Share News

తెలంగాణపై కాదు కేసీఆర్‌ విధానాలపైనే ఆక్రోశం

ABN , Publish Date - May 29 , 2025 | 01:27 AM

‘కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో (మే 14) తెలంగాణకు చెందిన విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీధర్‌రావు దేశ్ పాండే రాసిన ఆర్టికల్ నిరాధారమైన ఆరోపణతో మొదలైంది: నేను ‘‘ఎప్పటి అలవాటు ప్రకారమే తెలంగాణపై అక్కసు...

తెలంగాణపై కాదు కేసీఆర్‌ విధానాలపైనే ఆక్రోశం

‘కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో (మే 14) తెలంగాణకు చెందిన విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీధర్‌రావు దేశ్ పాండే రాసిన ఆర్టికల్ నిరాధారమైన ఆరోపణతో మొదలైంది: నేను ‘‘ఎప్పటి అలవాటు ప్రకారమే తెలంగాణపై అక్కసు వెళ్లగక్కాన’’ని ఆరోపించారు. నేను గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గాని మీరు ఆరోపించినట్లు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు. కాకుంటే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ భావోద్వేగ విద్వేష విధానాలకు వ్యతిరేకంగా అనేక మార్లు రాసిన మాట వాస్తవం. ఆ విమర్శలను మొత్తంగా తెలంగాణకు అన్వయించడం సరికాదు.

బచావత్ ట్రిబ్యునల్ విచారణ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి వాటా తగ్గిన అంశం పలుమార్లు ఉల్లేఖించాను. తెలంగాణతో పాటు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ కూడా దక్షిణ తెలంగాణ లాగా అన్యాయానికి గురైన విషయం శ్రీధర్‌రావు దేశ్‌పాండేకు తెలియనిది కాదు. అయినా వెనుకబడిన రాయలసీమకే బేసిన్ ఆవల అనే నెపంతో స్పాట్ పెట్టడం గమనార్హం. తెలంగాణకు గాని తుదకు రాయలసీమకు గాని జరిగిన అన్యాయం ఏదైనా వుంటే బేసిన్ మొత్తం మీద నీటి పంపిణీ జరిగినప్పుడు తప్ప 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు మాత్రం కాదు. రాష్ట్ర విభజనకు ముందే కేసీఆర్ నీళ్ల కోసం ఉద్యమాలు సాగించి ఉన్నారు కదా! బచావత్ ట్రిబ్యునల్ కూడా వాస్తవంలో చేసిందేమీ లేదు. 1969 నాటికి నిర్మింపబడి, లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసింది. హైదరాబాద్ సంస్థానంలో గాని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గాని రాష్ట్రాన్ని పాలించిన నేతలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించని నేరమది.

రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్ ఏనాడైనా బేసిన్ మొత్తం మీద తిరిగి కృష్ణా నదీ జలాలు అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలని తుదకు మాట వరసకు కూడా కోరిన సందర్భం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (2013) తీర్పు పునః పరిశీలన జరగాలని ఎన్నడైనా కోరారా? బేసిన్ మొత్తం మీద నీటి కేటాయింపులు జరిగినపుడు సంభవించిన అన్యాయాన్ని గాలికి వదిలేసి అవశేష ఆంధ్రప్రదేశ్‌తోనే వివాదానికి దిగారంటే అది కేవలం భావోద్వేగాలతో అధికారం సుస్థిరం చేసుకొనేందుకు కేసీఆర్‌ పన్నిన వ్యూహం కాదా?


నిజానికి కృష్ణా లోటు బేసిన్ కాదని శ్రీధర్‌రావు దేశ్‌పాండే అంటున్నారు. ఇదే నిజమైతే 2019లో ఎన్నికలు జరిగి ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే శ్రీశైలం జలాశయంలో కేవలం 400 టీయంసీలు మాత్రమే లభ్యత ఉంటుందని గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి గోదావరి నుండి 900 టీయంసీలు తరలించాలనే పథకం కేసీఆర్ ఎందుకు ప్రతిపాదించారు? ఒక ఇంజనీరింగ్ టీమ్ నెలలకొద్ది కసరత్తు చేయలేదా? బహుశా ఆ టీములో మీరు కూడా ఉన్నారేమో గుర్తు చేసుకోండి.

