Share News

Vandemataram Controversy: ఆ వ్యాఖ్యలు చరిత్రను వక్రీకరించడమే

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:42 AM

గాంధీజీ ఆకాంక్షలను కూడా తుంగలో తొక్కి, నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్‌వారు వందేమాతరం గేయాన్ని ముక్కలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం చరిత్రను వక్రీకరించడమే....

Vandemataram Controversy: ఆ వ్యాఖ్యలు చరిత్రను వక్రీకరించడమే

గాంధీజీ ఆకాంక్షలను కూడా తుంగలో తొక్కి, నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్‌వారు వందేమాతరం గేయాన్ని ముక్కలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం చరిత్రను వక్రీకరించడమే. 1939 జూలై 1న ‘హరిజన్‌’ పత్రికలో రాసిన వ్యాసంలో కొన్ని వర్గాల ప్రజలు ఆక్షేపించేటట్లయితే వందేమాతరం గేయాన్ని పాడనవసరం లేదని గాంధీజీ స్పష్టం చేశారు. అలాగే తన పుస్తకం ‘నిర్మాణాత్మక కార్యక్రమం’లో కూడా గాంధీజీ వందేమాతరం గేయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దరాదని పేర్కొన్నారు. ముస్లిమ్‌లకు అభ్యంతరకరంగా, కోపం తెప్పించేదిగా ఉండరాదని కూడా స్పష్టం చేశారు. 1896లోనే విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మొట్టమొదటిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆయన పాడారు. అవి వివాదరహితమయినవని ఆయన అభిప్రాయపడ్డారు. మిగతా చరణాలు దుర్గామాతను స్తోత్రించే విధంగా ఉన్నాయని ఆయన భావించారు. తర్వాత 1937లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో వందేమాతరం గేయం ఎక్కడ పాడినా మొట్టమొదటి రెండు చరణాలే పాడాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఇది నెహ్రూ నిర్ణయం కాదు. ఆనాటి జాతీయ నాయకులందరి సమష్టి నిర్ణయం. ఈ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో హిందూ, ముస్లిం నాయకులందరు పాల్గొన్నారు. తర్వాత 1950 జనవరి 24న జరిగిన భారత రాజ్యాంగ సభ సమావేశంలో వందేమాతరం మొట్టమొదటి రెండు చరణాలనే ‘జాతీయ గేయంగా’ నిర్ణయించారు. దానికి జాతీయగీతం ‘జనగణమణ’తో సమాన హోదాను కల్పించాలని తీర్మానం చేశారు.

ఈ విధంగా వందేమాతరం గేయాన్ని మొదటి రెండు చరణాలకే పరిమితం చేయడాన్ని గాంధీజీ పూర్తిగా సమర్థించారు. వందేమాతరం గేయాన్ని పరిమితం చేయడంలో నెహ్రూ పాత్ర కూడ ఏమీ లేదనేది సుస్పష్టం. నెహ్రూ మీద అభాండాలు వేయడం మోదీ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నది.

– డా. పి.సి.సాయిబాబు

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 18 , 2025 | 05:42 AM