Dasarathi Shatajayanti: శతజయంతి ఉత్సవాల సందడేదీ
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:04 AM
తెలుగు మాట వినిపిస్తేనే ఒంటిపై తేళ్ళు పాకినట్లుగా వ్యవహరించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను ముక్కుసూటిగా ఓ నిజాము పిశాచమా..
తెలుగు మాట వినిపిస్తేనే ఒంటిపై తేళ్ళు పాకినట్లుగా వ్యవహరించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను ముక్కుసూటిగా ‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని’’ అని ధిక్కరించినవాడు దాశరథి! ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ అని గురజాడ చెప్పిన స్థాయిలో– ‘‘ఘోర గహనాటడవులన్ వడగొట్టి, మంచి మాగాణములన్ సృజించి, యముకల్ నుసి చేసి, పొలాలు దున్ని, భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలంగాణ రైతుదే’’ అన్నాడు. ‘‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’’ అని ముష్కర నవాబును ఎదిరించిన కవికి ఎన్ని గుండెలు ఉండాలి. అలాంటి ప్రజాకవి దాశరథి శతజయంతి ఈ నెల 22వ తేదీన జరగనున్నది. హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన కుటిలమైన రాజుపై క్షేత్రంలో నిలబడి, సామాజిక ఆర్థిక అంశాలు ప్రస్తావిస్తూ, జనసామాన్యాన్ని చైతన్యపరుస్తూ, విప్లవాత్మకంగా పోరాటం చేసిన కవులు తెలుగు సాహితీలోకంలో దాశరథి మినహా మరొకరు లేరు. నిజాం రాజు దుష్టపాలనను ఎత్తిచూపుతూ కవితలు చెప్పటం ఏదో ఒక ఎయిర్ కండీషన్డ్ గదిలో కూర్చుని సినిమా పాటలు రాసినంత, కార్యాచరణ చేతగానివారు శ్రీరంగనీతులు బోధించినంత సులభం కాదు.
దాశరథి కవితలోని చరణం – ‘‘నా తెలంగాణ కోటిరత్నాల వీణ’’ అన్నది తెలంగాణ రాష్ట్ర పోరాటవీరులకు నినాదమైందన్న విషయం విస్మరించరానిది. అది ఏకవాక్యమైనా ప్రత్యేకమైనది, పసందైనది, పండిన కవితకు పరాకాష్ఠ అయింది. కాబట్టి గత ప్రభుత్వం ఆయన స్మృతిని గౌరవించక తప్పలేదు. అయితే ఏటేటా ఆయన స్మారకార్థం ఒక వర్ధమాన కవికి పురస్కారం ప్రదానం చేసినంత మాత్రాన ఆయన టిఆర్‌ఎస్ పార్టీ చెందినవాడైపోడు! పైగా కేసీఆర్ నిజాంను దేవుడులా కొలిస్తే, దాశరథి నిజాంను ‘పిశాచి’గా అభివర్ణిస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన దేశాభిమాని, ఆత్మాభిమాని మరి.
వాస్తవానికి దాశరథి ఒక జాతీయకవి. కాబట్టే జలగం వెంగళరావు హయాంలో వారిని ఆస్థానకవిగా నియమించి గౌరవించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్.టి. రామారావు అర్ధాతరంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. అసలు దాశరథి ఎవరో, ఏమిటో ప్రభుత్వాధినేత అర్థం చేసుకుని ఉంటే, ఆయనకు మరొక పదవి కట్టబెట్టి ఆస్థాన కవి పదవి రద్దు చేసేవాడు. ఇలా ఆస్థాన పదవులను నియమించే సంప్రదాయం బ్రిటన్‌లో మూడు వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అక్కడ రాజరికం ఉన్నప్పుడూ ఉంది, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాతా ఉంది. ఆస్థాన కవి పదవి ప్రజాస్వామ్య విరుద్ధమని, రాచమర్యాద అని ఎవరైనా అంటే అంతకన్నా అజ్ఞానం ఉండదు. రెండు వందల సంవత్సరాల పైచిలుకుగా ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో– దాశరథి ఆస్థానకవిగా కొనసాగిన సమయంలోనే– 19 రాష్ట్రాలలో ఆస్థానకవులు ఉన్నారు. సోషలిస్టు దేశాలలో చూస్తే– తజికిస్తాన్ రాష్ట్రానికి మిర్జో తుర్సునజోదా ఆస్థానకవి. ఇలా ఎన్నో ఉదాహరణలను చూపించవచ్చు.
జాతీయ కవి స్థాయికి అర్హత గల కవిత్వం ఎంతో రాశారు దాశరథి. స్వాతంత్య్ర సమరగీతాలు, జయభారతీ అంటూ దేశభక్తి పొంగిపొర్లే పద్యాలు రాసారు. ‘‘జండా ఒక్కటె మూడు వన్నెలది; దేశంబొక్కటే భారతాఖండాసేతు హిమాచలోర్వర; కవీట్కాండమ్ములోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్రుండు; ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతికోదండోద్యద్విజయుండు గాంధి ఒకడే, తల్లీ! మహాభారతీ!’’ అని శిలాక్షరాల్లాంటి పద్యాలెన్నో పాడారు. అందుకే ఆ రోజుల్లో విజ్ఞులైన రాజకీయవేత్తలు – సర్వేపల్లి రాధాకృష్ణన్, బూర్గుల రామకృష్ణరావు, పి.వి. నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి లాంటి వారు మహానుభావులు దాశరథిని ఎంతో అభిమానించారు, గౌరవించారు.
పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మంత్రులకే కాదు శాసనసభ్యులకు కూడా వారి మాతృభాష పట్ల, సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల అపారమైన అభిమానం. బెంగాలీలు జాతీయకవిగా గౌరవించే రవీంధ్రనాథ్ ఠాగూర్‌కు, తమిళులు దేశీ కవిగా నెత్తిన పెట్టుకొనే సుబ్రహ్మణ్యభారతికి, కన్నడిగులు రాష్ట్రకవిగా కొలిచే కె.వి. పుట్టప్పలకు ఏమాత్రం తీసుపోకుండా జగత్ కళ్యాణం కోసం అచంచల విశ్వా సంతో దేశభక్తి గీతాలను, అక్షర లక్షలు చేసే అభ్యుదయ కవితలను, ఏ ఇజాల జోలికి పోకుండా మానవతా దృష్టితో పలికిన వైతాళికుడు దాశరథి. అదేమి విచిత్రమోగాని తెలంగాణ లోని రాజకీయనాయకులకు ఆ పరంపర సంక్రమించలేదు.
దాశరథి శతజయంతి ఉత్సవాలు తెలంగాణలోని ప్రతిజిల్లాలో ఘనంగా, స్ఫూర్తి దాయకంగా నిర్వహించవలసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కిమ్మనకుండా కూర్చోవడం విచారకరం. తెలంగాణకు పేరుకు సాహిత్య అకాడమీ, సాంస్కృతికశాఖ ఉన్నాయి. కాని ఇలాంటి అంశాలలో అవి అంటీముట్టనట్టుగా ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాహిత్య అకాడమీకి రాష్ట్రమంతా వెతికినా సరైన అధ్యక్షుడు దొరకకపోవడం గమనించదగినది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కనీసం సాంస్కృతిక సలహాదారు ఒకరు ఉన్నా గుడ్డికన్నా మెల్లలా ఉండేది.
ఈమధ్యే దక్షిణ భారత దేశంలోనే తొలుదొలుత జానపద సాహిత్యంపై పరిశోధన చేసి విశ్వవిద్యాలయాల్లో జానపద వాఙ్మయ, కళల ప్రవేశానికి ఆద్యుడైన బిరుదురాజు రామరాజు శతజయంతి జరిగింది. అంతకుముందు ఉప్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఎంతగానో కృషిచేసిన దివాకర్ల వెంకట అవధాని శతజయంతి జరిగింది. ఇప్పుడు తెలంగాణ మహాకవి దాశరథి శతజయంతి వచ్చింది. శతజయంతి ఉత్సవాలను ఘనంగా, స్ఫూర్తిదాయకంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు మీనమేషాలు లెక్కిస్తే కేంద్రసాహిత్య అకాడమీ రంగంలోకి దిగడం సంతోషమే. కానీ, వారు ఈ జయంతి ఉత్సవాలను ‘‘క్లాస్‌రూమ్’’ స్థాయి కార్యక్రమాలుగా చేసేసి, చేతులు దులుపుకోవడం తెలుగువారిని ఒకసారి ఆలోచించుకోవడానికి దోహదం చేసింది. ఈ దశ లోనూ మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశూన్యంగా వ్యవహరిస్తున్నది. ఇంతకూ మన కాలం మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాలు ప్రభుత్వం జరపకుంటే జరగవా?
-టి. ఉడయవర్లు