Share News

Amaravati A Timeless Asset: తరతరాల తరగని సంపద... అమరావతి

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:51 AM

ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గానికి ఈ టర్మ్‌లో ఇంకా సుమారు మూడున్నరేళ్లు మాత్రమే ఉంది. ఈ లోపే ‘రాజధాని అమరావతి’కి ఒక శాశ్వతత్వం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Amaravati A Timeless Asset: తరతరాల తరగని సంపద... అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గానికి ఈ టర్మ్‌లో ఇంకా సుమారు మూడున్నరేళ్లు మాత్రమే ఉంది. ఈ లోపే ‘రాజధాని అమరావతి’కి ఒక శాశ్వతత్వం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ విశేషంగా కృషి చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి, భూములిచ్చిన రైతులకు 2019–24 మధ్య జరిగిన పరాభవాల పరంపరలు, అగౌరవం, హేళనలు మొదలైన వికృత చేష్టలు పునరావృతం కాకూడదన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు శక్తికి మించి శ్రమిస్తున్నారు. ఆయన ఆలోచనలను మంత్రి నారాయణ, తన భుజాలపై వేసుకుని లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నారు.

రాష్ట్ర పాలనకు అవసరమైన రాజధానిని ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా మార్చుకోవచ్చు. కానీ, ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని ఏ కారణంతోనూ మరో చోటుకు మార్చలేరు. ఆ మాటకొస్తే, ఒక చిన్న పట్టణాన్ని కూడా మరో చోటుకు కదిలించలేరు. రాజధానిని సునాయాసంగా తరలించవచ్చు అనడానికి గుజరాత్ ఒక ఉదాహరణ. మహారాష్ట్ర నుంచి 1960లో గుజరాత్‌ను విడదీశారు. అప్పుడు అహ్మదాబాద్‌లో రాజధాని కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కానీ 1965లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన హితేంద్ర దేశాయ్ 1970లో రాజధానిని అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు మార్చేశారు.

ఒక రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కావలసిన మౌలిక సదుపాయాలు– ఒక సచివాలయం కాంప్లెక్స్, శాఖాధిపతులకు కార్యాలయాలు, అసెంబ్లీ భవనం, డీజీపీ కార్యాలయ కాంప్లెక్స్, ఇతర పోలీసు సంబంధిత రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అవసరం. వీటితో పాటు శాసనసభ్యులు, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి వంటి వారి నివాస వసతులు, గవర్నర్ నివాస భవన సముదాయం, హైకోర్టు భవన సముదాయం, న్యాయమూర్తుల నివాసాలు ఉంటే సరిపోతుంది.


2014లో విభజన జరిగినప్పటి నుంచీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. 2019కి ముందు ఏర్పాటైన ఈ మౌలిక సదుపాయాలను గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఎక్కడికీ తరలించలేదు. ఆయన హయాంలో కూడా అవి పాలనకు ఉపయోగపడ్డాయి. చంద్రబాబుపై పుట్టు కక్షతో రాజధాని కార్యకలాపాలను తరలించాలనుకున్నా, పాలనానుభవ లేమితో జగన్ ఆ పని కూడా చేయలేకపోయారు. రాజధాని ఇప్పటికీ అక్కడే ఉంది. చంద్రబాబు ఇప్పటికీ ఆ మౌలిక సదుపాయాలనే పాలనకు వినియోగిస్తున్నారు. ఈ మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు మూడు, నాలుగొందల ఎకరాల ఖాళీ భూమి ఉంటే చాలని కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ పూర్వపు కార్యదర్శి కంటిపూడి పద్మనాభయ్య నిశ్చితాభిప్రాయం. ఇంటర్‌నెట్, కమ్యూనికేషన్ సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఊహాతీతంగా పెరిగిపోతున్న ఈ సాంకేతిక యుగంలో రాష్ట్ర రాజధాని భౌగోళికంగా ఎక్కడ ఉంటుందనే విషయానికి పెద్ద ప్రాధాన్యం లేదనే భావనను పలువురు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ వ్యక్తం చేశారు.

కానీ, చంద్రబాబు నాయుడు నిర్మించ తలపెట్టిన మయసభ లాంటి మహానగరం ‘అమరావతి’ మాత్రం సచివాలయ భవనాల వంటిది కాదు. ఒకసారి ఏర్పడితే ఇక మరో చోటుకు మార్చడం, జగన్మోహన్‌రెడ్డి మనస్తత్వం కలిగిన వందమంది పాలకులు వచ్చినా సాధ్యం కాదు. ఇప్పుడు అమరావతి అని మనం పిలుచుకునే ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలన్నీ ప్రభుత్వ సంబంధిత మౌలిక సదుపాయాలే. వాటిని మినహాయిస్తే మిగిలినదంతా ఖాళీ భూములే.


