Share News

Colonial Mindset India: మెకాలే శృంఖలాల్లో భారతీయ మేధ

ABN , Publish Date - Dec 04 , 2025 | 03:23 AM

స్వతంత్ర భారతదేశ మేధా ప్రస్థానంలో ఒక ప్రధాన అపసవ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిగ్గా ఎత్తి చూపారు. దశాబ్దాల స్వపరిపాలన ఆ కళంకాన్ని రూపుమాపలేకపోయిందని ఆయన గర్హించారు...

Colonial Mindset India: మెకాలే శృంఖలాల్లో భారతీయ మేధ

స్వతంత్ర భారతదేశ మేధా ప్రస్థానంలో ఒక ప్రధాన అపసవ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిగ్గా ఎత్తి చూపారు. దశాబ్దాల స్వపరిపాలన ఆ కళంకాన్ని రూపుమాపలేకపోయిందని ఆయన గర్హించారు. ఇటీవల రామనాథ్ గోయెంకా స్మారకోపన్యాసం వెలువరిస్తూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయులు వలసపాలనలో రూపొందిన మనస్తత్వాలను త్యజించి, తమ స్వీయ నాగరికతా వారసత్వం ఆలంబనతో పరిపూర్ణ స్వావలంబన దేశాన్ని నిర్మించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆ ఉపన్యాసంలో థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే గురించి మోదీ చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తున్నాను. మనలను మనం ‘గులామీకి మానసికతా’ (మానసిక బానిసత్వం) నుంచి విముక్తం చేసుకోవాలని, రాబోయే దశాబ్ద కాలం చాలా నిర్ణయాత్మక కాలమని ఆయన పిలుపునివ్వడాన్ని నేను బలపరుస్తున్నాను. నేనూ ఒక సూచన చేయదలిచాను: వచ్చే పది సంవత్సరాల కాలంలో మనం భారతీయ జనతా పార్టీని అధికార పీఠాల నుంచి కూలదోసి, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ భావజాల ప్రభావాన్ని తొలగించాలి.

ఎకసెక్కంగానో, ఎత్తిపొడుపుగానో నేను ఆ సూచన చేయలేదు. మేధా నిబద్ధతతో, కొత్త ఆలోచనలను పురిగొల్పే లక్ష్యంతోనే నేనా సూచన చేశాను. అవును, మెకాలే మానసపుత్రులపై సమరాన్ని తిలక్‌ధారి మెకాలేలను దీటుగా ఎదుర్కోవడం ద్వారా ప్రారంభించాలి. ఆ తరువాత సూట్‌లు ధరించి టైలు కట్టుకునే నవీన కులీన మెకాలేల భరతం పట్టాలి. సాంస్కృతిక జాతీయవాదం అనే ప్రచ్ఛన్న రూపంలో ఉన్న మానసిక బానిసత్వం బ్రౌన్‌ సాహిబ్‌ల (పాశ్చాత్య జీవనశైలి, భాష, ఆలోచనా పద్ధతులను అనుసరించే స్వదేశీ పెద్ద మనుషులు) అసభ్యకరమైన, కనిపించే బానిసత్వం (పాశ్చాత్య పద్ధతులు, ఆదర్శాలను గుడ్డిగా అనుకరించడం) కంటే మరింత ప్రమాదకరమైనది.


మెకాలే 1835లో రాసిన ‘మినిట్‌ ఆన్‌ ఇండియన్‌ ఎడ్యుకేషన్‌’ లక్ష్యాల గురించి ముందు తెలుసుకుందాం. ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా ఉండాలని సంప్రదాయ భారతీయ విషయాల కంటే పాశ్చాత్య శాస్త్రాలు, సారస్వతాన్ని ప్రోత్సహించాలని మెకాలే తన నివేదికలో సూచించాడు. ‘ఒక మంచి యూరోపియన్‌ గ్రంథాలయంలో ఒక బీరువాలో ఉన్న పుస్తకాల విలువ– భారత్‌, అరేబియాలు సృష్టించిన మొత్తం సాహిత్యం కంటే ఉన్నతమైనది. సంస్కృత భాషలోని సమస్త పుస్తకాల నుంచి సమీకరించిన చారిత్రక పరిజ్ఞానం, ఇంగ్లాండ్‌లో ఒక ప్రాథమిక పాఠశాల పాఠ్యగ్రంథంలో సంక్షేపించిన జ్ఞానం కంటే తక్కువ విలువైనది. ఇది ప్రాకృతిక, నైతిక తత్వశాస్త్రాలలోని ప్రతి విభాగానికీ వర్తిస్తుంది’ అని మెకాలే పేర్కొన్నాడు. ఈ కారణంగా భారతీయ విద్యారంగానికి ఆయన చేసిన విధాననిర్దేశమిది: ‘మనకు, మనం పాలించే ప్రజలకు మధ్య వారధులుగా ఉండే ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం మన విద్యా విధాన లక్ష్యం కావాలి. ఆ ప్రత్యేక వర్గంలో ఉండేవారు రక్తం, రంగులో భారతీయులు అయినప్పటికీ అభిరుచులు, నమ్మకాలు, నైతిక విలువలు, అభిప్రాయాలు, తెలివితేటల్లో ఇంగ్లీష్‌వారుగా ఉండాలి’.

పాశ్చాత్య సామ్రాజ్యవాదుల రాజకీయ ఆధిపత్యానికి, ఆర్థిక దోపిడీకే కాకుండా జ్ఞానపరమైన హింస (పాలితుల అవగాహనా సామర్థ్యాలు, జ్ఞానసముపార్జనా పద్ధతులు, దృక్పథాలను తిరస్కరించడం, అణచివేయడం)కు కూడా భారత్‌ గురయిందన్న వాస్తవాన్ని మెకాలే ‘మినిట్‌’ మనకు జ్ఞాపకం చేస్తోంది. అయితే, ఆధునిక యుగానికి ముందు పరిఢవిల్లిన భారతీయ విద్యా విధాన ప్రశస్తత గురించి మోదీ వ్యాఖ్యలను (బహుశా ఆయన ధరమ్‌పాల్ పుస్తకం ‘ది బ్యూటిఫుల్‌ ట్రీ’ నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు) నిశితంగా పరీక్షించవలసిన అవసరం ఉన్నది. మెకాలే ప్రణాళిక విజయవంతమవడంపై ఆయన విచారం వాస్తవానుగుణ్యమైనది, ఆయన అభిప్రాయాలలో సత్యవాదిత్వం ఉన్నది. బ్రిటిష్‌ పాలకులు పెంపొందించిన విద్యా వ్యవస్థ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని చావుదెబ్బ తీసింది. బ్రౌన్‌ సాహిబ్‌ (రక్తం, రంగులో మాత్రమే భారతీయులు)ల పాలనలోనే ఉండిపోయాము. స్వతంత్ర భారతదేశ విద్యావ్యవస్థ మెకాలే వారసత్వాన్ని చాలా వరకు కొనసాగించిందన్న మోదీ ఆరోపణ నిజమే. మన సమాజంలో ‘విదేశీ మేధావుల నుంచి స్వీకరించిన భావాల, దిగుమతి చేసుకున్న వస్తువుల, సేవల’ ప్రభావం మితిమీరిన స్థాయిలో ఉండడాన్ని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు.


మోదీ వాదనలను కొట్టివేసేందుకు విమర్శకులు కపట, కృత్రిమ వాదనలపై ఆధారపడ్డారు. వారిలో కొంతమంది స్వాతంత్ర్యానంతర భారతీయ విద్యా వ్యవస్థ వలసపాలనాకాల విద్యావ్యవస్థకు కొనసాగింపు కాదని వాదించారు. అధికారిక ఉద్దేశాలు, అభిమతాలలో ఆ కొనసాగింపు లక్షణాలు లేని మాట నిజమేకాని ఆచరణల్లో ఆ పాత వ్యవస్థనే కొనసాగించారన్నది నిజం. ఆంగ్ల భాషకు ప్రాధాన్యమివ్వడమే అందుకొక తార్కాణం. ఆధునిక విద్య, ఆంగ్ల భాష సుగుణాలను ప్రస్తుతించేవారు ఒక వింత వాదన చేస్తున్నారు. మన పూర్వకాలపు జ్ఞాన వ్యవస్థలను, దేశీయ భాషలను పక్కన పెడితేనే నవీన విద్య, ఇంగ్లీష్‌ నుంచి మనం సంపూర్ణ ప్రయోజనాలు పొందగలుగుతామనేది ఆ వాదన సారాంశం. ఈ విమర్శకులు నిజానికి మెకాలేతో ఏకీభవిస్తున్నారు. మెకాలే విద్యా విధానంలో శిక్షణ పొందినవారిలో ఆత్మన్యూనతా భావం బాగా ఉందన్న ప్రధానమంత్రి అభిప్రాయానికి ఆ విమర్శకులే నిదర్శనం.

వలసపాలన తన విధేయులనే కాకుండా విమర్శకులను కూడా ఎలా తనకు అనుకూలంగా కట్టడి చేస్తుందో ఆశిష్‌ నంది (వర్తమాన సజీవ భారతీయ ఆలోచనాపరులలో అగ్రగణ్యుడు, వలసవాద మానసిక ప్రభావాల గురించి నిశితంగా విశదీకరించిన విజ్ఞుడు) జీవితకాల మేధా కృషి తేటతెల్లం చేసింది. వలసవాదంలో రెండు విభిన్న దశలను ఆయన గుర్తించారు. మొదటిది: భూభాగాలను ఆక్రమించుకోవడం, రెండోది: హేతుబద్ధమైన ‘నాగరిక’ భావజాలాల ద్వారా పాలితుల సంస్కృతిని, ఆలోచనా పద్ధతులను ప్రభావితం చేయడం. తద్వారా పాశ్చాత్య ఆధిపత్య భావనలను పాలితులు అంతర్గతీకరించుకునేలా చేస్తుంది. పాశ్చాత్య సంస్కృతి, విలువలు, సంస్థలు తమ వాటికంటే మెరుగైనవి, అభివృద్ధి చెందినవని నమ్మేలా చేసే ప్రక్రియ అది. ఈ ప్రక్రియను ఆశిష్‌ నంది తన పుస్తకం ‘ది ఇంటిమేట్‌ ఎనిమీ: లాస్‌ అండ్‌ రికవరీ ఆఫ్‌ సెల్ఫ్‌ అండర్‌ కొలొనియలిజం’లో సమగ్రంగా వివరించారు. శతాబ్దాల వలసపాలనతో పాశ్చాత్య ప్రపంచం మనకు ‘సన్నిహిత శత్రువు’ (ఇంటిమేట్‌ ఎనిమీ) అయిందని నంది అభివర్ణించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రవచించే జాతీయవాదం వలసవాదంతో ప్రేరేపితమైన అనుకరణ ప్రతిస్పందనలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మోదీ వెలువరించిన గోయెంకా ఉపన్యాసం కూడా అటువంటి ప్రతిస్పందనలకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ‘గవర్నెన్స్‌ మోడల్‌’, ‘టూరిజం’ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ మొదలైన భావనల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఆంగ్ల పదాలు ఆయన హిందీ ఉపన్యాసంలో ప్రస్తావితమయ్యాయి. అవన్నీ ‘దిగుమతి అయిన భావాలు’ అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోకుండానే వాటిని ఆయన ప్రస్తావించారు మరి. నూతన విద్యా విధానం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నిజానికి అది అమెరికన్‌ విద్యా విధానానికి భారతీయ జ్ఞాన వ్యవస్థల అంశాలను కలగలుపుతూ రూపొందించిన విధానమే.


ఆరెస్సెస్‌ సైద్ధాంతిక పత్రాలు, బీజేపీ భావజాల పెద్దల రచనలు చదివితే ఆ సంస్థలు తమ సంస్థాపక భావాలను భారతీయ నాగరికతా విలువలకు విరుద్ధంగా పాశ్చాత్య దేశాల నుంచి ఎలా సంగ్రహించిందీ అర్థమవుతుంది. ప్రధాన భావన అయిన జాతీయవాదం విఫలమైన పాశ్చాత్య జాతి–రాజ్యం నమూనాకు అనుకరణే. ఎందుకంటే, ఆ విఫల పాశ్చాత్యనమూనా సాంస్కృతిక స్వరూప స్వభావాల ఏకరూపతను, అధికార కేంద్రీకరణను డిమాండ్‌ చేస్తుంది. ఇది మన నాగరికతా అనుభవానికి విరుద్ధమైనది. హిందుత్వ భావజాలంలోని దూకుడుతనం, మితిమీరిన ప్రభుత్వ జోక్యం (హైపర్‌–స్టేటిజం), కలహశీల మెజారిటేరియన్‌ వాదం అంతర్గతీకరించుక్ను ఆత్మన్యూనతా భావాన్ని దాచిపెడుతున్నాయి.

వలసవాద మేధను సూచించేదేమిటి? వలస పాలకుల ఆధిపత్య ప్రాపంచిక దృక్పథాన్ని అంతర్గతీకరించుకుని మనసా వాచా కర్మణా వారికి ప్రతిరూపంగా వెలుగొందాలన్న లక్ష్యమే వలసవాద మేధకు గీటురాయి. ఈ దృష్ట్యా మన వలసవాద మనోవైఖరులు కొనసాగేందుకు ప్రస్తుత పరిపాలనా విధానం ఒక ఆలంబనగా ఉన్నది. కాషాయ వస్త్రధారులైన మెకాలే వారసుల పాలన ఆంగ్ల మానసపుత్రుల పరిపాలన కంటే అధ్వానమైనది. వర్తమాన పాలకుల జాతీయవాద వాక్పటిమ వలసపాలనలో మనం స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయామనే వాస్తవాన్ని మరచిపోయేలా చేస్తోంది. జాతి కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి సాధించేందుకు మనం ‘సంఘ్‌’ భావజాల ప్రభావం నుంచి బయటపడి మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మేధా మార్గాలలో ముందుకు సాగాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి

ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్

సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..

Updated Date - Dec 04 , 2025 | 03:23 AM