పొంచి ఉన్న సమస్యలతో ‘గోదావరి – బనకచర్ల-’!
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:17 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమస్య పక్కన బెడితే ఇతరత్రా ఎన్నో మెళకువలతో జాగ్రత్తలు...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమస్య పక్కన బెడితే ఇతరత్రా ఎన్నో మెళకువలతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే సమయంలో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. పెండింగ్ ప్రాజెక్టుల నీళ్లు గాని గోదావరి నీళ్లు గాని రాయలసీమ చేరితే ఆ నీటి వినియోగానికి పెండింగ్ ప్రాజెక్టులకు చెందిన పంట కాలువల నిర్మాణం ఏక కాలంలో చేపట్టినపుడే ఆ ప్రాంత వాసులకు సంతృప్తి.
గోదావరి – బనకచర్ల అనుసంధానం పథకం డీపీఆర్ తయారవుతూ ఉందని, జూన్ కల్లా టెండర్లు పిలవబోతున్నారని వార్తలు వచ్చాయి. డీపీఆర్ తయారీలో ఇంజనీరింగ్ అధికారులు రాజకీయ నాయకుల ప్రచారార్భాటాలకు అనుకూలంగా వ్యవహరించకూడదు. ఉమ్మడి నదిగా ఉండి ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉన్న కృష్ణా జలాలకు ఏ మాత్రం సంబంధం కలిగించకూడదు. ముఖ్యంగా బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల ఆయకట్టులో ఒక్క ఎకరా కూడా ఈ పథకంలో ఆయకట్టుగా గాని, స్థిరీకరణ కింద గాని చూపకూడదు. ఇందుకోసమే తెలంగాణ కాచుకుని ఉంది. గతంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించిన రోజులు వేరు. పైగా పోలవరం పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం తీసి వేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు అలా కాదు. తెలంగాణ డిమాండ్‌తో ఏర్పాటు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు మెడ మీద కత్తిలా ఉంది. ఈ ‘పుణ్యం’ జగన్మోహన్‌రెడ్డి – కేంద్ర ప్రభుత్వం ఇరువురూ కట్టుకొన్నారు.
ట్రిబ్యునల్ ముందు తెలంగాణ రెండు ప్రధాన అంశాలపై వాదన కొనసాగిస్తోంది. ఒకటి బేసిన్. రెండు ఆంధ్ర ప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్ల ఆయకట్టుకు రెండు వేపుల నుండి నీటి వసతి ఉంటే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు తమకు కేటాయించమని. ఈ సందర్భంలో గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకం డీపీఆర్ రూపొందించే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తెలంగాణకు ట్రిబ్యునల్ ముందు ఏ మాత్రం అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించకూడదు.
గోదావరి బనకచర్ల అనుసంధాన పథకం కేవలం గోదావరి పెన్నా అనుసంధానంగానే జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు ఆంధ్రప్రదేశ్ పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు సాగు నీటికి చెంది రాజకీయ నేతలు ప్రకటనలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. ఆలాంటి ప్రకటనలు ఏమైనా చేస్తే ట్రిబ్యునల్ విచారణ ముందు వాటిని ఉపయోగించుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువగా బీఆర్‌ఎస్ నేతలు, వారి మీడియా నిత్యం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. డెల్టాకు గోదావరి నుండి నీళ్లు లభించే అవకాశం ఉన్నందున డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఎట్టి నీటి వసతి లేని బేసిన్‌లోని తమ ప్రాంతాలకు కేటాయించమని ఈ పాటికే కోరి ఉన్నారు. మొన్న మార్చి ఆఖరు వారంలో ఢిల్లీలో జరిగిన ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తెలంగాణ లాయర్ వైద్యనాధన్ అప్పుడే ఈ వాదనను వినిపించారు. కృష్ణ డెల్టాకు పట్టిసీమ నుండే కాకుండా పోలవరం నుండి కూడా 80 టీఎంసీలు వస్తాయని చెబుతుండగా ట్రిబ్యునల్ చైర్మన్ మధ్యలో కలుగచేసుకొని ఆంధ్ర ప్రదేశ్ బేసిన్ ఆవలకు ఎన్ని టీఎంసీల నీరు తరలించుతోందని ప్రశ్నించారు. 