఉండేవి కావు. ఆ గృహాలను తామే తమ సంఘాల ద్వారా నిర్మించుకుంటామని, అందుకు అవసరమైన ముందస్తు పెట్టుబడిని పొదుపు సంఘాల ద్వారా సమకూర్చుకుంటామని ప్రభుత్వ అధికారులను ఒప్పించారు కామేశ్వరరావు. అలా ప్రారంభమైన నిర్మాణాల నాణ్యత పటిష్ఠంగా ఉండేది. వాటికి ఆయన ‘విజయ కాలనీ’ అని పేరు పెట్టారు. అప్పన్నవలసలో మొదలైన ఈ కాలనీలు కాపుశంభం, కొండశంభం, బాగువలస, పెనుబర్తి, ఆకులపేట, దుమ్మెద, కోనూరు, వంగపల్లిపేట మొదలైన గ్రామాలకు విస్తరించాయి. ఇదే క్రమంలో అప్పటి కలెక్టర్ ఎస్.ఆర్ శంకరన్ సహాయ సహకారాలతో రిక్షా కార్మికులకు కూడా గృహ సముదాయాలు నిర్మింపజేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేదలకు ప్రభుత్వం భూములు పంచిపెట్టింది. అయితే వాటిని భూస్వాములు లాగేసుకున్నారు.


ఈ విషయం తెలుసుకున్న కామేశ్వరరావు, రైతులకు మద్దతుగా నాలుగేళ్ల పాటు పోరాటం చేశారు. మోహన్ కందా, శంకరన్‌ వంటి అధికారుల సహాయంతో భూమిని పోగొట్టుకున్న రైతుల వివరాలు తెలుసుకొని, వారికి భూమి తిరిగి వచ్చేలా చేశారు. అనంతర కాలంలో పిల్లలకు విద్య పట్ల దృష్టి పెట్టారు కామేశ్వరరావు. ఇందుకోసం బాలబడి పేరుతో పాఠశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా, అవి విద్యార్థులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. ‘చదువు అంటే శిక్ష’ అనే ధోరణిని రూపుమాపి, పిల్లలు ఇష్టంగా చదువుకునే విధంగా దేశదేశాల విద్యా విధానాలను పరిశీలించి, ఒక కొత్త విధానాన్ని బాలబడిలో అమలుచేశారు. ప్రభుత్వం ఈ విధానాన్ని అంగన్‌వాడీ పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుందంటే ఇది పిల్లలకు ఎంత ఉపయోగకరమో తెలుస్తోంది. తన జీవితాన్నే పణంగా పెట్టి, ఇంత కృషిచేసిన ఈ మహనీయుడు నిశ్శబ్ద కృషీవలుడు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ‘తెనాలి ప్రచురణలు’ సంస్థ ‘భారత జ్యోతి’ పురస్కారంతో డాక్టర్ పీడీకే రావును నేడు సత్కరించనున్నది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం, తెనాలిలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, న్యాయవాది కె.ఇంద్రనీల్‌ బాబు, వోలేటి పార్వతీశం, నల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొంటారు.

బండ్ల మాధవరావు

ఇవి కూడా చదవండి

5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం

అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

Updated Date - Nov 27 , 2025 | 01:13 AM