కుల గణన బూటకం
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:59 AM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఒక బలమైన ఐక్య బీసీ ఉద్యమం నేడు కొనసాగుతున్నది. ఈ క్రమంలో బీసీల కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తగ్గించి,..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఒక బలమైన ఐక్య బీసీ ఉద్యమం నేడు కొనసాగుతున్నది. ఈ క్రమంలో బీసీల కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తగ్గించి, ఓసీ కులాల జనాభాను అధికంగా చూపించడం అక్రమం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక న్యాయం సాధ్యం కాదు. అది కూడా నాటకమే. 2011లో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా పెరగాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీ జనాభాను పెంచి, వారికే సామాజిక న్యాయం అందే విధంగా ఆ నినాదాన్ని ఒక నాటకంగా మార్చింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డ్డి–రాహూల్‌గాంధీ కంపెనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అమలు చేస్తామని ప్రకటించడం కూడా నయా బూటకమే.
ఇక, 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన గత ప్రభుత్వం ఆ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదు? ఇది దొంగలు దొంగలు ఒక్కటే అనడానికి ఒక ఉదాహరణ. కుటుంబ సర్వే తప్పుల తడక అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆ ప్రతులను చూపిస్తూ షో చేశారే కానీ, వాటిని ఎందుకు బయట పెట్టలేదు? కోట్లాది ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహించిన ఆ సర్వే రిపోర్ట్ ప్రజలదే కదా! కేసీఆర్ లేదా టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) జేబు నుంచి ఖర్చు చేయలేదు కదా? నాటి సమగ్ర కుటుంబ సర్వేను, నేటి కుల గణనను బహిర్గతపరచాలి. కుల గణనపై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో నిపుణులను నియమించి రీ సర్వే చేయించాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్‌లోనే కాకుండా, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారో స్పష్టం చేయాలి. అన్ని రకాల రిజర్వేషన్లను అమలు చేయడానికి అడ్డుగా ఉన్న సుప్రీంకోర్టు సీలింగ్‌ని ఎత్తివేయాలి, లేదా తొమ్మిదవ షెడ్యూల్‌లో ఈ రిజర్వేషన్ అంశాన్ని చేర్చి, కేంద్రాన్ని ఒప్పించి అమలు చేయాలి. కానీ ఈ విషయంలో బీసీ సమాజంలో పనిచేస్తున్న ప్రజా సంఘాలు, మేధావులు మాట్లాడకపోవడం విడ్డూరం. అలాగే జస్టిస్ ఈశ్వరయ్య సూచనలను పరిగణంలోకి తీసుకోవాలి. కులాల జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి.
పాపని నాగరాజు (అధ్యక్షులు -కుల నిర్మూలన వేదిక), డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ (కోఆర్డినేటర్ - బీసీ ఇంటలెక్చువల్ ఫోరం), సంగం సూర్యారావు (బీసీ టైమ్స్), మాలి కరుణాకర్ (కో కన్వీనర్- బీసీ పొలిటికల్ జేఏసీ) తదితరులు.