కులగణన రెండంచుల కత్తి!
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:05 AM
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు...

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సంక్షేమ విధానాలలో, పాలనా సమానత్వంలో ఇది సత్ఫలితాలను ఇస్తుందని దీని సమర్థకులు వాదిస్తున్నప్పటికీ, విమర్శకులు మాత్రం దీని నుండి ఉత్పన్నం కాగల సామాజిక సమస్యల గురించి హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలోని 96.9శాతం కుటుంబాలను కవర్ చేసిన సర్వే ప్రకారం– జనాభాలో వెనుకబడిన తరగతులు (బీసీలు) 46.25 శాతం, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 10.45 శాతం ఉన్నట్లు వెల్లడైంది. జనాభాలో ముస్లింలు 12.56 శాతం ఉన్నారు. వీరిలో 35,76,588 బీసీ ముస్లింలు, 8,80,424 ఓసీ ముస్లింలు ఉన్నారు. మొత్తం ఓసీలు 15.46శాతంగా ఉన్నారు.
అయితే ప్రస్తుత తెలంగాణ జనాభా 4.3 కోట్లు ఉందని అనేక గణాంకాలు చెప్తుంటే 3.70 కోట్లకే పరిమితమైన సర్వేను సమగ్రంగా ఎట్లా పరిగణిస్తారు అనే వాదన బలంగా వినపడుతుంది. దాదాపు 60 లక్షల జనాభాను ఈ సర్వే లెక్కలోకి తీసుకోలేదు అన్నది విమర్శ. తమ సంఖ్యను దురుద్దేశంతో తగ్గించినట్లు వివిధ కులాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు ఓసీలుగా ఉన్న 10శాతం ముస్లింలను ఏ ప్రాతిపదికన బీసీలలో కలిపారు అని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీ వర్గాలకు ఈ చర్య తీవ్ర నష్టం చేస్తుందని బీసీ నాయకులే అంటున్నారు. ఈ సర్వే సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతుందా లేక కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఈ సర్వే ఫలితాల ద్వారా కొన్ని సామాజిక సమస్యలు తలెత్తవచ్చు.
ముఖ్యంగా సర్వే ఫలితాల వల్ల అన్ని రాజకీయ పార్టీలు కుల -ఆధారిత రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం ఉంది. వివిధ కులాలు వారి వారి సంఖ్య ఆధారంగా ఎక్కువ ప్రాతినిధ్యాన్ని, ప్రయోజనాలను కోరుతున్నాయి. మరి కొన్ని కులాలు మమ్మల్ని విస్మరిస్తే మా సంగతి చెప్తాం అని హెచ్చరించే అవకాశం ఉంది. అలాగే సర్వే సమాచారం నిర్దిష్ట సమూహాలకు రిజర్వేషన్‌లను కోటాలను పెంచాలన్న డిమాండ్‌లకు దారితీయవచ్చు. తద్వారా తాము కూడా వెనుకబడి ఉన్నామని భావించే ఇతరులలో ఆగ్రహాన్ని సృష్టించే అవకాశం ఉంది. సర్వే ఫలితాలు సామాజిక అశాంతికి కూడా దారితీయవచ్చు.
ప్రత్యేకించి కొన్ని కులాలు తక్కువగా లెక్కించబడ్డామని భావించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్సీ వర్గాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ వర్గాలు కూడా తమ సంఖ్య 51 శాతంగా ఉంటే 46శాతానికి తగ్గించారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ జనాభాలో కొన్ని కులాలను టార్గెట్ చేసి తగ్గించారు అనే చర్చ జరుగుతోంది. ముదిరాజ్, మున్నూరు కాపు, యాదవులు, గౌడలు, పద్మశాలిలు, ఎంబీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తగ్గించారు అనే చర్చ జరుగుతోంది. అందుకే బీసీ జనాభా దాదాపు 40లక్షల వరకు లెక్కలోకి తీసుకోలేదు అనే వాదన జరుగుతున్నది. బీసీలలో మున్నూరు కాపులు రెండవ అతిపెద్ద సంఖ్య అని సమగ్ర కుటుంబ సర్వే తేల్చింది. 28 లక్షల సంఖ్యను 13 లక్షలకు తగ్గించారు అని ఆ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఈ వర్గం ఓట్లే 13 లక్షలు ఉంటే తెలంగాణ మొత్తం జనాభాలో 13 లక్షలుగా ఎట్లా పరిగణిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ సామాజిక వర్గం బీజేపీకి అండగా ఉందని, అందుకే ఉత్తర తెలంగాణలో బీజేపీ ఏడు ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకుందని, ఆ కోపంతోనే అధికార పార్టీ ఈ వర్గాన్ని టార్గెట్ చేసి ఉంటుందని విమర్శకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా సర్వే ఫలితాలు అనేక వర్గాలను ఆందోళనకు, అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి.
ఈ పరిస్థితిలో ప్రభుత్వం చొరవ చూపాలి. సర్వే ఫలితాలు ఖచ్చితంగా, పారదర్శకంగా ఉన్నాయని, వాటి -ఆధారంగా విధాన రూపకల్పన చేయవచ్చని ప్రభుత్వం నిర్ధారించాలి. ఈ విషయంలో పౌర సమాజ సంస్థలు, వివిధ కుల సంఘాల నాయకులు, అట్టడుగు వర్గాలతో సహా వివిధ వాటాదారులతో ప్రభుత్వం తప్పనిసరిగా సమగ్ర సంభాషణలో పాల్గొనాలి. అఖిలపక్షం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చెయ్యాలి.
అంతిమంగా, తెలంగాణలోని సంక్లిష్ట సామాజిక దృశ్యం నేపథ్యంలో సర్వే ఫలితాల్ని అర్థం చేసుకుని, అన్వయించగల ప్రభుత్వ సామర్థ్యం పైనే కుల గణన విజయం ఆధారపడి ఉంటుంది. అందరికీ సమానత్వాన్ని, సమ న్యాయాన్ని ప్రోత్సహించడానికి కులగణన సర్వే ఫలితాలను ఉపయోగించుకుంటే తెలంగాణకు మేలు జరుగుతుంది. అట్లా కాకుండా గత ప్రభుత్వం లాగా ఈ సర్వే ఫలితాలను ఫక్తు రాజకీయాలకు వాడుకుంటే ఫలితాలు కూడా అట్లనే ఉంటాయి. నేటి తెలంగాణ ప్రజలు అనునిత్యం పాలకుల చర్యలను గమనిస్తున్నారు. గుర్తు పెట్టుకుంటున్నారు. సమయం వచ్చినప్పడు తడాఖా చూపిస్తున్నారు.
సిహెచ్. విఠల్
మాజీ టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For Telangana News And Telugu News