అవశేష ఆంధ్రప్రదేశ్‌లో నిత్య క్షామ పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రస్తావన వచ్చినపుడల్లా బేసిన్ అంశం తీసుకు వస్తున్నారు. గొంతెండిపోతున్న రాయలసీమలో రెండు జిల్లాలకు చెందినది కెసి కెనాల్. ఇటీవలనే ఈ కాలువకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. చారిత్రక ప్రాధాన్యం వున్న దృష్ట్యా ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇర్రిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ అవార్డుకు ఎంపిక చేసింది. శతాబ్దానికి పైగా కృష్ణా జలాలు వినియోగిస్తున్న కెసి కెనాల్ అదీ బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు రద్దు చేసి తమకు కేటాయించమని కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే ట్రిబ్యునల్ ముందు కోరడం సబబేనా?

బేసిన్ వెలుపల అని చెప్పబడే మరో ప్రాంతం సాగర్ కుడి కాలువ ఆయకట్టు. దీనికి బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసింది. శ్రీధర్‌రావు దేశ్‌పాండే చెబుతున్నట్లు ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం పెట్టినా బచావత్ ట్రిబ్యునల్ కెసి కెనాల్‌కు సాగర్ కుడి కాలువకు నిర్దిష్టంగా నీటి కేటాయింపులు చేసింది. ఒకవైపు కృష్ణా బేసిన్ వచ్చేసరికి బేసిన్ ఆవల అనే అభ్యంతరాలు పెట్టిన శ్రీధర్‌రావు దేశ్‌పాండే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాకతీయ కాలువ గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్‌కు వచ్చే అంశం గమనంలోనికి ఎందుకు తీసుకోరు? అంతెందుకు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సంగతేమిటి? అంతిమంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెబుతారు? తాము మాత్రం గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీళ్లు తరలించవచ్చు కాని దక్షిణ తెలంగాణ కన్నా కనాకష్టంగా మెట్ట ప్రాంతానికి కొన్ని దశాబ్దాలుగా నీళ్లు ఇచ్చే కెసి కెనాల్‌కు కృష్ణా నీటిని బంద్ చేయమనడం ఎంత వరకు న్యాయం? శ్రీధర్‌రావు దేశ్‌పాండే క్యారీ ఓవర్ నిల్వ గురించి చెబుతూ ఆంధ్రప్రదేశ్‌పై నిందారోపణ చేశారు.


సెక్షన్ 89 తెలంగాణకు న్యాయం చేయదని కేసీఆర్ భావించి కొత్త ట్రిబ్యునల్ కోసం కృషి చేసి సాధించారని శ్రీధర్‌రావు దేశ్‌పాండే చెబుతున్నారు. ట్రిబ్యునల్ నియామకంపై ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అదలా వుంచితే కేసీఆర్ న్యాయబద్ధంగా వ్యవహరించి ఉంటే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89కి సవరణ చేయించుకొని ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం ఉభయ పార్లమెంటు సభల ఆమోదం పొందినది. పైగా రాష్ట్ర విభజన చట్టం 11 షెడ్యూల్ (4)లో కూడా ఇందు గురించి స్పష్టత ఉంది.

ట్రిబ్యునల్ తీర్పుతోనే అవశేష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారం కాదు. ఇందుకు అనేక ఉదంతాలున్నాయి. కావేరి వివాదం ఏమైంది? అంతిమంగా శాంతి భద్రతల సమస్య తలెత్తితే న్యాయ పరమైన అంశాలు పక్కన బెట్టి (ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై జరిగితే సుప్రీంకోర్టుకు అధికారం లేదు) సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగినా అప్పుడప్పుడు వివాదం రాజుకుంటూనే వుంది. 2004లో నియమింపబడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తీర్పు ఇస్తే సుప్రీంకోర్టు స్టేతో దస్త్రాలకే పరిమితమై వుంది. కొత్తగా నియమించబడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మున్ముందు ఏలాంటి తీర్పు ఇస్తుందో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో పక్కనబెడితే సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు వాదులాటలు అటకెక్కించి సామరస్యానికి లాకు లెత్తడమే అత్యుత్తమం.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 03:03 PM