అమెరికాను యూరప్ ధిక్కరించగలదా?
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:33 AM
వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు చర్చలకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడిని అవమానించిన రోజున (28, ఫిబ్రవరి) నేను ప్రముఖ సాహిత్య పత్రిక గ్రంట పాత సంచిక నొకదాన్ని చదువుతున్నాను...
వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు చర్చలకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడిని అవమానించిన రోజున (28, ఫిబ్రవరి) నేను ప్రముఖ సాహిత్య పత్రిక గ్రంట పాత సంచిక నొకదాన్ని చదువుతున్నాను. 1990 వసంతకాలంలో ప్రచురితమైన ఆ సంచిక ఇతివృత్తం ‘కొత్త యూరప్!’. కొత్త అనే విశేషణం, ఆశ్చర్యార్థ సూచకం రెండూ కిందటి సంవత్సరం (1989)లో సంభవించిన చరిత్రాత్మక ఘటనలకు అంగీకారం తెలుపుతున్నవే. బెర్లిన్ గోడ పతనం, దశాబ్దాల అనంతరం పోలండ్లో ప్రప్రథమంగా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడం, తూర్పు యూరోపియన్ దేశాలలో నియంతృత్వ వ్యవస్థలు కుప్ప కూలిపోవడం మొదలైన నవ యుగ నిర్మాణ పరిణామాలు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భమది.
ఆ సంఘటనలు యూరప్ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయనే విషయమై గ్రంట ఎడిటర్ విఖ్యాత యూరోపియన్ రచయితలు, మేధావుల నుంచి వ్యాసాలను ఆహ్వానించాడు. సహజంగానే ఆ వ్యాసకర్తలలో చాలా మంది గత కొద్ది నెలలుగా యూరప్‌లో చోటు చేసుకుంటున్న ఘటనల పట్ల తమ ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారిలో ఒకరైన తూర్పు జర్మనీ మత గురువు వెర్నర్ క్రాట్ షెల్ బెర్లిన్ గోడ పతనానికి దారితీసిన ‘స్వేచ్ఛ, గౌరవం కోసం పోరాటం’కు అభివందనాలు తెలిపారు. గ్రంట వ్యాస రచయితలలో ఒకరు రాజనీతి శాస్త్రవేత్త ఇసయ్యా బెర్లిన్. పాశ్చాత్య మేధో ప్రపంచంలో ఆయన మిగతా వ్యాసకర్తలు అందరికంటే విఖ్యాతుడు. అక్టోబర్ విప్లవ పూర్వపు రష్యాలో జన్మించిన బెర్లిన్ చిన్నవయసులోనే తన తల్లిదండ్రులతో ఇంగ్లాండ్‌కు వలస వచ్చాడు. తనవైన చింతనా పద్ధతుల్లో బ్రిటిష్ మేధో సంస్కృతికి వారసుడుగా వెలుగొందారు. ఆక్స్‌ఫర్డ్‌లో ఆచార్యుడుగా సుప్రసిద్ధమయ్యాడు. ఒక కొత్త ఆక్స్‌ఫర్డ్ కళాశాలను కూడా నెలకొల్పాడు. బ్రిటిష్ అకాడెమీకి అధ్యక్షుడు అయ్యాడు. ముమ్మూర్తులా బ్రిటిష్‌వాడుగా రూపొందినప్పటికీ రష్యా చరిత్రలో తన ప్రగాఢ కుతూహలాన్ని, గత కాలం రష్యన్ రచయితలు, చింతకుల పట్ల అపురూపమైన ఆసక్తిని తుదకంటా నిలుపుకున్న యూరోపియన్ మేధావి. రష్యాలో కమ్యూనిస్టుల పాలన అణచివేసిన పాతకాలం బుద్ధిజీవుల మేధో కృషి, ఉదారవాద సంప్రదాయాల పునరుద్ధరణకు 1989 ఘటనలు అవకాశం కల్పించాయని బెర్లిన్ పేర్కొన్నారు.
తూర్పు యూరప్‌లో సోవియట్ కీలుబొమ్మల ప్రభుత్వాలు కూలిపోవడాన్ని మిగతా వ్యాసకర్తలూ స్వాగతించారు. అయితే భవిష్యత్తు పట్ల నిండు ఆశాభావాన్ని వ్యక్తం చేయలేదు, పలు సంవత్సరాలుగా కెనడాలో నివసిస్తున్న చెక్ రచయిత జొసెఫ్ స్కెవోరెస్కీ ఇలా రాశారు: ‘ఐరోపాలోని వివిధ దేశాలలో నిరంకుశ ప్రభుత్వాలకు రోజులు చెల్లిపోయాయి. మరికొన్ని దేశాలలో వాటి అంతం ఆరంభమయింది’. బహుముఖ ప్రజ్ఞాశాలి జార్జి స్టెయినెర్ ఇలా వ్యాఖ్యానించాడు: మనం ప్రతిచోటా పునరుజ్జీవ జాతీయవాదం, జాతి విద్వేషాల మధ్య ఒక ఉన్మాద పోటీని చూస్తున్నాము. అయితే అమెరికా మాత్రం ఒక ప్రాంతీయ మహాశక్తిగా పరిణమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. యూరప్ గురించి తెలుసుకోవడం లేదు. సంభవిస్తున్న సంఘటనలను పట్టించుకోకుండా ఈ మహా గొప్ప పాత ప్రపంచం (యూరప్) పట్ల ఉదాసీనత చూపుతున్నది. ఏమైనా యూరప్ పునరుత్థానమవుతోంది. తన సొంతంగా నిలబడుతోంది’.
1989 సంఘటనలలో సంభవించినదేమిటి? తూర్పు యూరప్ అంతటా అణచివేతకు గురైన జాతీయవాద మనోభావాలు ఉప్పెనలా వ్యక్తమయ్యాయి. పోలిష్ ప్రజలు, చెక్ దేశ వాసులు, మగ్యార్లు, జర్మన్లు సోవియట్ యూనియన్ ఆధిపత్యంపై తిరుగుబాటు చేశారు. సోవియట్ రష్యా శృంఖలాల నుంచి విముక్తమయ్యేందుకు దృఢంగా సంకల్పించుకున్నారు. పర్యవసానమే కొత్త యూరప్ ఆవిర్భావం. తూర్పు యూరప్ లోని చిన్న చిన్న దేశాలు మళ్లీ స్వేచ్ఛ సాధించుకోవడం పట్ల పలువురు వ్యాసకర్తలు తమ దృష్టి కేంద్రీకరించగా అంద్రేయి సిన్యావస్కీ అనే వ్యాసకర్త మాత్రం జాతీయవాదం అణగారిన ప్రజలను విముక్తం చేయడమే కాకుండా ప్రతి ఘాతుక శక్తిగా కూడా పరిణమించగలదని హెచ్చరించారు. ‘ప్రతిఘాతుక శక్తి’ అనే వ్యాఖ్యను ఆయన రష్యాను దృష్టిలో ఉంచుకుని చేశారు.
ఒక ఇతివృత్తంతో వెలువరించే ఏ సంచిక కోసమైనా సంబంధిత పత్రిక ఎడిటర్ వ్యాసకర్తలకు వేర్వేరుగా లేఖలు రాయడం పరిపాటి. బెర్లిన్, సాన్యావస్కీలు ఇద్దరికీ తోటి వ్యాసకర్త ఏమి చెప్పుతున్నాడన్న విషయం తెలిసి ఉండే అవకాశం లేదు. ప్రచురితమైన మూడు దశాబ్దాల అనంతరం వారి వ్యాసాలను వెంటవెంటనే చదువుతున్నప్పుడు ఒకరి ఆశాభావం, మరొకరి సంశయవాదం మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పించింది. ఇందుకు కారణం వారి జీవిత ప్రస్థానాలు భిన్న రీతులలో సాగడమేనని చెప్పవచ్చు. రష్యాలో రష్యన్లతో నేరుగా సంబంధాలు లేని తాత్త్వికుడు బెర్లిన్. రష్యన్లతో ప్రత్యక్ష అనుభవాలు అపారంగా ఉన్న మేధావి సిన్యావస్కీ. 1925లో మాస్కోలో జన్మించిన సిన్యావస్కీ, 1973లో మాత్రమే సోవియట్ యూనియన్ నుంచి వలస పోయిన వ్యక్తి. కనుక ఆయనకు రష్యన్లతో దశాబ్దాల పాటు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. రష్యన్ జాతీయవాదంలో విదేశీయుల పట్ల ద్వేషం దురహంకార ధోరణులు ఎలా ఉంటాయో ఆయనకు బాగా తెలిసి ఉంటుంది.
తమ మాతృభూమి రష్యా విషయంలో మాత్రం బెర్లిన్ అభిప్రాయాల కంటే సిన్యావస్కీ అభిప్రాయాలే నిర్దుష్టంగా, యథార్థంగా ఉన్నాయని చెప్పవచ్చు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వ్లాదిమిర్ పుతిన్ తొలుత తన సొంత ప్రజలను తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా దాస్యులను చేసుకోగలిగాడు. ఆ తరువాత, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయిన తరువాత స్వేచ్ఛ పొందిన దేశాల ప్రజలపై రష్యా సంపూర్ణ పెత్తనాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నాడు. పుతిన్‌లో బలంగా ఉన్న సామ్రాజ్య పునర్నిర్మాణ ఆకాంక్షే ఉక్రెయిన్ దురాక్రమణగా రూపుదాల్చింది. ఉక్రెయిన్‌ను జయించిన పిదప మరికొన్ని చిన్న యూరోపియన్ దేశాలను సైతం ఆక్రమించుకునేందుకు ఆయన తప్పక ప్రయత్నిస్తాడు. రష్యన్ జాతీయవాద దురహంకార ధోరణులను, పుతిన్ విస్తరణవాదాన్ని విమర్శిస్తున్నవారు రష్యా భీతితో వ్యవహరిస్తున్నవారుగా పుతిన్ సమర్థకులు కొట్టివేస్తున్నారు.
అమెరికా భవిష్యత్తులో యూరప్ పట్ల పూర్తిగా ఉదాసీనత చూపుతుందని జార్జి స్టెయినర్ చేసిన వ్యాఖ్యలు చాల దూరదృష్టితో చేసినవని గత పక్షం రోజులుగా సంభవిస్తున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అమెరికా కాలక్రమేణా ఐరోపాపట్ల పూర్తిగా ఉదాసీనత చూపుతుందనేది ఆయన వ్యాఖ్యల సారాంశం కదా. పుతిన్ పట్ల డొనాల్డ్ ట్రంప్ అభిమానం అందరికీ తెలిసిందే అయినా, రెండోసారి అధికారానికి వచ్చీ రాగానే ఉక్రెయిన్ విషయంలో తీవ్ర వ్యతిరేకతతో వ్యవహరిస్తాడని కొద్ది మంది మాత్రమే ఊహించారు. ఫిబ్రవరి 28న వైట్ హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ట్రంప్, ఆయన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మీడియా ముందే అంతగా అవమానించడాన్ని రష్యన్ రాజకీయవేత్తలు సహజంగానే స్వాగతించారు. ఉక్రెయిన్‌ను మళ్లీ స్వాధీనం చేసుకోవాలన్న తమ ఆకాంక్షను ట్రంప్ సమర్థిస్తున్నట్టు ఆ ఘటన నిర్ధారించిందని వారు ఆనందపడుతున్నారు.
అయితే యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు సహాయపడడానికి తాము తిరస్కరించినప్పటికీ యూరోపియన్ మిత్ర రాజ్యాలు ఆ దేశానికి వెన్వెంటనే పూర్తి మద్దతునిస్తాయన్న విషయాన్ని ట్రంప్ ఊహించలేకపోయారు. వైట్‌హౌజ్‌లో మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమయిన వెన్వెంటనే యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల, భద్రతా విధాన ప్రతినిధి కజా కల్లాస్ సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిస్పందనను పోస్ట్ చేశారు: ‘ఉక్రెయిన్ ఐరోపాకు అన్య దేశం కాదు. ఉక్రెయిన్, ఐరోపా అవిభాజ్యమైనవి. మేము ఉక్రెయిన్‌కు బాసటగా నిలబడతాము ఆ యుద్ధ బాధిత దేశానికి మా సహాయ సహకారాలను ఇతోధికం చేస్తాం. దురాక్రమణదారుకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ల పోరాటానికి అవసరమైన మద్దతును పూర్తిగా అందిస్తాం’. ఆమె ఇంకా ఇలా పేర్కొన్నారు: ‘స్వేచ్ఛాయుత ప్రపంచానికి ఒక కొత్త నాయకుడు అవసరమని ఈ రోజు స్పష్టమయింది. ఈ సవాల్‌ను యూరోపియన్లమైన మేము సమర్థంగా ఎదుర్కొంటాము’.
యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి బాధ్యతలు చేపట్టక ముందుకు కల్లాస్ ఎస్టోనియా ప్రధానమంత్రిగా ఉన్నారు. సోవియట్ యూనియన్ ఆధిపత్యం నుంచి విముక్తి పొందిన చిన్న బాల్టిక్ రాజ్యాలలో ఎస్టోనియా ఒకటి. ఉక్రెయిన్‌ను వశపరచుకున్న తరువాత పుతిన్ దృష్టి తమ దేశంపై తప్పక పడుతుందన్న వాస్తవం ఆమెకు బాగా తెలుసు. కల్లాస్ ధిక్కార ధోరణి కంటే బ్రిటిష్ ప్రధాని కెయిర్ స్టార్మెర్ తెలిపిన సంఘీభావం చాలా ముఖ్యమైనది. జెలెన్ స్కీని తన అధికార నివాసానికి ఆహ్వానించి వైట్ హౌజ్ ఆయనకు నిరాకరించిన గౌరవాదరాల నివ్వడమేకాకుండా ఉక్రెయిన్‌కు గణనీయమైన ఆర్థిక, ఆయుధ సహాయాన్ని బ్రిటిష్ ప్రధాని ప్రకటించడం గమనార్హం. ఆ వెన్వెంటనే యూరోపియన్ దేశాల అధినేతలు అందరూ జెలెన్ స్కీకి తమ సంఘీభావాన్ని తెలిపారు. ట్రంప్‌తో విభేదించే ధైర్యం చూపినప్పటికీ రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్‌ను రక్షించేందుకు అవసరమైన సైనిక సామర్థ్యం తమకు లేదన్న విషయం యూరోపియన్ రాజకీయవేత్తలకు బాగా తెలుసు. అయితే ఉక్రెయిన్‌లోని విలువైన అపురూప ఖనిజ సంపదను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానించిన పక్షంలో ఆ దేశానికి తమ సైనిక సహాయం ఉపసంహరణపై ట్రంప్ పునరాలోచన చేయగలరనే ఆశాభావం యూరోపియన్ నాయకులలో ఉన్నది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలు కూడా చదవండి:
IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..
AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..