‘నగరం’ అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపే అందాల హర్మ్యాలే కాదు కదా! రోజువారీ కూలి నాలీ చేసుకు బతికే జనాల దగ్గరి నుంచి, సమస్త కుల, మత, ధనాదాయవర్గ సహజ జీవన రీతులను ప్రతిబింబించే ప్రజలు కూడా అన్ని రకాల జీవన సౌకర్యాలతో నివసించినప్పుడే– అది ఒక పట్టణమో, నగరమో, కాస్మోపాలిటన్ సిటీనో అవుతుంది. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు, ఆస్పత్రులు, హోటళ్లు, విద్యాసంస్థలు, థియేటర్లు, కళాక్షేత్రాలు, వాణిజ్య సముదాయాలు, క్లబ్బులు, పార్కులు, ఫ్లై ఓవర్లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ మొదలైన వాటికి కేటాయించే స్థలాల మధ్యలో మిగిలివున్న ఖాళీ భూముల్లో ప్రజలు అన్ని వసతులతో నివసిస్తేనే కదా అమరావతికి ఒక రూపు వచ్చేది. మయసభను తలపింపజేసే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో, వాటి మధ్య ప్రజల నివాసానికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నివాసయోగ్య భూమిని ఐడెంటిఫై చేసి; 100, 200, 300, 400, 500 గజాల నివాస ప్లాట్లుగా విభజించాలి. ఒక్క ఆంధ్రప్రదేశ్ వాసులకు మాత్రమే కాక, మొత్తం భారతదేశ పౌరులు ఈ ప్లాట్లను సొంతం చేసుకుని, శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించాలి. వంద గజాల స్థలం కావాలనుకునే వారి నుంచి లక్ష, 500 గజాల స్థలం కావాలని భావించే వారి నుంచి ఐదు లక్షలు– ఇలా కేటగిరీల వారీగా చెల్లించి పేరు నమోదు చేసుకోవడానికి– నమోదు రుసుము నిర్ణయించాలి. ఇందుకోసం అవసరమైన వెబ్‌సైట్‌ను సీఆర్‌డీఏ రూపొందించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలి. మొత్తం స్థలాల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువ రావడం సహజం. వాటిని పబ్లిక్‌గా డ్రా తీసి, స్థలాలు పొందిన వారి వివరాలు కూడా కేటగిరీ వారీగా వెబ్‌సైట్‌లో ఉంచాలి. స్థలాలు పొందినవారు చెల్లించిన రుసుమును నాన్–రిఫండబుల్ డిపాజిట్‌గా పరిగణించాలి. డ్రాలో పేర్లు రాని దరఖాస్తుదారుల రుసుములో 75 శాతం మొత్తాన్ని వారికి తిరిగి చెల్లించేయాలి. (25 శాతం నిర్వహణ ఖర్చులుగా ప్రభుత్వం మినహాయించాలి.)

ఇక, లాటరీలో నివాస స్థలాలు పొందినవారికి విశాఖలో పరిశ్రమల యూనిట్లకు కేటాయించిన రీతిలో చౌకగా ప్రభుత్వం విక్రయించాలి. వారికి కేటాయించిన నివాస స్థలంలో రెండు సంవత్సరాలలోనే భవనం నిర్మించాలన్న నిబంధన విధించాలి. ఒక్కో కేటగిరీలో ఒక్క డిజైన్‌లో మాత్రమే తమ భవనాలు/ గృహాలు నిర్మించాలనే నిబంధన ఉండాలి. అంటే వంద గజాల స్థలంలో నిర్మాణాలు అన్నీ ఒకే రకం డిజైన్‌లో ఉంటాయి. అలాగే 500 గజాల వరకు. గృహస్థులకు కావలసిన ఇసుక, సిమెంట్, స్టీల్, విద్యుత్ కేబుళ్ళు, విద్యుత్ పరికరాల వంటి సమస్త నిర్మాణ సామగ్రిని యాభై శాతం సబ్సిడీపై ప్రభుత్వం వారికి అందుబాటులో ఉంచాలి. బ్యాంకుల నుంచి గృహ రుణాలకు ప్రభుత్వమే బ్యాంకులకు హామీ ఉండాలి. ఈ రెండేళ్లలో గృహాలకు కావలసిన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు ప్రభుత్వం పూర్తి చేయాలి.


ప్రభుత్వ భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఎంతగా తహతహలాడుతున్నారో అలాగే నివాస గృహాలను కూడా ఏకకాలంలో నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ విధంగా ఏర్పాటయ్యే ‘అమరావతి’ నగరం తెలుగు వారి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. మళ్ళీ జగన్ వస్తే, దానినో శ్మశానవాటికగా మారుస్తారేమో అనే భయం ఉండదు.

1591 ప్రాంతంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా పునాది వేసిన హైదరాబాద్ లాగా అమరావతి నగరం తరతరాల సంపదగా దినదినాభివృద్ధి చెందుతుంది. దానిని నిర్మిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో భాగంగా ఆచంద్రతారార్కం నిలిచి ఉంటారు.

భోగాది వేంకటరాయుడు

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 18 , 2025 | 05:51 AM