మూలాలు విస్మరిస్తే మనుగడ కష్టం
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:22 AM
జాతీయ పార్టీలు– భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ– రెండూ తమ రూపురేఖల్ని దిద్దుకునే క్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో వివిధ రాష్ట్రాల అధ్యక్షుల...
జాతీయ పార్టీలు– భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ– రెండూ తమ రూపురేఖల్ని దిద్దుకునే క్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో వివిధ రాష్ట్రాల అధ్యక్షుల నియామకంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముద్ర స్పష్టంగా కనబడుతోంది. సంస్థాగత నియామకాల్లో మొదటి నుంచీ సిద్ధాంతాలకు కట్టుబడినవారు, అధికారంలో లేకపోయినా పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయమై సంఘ్, బీజేపీల మధ్య ఒక అవగాహన ఏర్పడినట్లు జరుగుతోన్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఏబీవీపీ, యువమోర్చాలతో బలమైన సంబంధం ఉన్న ఎన్.రామచందర్ రావు, మాధవ్‌లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడమే ఇందుకు నిదర్శనం. మాధవ్ తండ్రి పి.వి. చలపతిరావు నిబద్ధ సంఘీయుడు. పదేళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన చరిత్ర ఆయనకు ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, ఎమ్‌ఎల్‌సీగా కూడా ఆయన పనిచేశారు రామచందర్ రావుకు అలాంటి నేపథ్యం ఏమీ లేదు. ఇంటా, బయటా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ విద్యార్థి దశనుంచే ఒక భావజాలానికి కట్టుబడి రకరకాల దాడులను ఎదుర్కొని నిలబడిన చరిత్ర ఆయనది. ఏపీ, తెలంగాణలోనే కాదు, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో సంఘ్ నేపథ్యం ఉన్నవారికే పార్టీ పగ్గాలు అందించారు. దేశంలో హిందూత్వ భావజాలం విస్తరిస్తున్నందువల్ల వ్యక్తులు, కులాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని ఒక సైద్ధాంతిక పార్టీగా బలోపేతం చేయగలమనే విశ్వాసం ఆ పార్టీ నేతల్లోను, సంఘ్ పెద్దల్లోనూ కనబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశంలో నలుమూలలా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసి హిందువులను సంఘటితం చేయాలని గత వారం ఢిల్లీలో జరిగిన మూడు రోజుల ప్రాంత ప్రచారక్ సమావేశం పిలుపునిచ్చింది.
సామాజిక, రాజకీయ సమీకరణాలకు భిన్నంగా మత ప్రాతిపదికగా ఒక పార్టీని పటిష్ఠం చేయడం సాధ్యమవుతుందా? ప్రజల్లో విస్తృత ఆమోదయోగ్యత ఉంటుందా? ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు అందులో ఇమడగలుగుతారా అన్న చర్చ భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతోంది. బీజేపీలో చేరేందుకు ఒకప్పుడు తెలుగుదేశం మాజీ నేత పి.ఉపేంద్ర ఆసక్తి చూపినప్పుడు ‘మా పార్టీలో నీవు ఇమడగలవా ఆలోచించుకో’ అని మాజీ ప్రధాని వాజపేయి హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉపేంద్ర తన ఆత్మకథలో రాసుకున్నారు. వాజపేయి మాటలను రుజువు చేస్తూ ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే అప్పటి బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు అని వాదించేవారున్నారు.
బీజేపీ హిందూత్వ భావజాలానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం అజెండాగా ముందుకు సాగుతోంది. తెలంగాణలో ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మాల, మాదిగ, బీసీ నేపథ్యం ఉన్నవారికి అవకాశం కల్పించారు. తెలంగాణ, బిహార్, జార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హరియాణాలలో దళిత లేదా బీసీ వర్గాలకు చెందిన వారినే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమిస్తే ఛత్తీస్‌గఢ్ పార్టీ సారథ్యాన్ని ఆదివాసీకి అప్పగించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన భూపేష్ బఘేల్, సచిన్ పైలట్‌లను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు 13 మందిలో ఆరుగురు దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. దీన్ని బట్టి చూస్తే సాధ్యమైనంత మేరకు పార్టీలో అగ్రవర్ణాల సంఖ్యను తగ్గిస్తూ పార్టీని సైద్ధాంతికంగా, సంస్థాగతంగా సామాజిక న్యాయానికి ప్రతీకగా మార్చాలని రాహుల్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ను బహుజనుల పార్టీగా, బీజేపీని అగ్రవర్ణాల పార్టీగా చిత్రించేందుకు ఆయన అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కులగణనను ఆయన ఒక ప్రచారాంశంగా మార్చారు. రాజ్యాంగానికీ, మనుస్మృతికీ మధ్య వైరుధ్యంపై చర్చను రేకెత్తిస్తున్నారు. కాని ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా? బీజేపీకి, కాంగ్రెస్‌కూ మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నదని ప్రజలు, ముఖ్యంగా సామాన్యులు ఎంతవరకు భావిస్తున్నారు? దళితులను, బలహీన వర్గాలను పార్టీ పోస్టుల్లో నియమించినంత మాత్రాన అగ్రవర్ణాలు, పలుకుబడిగలిగిన వారి ప్రభావం లేకుండా పోతుందా? అన్న ప్రశ్నలు పార్టీ నేతల్లో తచ్చాడుతున్నాయి.
ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండు సైద్ధాంతిక ఆలోచనా విధానాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించడం ఆహ్వానించదగిన పరిణామం. కష్టపడకుండా వచ్చిన సంపద, వ్యక్తిత్వం లేని జ్ఞానం, నైతికత లేని వ్యాపారం, విలువల్లేని రాజకీయాలు మంచివి కావని ఒక మేధావి అన్నారు. ఈ రెండు పార్టీలు తమ ఆర్థిక, సామాజిక విధానాలను ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా అజెండాలను రూపొందించగలగడం అవసరం. చాలా కాలంగా రెండు పార్టీల ఆర్థిక విధానాలకు పెద్దగా తేడా లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. కాంగ్రెస్ అనుసరించిన ఆర్థిక విధానాలనే తాము మరింత వేగవంతంగా అమలు చేశామని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఆర్థిక విధానాల విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలో కూడా కాంగ్రెస్ అనుసరించిన పంథాకు, బీజేపీ అనుసరిస్తున్న పంథాకు తేడా లేదని చెప్పేందుకు ఆస్కారం కలిగింది. తమ అజెండాల భిన్నత్వాన్ని ప్రజలు అర్థం చేసుకునేలా జాతీయ పార్టీలు రెండూ మరింత బలంగా ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతాయనడంలో సందేహం లేదు.
జాతీయ పార్టీల తీరుతెన్నులు ఇలా ఉంటే అనేక ఇతర పార్టీలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలకు అసలు సైద్ధాంతిక స్పష్టత ఉన్నదా అని అనుమానం కలుగుతోంది. మొదటి ఐదు సార్వత్రక ఎన్నికల్లో 40 శాతానికి పైగా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ బలహీనపడ్డ తర్వాతే దేశంలో ప్రాంతీయ పార్టీల ఎదుగుదలకు ఆస్కారమేర్పడింది. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల కూటమి చేతుల్లో పరాజయం పాలైంది. 1984 తర్వాత కాంగ్రెస్ మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితి ఎదుర్కొంటూ వచ్చింది. 1998 నాటికి 177 పార్టీలు రంగంలో ఉన్నాయి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 19 పార్టీల కలయికతో ఏర్పడితే 1998లో వాజపేయి నేతృత్వంలో 23 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రాంతీయ వాదంతో పాటు ప్రాంతీయ పార్టీలు బలోపేతమయ్యాయి. వెనుకబాటుతనం, అస్తిత్వ రాజకీయాలు వంటి వాటికి ప్రజలు ప్రాధాన్యతనిచ్చారు.
కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును ప్రాంతీయ పార్టీలకే కాక, బీజేపీకి కూడా హస్తగతం చేస్తూ బలహీనపడింది. దేశ ప్రజానీకంలోని వివిధ వర్గాల ప్రయోజనాలను పరిష్కరించగల నాయకత్వాన్ని అందించలేకపోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడింది. సోషలిజం, లౌకికవాదం వంటి తన మూలభావనలకు దూరంగా పోవడం వల్లే కాంగ్రెస్ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోతూ వచ్చింది. తన ప్రాభవాన్ని మళ్లీ పునరుద్ధరించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. విచిత్రమేమంటే ప్రాంతీయ పార్టీలు కూడా తమ మూల భావనలకు దూరం పోవడం వల్లే అస్తిత్వ పరీక్షలో పడ్డాయనడంలో సందేహం లేదు. ఇవాళ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బీఆర్ఎస్‌తో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు అస్తిత్వ పరీక్షలో ఉన్నాయి. డీఎంకే వచ్చే ఎన్నికల్లో తన అస్తిత్వాన్ని, ప్రాంతీయ ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేసే పరిస్థితిలో చిక్కుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే స్వంతంగా తన కాళ్లపై నిలబడలేక బీజేపీతో చేతులు కలపాల్సి వస్తోంది. ఒకప్పటి ద్రవిడ అస్తిత్వం ఇవాళ తమిళనాడులో ప్రశ్నార్థకమైన దశలో ఉన్నది.
1997లో ఉనికిలోకి వచ్చిన బిజూ జనతాదళ్‌ను ఒడిషా అస్తిత్వానికి ప్రతీకగా ప్రజలు గుర్తించకపోవడంతో 18వ లోక్‌సభలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. దళితుల స్వరంగా నిలిచిన బహుజన్ సమాజ్ పార్టీని ఇప్పుడు దళితులే తమ పార్టీగా భావించకపోవడంతో యూపీ రాజకీయాల్లో పూర్తిగా పట్టుకోల్పోయింది. అదే పరిస్థితి బిహార్లో లోక్ జన్‌శక్తి ఎదుర్కొంటోంది. హరియాణా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన లోక్‌దళ్, తన వ్యవస్థాపకుడు చరణ్‌సింగ్ ఆదర్శాలను కొనసాగించలేక ముక్కలు చెక్కలైంది. మహారాష్ట్ర ప్రజలు ఒకప్పుడు శివసేన పార్టీని ప్రాంతీయాభిమానానికి, దుందుడుకు హిందూత్వకు ప్రతీకగా భావించేవారు. కాని ఇప్పడు ఈ పార్టీ కూడా తన సైద్దాంతిక పునాది కోల్పోవడంతో పాటు అవకాశవాద రాజకీయాల కారణంగా చీలిపోయింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా అనేక ప్రాంతీయ పార్టీల మాదిరి తన మూల భావనలకు దూరంగా వైదొలగడమే ప్రస్తుతం అస్తిత్వ పరీక్ష నెదుర్కోవడానికి కారణం. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వానికి చిహ్నంగా భావించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడెక్కడ ఉన్నది? దేశంలో కీలక పాత్ర పోషించగలమన్న అత్యాశతో పార్టీ పేరు మార్చుకుని, ఢిల్లీలో భవనాలను ప్రారంభించినంత మాత్రాన జాతీయ స్థాయి గౌరవం లభిస్తుందా? కోట్లాది ప్రజల మనోభావాలకు ప్రతీకగా మారాల్సిన ఒక పార్టీ మాత్రమే కాదు మొత్తం రాష్ట్రం ఒకరిద్దరు వ్యక్తుల ఇష్టారాజ్యంగా మారిన క్రమాన్ని, ప్రజాస్వామిక విలువలకు తావులేని పరిస్థితులను, మనం చూశాం. కుటుంబ సభ్యులందరూ ‘ప్రజా సేవ’ కోసం తాపత్రయపడిన తీరునూ గమనించాం. అధికారంలో కొద్ది రోజులు లేనంత మాత్రాన అసహనం. అరాచకత్వం, అభద్రత, అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ ఒకప్పటి టీఆర్ఎస్‌లా ప్రజల మద్దదతును సాధించుకుని, అధికారానికి అర్హత సంపాదించగలుగుతుందా లేక అంతరిస్తున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో చేరుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు చదవండి:
అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..
యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం