Share News

నీ ఋణం తీర్చుకోగలమా బాబు..!

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:58 AM

గత సంవత్సరం ఆగస్టు 1న వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు కార్యాచరణలో భాగంగా 2024 నవంబర్ 15న విశ్రాంత...

నీ ఋణం తీర్చుకోగలమా బాబు..!

గత సంవత్సరం ఆగస్టు 1న వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు కార్యాచరణలో భాగంగా 2024 నవంబర్ 15న విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో వన్ మాన్ కమిషన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ కమిషన్ అదే నెల 27న బాధ్యతలు స్వీకరించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, 3,820 వినతులను స్వీకరించి, దళితుల స్థితిగతులను అధ్యయనం చేసి, ఎస్సీలను మూడు గ్రూపులుగా చేసింది. A గ్రూపులో రెల్లి, ఉపకులాలకు ఒక శాతం, B గ్రూపులో మాదిగ, వారి ఉపకులాలకు 6.5 శాతం, C గ్రూపులో మాల, వారి ఉప కులాలకు 7.5% కేటాయించాలని సిఫారసు చేసి, తన నివేదికను మార్చి 10, 2025న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మార్చి 17న రాష్ట్ర మంత్రివర్గం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసులను ఆమోదించి, మార్చి 20న అసెంబ్లీలో వర్గీకరణపై విధాన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ కృషి చేసినంతగా మరే పార్టీ చేయలేదంటే అతిశయోక్తి కాదు. గతంలో కూడా దళితుల అసమానతలు తెలుసుకోవడానికి 1996 సెప్టెంబర్ 10న జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను చంద్రబాబు నియమించారు. ఆ కమిషన్ ఎస్సీల్లో అసమానతలు నిజమేనని గుర్తించి, 1997 మే 28న ఎస్సీలను ఎ, బి, సి, డి లుగా వర్గీకరించాలని, A గ్రూపులో రెల్లి, ఉప కులాలకు ఒక శాతం, B గ్రూపులో మాదిగ, ఉప కులాలకు 7 శాతం, C గ్రూపులో మాల, ఉపకులాలకు 6 శాతం, D గ్రూపులో ఆది ఆంధ్ర కులానికి ఒక శాతం కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దరిమిలా చంద్రబాబు ప్రభుత్వం 1997 జూన్ 6న ఎస్సీలను ఎ, బి, సి, డి లుగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ విడుదల చేసింది. అయితే జాతీయ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించలేదన్న కారణంతో 1997 సెప్టెంబర్ 18న రాష్ట్ర హైకోర్ట్ ఆ ఆర్డినెన్సు కొట్టివేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరం మే నెలలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేశారు. దీంతో 2000–2004 సంవత్సరాల మధ్యకాలంలో మాదిగలు 24 వేల పైచిలుకు ఉద్యోగాలు పొందారని గణాంకాలు చెప్తున్నాయి.


అయితే 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత నవంబర్ 6, 2004న రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య Vs ఆంధ్రప్రదేశ్ కేసులో చంద్రబాబు చేసిన చట్టాన్ని కొట్టేసింది. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోవడం వల్ల మాదిగ జాతి తీవ్రంగా నష్టపోయిందని ఇప్పటికీ మాదిగలు బలంగా నమ్ముతారు. 2004లో ఏ సుప్రీంకోర్టు అయితే రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పి చంద్రబాబు చేసిన చట్టాన్ని కొట్టేసిందో, 20 ఏళ్ల తర్వాత అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చు అని తెలిపింది. దీని ద్వారా 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన వర్గీకరణ చట్టం న్యాయమని చెప్పకనే చెప్పింది. అలాగే 2014–2019 మధ్య చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల జనాభా నిష్పత్తి ఆధారంగా నిధులు ఖర్చు చేయడానికి జీవో నెంబర్ 25 విడుదల చేసి, అమలు చేశారు.


మాదిగల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్గీకరణ అమలు చేయనున్న ఘనత చంద్రబాబుకే దక్కింది. సామాజిక నిచ్చెనమెట్ల వ్యవస్థలో అణగదొక్కబడిన దళితుల్లో కూడా వైరుధ్యాలు ఉన్నాయని గుర్తించి, అందరికీ సమానత్వం అనే సత్యాన్ని వర్తింపచేయడానికి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుపై కొన్ని పార్టీలు అపోహలు రేకెత్తించిన కారణంగా దళితుల్లో ఒక వర్గం ఆ పార్టీకి దూరం కావడం బాధాకరం. అయినప్పటికీ మాదిగలకు ఇచ్చిన మాట కోసం, సామాజిక న్యాయం కోసం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణపై చేసిన కృషికి మాదిగలు జీవితాంతం ఆయనకు ఋణపడి ఉంటారనడంలో సందేహం లేదు. నిజానికి వర్గీకరణ వల్ల ఏ వర్గానికి నష్టం జరగదు. ఆయా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కోటా కేటాయింపులు జరుగుతాయి.

గెడ్డం గణేష్

మాదిగ ఉద్యోగ సమాఖ్య నాయకుడు

ఈ వార్తలు కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు

Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 03:58 AM