312 టీఎంసీలు కృష్ణ జలాలను ఆంధ్రప్రదేశ్ బేసిన్ ఆవలకు తరలించుతోందని, కేవలం 189 టీఎంసీలు మాత్రమే బేసిన్‌లో ఉపయోగించుతోందని జవాబు చెప్పారు. ఇది కీలక పరిణామమే. ఏప్రిల్ 15, 16 తేదీలకు విచారణ వాయిదా పడినా తెలంగాణ లాయర్ తన వాదనను తిరిగి రెండు రోజులు వినిపిస్తారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ వంతు వస్తుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పకడ్బంధీగా ఈ రంగంలో నిపుణులైన లాయర్లను పెడితేనే బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కాపాడగలరు. ఆ మధ్య ట్రిబ్యునల్ నియామకం పైనే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఉన్న కేసు విచారణకు వస్తుందన్నారు. తర్వాత అతీ గతీ లేదు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ వచ్చునట్లు చూడాలి. ఈ పూర్వ రంగంలో గోదావరి బనకచర్ల అనుసంధానం పథకంపై డీపీఆర్ తయారు చేసే సమయంలో ట్రిబ్యునల్ చేతికి జుట్టు అందించకుండా అధికారులు జాగ్రత్తపడాలి. అంతేగాక కేంద్ర జల సంఘానికి డీపీఆర్ పంపకుండా, పర్యావరణ అనుమతులైనా పొందకుండా పథకానికి టెండర్లు పిలిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తొందరపడినా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను ఇంజనీరింగ్ అధికారులు వివరించాలి. లేకుంటే ఏ విధంగానైనా ఎవరైనా గ్రీన్ ట్రిబ్యునల్ కెళ్లి ఫిర్యాదు చేస్తే మొత్తం లక్ష్యం మూలన పడే అవకాశం ఉంది.
ఇదిలా వుండగా ఏ ప్రాంతానికైతే గోదావరి జలాలు తరలించి కరవు నేలను తడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారో ఆ ప్రాంతంలో గోదావరి బనకచర్ల అనుసంధానం పట్ల సానుకూలత కన్పించక పోవడం గమనార్హం. ముందుగా కృష్ణలో తమ వాటా నీళ్లు సద్వినియోగం చేయాలని కోరుతున్నారు. కెసి కెనాల్‌కు నికర జలాలు కేటాయింపులు ఉన్నా 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సుంకేసుల బ్యారేజీ ఒక్కటే దిక్కు. దాని నీటి నిల్వ సామర్థ్యం కేవలం 1.25 టీఎంసీలేనని, గుండ్రేవుల రిజర్వాయర్ గాని ఎత్తిపోతల పెట్టి నీరు గ్యారంటీగా ఇవ్వకుండా గోదావరి జలాలు ఇవ్వడమేమిటని అడుగుతున్నారు. కనీసం ఇందులో భాగమై పశువుల మేత భూమిగా అధ్వాన్న స్థితిలో ఉన్న 2.965టీఎంసీల సామర్థ్యం గల సమతుల అలగనూరు రిజర్వాయర్ గురించి పట్టించుకోకపోవడం జీర్ణించుకోలేకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన వేదవతి అంగలార్చుతోంది. ఇది పూర్తయితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం దాహార్తి తీరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదుద్దేశంతో హంద్రీనీవా కాలువ లైనింగ్ కోసం రూ.940కోట్లు కేటాయించారు. ఈ లైనింగ్ వద్దని కాలువ వెడల్పు చేయాలని ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఆందోళనలు సాగుతున్నాయి. వాస్తవంలో కాలువ వెంబడి డీపీఆర్ మేరకు పంట కాలువలు పిల్ల కాలువలు తవ్వితే ఈ ఆందోళన ఉండేది కాదు. కాలువలో నీరు పోతున్నా కాలువ వెంబడి రైతులు కళ్లప్పగించి చూడవలసి వుంది. కనీసం ఊట నీరు కూడా లేకుండా చేస్తున్నారనేది వారి ఆందోళన. మున్ముందు గోదావరి జలాలు రాయలసీమ చేరినా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి గాక, అదే సమయంలో పంట కాలువలు నిర్మాణం జరగకపోతే గోదావరి జలాలైనా వృథానే!
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News