యూజీసీ ప్రతిపాదనలతో ప్రమాదం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:12 AM
రాజ్యాంగ మూలసూత్రాలను బలహీనపరచడమే కాకుండా, భారత రాజ్యాంగంపై దాడిచేసే విధంగా యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలు ఉన్నాయి. దేశ ఉన్నత విద్యారంగంలో ఇవి ప్రమాదకరమైనవి....

రాజ్యాంగ మూలసూత్రాలను బలహీనపరచడమే కాకుండా, భారత రాజ్యాంగంపై దాడిచేసే విధంగా యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలు ఉన్నాయి. దేశ ఉన్నత విద్యారంగంలో ఇవి ప్రమాదకరమైనవి. ఫెడరల్ హక్కులను కాలరాసి, ప్రభుత్వ యూనివర్శిటీలను మూసివేసే కుట్రలకు యూజీసీ తెరలేపింది. వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం గవర్నర్లకు కట్టబెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ కాలరాస్తున్నది. విద్యను మరింతగా కేంద్రీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేసే దిశగా బీజేపీ ఈ ప్రతిపాదనలకు పూనుకున్నది. విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ అజెండా అమలుచేయడం బీజేపీ ప్రభుత్వానికి తగదు.
నూతన విద్యావిధానం–2020లో భాగంగా తీసుకొని వస్తున్న ఈ ప్రతిపాదనలు ఫెడరలిజం ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించేలా ఉన్నాయి. రాష్ట్రాలు తమ ప్రత్యేక సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక అంశాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించుకుంటాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడం, విద్యలో రాష్ట్రాల హక్కులను, స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా యూజీసీ ముసాయిదా ఉంది. భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను యూజీసీ నిబంధనల ద్వారా కేంద్రం లాక్కుంటున్నది. ఈ విద్యా విధానాలను వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలలో దీనిని బలవంతంగా అమలుచేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. వైస్ ఛాన్సలర్ల నియామక అధికారం గవర్నర్లకు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరైంది కాదు. నూతన జాతీయ విద్యా విధానంలో పేదవారికి ఉచిత విద్య లేనట్టేనా? అలాగే పాఠ్యపుస్తకాల్లో ప్రజాస్వామ్య, సెక్యులర్ పదాలను, డార్విన్ సిద్ధాంతాలను తొలగించడంలో ఆంతర్యం ఏమిటి?
భారతదేశంలో విశ్వవిద్యాలయాల సైద్ధాంతిక నియంత్రణ కార్పొరేట్ శక్తులకు లాభదాయక సాధనగా, హిందుత్వ ప్రచార సాధనగా మారకుండా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యను కాపాడుకునేందుకు విద్యావేత్తలు, విద్యార్థులు యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఉన్నత విద్యా పరిరక్షణకు పూనుకోవాలి.
ఇటికాల రామకృష్ణ
ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి:
IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..
AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..