Technology and Society : సిద్ధాంతం వేరు, సైన్స్ వేరు!
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:12 AM
మార్క్స్ సిద్ధాంతాన్ని నమ్మి, దానిని సామాన్యులు సైతం సరళంగా అర్థం చేసుకోవడానికి వీలుగా మార్క్స్ రచనలను అనువదించి..
మార్క్స్ సిద్ధాంతాన్ని నమ్మి, దానిని సామాన్యులు సైతం సరళంగా అర్థం చేసుకోవడానికి వీలుగా మార్క్స్ రచనలను అనువదించి, కృషి చేసిన వారిలో రంగనాయకమ్మ ప్రథములు. ఎంతటి గొప్ప మేధావులైనా అప్పుడప్పుడూ తడబడతారు. ‘కృత్రిమ మేధ: భ్రమలూ, వాస్తవాలు!’ (ఫిబ్రవరి 20, -2025) అనే వ్యాసంలో ఇదే జరిగినట్లు అనిపించింది.
కృత్రిమమేధ ఎన్నో పనులు చేస్తూ పెట్టుబడిదారులకు, వ్యాపారులకు లాభాలను గడించి పెడుతుందంటూ ఒక పది రకాల పనులను ఉదాహరించారు రంగనాయకమ్మ. నిజమే, కృత్రిమమేధ అనేది సైన్స్‌కు చెందిన ప్రక్రియ. సైన్స్ ఎప్పుడు కఠినమైన ప్రక్రియలను సరళం చేస్తుంది. మార్క్స్ ఉత్పత్తి – లాభాలు అంశాన్ని మిగులువిలువ సిద్ధాంతం కోణంలో చూసినట్లు మనం సైన్స్‌ను సైన్స్ అప్గ్రేడేషన్ కోణంలో చూడాలి. అనేక సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు వచ్చాయి. కానీ ఉత్పత్తి ప్రక్రియలో మార్క్స్ వెలుగులోకి తెచ్చిన మిగులు విలువ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం లేదు, రాదు కూడా. సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం రావచ్చు, రాకపోవచ్చు. సైన్స్‌కు మాత్రం ప్రత్యామ్నాయం ఉండదు, కేవలం అప్‌గ్రేడేషన్ మాత్రమే ఉంటుంది. అలా వచ్చిందే కృత్రిమమేధ.
కృత్రిమమేధపై పెట్టుబడి లాభం రంగనాయకమ్మ కోణంలో చూద్దాం. ఫ్రెంచ్ ఆర్థికవేత్త జెబి సే సూత్రం ప్రకారం– ‘‘సప్లయ్ తనకు తానే తన డిమాండ్ సృష్టించుకుంటుంది’’. ఈ సిద్ధాంతం ప్రకారం పెట్టుబడిదారుల విపరీత లాభాపేక్షతో ఉత్పత్తిలో యాంత్రీకరణ ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తులు పెరిగి లాభాలు రావాలి. కానీ పారిశ్రామిక చరిత్రలో ఇలా జరగలేదు. యంత్రాల ద్వారా డిమాండ్‌ను మించి మిగులు ఉత్పత్తులు పెరగడంతో అమ్మకాలు లేవు. నష్టాలపాలైన పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలను నడపకపోవడం వలన కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాభాల ఆశతో విపరీత ఉత్పత్తితో పెట్టుబడిదారులకు లాభాలు వస్తాయనేది కూడా ఒక భ్రమ అని ప్రపంచవ్యాప్తంగా 1928–33 మధ్య వచ్చిన ఆర్థికమాంద్య పరిస్థితులు రుజువు చేసినవి. కార్ల్ మార్క్స్ యాంత్రీకరణ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికవర్గం పెట్టుబడిదారి వ్యవస్థపై తిరుగుబాటు చేస్తుందన్నారు. యాంత్రీకరణ వలన మిగులు ఉత్పత్తితో నష్టాల పాలైన పెట్టుబడిదారులు, వేతనాలు చెల్లించలేని స్థితిలో కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించినప్పటికీ, ఎక్కడా మార్క్స్ చెప్పినట్టు కార్మికులు తిరుగుబాటు చేయలేదు. ఆనాటి ఆర్థికమాంద్య ఉపద్రవం నుండి పెట్టుబడిదారులను కాపాడి వారికి లాభాల మార్గం చూపి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడానికి కృషిచేసిన వారిలో ఆర్థర్ సిసిల్ పిగూ ఒకరు.
ఆయన చెప్పిన వేతనాల తగ్గింపు సిద్ధాంతం (వేజ్ కట్ పాలసీ), ఇటు లాభాలను గాని అటు డిమాండ్‌ను కానీ పెంచలేకపోయింది. ఇక్కడ ఆచరణలో జెబి సే, కార్ల్ మార్క్స్, ఆర్థర్ సిసిల్ పిగూ సిద్ధాంతాలు మూడూ విఫలం అయినాయి. ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు బ్రిటిష్ ఆర్థికవేత్త జె.ఎమ్. కీన్స్ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకొని పని సృష్టించాలని, తద్వారా ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ ఏర్పడి పరిశ్రమలు పునఃప్రారంభం అవుతాయని, ఇందుకుగాను ప్రభుత్వాలు రాబడిని మించి వ్యయం చేయాలంటూ లోటుబడ్జెట్ విధానాన్ని సూచించాడు. నేటికీ అనేక దేశాలు రాబడికి మించి వ్యయం చేస్తున్నాయి. ఈ అంశాలను బట్టి ఒక సిద్ధాంతం విఫలమైనప్పుడు నష్టనివారణకు ప్రత్యామ్నాయ సిద్ధాంతం కూడా వస్తుంది అనేది రుజువైంది.
భారతదేశంలో వ్యవసాయరంగంలో ట్రాక్టర్ లాంటి యంత్రాల వినియోగం లేకుంటే ఇప్పటి జనాభాకు సరిపడా ఆహారధాన్యాల ఉత్పత్తిలేక సగం మంది ఆకలితో చచ్చిపోయేవారు. జనాభా ఇంతగా పెరిగినా గ్రామాల్లో కూలీల కొరత స్పష్టంగా కనపడుతున్నది. యంత్రీకరణను వ్యతిరేకిస్తూ, శ్రామికులకు పనిలేదని వాపోయేవారు తెలంగాణ పల్లెలను చూస్తే బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి వ్యవసాయకూలీల వలసలను గమనించవచ్చు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న ఉత్పత్తి ఫలాలు ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్రలో బారామతి ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ వ్యవసాయ పరిశోధనలు చేస్తున్నది. ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేని, నీటిఎద్దడి కలిగిన మారుమూల పల్లెల్లో కృత్రిమమేధను ఉపయోగిస్తూ పంటలకు ఆశిస్తున్న తెగుళ్ళను గుర్తించి సకాలంలో నివారణ చర్యలను చేపట్టి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకొంటున్నారు. జన్యువుల రహస్యం ఛేదించి, కణనిర్మాణం గుట్టును పసిగట్టి, జీనోమ్ మ్యాప్ రూపుదిద్దిన మానవుడు, శిశువు పిండదశలో ఉన్నప్పుడే ఏ జన్యువు లోపంతో ఏ రకమైన వ్యాధులు వస్తాయో గుర్తించి జన్యులోపాలను సరిచేయగలుగుతున్నాడు.
ఇలా సైన్స్ సృష్టించిన అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. సాధారణ మొబైల్ స్థానంలో ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చిన తర్వాత వాచ్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎన్నో పరికరాల ఉపయోగం తగ్గింది. అంతమాత్రాన ఆండ్రాయిడ్ మొబైల్ నిరుద్యోగం సృష్టిస్తున్నదని దాని వాడకం నిలిపివేయలేం కదా. కృత్రిమమేధ వల్ల పెట్టుబడిదారులకు విపరీత లాభాలు వస్తాయనేది ఒక భ్రమ. కేవలం అది ఒక దశ మాత్రమే. మళ్ళీ దానిలో అప్‌గ్రేడేషన్ ఉండనే ఉంటుంది. మొత్తం మానవ పరిణామ క్రమమంతా కఠినత్వం నుంచి సరళత్వం వైపు ప్రయాణం మాత్రమే. అందులో భాగమే పెట్టుబడి లాభం. పరిశోధనలన్నీ పెట్టుబడి లేకుండా జరగవు. పెట్టుబడి పెట్టేవారు లాభం తప్పక ఆశిస్తారు. ఆశ లేకపోతే ప్రగతికి ఆస్కారం లేదు. సైన్స్ ఏ వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందనే వాదన అర్థరహితం. సైన్స్ సార్వజనీనమైంది. కృత్రిమమేధ పనితీరు పట్ల అనుమానాలు, భయాలు అర్థరహితం.
మామిడి నారాయణ
సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్