కార్పొరేట్ల సేవకే అభివృద్ధి మంత్రం
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:57 AM
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ నుంచి విశాఖపట్నం సముద్రతీరంలోని గంగవరం పోర్టు వరకు 464 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇది ఆరులైన్ల విశాలమైన రహదారి....

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ నుంచి విశాఖపట్నం సముద్రతీరంలోని గంగవరం పోర్టు వరకు 464 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇది ఆరులైన్ల విశాలమైన రహదారి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విస్తారమైన అటవీ ప్రాంతమే దండకారణ్యంగా ప్రసిద్ధి. ఈ అడవిలో అపారమైన ప్రకృతి సంపద ఉంది. ఒక్క వృక్ష సంపదే లక్షల కోట్ల విలువ చేస్తుంది. ఈ అరణ్యంలో 26 రకాల విలువైన ఖనిజ సంపద ఉంది.
ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 31 శాతం ఖనిజ సంపద, అటవీ సంపద ప్రభుత్వాలకు లక్షల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఈ సంపదను రాజకీయ నాయకులు, అధికారులు, కార్పొరేట్ కంపెనీలు, సామ్రాజ్యవాద శక్తులు నిలువుదోపిడీ చేస్తున్నాయి. అదానీ, అంబానీలకు ఈ సంపద అప్పనంగా దోచిపెట్టి, విదేశాలకు తరలించడం ద్వారా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే కుట్రలో భాగంగా జరుగుతున్న తంతు ఇది. దండకారణ్యానికి అతి సమీపంలో ఉన్నది గంగవరం పోర్టు. ఇక్కడ సముద్రం లోతు ఎక్కువ. విదేశీ భారీ నౌకల సంచారానికి చాలా అనువైన పోర్టు.
కార్పొరేట్ల ప్రయోజనాలకే దండకారణ్య ప్రాంతాన్ని సైనికీకరణ, ప్రైవేటీకరణకు కేంద్రం కృషి చేస్తున్నది. దండకారణ్య ప్రాంతం దేశంలో నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర స్థానంలో ఉంది. వీరికి ఇక్కడి గిరిజనులలో మంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంది. దీనివల్ల అటవీ ప్రాంతం నుంచి ప్రకృతి సంపదను తరలించాలన్నా, గనులను కొల్లగొట్టాలన్నా, వృక్ష సంపదను అనుభవించాలన్నా కార్పొరేట్ వర్గాలకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. దీంతో నక్సలైట్లను నిర్మూలించడం ద్వారా గిరిజన ప్రతిఘటనోద్యమాన్ని బలహీనపరచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అందుకే 2026 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తున్నారు. ఇందుకోసం దండకారణ్యంలో వేలాది సైనికులు, కోబ్రా తదితర దళాలు వినియోగిస్తూ నక్సలైట్ ఉద్యమకారులను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అమాయకులను బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. వేలాది పోలీసు బలగాల సంరక్షణలో రోడ్డు నిర్మాణం కొనసాగిస్తున్నారు. అపార సంపదలకు నిలయమైన ఈ ప్రాంతం నుంచి గిరిజనులను గెంటి వేసి ఈ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలో భాగమే మావోయిస్టుల నిర్మూలన ఆలోచన.
అభివృద్ధి మంత్రంతో జరుగుతున్న ఈ దోపిడి చర్యలను ప్రజలు గ్రహించి, అసంబద్ధ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి. ప్రకృతి ప్రసాదించిన విలువైన సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలి.
చలసాని వెంకటరామారావు,
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు