Democratic Participation: ఆటలో గెలవాలంటే ఆడితీరాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:20 AM
ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికలలో పాల్గొనడమనేది పౌరుల హక్కే కాదు, బాధ్యత కూడా. ప్రజలు ఆ హక్కును సద్వినియోగపరిచి, తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చేలా చూడడమనేది...
ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికలలో పాల్గొనడమనేది పౌరుల హక్కే కాదు, బాధ్యత కూడా. ప్రజలు ఆ హక్కును సద్వినియోగపరిచి, తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చేలా చూడడమనేది రాజకీయ పార్టీల, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల విద్్యుక్త ధర్మం. అయినా కొన్ని రాజకీయ పార్టీలు లేదా ప్రజా వర్గాలు అప్పుడప్పుడూ ఎన్నికలలో పాల్గొనేందుకు నిరాకరించడం, ఆ ప్రజాస్వామిక ప్రక్రియను బహిష్కరించడం జరుగుతోంది. తద్వారా, ఎన్నికలలో పాల్గొనడం కంటే పాల్గొనకపోవడం ద్వారా ప్రభుత్వానికి, సమాజానికి తమ వైఖరి ఏమిటో స్పష్టాతి స్పష్టంగా చెప్పడమవుతుందని పార్టీలు లేదా ప్రజా వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలు లేదా ప్రజావర్గాలు ఎన్నికలను బహిష్కరించడమనే ఎత్తుగడ పాత, కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పునరావృతమవుతున్న లక్షణంగా ఉన్నది. అయితే చరిత్ర ఈ పరిణామం గురించి ఒక సత్యాన్ని చెప్పుతోంది: ఎన్నికల బహిష్కరణలు అరుదుగా విజయవంతమయ్యాయి. అవి చాలావరకు విఫలమయ్యాయని, ప్రతిపక్షాలను బలహీనపరిచాయని, అధికారంలో ఉన్న పార్టీలు లేదా నాయకులకే మరింత అనుకూల పరిస్థితులు సృష్టించాయని కూడా చరిత్ర స్పష్టం చేసింది. ఈ సంవత్సరాంతంలో బిహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్షాలు గట్టిగా పిలుపునిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –సర్) పట్ల సందేహాలు, సంకోచాలతో విపక్షాలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఓటర్ల పేర్లను భారీ ఎత్తున జాబితా నుంచి తొలగించే లక్ష్యంతోనే ‘సర్’ను చేట్టారని, దీనివల్ల పేదలు, మైనారిటీలు, వలసపోయినవారు తీవ్రంగా నష్టపోనున్నారని ‘సర్’ విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడంతో సర్ నిష్పాక్షికతను ప్రజలు విశ్వసించలేకపోతున్నారు.
ఎన్నికల సంఘం పట్ల బిహార్ ప్రజల్లో అపనమ్మకం నెలకొన్నది. ఓటర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం తక్షణమే ఎటువంటి సందేహాలకు తావివ్వని రీతిలో సమాధానాలు ఇవ్వవలసిన అవసరమున్నది. అయితే ఇదే సమయంలో సర్ పట్ల ఆక్షేపణతో ఎన్నికలను బహిష్కరించడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని నిశితంగా పరీక్షించవలసిన అవసరమున్నది. ఎన్నికల బహిష్కరణ విషయమై చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని దక్షిణాసియా అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) 2014లో పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించింది. అధికారంలో ఉన్న అవామీలీగ్ రాజీనామా చేసి, ఎన్నికల నిర్వహణకు ఒక తటస్థ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని బీఎన్‌పీ డిమాండ్ చేసింది. అవామీలీగ్ నిష్పాక్షికత పట్ల బీఎన్‌పీ అనుమానాలు నిరాధారమైనవి కావు. అయితే బీఎన్‌పీ ఎన్నికలను బహిష్కరించడం ద్వారా అధికార పార్టీకి చెప్పుకోదగ్గ పోటీ లేకుండా చేసింది. ఫలితంగా 153 నియోజకవర్గాలలో అవామీలీగ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల అనంతరం నేను ఢాకాకు వెళ్లాను. బీఎన్‌పీ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేదని చాలా మంది నాకు స్పష్టంగా చెప్పారు అధికార అవామీలీగ్‌కు విజయాన్ని బీఎన్‌పీ స్వయంగా సమకూర్చిందని వారు అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా ఎన్నికల బహిష్కరణ జరిగింది. పంజాబ్‌లో 1992 అసెంబ్లీ ఎన్నికలు ఇందుకొక ఉదాహరణ. శిరోమణి అకాలీదళ్ ఆ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించింది. ఫలితంగా ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. కొన్ని జిల్లాల్లో కేవలం 13 శాతం ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. అకాలీదళ్ బాయ్‌కాట్ కాంగ్రెస్ పార్టీకి సులభ విజయాన్ని సమకూర్చింది. పోటీ రహితంగా ఎన్నికలు జరగడం, శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడంతో పంజాబ్‌లో ప్రజాస్వామ్యం సార్థకత కోల్పోయింది. ఇంకా పలు బహిష్కరణల ఉదంతాలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా భాగం ప్రధానస్రవంతిలో లేని వేర్పాటువాద పార్టీలు ఇచ్చినవే. జమ్మూ–కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులు మొదటి నుంచీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూనే ఉన్నాయి.
ఎన్నికలలో తాము పాల్గొనడం జరిగితే కశ్మీర్‌లో భారత పరిపాలనకు న్యాయసమ్మతి కల్పించడమే అవుతుందని వేర్పాటువాదులు తమ నిర్ణయాన్ని సమర్థించుకునేవారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కూడా ఎన్నికల బహిష్కరణ పిలుపులు విజయవంతమవలేదు. వెనిజులా ఇందుకొక ఉదాహరణ. 2005లో ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. ఫలితంగా జాతీయ అసెంబ్లీలో ప్రతి సీటునూ పాలక కూటమి గెలుచుకున్నది. 2018లో పాక్షికంగా బహిష్కరించాయి. నికోలస్ మదురో మళ్లీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు ఈ బహిష్కరణ తోడ్పడింది. 2020లో కూడా ప్రతిపక్షాలు ఎన్నికలలో పాల్గొనకపోవడంతో 31 శాతం ఓటర్లే పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ తక్కువ శాతం పోలింగ్‌తో అధికార పార్టీకి భారీ మెజారిటీ లభించింది. జింబాబ్వేలో మోర్గాన్ స్వాన్‌గిరాయి 2008 అధ్యక్ష ఎన్నికల నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో రాబర్ట్ ముగాబే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల బహిష్కరణ వల్ల గానీ లేదా ఓటర్లు చాలా తక్కువగా పోలింగ్‌లో పాల్గొన్న కారణాన గానీ సంబంధిత ఎన్నికను రద్దు చేసే సౌలభ్యాన్ని భారత రాజ్యాంగం కల్పించలేదు. షెడ్యూలు ప్రకారం ఎన్నికల సంఘం విధిగా ఎన్నికలు నిర్వహించి, పోలయిన ఓట్ల ప్రాతిపదికన విజేతలు ఎవరో ప్రకటిస్తుంది. కనుక ఎన్నికల బహిష్కరణ పిలుపు ఎన్నికల ప్రక్రియను నిరోధించలేదు, నిరోధించజాలదు. పార్టీలు లేదా అభ్యర్థులు పోటీనుంచి వైదొలిగిన పక్షంలో అది బరిలో ఉన్న అభ్యర్థికి సులభ విజయం సమకూర్చడానికి మాత్రమే దోహదం చేస్తుంది. ఈ కారణంగానే బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదానికి ప్రతిస్పందనగా ఎన్నికలను బహిష్కరించాలన్న తమ పిలుపుపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పునరాలోచన చేయవలసిన అవసరమున్నది. అయితే ‘సర్’ ప్రక్రియను నిశితంగా పరీక్షించాలి. ప్రత్యేక సమగ్ర సవరణపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం వ్యక్తం చేస్తున్న అనుమానాలను తొలగించాలి. ఆ సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉన్నది. ఓటర్ల ఫిర్యాదులను శీఘ్రగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు అన్నీ చేపట్టాలి. పౌర సమాజం, మీడియా, న్యాయస్థానాలు అన్నీ ‘సర్’ విషయంలో జాగరూకతతో ఉండాలి. ఎన్నికలలో పాల్గొనే బాధ్యతను రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితులలోను వదిలివేయకూడదు. ఎన్నికల బరి నుంచి వైదొలగడమంటే ఎన్నికల పోరులో ఓడిపోవడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలలో పాల్గొనక పోవడం నిరసన ఎంత మాత్రంకాదు, అది బాధ్యతను పరిత్యజించడమే అవుతుందన్న సత్యాన్ని విస్మరించకూడదు. ఎన్నికల బహిష్కరణే కాదు, పార్లమెంటు సమావేశాలను బహిష్కరించడం కూడా ప్రతిపక్షాలు తమను తాము ఓడించుకోవడమే అవుతుంది. వాకౌట్‌లు, సభా కార్యక్రమాలకు ఎగతెగకుండా అంతరాయం కలిగించడం కొన్ని సందర్భాలలో ప్రతీకాత్మక నిరసన కావచ్చునేమో కానీ, వాటి ఆచరణాత్మక ప్రభావం వల్ల కీలక బిల్లులను ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించే స్వేచ్ఛ పాలక పక్షానికి లభిస్తుంది. అనేక కీలక బిల్లులు–2020లో మూడు కొత్త సాగు చట్టాలు, అంతకు ముందు సంవత్సరాలలో కీలక రాజ్యాంగ సవరణలు– ప్రతిపక్ష ఎంపీల వాకౌట్ల వల్లే ఆమోదించడం అధికార పార్టీకి వీలయింది.
ఎన్నికలలో గానీ, పార్లమెంటులో గానీ ప్రతిపక్షం పాత్ర ప్రభుత్వాన్ని సవాల్ చేయడం, ప్రశ్నించడం, పాలనాపరమైన నిర్ణయాలు, చర్యలకు జవాబుదారీగా వ్యవహరించేలా చేయడమే. ఆగ్రహాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేసేందుకు బహిష్కరణలు ఉపయోగపడవచ్చుగానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదికల నుంచి వైదొలగడం, పాలకులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా చేయాల్సిన పోరాటాలను వదిలివేయడమే అవుతుంది. అత్యంత ప్రభావశీల ప్రతిపక్ష నాయకులు అందరూ అత్యంత ప్రతికూల పరిస్థితులలోను తమ బాధ్యతలను విడనాడనివారేనని చరిత్ర చెప్పుతోంది. ప్రజాస్వామిక పద్ధతులలో ప్రభుత్వ తప్పులను బహిర్గతం చేసి, ప్రజాభిప్రాయాన్ని సమీకరించి, ప్రజల విశ్వాసాన్ని పొందినవారేనని స్పష్టం చేస్తోంది. ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలను బహిష్కరించడం వల్ల ప్రతిపక్షాలు తమ ప్రత్యర్థులకే అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇది చాలా పెద్ద తప్పు. దీనివల్ల సంభవించే అనర్థాల నుంచి కోలుకోవడానికి దశాబ్దాలు కాకపోయినా సంవత్సరాలు పడుతుంది. చట్టసభలలో ప్రతిపక్షాల స్థానాలు ఖాళీగా ఉండడం అధికారపక్షం స్వప్నం, ప్రజాస్వామ్యానికి దుస్స్వప్నం అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి.
ఎస్‌వై ఖురేషి
భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి
(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యం)
ఇవీ చదవండి:
ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి